District Government hospital
-
ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్ దోపిడీ
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నిత్యం వందలాది మంది రోగులు, వారి సహాయకులు వస్తూపోతుంటారు. వైద్యం కోసం వీరు సొంత, ప్రైవేటు, అద్దె వాహనాల్లో వస్తారు. జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న వారిలో దాదాపుగా అధికశాతం పేదలే ఉంటారు. ఇక్కడ అన్ని సేవలు ఉచితంగానే అందాలి. కానీ పార్కింగ్ పేరుతో నిర్ణయించిన రేటుకంటే అధికంగా వసూలు చేస్తూ రోగులను, వారి సహాయకులను, పరామర్శించడానికి వచ్చిన వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ తతంగమంతా నెలలకొద్దీ జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి జిల్లాలోని నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వారి వెంట సహాయకులు, కుటుంబసభ్యులు, పరామర్శించడానికి నిత్యం వందలాది మంది వచ్చి వెళ్తుంటారు. వీరిలో ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారితో పాటుగా రోగులను తీసుకొని వాహనాలలో కూడా వస్తుంటారు. వాస్తవానికి వీరి వాహనాలను ఉచితంగా ఆస్పత్రి లోపలికి అనుమతించాలి. కానీ పార్కింగ్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తూ దండుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ నిమిత్తం టెండరును కూడా వేశారు. రెండు సంవత్సరాల క్రితం టెండరును ఖరారు చేశారు. ఈ కాలపరిమితిలో ప్రతినెలా రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వాహనానికి కేవలం రూ.5 మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. కాగా ఈ నిబంధనలను కాలరాస్తూ రూ.10 దండుకుంటున్నారు. వాస్తవానికి వాహనం పార్కింగ్‌కు ఇచ్చే రశీదుపై మాత్రం కేవలం రూ.5 మాత్రమే అని ముద్రించి ఉంటుంది. అయినప్పటికీ టెండరు కాంట్రాక్టుదారులు వాహనానికి రూ.10 వసూలు చేస్తూ రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ తతంగం గురించి పలుమార్లు రోగులు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో రోగులు ఫిర్యాదుచేసినా ఫలితంలేదని భావించి ఊరుకున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మెయింటెనెన్స్ కోసం టెండరు వేస్తున్నప్పటికీ ఒకరి పేరుమీద మరొకరు పార్కింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పార్కింగ్ వసూలు చేస్తున్నవారిని వివరణ కోరగా.. కొన్ని సార్లు చిల్లర లేనప్పుడు మాత్రమే రూ.10 తీసుకుంటున్నట్లు చెప్పడం కొసమెరుపు. ప్రతిరోజు వందల వాహనాలు.. జిల్లా ఆస్పత్రి కావడంతో రోగులు, సహాయకులు, బంధువులు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాలు ప్రతి రోజు సుమారుగా 200 నుంచి 300 వరకు వస్తుంటాయి. వీటిలో దిచక్రవాహనాలు, ఆటోలు, కార్లు వస్తుంటాయి. ద్విచక్రవాహనాలకు రూ.5, ఆటో, కార్లు, తదితర వాహనాలకు రూ.10 తీసుకోవాలన్న నిబంధన ఉంది. కాగా ద్విచక్ర వాహనాలకు సైతం రూ.10 వసూలు చేస్తూ దండుకుంటున్నారని రోగులు పేర్కొంటున్నారు. ఆసుపత్రి రోగులను తరలించే అంబులెన్స్‌లకు సైతం రూ.10 వసూలు దోపిడీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. -
దాని ‘మెడాల్’ వంచేదెవరు?
రోగ నిర్ధారణలో వారి బాధ్యతే కీలకం. వైద్యులు కోరిన నివేదికలు సత్వరం అందించడం వారి కనీస ధర్మం. కానీ జిల్లా కేంద్రాస్పత్రిలోని మెడాల్ సంస్థ వారి విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తోంది. రోగులకు అవసరమైన వైద్యపరీక్షల రిపోర్టులు అందించడంలో తాత్సారం చేస్తోంది. దీనివల్ల రోగులకు సేవలు అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారి ప్రాణాలకు ముప్పువాటిల్లేందుకు కారణమవుతోంది. వారి నిర్లక్ష్య వైఖరిపై ఏకంగా రోగులే ఆందోళనకు దిగాల్సిన దుస్థితి ఏర్పడింది. సాక్షి, విజయనగరం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం మెడాల్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. వైద్య పరీక్షలు చేయడం ప్రారంభించిన నాటి నుంచి ఆ సంస్థపై అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. నివేదికలు తప్పుల తడకగా ఇస్తున్నారని, అదీ సకాలంలో ఇవ్వడం లేదని వైద్యులు సైతం అధికారులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఆ సంస్థ వ్యవహారంలో ఏమాత్రం మార్పు కానరాలేదు. నాలుగు రోజులుగా అందివ్వని నివేదికలు వైద్య పరీక్షలకోసం రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలకు సంబంధించిన నివేదికలను మెడాల్ సంస్థ సకాలంలో ఇవ్వడం లేదు. నాలుగు రోజులుగా కేంద్రాస్పత్రిలో రోగుల నుంచి నివేదికలు ఇవ్వడం నిలిపివేసింది. రోగులు రోజుల తరబడి తిరగలేక విసుగుచెంది శుక్రవారం ఆందోళనకు దిగారు. మెడాల్ సంస్థ ఇచ్చిన చీటీలు చూపి ంచి ఆందోళన చేయడంతో ఆస్పత్రి అధికారులు మెడాల్ సిబ్బందికి ఫోన్ చేసి రప్పించి రోగులకు సంబంధించిన నివేదికలను ఇప్పించారు. విధుల్లోనూ సిబ్బంది నిర్లక్ష్యమే... వాస్తవానికి సంస్థలో పనిచేసే సిబ్బంది ఉదయం తొమ్మిదిగంటలకే హాజరుకావాల్సి ఉంది. అయినా శుక్రవారం వారు పదిగంటలైనా రాలేదు. అప్పటికే రోగులు పెద్ద సంఖ్యలో అక్కడ సిబ్బందికోసం వేచి ఉన్నారు. పాత నివేదికలకోసం కొందరు... కొత్తగా పరీక్షలకోసం మరికొందరు అక్కడ నిరీక్షించడం కనిపించింది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులుగానీ... సంస్థ యాజమాన్యం గానీ కనీసం చర్యలు చేపట్టకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జాప్యం వాస్తవమే... రోగులకు ఇవ్వాల్సిన నివేదికలను రెండు, మూడు రోజులుగా మెడాల్ సంస్థ అందివ్వకుండా జాప్యం చేస్తోందని తెలిసింది. ఈ రోజు రోగులు ఆందోళన చేపట్టడంతో వెంటనే వారికి ఫోన్ చేసి మందలించి వెంటనే నివేదికలు ఇప్పించాం. దీనిపై పై అధికారులకు తెలియజేస్తాం. – కె.సీతారామరాజు, సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
మెడికల్ కళాశాలతో ప్రొద్దుటూరుకు మహర్దశ
- ప్రతిపాదనలు పంపిన అధికారులు - వైఎస్ హయాంలో జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని వైద్య కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆమేరకు వైద్య కళాశాల మంజూరైతే ప్రొద్దుటూరుతోపాటు పరిసర గ్రామాల్లోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అలాగే విద్యార్థులు కూడా చదివేందుకు అదనంగా సీట్లు లభిస్తాయి. వివరాలిలావున్నాయి. పూర్వం నుంచి ప్రొద్దుటూరులో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఏరియా ఆస్పత్రి కొనసాగుతూ ఉంది. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కడపలో ఉన్న జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సెన్సైస్(రిమ్స్)ను నిర్మించారు. అదే సమయంలో ప్రొద్దుటూరులోని ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి 3-5-2008న శిలాఫలకం వేశారు. సుమారు రూ.20కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం 12-8-2011న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసి వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పరిస్థితులన్నీ అనుకూలించి ఇక్కడ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభించే అవకాశం ఉంది. అలాగే వంద సీట్లతో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యుల కొరత ఉంది. అదే వైద్య కళాశాల మంజూరైతే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇందుకు నిధులు మంజూరు కానున్నాయి. ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం చొప్పున నిదులు కేటాయించనున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా స్వయంగా ఆస్పత్రిని సందర్శించి ప్రశంసించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మొత్తం 56 కేటగిరిల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో రెగ్యులర్‌తోపాటు ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నవారు ఉన్నారు. సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయి జిల్లా ఆస్పత్రిని మెడికల్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అందుతాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరు పరిసరాల్లో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే వైద్య నిపుణుల కొరత కూడా తీరే అవకాశం ఉంది. డాక్టర్ ఎం.బుసిరెడ్డి, ఆర్ఎంఓ, జిల్లా ఆస్పత్రి -
అస్తవ్యస్తంగా ‘సదరమ్’
ఖమ్మం వైరా రోడ్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం సదరమ్ క్యాంపు అస్తవ్యస్తంగా సాగింది. ఫలితంగా వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. నగరంలోని జిల్లా ఆస్పత్రిలో ప్రతి గురువారం రెండు మండలాల చొప్పున సదరమ్ క్యాంపులను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ గురువారం ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, ఖమ్మం కార్పొరేషన్ నుంచి దాదాపు మూడువేలమంది వికలాంగులు, వారి సహాయకులు వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో ఎటు చూసినా వీరే కనిపించారు. ఉదయం తొమ్మిది గంటలకు క్యాంప్ ప్రారంభమవుతుందని, 120 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దీంతో, తెల్లవారుజామున నాలుగు గంటలకే వికలాంగులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా వీరిలో ఉన్నారు. టోకెన్ నిబంధనతో ఇక్కట్లు సదరమ్ క్యాంపునకు వచ్చే వికలాంగులు ఫొటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకురావాలని ఆస్పత్రి అధికారులు ముందుగా ప్రచారం చేశారు. ఇవన్నీ సిద్ధం చేసుకుని సమయానికి క్యూలో నిల్చున్న తరువాత.. మున్సిపాలిటీతోపాటు ఆయా గ్రామ పంచాయతీల నుంచి టోకెన్‌తో వచ్చిన వారినే లోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దీంతో వికలాంగులు హతాశులయ్యారు. మండలంలోని గ్రామ కార్యదర్శులు టోకెన్లు ఇచ్చారు. టోకెన్ల విషయమే తెలీని కార్పొరేషన్ పరిధిలోని అనేకమంది వికలాంగులు అప్పటికప్పుడు పరుగు పరుగున కార్పొరేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ, ఎలాంటి టోకెన్లు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చి, అక్కడి అధికారులకు విషయం చెప్పారు. దీనిని వారు పట్టించుకోకుండా.. ‘‘టోకెన్లు ఉంటేనే అనుమతిస్తా’’మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఏజేసీకి ఫిర్యాదు టోకెన్ లేని వికలాంగులను లోనికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వికలాంగు లు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకుదిగారు. ముందస్తు సమాచారంగానీ, సరైన ప్రచారంగనీ లేకుండా తీరా ఆస్పత్రికి వచ్చిన తర్వాత టోకెన్లు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేదని వారు ప్రశ్నించారు. ధర్నా అనంతరం, కలెక్టరేట్‌కు వెళ్లి అదనపు జాయింట్ కలెక్టర్ బాబూరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఆయన స్పంది స్తూ.. టోకెన్ లేకుండా వచ్చిన వారికి ప్రత్యేక తేదీలలో క్యాంపు నిర్వహిస్తామన్నారు. ప్రతి క్యాంప్‌లో ఐదుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో 200మంది వికలాంగులకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు షర్మిలా సంపత్, షకీనా, గరిడేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధికారుల సమన్వయ లేమి ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కార్పొరేషన్ పరిధిలోని వికలాంగులకు ఒకే రోజు సదరమ్ క్యాంపు నిర్వహించడం తో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్యశాఖ, డీఆర్డీఏ, కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయ లో పం కారణంగా సదరమ్ క్యాంపులో వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. ఏ విభాగానికి చెందిన వైద్యుడు ఎక్కడ ఉంటారు? ముందుగా ఎవరిని సంప్రదించాలి? దరఖాస్తు లు ఎక్కడ ఇస్తారు? ఇత్యాది వివరాలు తెలియకపోవడంతో వికలాంగులు ఇబ్బందిపడ్డారు. సదరమ్ క్యాంపు నిర్వహణలో ప్రైవేట్ ఫిజియోథెరపిస్టులు కూడా సేవలందించారు. వారికి కుర్చీలు, మంచినీళ్లు కూడా లేవంటే.. ఏర్పాట్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. -
జిల్లా ఆస్పత్రికి సుస్తీ
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఎటు చూసినా పారిశుద్ధ్యం కనిపించడంలేదు. వార్డుల్లో పగిలిపోయిన కిటికీలు దర్శనమిస్తున్నాయి. మంచాలు కొన్ని విరిగి పోయి ఉండగా మరికొన్ని అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులోని మంచాలపై బెడ్లు కూడ లేని దుస్థితి. ఓపీకి వచ్చే రోగుల పరిస్థితి మరీ దారుణం. ఒకరోగంతో వస్తే ఓపీ చీటి తీసుకునే లోపు మరో రోగం వచ్చేలా పరిస్థితులు తయారయ్యాయి. ఓపీ లైన్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలి. కానీ 10 గంటలకు కూడా మొదలవదు. ఎందుకంటే చీటీ రాసిచ్చే వారు వచ్చినా డాక్టర్లు దర్జాగా 10 గంటల తరువాతే వస్తారు. ఎవరైనా అధికారులు పర్యవేక్షణకు వస్తున్నారంటే మాత్రం సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుంటారు. అధికారులు వెళ్లిపోగానే మల్లి కథ మొదటికి వస్తుంది. వార్డుల్లో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అధికారులు అక్షింతలు వేసినా పట్టించుకోని నైజం. ఆధిపత్య పోరులో మునిగితేలుతున్న అధికారులకు ఇవేమి పట్టవు. వాటర్ ట్యాంకుల్లో నీరు వృథాగా పోతూ ఉంటుంది. రోగులు నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి. ఆస్పత్రి ఆవరణలో పశువులు సంచరించినా, మేయిన్‌గేట్ పక్కనే చెత్త పేరుకు పోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. డాక్టర్లు ఏ సమయంలో వస్తారో తెలియదు. పిల్లల వార్డులో సీరియస్‌గా ఉన్న ఏఎంసీ పేషెంట్లను ఉంచడంతో చిన్న పిల్లలలు భయబ్రాంతులకుగురవుతున్నారు. ఏ వార్డు చూసినా సమస్యలే దర్శనమిస్తాయి. టాయ్లెట్లు నిరుపయోగంగా మారాయి. బాత్రూంలకు తలుపులుండవు. సాయంత్రం వేళల్లో ఆస్పత్రి భూత్ బంగ్లాను తలపిస్తుంది. లైట్లు అరకొరగా ఉండటం వల్ల రాత్రి పూట రో గులు వారి వెంట వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం మాట అటుంచితే సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ గురువారం జిల్లా ఆస్పత్రిని సందర్శించనుండడంతో ఈ దుస్థితి మారుతుందన్న ఆశాభావం రోగులు వ్యక్తం చేస్తున్నారు. -
స్పెషల్ బేబీస్
=11-12-13న మరువలేని జననాలు =తల్లిదండ్రుల ఆనందం మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : వెయ్యేళ్లకోమారు వచ్చే అరుదైన 11-12-13న తమ బిడ్డలకు జన్మనిచ్చిన తల్లితండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ తేదీ అంకెలన్నీ కలిపితే తొమ్మిది సంఖ్య వస్తుంది. తొమ్మిది సంఖ్యను చాలా మంది లక్కీ నెంబర్‌గా భావిస్తారు. అత్యంత అరుదైన ఈ తేదీన గ్రహబలాలు బాగున్నాయని పండితులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కొంతమంది గర్భిణీలు కావాలనే సిజేరియన్ల ద్వారా శిశువులకు జన్మనిచ్చారు. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన నరహరశెట్టి సుగుణ సిజేరియన్ ద్వారా మగ కవలలకు జన్మనివ్వడం మరో విశేషం. అలాగే మొగల్తూరు మండలం పాతపాడుకు చెందిన రామాని జ్యోతి, పామర్రు గాంధీ ఆశ్రమంకు చెందిన పెద్ది నాగలక్ష్మి, ఆచంట మండలం వేమవరంకు చెందిన చల్లా భాగ్యశ్రీ, ఘంటసాల మండలం జీలగలగండికి చెందిన గండు సుభాషిణి మగశిశువులకు జన్మనిచ్చారు. అలాగే బందరు మండలం గొకవరంకు చెందిన మేకా నాగ పైడమ్మ, గూడూరు మండలం ముక్కొల్లుకు చెందిన అరిశెట్టి అనురాధ, మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన జన్ను రమ్యశ్రీ ఆడ శిశువులకు జన్మనిచ్చారు. అలాగే సాధారణ ప్రసవాల ద్వారా ఆరుగురు గర్భిణిలు శిశువులకు జన్మనిచ్చారు. మచిలీపట్నం బైపాస్ రోడ్‌కు చెందిన జన్ను లలిత, నిజాంపేటకు చెందిన వాసిరెడ్డి కీర్తిరమ్య, పెడన మండలం కట్లపల్లికి చెందిన మర్రి పైడమ్మ, నాగాయలంక మండలం మెరకపాలెంకు చెందిన గాలి పావని, జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామానికి చెందిన శీలం జ్యోతి , ఖమ్మం జిల్లా ,ఎర్రుపాలెం మండలం, బనిగండ్లపాడు గ్రామానికి చెందిన ముంతమాల మల్లేశ్వరి ఆడశిశువులకు జన్మనిచ్చారు. బందరు మండలం నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన వేముల పార్వతి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది అరుదైన 11.12.13 తేదీన మగపిల్లాడికి సిజేరియన్ ద్వారా జన్మనివ్వటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజున గ్రహబలం బాగా ఉందని పండితులు చెబుతున్నారు. -పెద్ది నాగలక్ష్మి, పామర్రు ఆడ శిశువుకు జన్మనివ్వడం అదృష్టం ఈ అరుదైన తేదీన సిజేరియన్ ద్వారా ఆడ శిశువుకు జన్మనివ్వటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. మంచి రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చాననే తృప్తి కలిగింది. - అరిశెట్టి అనురాధ, ముక్కొల్లు