- ప్రతిపాదనలు పంపిన అధికారులు
- వైఎస్ హయాంలో జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని వైద్య కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆమేరకు వైద్య కళాశాల మంజూరైతే ప్రొద్దుటూరుతోపాటు పరిసర గ్రామాల్లోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అలాగే విద్యార్థులు కూడా చదివేందుకు అదనంగా సీట్లు లభిస్తాయి. వివరాలిలావున్నాయి.
పూర్వం నుంచి ప్రొద్దుటూరులో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఏరియా ఆస్పత్రి కొనసాగుతూ ఉంది. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కడపలో ఉన్న జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసి రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌సెన్సైస్(రిమ్స్)ను నిర్మించారు. అదే సమయంలో ప్రొద్దుటూరులోని ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి 3-5-2008న శిలాఫలకం వేశారు.
సుమారు రూ.20కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం 12-8-2011న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసి వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పరిస్థితులన్నీ అనుకూలించి ఇక్కడ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభించే అవకాశం ఉంది. అలాగే వంద సీట్లతో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యుల కొరత ఉంది. అదే వైద్య కళాశాల మంజూరైతే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇందుకు నిధులు మంజూరు కానున్నాయి. ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం చొప్పున నిదులు కేటాయించనున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా స్వయంగా ఆస్పత్రిని సందర్శించి ప్రశంసించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మొత్తం 56 కేటగిరిల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో రెగ్యులర్‌తోపాటు ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్నవారు ఉన్నారు.
సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయి
జిల్లా ఆస్పత్రిని మెడికల్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అందుతాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరు పరిసరాల్లో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే వైద్య నిపుణుల కొరత కూడా తీరే అవకాశం ఉంది.
డాక్టర్ ఎం.బుసిరెడ్డి, ఆర్‌ఎంఓ, జిల్లా ఆస్పత్రి
మెడికల్ కళాశాలతో ప్రొద్దుటూరుకు మహర్దశ
Published Tue, Dec 9 2014 4:07 AM | Last Updated on Thu, Sep 19 2019 8:59 PM
Advertisement
Advertisement