నెలకు 5,000 ఖర్చు చేయలేక.. మొసళ్ల నదిలో వదిలేశారు | Crocodiles were released into the river | Sakshi
Sakshi News home page

నెలకు 5,000 ఖర్చు చేయలేక.. మొసళ్ల నదిలో వదిలేశారు

Published Tue, Dec 17 2024 11:16 AM | Last Updated on Tue, Dec 17 2024 11:16 AM

 Crocodiles were released into the river

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఒక మొసలికి ఆహారంగా రోజుకు సుమారు అర కిలో మాంసం వరకు సరిపోతుంది. వీటికి రోజువిడిచిరోజు ఓ కిలో వర కు బీఫ్‌ ఆహారంగా వేస్తారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం నెలకు ఎక్కు వలో ఎక్కువ రూ.ఐదు వేల వరకు.. ఏడాదికి రూ.60 వేలకు మించి ఖర్చు కావు. ఈ మాత్రం నిధులు లేవనే సాకుతో అటవీశాఖ అధికారులు మంజీరా అభయారణ్యం వద్ద ఉన్న మొసళ్ల పునరావాస కేంద్రాన్నే మూసివేశారు. ఈ కేంద్రంలో ఉన్న మొసళ్లను నదిలో వదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

మూడింటిని కూడా మేపలేక..
సంగారెడ్డికి సమీపంలో ఉన్న మంజీరా అభయార ణ్యం విభిన్న పక్షి జాతులకు నిలయం. మంజీరా డ్యాం వద్ద ఉన్న చిత్తడి నేలల్లో ఏటా వివిధ దేశాల నుంచి వలస పక్షులు కూడా వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ డ్యాంవద్ద అటవీశాఖకు సంబంధించి మొసళ్ల పునరావాస కేంద్రం ఉంది. ఇందులో రెండు ఆడ, ఒక మగ మొసలి ఉండేవి. వీటికి మేతకు నిధులు రావడం లేదని ఆ మొసళ్లను నదిలో వది లేసి ఈ కేంద్రాన్ని మూసివేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తుంటే, ఈ నామమాత్ర నిధులు రావడం లేదంటూ మొసళ్లను నదిలో వదిలేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

పెదవి విరుస్తున్న వన్యప్రాణుల ప్రేమికులు
మొసళ్ల పునరావాస కేంద్రాన్ని మూసివేయడం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు, సందర్శకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యాం వద్దకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కూడా ఈ అభయారణ్యానికి వస్తుంటారు. ఈ కేంద్రం మూసి ఉండటంతో వీరంతా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. 

కాంపా నిధులూ కేటాయించలేరా?
వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కాంపా (కాంపెన్‌సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్, ప్లానింగ్‌ అథారిటీ) నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద ఏటా రూ.కోట్లలో నిధులు వస్తున్నప్పటికీ., ఈ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి మాత్రం నిధులు కేటాయించడం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement