medaal company
-
దాని ‘మెడాల్’ వంచేదెవరు?
రోగ నిర్ధారణలో వారి బాధ్యతే కీలకం. వైద్యులు కోరిన నివేదికలు సత్వరం అందించడం వారి కనీస ధర్మం. కానీ జిల్లా కేంద్రాస్పత్రిలోని మెడాల్ సంస్థ వారి విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తోంది. రోగులకు అవసరమైన వైద్యపరీక్షల రిపోర్టులు అందించడంలో తాత్సారం చేస్తోంది. దీనివల్ల రోగులకు సేవలు అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారి ప్రాణాలకు ముప్పువాటిల్లేందుకు కారణమవుతోంది. వారి నిర్లక్ష్య వైఖరిపై ఏకంగా రోగులే ఆందోళనకు దిగాల్సిన దుస్థితి ఏర్పడింది. సాక్షి, విజయనగరం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం మెడాల్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. వైద్య పరీక్షలు చేయడం ప్రారంభించిన నాటి నుంచి ఆ సంస్థపై అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. నివేదికలు తప్పుల తడకగా ఇస్తున్నారని, అదీ సకాలంలో ఇవ్వడం లేదని వైద్యులు సైతం అధికారులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఆ సంస్థ వ్యవహారంలో ఏమాత్రం మార్పు కానరాలేదు. నాలుగు రోజులుగా అందివ్వని నివేదికలు వైద్య పరీక్షలకోసం రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలకు సంబంధించిన నివేదికలను మెడాల్ సంస్థ సకాలంలో ఇవ్వడం లేదు. నాలుగు రోజులుగా కేంద్రాస్పత్రిలో రోగుల నుంచి నివేదికలు ఇవ్వడం నిలిపివేసింది. రోగులు రోజుల తరబడి తిరగలేక విసుగుచెంది శుక్రవారం ఆందోళనకు దిగారు. మెడాల్ సంస్థ ఇచ్చిన చీటీలు చూపి ంచి ఆందోళన చేయడంతో ఆస్పత్రి అధికారులు మెడాల్ సిబ్బందికి ఫోన్ చేసి రప్పించి రోగులకు సంబంధించిన నివేదికలను ఇప్పించారు. విధుల్లోనూ సిబ్బంది నిర్లక్ష్యమే... వాస్తవానికి సంస్థలో పనిచేసే సిబ్బంది ఉదయం తొమ్మిదిగంటలకే హాజరుకావాల్సి ఉంది. అయినా శుక్రవారం వారు పదిగంటలైనా రాలేదు. అప్పటికే రోగులు పెద్ద సంఖ్యలో అక్కడ సిబ్బందికోసం వేచి ఉన్నారు. పాత నివేదికలకోసం కొందరు... కొత్తగా పరీక్షలకోసం మరికొందరు అక్కడ నిరీక్షించడం కనిపించింది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులుగానీ... సంస్థ యాజమాన్యం గానీ కనీసం చర్యలు చేపట్టకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జాప్యం వాస్తవమే... రోగులకు ఇవ్వాల్సిన నివేదికలను రెండు, మూడు రోజులుగా మెడాల్ సంస్థ అందివ్వకుండా జాప్యం చేస్తోందని తెలిసింది. ఈ రోజు రోగులు ఆందోళన చేపట్టడంతో వెంటనే వారికి ఫోన్ చేసి మందలించి వెంటనే నివేదికలు ఇప్పించాం. దీనిపై పై అధికారులకు తెలియజేస్తాం. – కె.సీతారామరాజు, సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
రోజుకు ఐదారు టెస్టులు రాయండి!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్కో డాక్టర్ రోజుకు ఐదారు టెస్టులు రాయాల్సిందే..’ నంటూ వైద్యాధికారులపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు అవసరం లేకపోయినా పరీక్షలు ఎలా రాసేదంటూ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ బాధ్యతను మెడాల్ అనే ప్రైవేటు సంస్థకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడాల్ సంస్థ.. డాక్టర్లతో వీలైనన్ని ఎక్కువ పరీక్షలకు సిఫారసు చేయించుకోవడం లేదా అసలు పరీక్షలే చేయకున్నా చేసినట్టుగా బిల్లులు పెట్టుకోవడం వంటి చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల గోదావరి జిల్లాలకు చెందిన ఓ కలెక్టర్... వైద్యాధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎందుకు టెస్టులు రాయడం లేదంటూ కొందరు అధికారులు, వైద్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. ‘ఇది మన ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును భారీగా సక్సెస్ చేయాలి. రోగులకు టెస్టులు ఎవరైనా రాయకపోతే నాకు చెప్పండి..’ అంటూ జిల్లా వైద్యాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో సమావేశంలో పాల్గొన్న వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, డీఎంహెచ్ఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు నివ్వెర పోయారు. రోగికి అవసరమనుకుంటే టెస్టులు రాస్తాం కానీ, అవసరం లేకపోతే ఎలా రాస్తామని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వైద్యుడు వాపోయారు. రోజుకు 8 వేల రక్త నమూనాలు ఇస్తామని ప్రభుత్వం మెడాల్కు చెప్పిన నేపథ్యంలోనే.. ఆ సంస్థకు లబ్ధి చేకూర్చే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లపై పెట్టిందని, ఆ మేరకు కలెక్టర్లు తమపై ఒత్తిడి తెస్తున్నారని వైద్యాధికారులు వాపోతున్నారు. మరోవైపు పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రి వైద్యుల వద్దకు మెడాల్ తమ ప్రతినిధులను పంపించి మీరు ఖాళీ ప్రిస్క్రిప్షన్లు ఇస్తే, తామే టెస్టులు రాసుకుంటామని, దీనికి ప్రతిఫలంగా దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు టూర్లు ఎరగా వేస్తోందని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైద్యుడు తెలిపారు. ఇదిలా ఉండగా మెడాల్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 81 రక్తపరీక్షల ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు చేయలేదు. పైగా ప్రైవేటు డయాగ్నిస్టిక్స్ కేంద్రాలకు ఫ్రాంచైజీల లెక్కన అమ్మేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్థాయిలో, ఉన్నతాధికారుల వద్ద ఉన్న పరపతి కారణంగానే మెడాల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వైద్యాధికారులు అంటున్నారు.