సాగర్‌లోకి పైపు ద్వారా సొల్యూషన్స్ వేస్తున్న దృశ్యం
రాష్ట్ర రాజధానిలో ప్రధాన పర్యాటక కేంద్రమైన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన సత్ఫలితాలనిస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పది నెలల క్రితం మొదలుపెట్టిన ‘బయో రెమిడేషన్’ ప్రక్రియతో సా‘గరళం’ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. డ్రైనేజీ, రసాయన వ్యర్థాలు నిండటంతో సాగర్‌లోంచి వెలువడుతున్న దుర్వాసనను బెంగళూరుకు చెందిన నాకాఫ్ సంస్థ కొంతమేర నియంత్రించగలిగింది. అడపాదడపా హుస్సేన్‌సాగర్ నుంచి దుర్వాసన వస్తున్నా పూర్తిస్థాయిలో నియంత్రణలోనే ఉండటంతోపాటు నీటిలో ఆక్సిజన్ శాతం పెరగడమే కాకుండా వ్యర్థ బ్యాక్టీరియాలు నశించడం సానుకూల సంకేతాలను ఇస్తోంది. హెచ్‌ఎండీఏ అధికారుల మార్గదర్శనంలో మరో ఆరు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగితే పర్యాటకులు, నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దుర్వాసన పూర్తిస్థాయిలో దూరం కానుంది.
2దశల్లో..2పనులు
హుస్సేన్‌సాగర్ విస్తరిత ప్రాంతంతోపాటు దుర్గంధం అధికంగా వచ్చే ప్రాంతాలపై నాకాఫ్ సంస్థ దృష్టి సారించింది. మొదటి దశలో ఐఎం సొల్యూషన్స్‌ను ట్యాంకర్ల ద్వారా హుస్సేన్‌సాగర్‌లో చల్లుతున్నారు. దీనివల్ల జలాశయంలోని వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతోంది. రెండో దశలో బొకాషి బాల్స్‌ను జలాశయంలోకి వదలుతున్నారు. దీనివల్ల ఆ రసాయనాలు సాగర్ అడుగున ఉన్న బ్యాక్టీరియాలను తినేస్తున్నాయి. ఈ ప్రక్రియ కోసం పర్యాటకశాఖ నుంచి బోటును అద్దెకు తీసుకొని ‘బొకాషి బాల్స్’ను జలాల్లో వేస్తున్నారు. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడమే కాకుండా ఆక్సిజన్ శాతం పెరుగుతోంది. తాజా పీసీబీ గణాంకాల ప్రకారం గతంలో శూన్య శాతంలో ఉన్న డిసాల్వ్‌డ్ ఆక్సిజన్
ఇప్పుడు 7.6 శాతం దాకా చేరుకుంది. ఈ ఏడాది సాగర్ పరిసరాల్లో దుర్గంధం అంతగా లేదని పర్యాటకులు చెబుతున్నారు. హెచ్‌ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అమెరికా పర్యటన ఉండటంతో ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ హుస్సేన్ సాగర్‌లో శనివారం పర్యటించి నాకాఫ్ సంస్థ పనితీరును మెచ్చుకున్నారు.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment