ఖమ్మం వైరా రోడ్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం సదరమ్ క్యాంపు అస్తవ్యస్తంగా సాగింది. ఫలితంగా వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. నగరంలోని జిల్లా ఆస్పత్రిలో ప్రతి గురువారం రెండు మండలాల చొప్పున సదరమ్ క్యాంపులను అధికారులు నిర్వహిస్తున్నారు.
ఈ గురువారం ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, ఖమ్మం కార్పొరేషన్ నుంచి దాదాపు మూడువేలమంది వికలాంగులు, వారి సహాయకులు వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో ఎటు చూసినా వీరే కనిపించారు. ఉదయం తొమ్మిది గంటలకు క్యాంప్ ప్రారంభమవుతుందని, 120 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దీంతో, తెల్లవారుజామున నాలుగు గంటలకే వికలాంగులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా వీరిలో ఉన్నారు.
టోకెన్ నిబంధనతో ఇక్కట్లు
సదరమ్ క్యాంపునకు వచ్చే వికలాంగులు ఫొటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకురావాలని ఆస్పత్రి అధికారులు ముందుగా ప్రచారం చేశారు. ఇవన్నీ సిద్ధం చేసుకుని సమయానికి క్యూలో నిల్చున్న తరువాత.. మున్సిపాలిటీతోపాటు ఆయా గ్రామ పంచాయతీల నుంచి టోకెన్‌తో వచ్చిన వారినే లోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు.
దీంతో వికలాంగులు హతాశులయ్యారు. మండలంలోని గ్రామ కార్యదర్శులు టోకెన్లు ఇచ్చారు. టోకెన్ల విషయమే తెలీని కార్పొరేషన్ పరిధిలోని అనేకమంది వికలాంగులు అప్పటికప్పుడు పరుగు పరుగున కార్పొరేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ, ఎలాంటి టోకెన్లు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చి, అక్కడి అధికారులకు విషయం చెప్పారు. దీనిని వారు పట్టించుకోకుండా.. ‘‘టోకెన్లు ఉంటేనే అనుమతిస్తా’’మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఏజేసీకి ఫిర్యాదు
టోకెన్ లేని వికలాంగులను లోనికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వికలాంగు లు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకుదిగారు. ముందస్తు సమాచారంగానీ, సరైన ప్రచారంగనీ లేకుండా తీరా ఆస్పత్రికి వచ్చిన తర్వాత టోకెన్లు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేదని వారు ప్రశ్నించారు. ధర్నా అనంతరం, కలెక్టరేట్‌కు వెళ్లి అదనపు జాయింట్ కలెక్టర్ బాబూరావుకు వినతిపత్రం ఇచ్చారు.
ఆయన స్పంది స్తూ.. టోకెన్ లేకుండా వచ్చిన వారికి ప్రత్యేక తేదీలలో క్యాంపు నిర్వహిస్తామన్నారు. ప్రతి క్యాంప్‌లో ఐదుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో 200మంది వికలాంగులకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు షర్మిలా సంపత్, షకీనా, గరిడేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల సమన్వయ లేమి
ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కార్పొరేషన్ పరిధిలోని వికలాంగులకు ఒకే రోజు సదరమ్ క్యాంపు నిర్వహించడం తో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్యశాఖ, డీఆర్‌డీఏ, కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయ లో పం కారణంగా సదరమ్ క్యాంపులో వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. ఏ విభాగానికి చెందిన వైద్యుడు ఎక్కడ ఉంటారు? ముందుగా ఎవరిని సంప్రదించాలి? దరఖాస్తు లు ఎక్కడ ఇస్తారు? ఇత్యాది వివరాలు తెలియకపోవడంతో వికలాంగులు ఇబ్బందిపడ్డారు. సదరమ్ క్యాంపు నిర్వహణలో ప్రైవేట్ ఫిజియోథెరపిస్టులు కూడా సేవలందించారు. వారికి కుర్చీలు, మంచినీళ్లు కూడా లేవంటే.. ఏర్పాట్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అస్తవ్యస్తంగా ‘సదరమ్’
Published Fri, Sep 26 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement
Advertisement