దాని ‘మెడాల్‌’ వంచేదెవరు? | Government Hospital Staff Not working In Vizianagaram | Sakshi
Sakshi News home page

దాని ‘మెడాల్‌’ వంచేదెవరు?

Published Sat, Aug 3 2019 10:31 AM | Last Updated on Sat, Aug 3 2019 10:31 AM

Government Hospital Staff Not working In Vizianagaram - Sakshi

మెడాల్‌ సంస్థ లేబొరేటరీ వద్ద ఆందోళన చేస్తున్న రోగులు

రోగ నిర్ధారణలో వారి బాధ్యతే కీలకం. వైద్యులు కోరిన నివేదికలు సత్వరం అందించడం వారి కనీస ధర్మం. కానీ జిల్లా కేంద్రాస్పత్రిలోని మెడాల్‌ సంస్థ వారి విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తోంది. రోగులకు అవసరమైన వైద్యపరీక్షల రిపోర్టులు అందించడంలో తాత్సారం చేస్తోంది. దీనివల్ల రోగులకు సేవలు అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారి ప్రాణాలకు ముప్పువాటిల్లేందుకు కారణమవుతోంది. వారి నిర్లక్ష్య వైఖరిపై ఏకంగా రోగులే ఆందోళనకు దిగాల్సిన దుస్థితి ఏర్పడింది.

సాక్షి, విజయనగరం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం మెడాల్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. వైద్య పరీక్షలు చేయడం ప్రారంభించిన నాటి నుంచి  ఆ సంస్థపై అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. నివేదికలు తప్పుల తడకగా ఇస్తున్నారని, అదీ సకాలంలో ఇవ్వడం లేదని వైద్యులు సైతం అధికారులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఆ సంస్థ వ్యవహారంలో ఏమాత్రం మార్పు కానరాలేదు.

నాలుగు రోజులుగా అందివ్వని నివేదికలు
వైద్య పరీక్షలకోసం రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలకు సంబంధించిన నివేదికలను మెడాల్‌ సంస్థ సకాలంలో ఇవ్వడం లేదు. నాలుగు రోజులుగా కేంద్రాస్పత్రిలో రోగుల నుంచి నివేదికలు ఇవ్వడం నిలిపివేసింది. రోగులు రోజుల తరబడి తిరగలేక విసుగుచెంది శుక్రవారం ఆందోళనకు దిగారు. మెడాల్‌  సంస్థ ఇచ్చిన చీటీలు చూపి ంచి ఆందోళన చేయడంతో ఆస్పత్రి అధికారులు మెడాల్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి రప్పించి  రోగులకు సంబంధించిన నివేదికలను ఇప్పించారు.

విధుల్లోనూ సిబ్బంది నిర్లక్ష్యమే...
వాస్తవానికి సంస్థలో పనిచేసే సిబ్బంది ఉదయం తొమ్మిదిగంటలకే హాజరుకావాల్సి ఉంది. అయినా శుక్రవారం వారు పదిగంటలైనా రాలేదు. అప్పటికే రోగులు పెద్ద సంఖ్యలో అక్కడ సిబ్బందికోసం వేచి ఉన్నారు. పాత నివేదికలకోసం కొందరు... కొత్తగా పరీక్షలకోసం మరికొందరు అక్కడ నిరీక్షించడం కనిపించింది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులుగానీ... సంస్థ యాజమాన్యం గానీ కనీసం చర్యలు చేపట్టకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

జాప్యం వాస్తవమే...
రోగులకు ఇవ్వాల్సిన నివేదికలను రెండు, మూడు రోజులుగా మెడాల్‌ సంస్థ అందివ్వకుండా జాప్యం చేస్తోందని తెలిసింది. ఈ రోజు రోగులు ఆందోళన చేపట్టడంతో వెంటనే వారికి ఫోన్‌ చేసి మందలించి వెంటనే నివేదికలు ఇప్పించాం. దీనిపై పై అధికారులకు తెలియజేస్తాం.        
– కె.సీతారామరాజు, సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement