సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఎటు చూసినా పారిశుద్ధ్యం కనిపించడంలేదు. వార్డుల్లో పగిలిపోయిన కిటికీలు దర్శనమిస్తున్నాయి. మంచాలు కొన్ని విరిగి పోయి ఉండగా మరికొన్ని అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులోని మంచాలపై బెడ్లు కూడ లేని దుస్థితి. ఓపీకి వచ్చే రోగుల పరిస్థితి మరీ దారుణం. ఒకరోగంతో వస్తే ఓపీ చీటి తీసుకునే లోపు మరో రోగం వచ్చేలా పరిస్థితులు తయారయ్యాయి.
ఓపీ లైన్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలి. కానీ 10 గంటలకు కూడా మొదలవదు. ఎందుకంటే చీటీ రాసిచ్చే వారు వచ్చినా డాక్టర్లు దర్జాగా 10 గంటల తరువాతే వస్తారు. ఎవరైనా అధికారులు పర్యవేక్షణకు వస్తున్నారంటే మాత్రం సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుంటారు. అధికారులు వెళ్లిపోగానే మల్లి కథ మొదటికి వస్తుంది. వార్డుల్లో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అధికారులు అక్షింతలు వేసినా పట్టించుకోని నైజం. ఆధిపత్య పోరులో మునిగితేలుతున్న అధికారులకు ఇవేమి పట్టవు. వాటర్ ట్యాంకుల్లో నీరు వృథాగా పోతూ ఉంటుంది. రోగులు నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి.
ఆస్పత్రి ఆవరణలో పశువులు సంచరించినా, మేయిన్‌గేట్ పక్కనే చెత్త పేరుకు పోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. డాక్టర్లు ఏ సమయంలో వస్తారో తెలియదు. పిల్లల వార్డులో సీరియస్‌గా ఉన్న ఏఎంసీ పేషెంట్లను ఉంచడంతో చిన్న పిల్లలలు భయబ్రాంతులకుగురవుతున్నారు. ఏ వార్డు చూసినా సమస్యలే దర్శనమిస్తాయి. టాయ్‌లెట్లు నిరుపయోగంగా మారాయి. బాత్‌రూంలకు తలుపులుండవు. సాయంత్రం వేళల్లో ఆస్పత్రి భూత్ బంగ్లాను తలపిస్తుంది. లైట్లు అరకొరగా ఉండటం వల్ల రాత్రి పూట రో గులు వారి వెంట వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం మాట అటుంచితే సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ గురువారం జిల్లా ఆస్పత్రిని సందర్శించనుండడంతో ఈ దుస్థితి మారుతుందన్న ఆశాభావం రోగులు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా ఆస్పత్రికి సుస్తీ
Published Wed, Feb 19 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement