ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనాలు
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నిత్యం వందలాది మంది రోగులు, వారి సహాయకులు వస్తూపోతుంటారు. వైద్యం కోసం వీరు సొంత, ప్రైవేటు, అద్దె వాహనాల్లో వస్తారు. జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న వారిలో దాదాపుగా అధికశాతం పేదలే ఉంటారు. ఇక్కడ అన్ని సేవలు ఉచితంగానే అందాలి. కానీ పార్కింగ్ పేరుతో నిర్ణయించిన రేటుకంటే అధికంగా వసూలు చేస్తూ రోగులను, వారి సహాయకులను, పరామర్శించడానికి వచ్చిన వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ తతంగమంతా నెలలకొద్దీ జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
పూర్తి వివరాలలోకి వెళ్తే.. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి జిల్లాలోని నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వారి వెంట సహాయకులు, కుటుంబసభ్యులు, పరామర్శించడానికి నిత్యం వందలాది మంది వచ్చి వెళ్తుంటారు. వీరిలో ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారితో పాటుగా రోగులను తీసుకొని వాహనాలలో కూడా వస్తుంటారు. వాస్తవానికి వీరి వాహనాలను ఉచితంగా ఆస్పత్రి లోపలికి అనుమతించాలి. కానీ పార్కింగ్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తూ దండుకుంటున్నారు.
వాహనాల పార్కింగ్ నిమిత్తం టెండరును కూడా వేశారు. రెండు సంవత్సరాల క్రితం టెండరును ఖరారు చేశారు. ఈ కాలపరిమితిలో ప్రతినెలా రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వాహనానికి కేవలం రూ.5 మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. కాగా ఈ నిబంధనలను కాలరాస్తూ రూ.10 దండుకుంటున్నారు. వాస్తవానికి వాహనం పార్కింగ్‌కు ఇచ్చే రశీదుపై మాత్రం కేవలం రూ.5 మాత్రమే అని ముద్రించి ఉంటుంది. అయినప్పటికీ టెండరు కాంట్రాక్టుదారులు వాహనానికి రూ.10 వసూలు చేస్తూ రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ తతంగం గురించి పలుమార్లు రోగులు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో రోగులు ఫిర్యాదుచేసినా ఫలితంలేదని భావించి ఊరుకున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మెయింటెనెన్స్ కోసం టెండరు వేస్తున్నప్పటికీ ఒకరి పేరుమీద మరొకరు పార్కింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పార్కింగ్ వసూలు చేస్తున్నవారిని వివరణ కోరగా.. కొన్ని సార్లు చిల్లర లేనప్పుడు మాత్రమే రూ.10 తీసుకుంటున్నట్లు చెప్పడం కొసమెరుపు.
ప్రతిరోజు వందల వాహనాలు..
జిల్లా ఆస్పత్రి కావడంతో రోగులు, సహాయకులు, బంధువులు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాలు ప్రతి రోజు సుమారుగా 200 నుంచి 300 వరకు వస్తుంటాయి. వీటిలో దిచక్రవాహనాలు, ఆటోలు, కార్లు వస్తుంటాయి. ద్విచక్రవాహనాలకు రూ.5, ఆటో, కార్లు, తదితర వాహనాలకు రూ.10 తీసుకోవాలన్న నిబంధన ఉంది. కాగా ద్విచక్ర వాహనాలకు సైతం రూ.10 వసూలు చేస్తూ దండుకుంటున్నారని రోగులు పేర్కొంటున్నారు. ఆసుపత్రి రోగులను తరలించే అంబులెన్స్‌లకు సైతం రూ.10 వసూలు దోపిడీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment