Purge
-
జీహెచ్ఎంసీ ప్రక్షాళన.. 14 మంది అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అధికారుల ప్రక్షాళన మొదలైంది. రిటైర్డ్ ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను కమిషనర్ టర్మినెట్ చేశారు. 45 మంది రిటైర్డ్ ఉద్యోగుల్లో 37 మంది తమ విధుల నుంచి వైదొలిగారు. అక్రమాలకు పాల్పడిన 14 మంది అధికారులను విధుల నుంచి కమిషనర్ తొలగించారు. తప్పులు చేస్తున్న పలువురు అధికారులకు రోనాల్డ్ రోస్ మెమోలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కాగా, అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగినషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. -
‘అంచె’లంచెలుగా ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అంచెలంచెల ప్రక్షాళన మొదలైంది. ఆయా విభాగాల్లోని అంచెల్లో ఫైళ్లు చిక్కుకుని ఒక పట్టాన పరిష్కారం కావడంలేదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్‌భవన్‌లో రెండంచెల అధికారుల వ్యవస్థ మాయంకానుంది. ఇక్కడ ఆయా విభాగాల్లో రెండంచెలను తొలగించినా పనులకు ఇబ్బంది ఉండదనే అంచనాకు వచ్చారు. అనవసరంగా ఉన్న అధికారులను అక్కడి నుంచి తొలగించి అవసరమైనచోట వారికి పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏ అంచెలను తొలగించాలో ఈ నెల 24 లోగా తేల్చిచెప్పాలంటూ ఈడీలను ఆదేశించారు. ఇలా మొదలైంది..: ఐటీ విభాగానికి సంబంధించి గతంలో ఆదేశించిన ఓ పని గురించి ఎండీ వాకబు చేశారు. అది ఫలానా విభాగానికి పంపానని ఉన్నతాధికారి తెలపగా, ఆ విభాగాధికారిని అడిగితే.. రిమార్క్స్ కోసం ఫైల్‌ను కింది విభాగానికి పంపానన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎండీ.. ఒకే భవనంలో ఉండే అధికారులు అప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుకుని క్లియ ర్ చేయాల్సిన పనుల్లో కూడా ఫైల్ మూవ్మెంట్ పేరుతో కాలయాపన చేయటం ఏంటని ప్రశ్నించా రు. ఒకరిద్దరు అధికారులు చూసి క్లియర్ చేసే వాటిని కూడా రకరకాల విభాగాలకు పంపి రోజుల తరబడి ఎదురు చూడటం సరికాదని భావించి ఈ అంచెల వ్యవస్థ రద్దు నిర్ణయానికి వచ్చారు. ఇవీ విభాగాలు..: ఓపీడీ సీటీఎం, పర్సనల్ డిపార్ట్మెంట్లో సీపీఎం, ఇంజనీరింగ్ విభాగంలో సీఎంఈ, ఎకౌంట్స్ డిపార్ట్మెంట్లో సీఏవో, సీటీఎం మార్కెటింగ్, సీటీఎం కమర్షియల్ పేరుతో విభాగాధిపతులున్నారు. ఈ పోస్టులు ఈడీ అడ్మినిస్ట్రేషన్, ఈడీ ఆపరేషన్స్, ఈడీ ఇంజనీరింగ్, ఈడీ రెవెన్యూ విభాగాల కింద ఉన్నాయి. ఈ విభాగా ల్లోని సూపర్వైజర్ కేడర్‌లో ఐటీ విభాగం ప్రక్షాళన పూర్తిచేశారు. ఐటీ విభాగానికి ఓ ఈడీ ఉండేవారు. ఇక నుంచి ఈడీ ఉండరు. నేరుగా సీఈ ఎండీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో రెండంచెలుంటే చాలన్న తరహాలో ఎండీ యోచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏ అంచె ను తగ్గించాలన్న విషయంలో తర్జనభర్జన జరుగుతోంది. ఈడీ, ఆ తర్వాత విభాగాధిపతి పోస్టులు రెండు అవసరం లేదని, కింది అంచెల్లోనే ప్రధాన పని పూర్తవుతున్నందున.. పై స్థాయిలో ఒకే అంచె ఉంటే చాలన్నది ఓ అభిప్రాయం. కిందిస్థాయిలో ఒకే అంచె ఉంటే చాలన్నది మరో అభిప్రాయం. తుది నిర్ణయం ఎండీ తీసుకోవాల్సి ఉంది. ఫీల్డ్‌లోకి ఒక ఈడీని పంపే యోచన ప్రస్తుతం ఆర్టీసీలో ఐదుగురు ఈడీలు పనిచేస్తున్నారు. బస్‌భవన్‌లో ముగ్గురుండగా, కరీంనగర్–హైదరాబాద్ జోన్లను పర్యవేక్షించే మరో ఈడీ ఇమ్లీబన్ బస్టాండులో, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌ను పర్యవేక్షించే ఈడీ జూబ్లీ బస్టాండ్‌లో ఉంటారు. మొత్తంగా ఐదుగురు ఈడీలు హైదరాబాద్‌లోనే ఉంటారు. దీంతో ఒకరు జిల్లాల్లో ఉంటే బాగుంటుందని ఎండీ యోచిస్తున్నారు. ఆ మేరకు ఒకరిని క్షేత్రస్థాయిలో ఉండేలా పంపే వీలుందని సమాచారం. -
రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనలు
సాక్షి, మేడ్చల్ జిల్లా : రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనకు జిల్లా అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తాజాగా మేడ్చల్ జిల్లాలో 11 మంది తహసీల్దార్లను బదిలీ చేసిన యంత్రాంగం మంగళవారం మరో 12 మంది ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల కీసర తహసీల్దార్ నాగరాజు రాంపల్లి దాయార రెవెన్యూ పరిధిలో భూ మార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో రియల్టర్ బ్రోకర్ల వద్ద నుంచి రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై జిల్లా అదనపు కలెక్టర్ కె.విద్యాసాగర్ ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలుస్తున్నది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో అవినీతి ఉద్యోగుల ఏరివేత ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని భూముల ధరలకు రెక్కలు రావటంతో రెవెన్యూ శాఖలో అవినీతికి అందులేకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళనతో ఆరంభమైన రెవెన్యూ శాఖ అవినీతి భాగోతం పరాకాష్టకు చేరుకుంది. అందులో భాగంగా కీసర నుంచి మొదలుకొని అనేక సంఘటనలు వెలుగు చూశాయి. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) ఇదిలా ఉండగా, జిల్లాలో 12 వేల ఎకరాలకు సంబంధించిన భూములు పలు వివాదాలతో పలు కోర్టుల్లో మగ్గుతుండగా, వందలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములపై కన్నేసిన కొందరు కబ్జాదారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నగర శివారులోని కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, అసైన్డ్ భూములు పరిరక్షణ, వివాదాల్లోని భూములకు సత్వర పరిష్కారం తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా బదిలీలకు తెరలేపినట్లు తెలుస్తున్నది.(చదవండి : విచారణకు సహకరించని ఎమ్మార్వో నాగరాజు!) అందులో భాగంగా జిల్లాలో 12 మంది ఆర్ఐలు (గీర్దావరులు), సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గీర్దార్వర్ (ఆర్ఐ) కిరణ్‌కుమార్ కీసర మండలంతోపాటు శామీర్‌పేట్‌లో పని చేసిన కాలంలో పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కీసరలో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నాగరాజుకు ఆర్ఐ కిరణ్‌కుమార్ ప్రధాన అనుచరుడిగా పేరుంది. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడలో అసైన్డ్ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదల నుంచి ఒక్కొకరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష స్థానిక వీఆర్‌ఓతో కలిసి వసూలు చేశారనే ఆరోపణల్లో కిరణ్ కుమార్ ప్రధాన వ్యక్తిగా స్థానిక ప్రజల్లో ప్రచారం ఉంది. వెలుగులోకి రాని అవినీతి ఆర్ఐలకు కూడా బదిలీల్లో చోటు లభించింది. త్వరలో పెద్ద ఎత్తున వీఆర్ఓ, వీఆర్ఏల బదిలీలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉద్యోగ సృష్టికర్తలొస్తారు..
న్యూఢిల్లీ: ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. శనివారం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థి ఏం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడో అదే అందించడం కొత్త విద్యా విధానంలో భాగంగా ఉంటుందని వెల్లడించారు. ఇది కేవలం ఒక విధాన పత్రం కాదని, 130 కోట్ల మందికిపైగా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. ‘ఇష్టం లేని సబ్జెక్టులను తమపై బలవంతంగా రుద్దుతున్నారని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. ఆసక్తి లేని చదువులు చదవాలని వారిపై మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల విద్యార్థులు అక్షరాస్యులు అవుతారేమో గానీ వారికి ఉపయోగం మాత్రం ఉండదు. డిగ్రీలు సంపాదించినప్పటికీ ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. ఇది వారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయడమే నూతన విద్యా విధానం ఉద్దేశం’ అని మోదీ ఉద్ఘాటించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. ఈ ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. -
సాగరళ మథనం
రాష్ట్ర రాజధానిలో ప్రధాన పర్యాటక కేంద్రమైన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన సత్ఫలితాలనిస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పది నెలల క్రితం మొదలుపెట్టిన ‘బయో రెమిడేషన్’ ప్రక్రియతో సా‘గరళం’ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. డ్రైనేజీ, రసాయన వ్యర్థాలు నిండటంతో సాగర్‌లోంచి వెలువడుతున్న దుర్వాసనను బెంగళూరుకు చెందిన నాకాఫ్ సంస్థ కొంతమేర నియంత్రించగలిగింది. అడపాదడపా హుస్సేన్‌సాగర్ నుంచి దుర్వాసన వస్తున్నా పూర్తిస్థాయిలో నియంత్రణలోనే ఉండటంతోపాటు నీటిలో ఆక్సిజన్ శాతం పెరగడమే కాకుండా వ్యర్థ బ్యాక్టీరియాలు నశించడం సానుకూల సంకేతాలను ఇస్తోంది. హెచ్ఎండీఏ అధికారుల మార్గదర్శనంలో మరో ఆరు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగితే పర్యాటకులు, నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దుర్వాసన పూర్తిస్థాయిలో దూరం కానుంది. 2దశల్లో..2పనులు హుస్సేన్‌సాగర్ విస్తరిత ప్రాంతంతోపాటు దుర్గంధం అధికంగా వచ్చే ప్రాంతాలపై నాకాఫ్ సంస్థ దృష్టి సారించింది. మొదటి దశలో ఐఎం సొల్యూషన్స్‌ను ట్యాంకర్ల ద్వారా హుస్సేన్‌సాగర్‌లో చల్లుతున్నారు. దీనివల్ల జలాశయంలోని వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతోంది. రెండో దశలో బొకాషి బాల్స్‌ను జలాశయంలోకి వదలుతున్నారు. దీనివల్ల ఆ రసాయనాలు సాగర్ అడుగున ఉన్న బ్యాక్టీరియాలను తినేస్తున్నాయి. ఈ ప్రక్రియ కోసం పర్యాటకశాఖ నుంచి బోటును అద్దెకు తీసుకొని ‘బొకాషి బాల్స్’ను జలాల్లో వేస్తున్నారు. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడమే కాకుండా ఆక్సిజన్ శాతం పెరుగుతోంది. తాజా పీసీబీ గణాంకాల ప్రకారం గతంలో శూన్య శాతంలో ఉన్న డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఇప్పుడు 7.6 శాతం దాకా చేరుకుంది. ఈ ఏడాది సాగర్ పరిసరాల్లో దుర్గంధం అంతగా లేదని పర్యాటకులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అమెరికా పర్యటన ఉండటంతో ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ హుస్సేన్ సాగర్‌లో శనివారం పర్యటించి నాకాఫ్ సంస్థ పనితీరును మెచ్చుకున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
పల్లెకు డెంగీ కాటు
రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు నీటి నిల్వలే కొంప ముంచుతున్న వైనం పట్టించుకోని ప్రభుత్వం జిల్లాను డెంగీ వణికిస్తోంది. బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు డెంగీ కాటుకు బలైపోతున్నారు. నీటి నిల్వలు, అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం, దీనికితోడు ఉధృతమవుతున్న దోమలు, మరో వైపు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి పడమటి మండలాల్లోని గ్రామాలు ‘గజగజ’ వణికిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. తిరుపతి : జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు, భాకరాపేట, కుప్పం, యాదమరి, ఐరాల, బి.కొత్తకోట, పలమనేరు, బొమ్మన చెరువు, రాయలపేట, చెంబుకూరు, ముదిబాపన పల్లె, పెద్దమండ్యం, తిరుపతి అర్బన్, కోసువారిపల్లె, ములకలచెరువు, సోమల, రొంపిచెర్ల, నిమ్మనపల్లె, కల్లూరు, చింతపర్తి గ్రామాల ప్రజలు జ్వరాలతో వణికిపోతున్నారు. ముఖ్యంగా మదనపల్లె డివిజన్లో ఈ జ్వరాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల సైతం ధ్రువీకరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 738 డెంగీ కేసులు నమోదైనట్లు తెలుపుతున్నారు. అనధికారికంగా రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది. నీటి నిల్వలే కారణం... ముఖ్యంగా పడమటి మండలాల్లో ఎక్కువ గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటి కోసం సైతం ట్యాంకర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇవి కూడా కొన్ని చోట్ల వారానికి ఒక సారి వస్తుండడంతో ప్రజలు నీటిని నిల్వ ఉంచుకుంటున్నారు. ఇదే ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ నీటి వల్లే దోమలు వృద్ధి చెంది ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయని వైద్యశాఖ అధికారుల సైతం ధ్రువీకరిస్తున్నారు. డెంగీకి దూరంగా ఉండాలంటే... - నీటిని నిల్వ ఉంచుకునే పాత్రలు, డ్రమ్ములు కచ్చితంగా వారానికి ఒకసారి కడిగి ఎండబెట్టిన తరువాత మాత్రమే వాటిలో తిరిగి నీటిని నింపుకోవాలి. - నీరు నిల్వ ఉండే ఓవర్హెడ్ట్యాంక్లు, బిందెలు, డ్రమ్ములపై మూతలు తప్పకుండా పెట్టుకోవాలి. - ఇంటి పరిసరాల్లో ఖాళీ కూల్‌డ్రింక్ బాటిళ్లు, పగిలిన టీకప్పులు, కొబ్బరి బోండాలు, పాత టైర్లు, రోళ్లలో నీటి నిల్వలు ఉండకుండా చూడాలి. - వారంలో ఒక రోజు డ్రైడేను పాటించాలి. - ఈ డెంగీ వైరస్ మంచి నీళ్లల్లోనే గుడ్లు పెట్టి వృద్ధి చెందుతుంది, కాబట్టి మూతలు తప్పని సరిగా పెట్టుకోవాలి. - దోమలు కుట్టకుండా దోమతెరలు,పూర్తి డ్రస్సులు, ప్రొటెక్ట్ చేసే మస్కిటో కాయల్స్ వాడుకోవాలి జ్వరం వచ్చిన వెంటనే... డెంగీ అయితే నీరసంతో పాటు జ్వరం ఎక్కువగా వస్తుంది. కళ్లు నొప్పిగా ఉంటాయి. వాంతులు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం వచ్చిన వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్లు అంటే దగ్గరల్లోని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించాలి. జ్వరం తగ్గక పోతే జిల్లా ఆస్పత్రి, రుయా వంటి ప్రధాన ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. చైతన్యం చేస్తున్నాం... డెంగీ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. నీటిని నిల్వ ఉంచుకోకుండా ఉండటంతో పాటు, గ్రామాల్లో పారిశుధ్యంపైన దృష్టి సారించాం. ప్రజలు దోమల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పల్లె ప్రజలకు వివరిస్తున్నాం. - కోటేశ్వరి,డీఎంహెచ్‌వో, చిత్తూరు -
జిల్లా ఆస్పత్రికి సుస్తీ
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఎటు చూసినా పారిశుద్ధ్యం కనిపించడంలేదు. వార్డుల్లో పగిలిపోయిన కిటికీలు దర్శనమిస్తున్నాయి. మంచాలు కొన్ని విరిగి పోయి ఉండగా మరికొన్ని అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులోని మంచాలపై బెడ్లు కూడ లేని దుస్థితి. ఓపీకి వచ్చే రోగుల పరిస్థితి మరీ దారుణం. ఒకరోగంతో వస్తే ఓపీ చీటి తీసుకునే లోపు మరో రోగం వచ్చేలా పరిస్థితులు తయారయ్యాయి. ఓపీ లైన్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలి. కానీ 10 గంటలకు కూడా మొదలవదు. ఎందుకంటే చీటీ రాసిచ్చే వారు వచ్చినా డాక్టర్లు దర్జాగా 10 గంటల తరువాతే వస్తారు. ఎవరైనా అధికారులు పర్యవేక్షణకు వస్తున్నారంటే మాత్రం సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుంటారు. అధికారులు వెళ్లిపోగానే మల్లి కథ మొదటికి వస్తుంది. వార్డుల్లో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అధికారులు అక్షింతలు వేసినా పట్టించుకోని నైజం. ఆధిపత్య పోరులో మునిగితేలుతున్న అధికారులకు ఇవేమి పట్టవు. వాటర్ ట్యాంకుల్లో నీరు వృథాగా పోతూ ఉంటుంది. రోగులు నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి. ఆస్పత్రి ఆవరణలో పశువులు సంచరించినా, మేయిన్‌గేట్ పక్కనే చెత్త పేరుకు పోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. డాక్టర్లు ఏ సమయంలో వస్తారో తెలియదు. పిల్లల వార్డులో సీరియస్‌గా ఉన్న ఏఎంసీ పేషెంట్లను ఉంచడంతో చిన్న పిల్లలలు భయబ్రాంతులకుగురవుతున్నారు. ఏ వార్డు చూసినా సమస్యలే దర్శనమిస్తాయి. టాయ్లెట్లు నిరుపయోగంగా మారాయి. బాత్రూంలకు తలుపులుండవు. సాయంత్రం వేళల్లో ఆస్పత్రి భూత్ బంగ్లాను తలపిస్తుంది. లైట్లు అరకొరగా ఉండటం వల్ల రాత్రి పూట రో గులు వారి వెంట వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం మాట అటుంచితే సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ గురువారం జిల్లా ఆస్పత్రిని సందర్శించనుండడంతో ఈ దుస్థితి మారుతుందన్న ఆశాభావం రోగులు వ్యక్తం చేస్తున్నారు.