sadaram camp
-
సదరం స్కాంలో సర్కారు ఉద్యోగులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి కేంద్రంగా వెలుగుచూసిన సదరం స్కాంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఆర్డీఏ అధికారులు, సివిల్ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించిన అధికారులకు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇంతకాలం సదరం సర్టిఫికెట్లను పింఛన్లు, ఆదాయ పన్ను మినహాయింపు, బస్‌పాస్, రైల్వేపాస్‌ల్లో రాయితీ కోసం తీసుకుంటున్నారని అంతా భావించారు. కానీ.. విచిత్రంగా దర్యాప్తులో సరికొత్త నిజం వెలుగుచూసింది. ఈ సర్టిఫికెట్లను తీసుకున్న వారిలో సామాన్య ప్రజలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు గుర్తించడం కేసును మరో మలుపు తిప్పింది. త్వరలోనే వీరి విచారణ..! వాస్తవానికి సదరం స్కాం వెలుగుచూసిన సమయంలో 317 జీవో అమలులో ఉంది. ఆ సమయంలో చాలామంది ప్రభు త్వ ఉద్యోగులు తాము దివ్యాంగులమని అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు పొందారు. ప్రస్తుతం ఏసీబీ సేకరించిన 22 మంది ప్రభుత్వ ఉద్యోగుల జాబితాను ఏసీబీ అధికారులు ఇప్పటికే తనిఖీ చేశారని సమాచారం. వీరు ఇటీవల జరిగిన బదిలీల్లోనూ ఈ సర్టిఫికెట్లను చూపినట్లు తెలిసింది. ఈ క్రమంలో బదిలీల లిస్టులో వీరు ఈ సర్టిఫికెట్లను కోరుకున్న స్థానాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారా? లేదా అని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వీరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ఏ స్థానంలో పనిచేస్తున్నారు? అన్న విషయాలపై దృష్టి సారించారు. ఈ విషయంలో వీరు ఒక నిర్ధారణకు వస్తే.. అప్పుడు వీరిని పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. దాంతోపాటు.. సర్టిఫికెట్లు కలిగి ఉన్న సివిల్ ఆసుపత్రి సిబ్బంది వెంటనే సమర్పించాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఏసీబీ ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందని సమాచారం. 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు 2020 కరోనాకు ముందు సదరం సర్టిఫికెట్ల జారీ మొత్తం మ్యాన్యువల్ విధానంలో జరిగేది. ► కరోనాతో 2020లో శిబిరాలు నిర్వహించలేదు. ► 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన స్లాట్లపై తీవ్ర దుమారం రేగింది. జారీ చేసిన సర్టిఫికెట్లలో అధికశాతం అనర్హులకు కేటాయించారన్న విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ► వాస్తవానికి ఈ కుంభకోణం మూలాలు 2015 నుంచే ఉన్నప్పటికీ.. ఆన్లైన్లో డీఆర్డీఏ– సివిల్ ఆసుపత్రి వారు కుమ్మక్కై తమకు కావాల్సిన వారికే స్లాట్లు దక్కేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ► ఈ ఏడాది వ్యవధిలో పొందిన సర్టిఫికెట్లలో మొత్తం 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని గుర్తించింది. వీరిలో దాదాపు 14 మంది కరీంనగర్‌కు నగరానికి చెందినవారే కావడం గమనార్హం. ► మిగిలిన వారు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో నివసిస్తున్నారు. వీరంతా పోయినేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ వరకు వివిధ క్యాంపుల్లో సర్టిఫికెట్లు తీసుకున్నారు. వీరి సర్టిఫికెట్లు అనుమానాస్పదంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు వీరి వ్యక్తిగత వివరాలు, ఫోన్నెంబర్లను సేకరించారు. -
రేపు సదరం శిబిరం రద్దు
అనంతపురం టౌన్: వైలక్యధ్రువీకరణ పరీక్షలు, సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో శనివారం నిర్వహించాల్సిన ‘సదరం’ శిబిరాన్ని రద్దు చేస్తున్నట్లు సదరం ఇన్చార్జ్ లలిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు. -
రేపు ‘సదరం’ శిబిరానికి సెలవు
అనంతపురం టౌన్: వైకల్య ధ్రువీకరణ పరీక్ష, సర్టిఫికెట్ల జారీకి సంబంధించి అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరం శనివారం ఉండదని సదరం ఇన్చార్జ్ లలిత తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వైద్య పరీక్షల కోసం వచ్చే వారు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. -
11న సదరం శిబిరం రద్దు
అనంతపురం మెడికల్ : వైకల్య ధ్రువీకరణ పరీక్షలు, పత్రాల జారీకి సంబంధించి నిర్వహించే ‘సదరం’ శిబిరాన్ని ఈనెల 11న రద్దు చేస్తున్నట్లు సదరం ఇన్చార్జ్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండో శనివారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ సర్వజనాస్పత్రికి ఎవరూ రావద్దని ఆయన ఆప్రకటనలో కోరారు. -
దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దు
నెల్లూరు(అర్బన్): దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ పెద్దాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహరావు సూచించారు. దివ్యాంగులకు సర్టిఫికెట్లను అందజేసే సదరమ్ క్యాంపును పెద్దాస్పత్రిలో మంగళవారం తనిఖీ చేశారు. రెండు వారాల నుంచి వారి సర్టిఫికెట్లపై డాక్టర్లు సంతకాలు చేయకపోవడాన్ని గుర్తించారు. ఎన్నిసార్లు చెప్పినా డాక్టర్లు మారడం లేదని, ఇలాంటి వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వారంలోపు వారి సర్టిఫికెట్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. అనంతరం డాక్టర్ల హాజరుపట్టీలను పరిశీలించారు. అభివృద్ధి కమిటీలో కలెక్టర్ ఆదేశించిన మేరకు విధులకు రాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఒట్టూరు సంపత్‌రాజు, నాయకుడు గిరి, తదితరులు పాల్గొన్నారు. -
వికలాంగుల కష్టాలు
సదరమ్ క్యాంప్‌నకు వేలాదిగా తరలివచ్చిన బాధితులు వసతులు కల్పించని అధికారులు గూడూరు టౌన్ : స్థానిక డీఎన్ఆర్ కమ్యూనిటీహాల్లో మంగళవారం జరిగిన సదరమ్ క్యాంపునకు గూడూరు, నాయుడుపేట డివిజన్ పరిధిలోని వికలాంగులు వేలాదిగా తరలిరావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వికలాంగులకు సరైన వసతులు కల్పించకపోవడంతో అవస్థలు పడ్డారు. సదరన్ క్యాంప్‌ను ఏజెసీ రాజ్‌కుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ వాణి, ఆర్డీఓలు ప్రారంభించారు. వేలాదిగా వచ్చిన వికలాగుల ధ్రువపత్రాలు పరిశీలించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జూన్ 2వ తేదీన వారికి అవసరమైన పరికరాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వికలాంగుల సదరమ్ క్యాంపునకు వచ్చిన పలువురు వికలాంగులకు భోజన వసతి కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ధ్రువపత్రాలను పరిశీలించి వారికి అవసరమైన పరికరాలను ఎంపిక చేసేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామాల్లో సరైన సమాచారం లేకపోవడంతోనే రెండు డివిజన్ల నుంచి వేలాదిగా వికలాం గులు తరలివచ్చారు. ఆర్డీఓ రవీంద్ర, ము న్సిపల్ చైర్పర్సన్ దేవసేన, కమిషనర్ ప్రమీల, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ, ఎంపీడీఓ పాల్గొన్నారు. అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం సదరమ్ క్యాంప్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు వికలాంగులు తమ కష్టాలను మొర పెట్టుకున్నారు. సదరమ్ క్యాంప్‌నకు సంబంధించి అధికారులు వికలాంగులకు, ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ సదరమ్ క్యాంప్ ఏర్పాటు చేసే సమయంలో గతంలో వికలాంగులకు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించి అవసరమైన వారికి పరికరాలు ఇస్తామన్న పూర్తి సమాచారాన్ని గ్రామాల్లో తెలియజేయకపోవడం తగదన్నారు. ఏడీ వాణి స్పందిస్తూ స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో ధ్రువపత్రాలు పొందిన వికలాంగులను మాత్రమే హాజరు కావాలని సమాచారం ఇచ్చామన్నారు. -
వికలాంగుల విలవిల
సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ‘సదరం’ వైద్య శిబిరానికి వికలాంగులు ఇలా పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే భారీగా క్యూ కట్టారు. గంటల తరబడి నిలబడలేక కొందరు సొమ్మసిల్లి పడిపోగా తొక్కిసలాట జరిగింది. కూర్చోవడానికి స్థలం లేక.. తాగడానికి నీళ్లు లేక అవస్థల పాలయ్యారు. - సంగారెడ్డి -
‘సదరమ్’ శిబిరానికి భారీ స్పందన
చేవెళ్ల: చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంప్‌నకు విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాలకు సంబంధించి ఈ క్యాంపులో మొత్తం 581 మంది వికలాంగులు పాల్గొన్నారు. శారీరక వికలాంగుల కోసం చేవెళ్ల ఆస్పత్రిలో భవనం ఆవరణలో, కంటి చూపు లోపమున్న వారి కోసం మహిళా సమాఖ్య భవనంలో, చెవిటి, మూగవారి కోసం ఆర్అండ్బీ కార్యాలయంలో ఆవరణలో కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. వైద్యులు బాలరాజ్, సుప్రియ, బి. శేఖర్‌గౌడ్‌లు దరఖాస్తులను స్వీకరించారు. డీఆర్డీఏ ఏరియా కో ఆర్డినేటర్ పద్మావతి, జిల్లా యాంకర్ పర్సన్ శేఖర్, మూడు మండలాల ఏపీఎంలు మంజులవాణి, రవీందర్, నర్సింలు, ఐకేపీ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. శారీరక వికలత్వం కలవారు 400 మంది కాగా చూపు లోపం ఉన్న వారు 69 మంది, మూగ, చెవిటి సమస్యలు ఉన్న వారు 112 మందిగా నమోదు చేసుకున్నట్లు ఏరియా కోఆర్డినేటర్ పద్మావతి తెలిపారు. కాగా.. అంధత్వ పరీక్షల కోసం వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు. ఫాంలు నింపి వాటిని వైద్యులకు చూపించేందుకు వెళ్తే తమను వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఏ సమస్యపై వచ్చారని అడగకుండానే ఫాంలు తీసుకొని పంపించారని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సర్టిఫికెట్ వస్తుందో రాదో కూడా చెప్పలేదని ఆందోళన చెందారు. దీంతో ఒకానొక దశలో వైద్యులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపునకు వచ్చిన వారిలో ఎంతమంది అర్హులు.. ఎంతమందికి సర్టిఫికెట్లు వస్తాయో కూడా తెలియకపోవటంతో వెళ్లిపోయారు. వికలాంగుల సౌకర్యం కోసమే ‘సదరమ్’ మేడ్చల్ : వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం వికలాంగులు ఆస్పత్రుల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతోనే డివిజన్ల వారీగా జిల్లాలో సదరం క్యాంపులు ఏర్పాటు చేసినట్టు డీఆర్డీఏ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ సూర్యారావు పేర్కొన్నారు. మేడ్చల్ సివిల్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడ్చల్ లో నిర్వహించిన శిబిరానికి మేడ్చల్, కీసర, మేడ్చల్ నగరపంచాయతీల నుంచి 339 మంది హాజరయ్యారన్నారు. వీరిలో 242 మందికి వైకల్యం ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు. మేడ్చల్ మండలం నుంచి 179 మంది, కీసర నుంచి 160 మంది హాజరైనట్టు చెప్పారు. అర్హులైన వికలాంగులకు రెండు రోజుల్లో ధ్రువపత్రాలు స్థానికంగానే అందజేస్తామని అన్నారు. శిబిరాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, డీఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ సరస్వతీ, ఏపీఎం లీలాకుమారి పరిశీలించారు. -
నేటినుంచి ‘సదరమ్’
⇒ తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో నిర్వహణ ⇒ మండలాల వారీగా తేదీలు ఖరారు తాండూరు రూరల్: మళ్లీ సదరమ్ క్యాంపు నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం నుంచి ఫిబ్రవరి 21 వరకు తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల సదరమ్ క్యాంపులు ఎత్తివేయడంతో జిల్లాలోని పలుచోట్ల వికలాంగులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 18న వివిధ మండలాల నుంచి భారీగా తాండూరులోని జిల్లా ఆస్పత్రికి వచ్చిన వికలాంగులు సదరమ్ క్యాంపు ఎత్తివేశారని తెలుసుకుని ధర్నాకు దిగారు. ఆగ్రహంతో ర్యాలీగా వెళ్లి మంత్రి మహేందర్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అధికారులు సదరమ్ క్యాంపును తిరిగి నిర్వహించాలని మండలాల వారీగా తేదీలను ఖరారు చేశారు. శారీరక వైకల్యం, అంధులు, చెవుడు, మూగ వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సదరమ్ ఇన్చార్జి బాలకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన మరికొన్ని విషయాలు.. ⇒ ఈ నెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 21 వరకు క్యాంపు కొనసాగుతుంది. ⇒ సదరం క్యాంపునకు వచ్చే వికలాంగులు ఆయా మండలాల్లోని ఐకేపీ సిబ్బంది వద్ద టోకెన్ తీసుకుని రావాలి. ⇒ టోకెన్‌పై ఎంవీఎస్ ముద్రతోపాటు సీసీ సంతకం తప్పనిసరి. ⇒ గతంలో వికలాంగత్వ సర్టిఫికెట్లు ఉన్నవారు క్యాంపునకు రావొద్దు. ⇒ కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆయా మండలాలకు చెందిన వారు క్యాంపునకు హాజరుకావాలి. -
సదరం క్యాంపునకు భారీ స్పందన
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపునకు భారీ స్పందన లభించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వికలాంగులు శిబి రానికి తరలిరాగా, అధికారులు నాలుగు కౌం టర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. నలుగురు వైద్యు లు వికలాంగులకు పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో మొత్తం 1,613 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్డీఏ ఏపీఓ జయలక్ష్మి తెలిపారు. వికలత్వ పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే ధ్రువీకరణ పత్రాలను ఆయా మండలాలకు పంపుతామని ఆమె వెల్లడిం చారు. అర్హులందరికీ పింఛన్లు అర్హులైన ప్రతి వికలాంగునికి రూ.1,500 పింఛన్ వచ్చేలా కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె సదరం క్యాంపును సందర్శించారు.ఈ సందర్భంగా దరఖాస్తులు స్వీకరణ కౌంటర్లు, వైద్య పరీక్షలు చేసే కౌంటర్లను పరి శీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, ఎంపీడీఓ ల క్ష్మీబాయి, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెం ట్ సురేష్‌బాబు, నగేష్ , నవాజ్ పాల్గొన్నారు. -
వికలాంగ అభ్యర్థులకు న్యాయం జరిగేనా..?
జిల్లాలోని వివిధ శాఖల్లో వికలాంగుల కోసం రిజర్వు చేసిన ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరుగుతోంది. వీటి భర్తీకి జనవరి 19న కలెక్టర్ కార్యాలయం (వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ) నుంచి ప్రకటనను విడుదల చేశారు. వికలాంగుల బ్యాక్ లాగ్ గ్రూపు 4, గ్రూపు 4 కాని ఉద్యోగాల పరిమిత నియామకాల కోసం ఫిబ్రవరి 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 52 పోస్టులు కాగా గ్రూపు 4 ఉద్యోగాలుగా టైపిస్ట్ పోస్ట్‌లు 8, జూనియర్ అసిస్టెంట్ 3, బిల్ కలెక్టర్ 1, కాంపౌండర్ (ఆయుర్వేదం)1, కాంపౌండర్ (హోమియో) 1, ఎంపీహెచ్ఏ (పురుష) 9, ల్యాబ్ టెక్నిషియన్ (గ్రేడ్)1 పోస్ట్‌ను కేటాయించారు. వీటి భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతగా ప్రకటించారు. అలాగే గ్రూప్ 4 కాని ఉద్యోగులుగా అటెండర్, ఆఫీస్ సబార్డునేట్ 8, పీహెచ్ వర్కర్ 2, కామాటి 5, కుక్ 5, వాచ్మెన్ 6, వాటర్ బాయ్ 1, ల్యాబ్ అటెండర్ 1 పోస్ట్‌ను ప్రకటించారు. వీటికి విద్యార్హత ఐదో తరగతి నుంచి ఐటీఐ వరకు ప్రకటించారు. వీటిని వివిధ వైకల్యాలతో ఉన్న వారి కోసం గ్రూపు 4 సర్వీసులతో ఆయా పోస్టులకు ఉద్దేశించి నిర్దిష్ట విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులను ఇంకా పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఉద్యోగాల కోసం సదరమ్ క్యాంపు లేదా మెడికల్ బోర్డు నుంచి 40 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత పత్రాలతో అర్హులైన అంధులు, బదిరులు, శారీరక వికలాంగులు వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జరిగి పది నెలలు గడుస్తున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో వికలాంగుల సమాఖ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ పోస్టుల భర్తీకి మోక్షం కలిగేలా చూడాలని కోరుతున్నారు. -
సదరం క్యాంపులో గందరగోళం
మహబూబాబాద్ :మానుకోటలో బుధవారం జరిగిన సదరం క్యాంపు వద్ద గందరగోళం నెలకొంది. రోజూ 150 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వేల సంఖ్యలో వికలాంగులు క్యాంపునకు హాజరయ్యారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి సిబ్బంది చేతులెత్తేశారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 1 నుంచి సదరంక్యాంపు ని ర్వహిస్తున్నారు. మానుకోట, నర్సంపేట డివి జన్లకు సంబంధించిన వికలాంగులు ఈ క్యాంపునకు హాజరవుతున్నారు. 11 రోజులుగా క్యాంపు ఎలాంటి ఆటంకాలు లేకుండానే కొనసాగింది. అరుుతే ఇటీవల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు పరీక్షలు నిర్వహించేందుకు డీఆర్డీఏ సిబ్బందివారికి ప్రత్యేకంగా స్లిప్‌లను పంపిణీ చేశారు. బుధవారం వచ్చేందుకు మానుకోట పట్టణంలో 50 మందికి, మండలంలోని ఇతర గ్రామాల్లో 100 మందికి స్లిప్‌లు పంపిణీ చేశారు. అరుుతే ఆ స్లిప్లపాటు నకిలీ స్లిప్‌లు కూడా పెద్ద సంఖ్య లో పంపిణీ అయ్యాయి. ఆ స్లిప్‌లతో శిబిరానికి వందలాదిగా వచ్చిన వికలాంగులు తమకు పరీక్షలు నిర్వహించాలని ఆందోళనకు దిగారు. వారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్, సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పోలపాక మల్లయ్య, సురుగు ఐలయ్య, గార్లపాటి వెంకటేశ్వర్లు, తోట బిక్షం, దుగ్గి సారయ్య మాట్లాడుతూ క్యాంపును పొడగించాలని, వికలాంగులకు సదుపాయాలు కల్పించాలని, అర్హులైన వారందరికి సదరం స ర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ మల్లయ్య, మునిసిపల్ కమిషనర్ రాజలింగు అక్కడికి చేరుకుని డీఆర్డీఏ కేవలం 150 స్లిప్పులు మాత్రమే పంపిణీ చేసిందని, మిగతా కార్డులతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. సదరం క్యాంపు నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లతోపాటు పింఛ న్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిగతావారిని తిరిగి ఇంటికి పంపిం చారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో నిలువనీడ లేక వికలాంగులు ఎండలో కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా నకిలీ స్లిప్‌లు తయారు చేసిన వారిపై అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఐకేపీ ఏపీఎం శంకర్ తెలిపారు. -
అస్తవ్యస్తంగా ‘సదరమ్’
ఖమ్మం వైరా రోడ్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం సదరమ్ క్యాంపు అస్తవ్యస్తంగా సాగింది. ఫలితంగా వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. నగరంలోని జిల్లా ఆస్పత్రిలో ప్రతి గురువారం రెండు మండలాల చొప్పున సదరమ్ క్యాంపులను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ గురువారం ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, ఖమ్మం కార్పొరేషన్ నుంచి దాదాపు మూడువేలమంది వికలాంగులు, వారి సహాయకులు వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో ఎటు చూసినా వీరే కనిపించారు. ఉదయం తొమ్మిది గంటలకు క్యాంప్ ప్రారంభమవుతుందని, 120 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దీంతో, తెల్లవారుజామున నాలుగు గంటలకే వికలాంగులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా వీరిలో ఉన్నారు. టోకెన్ నిబంధనతో ఇక్కట్లు సదరమ్ క్యాంపునకు వచ్చే వికలాంగులు ఫొటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకురావాలని ఆస్పత్రి అధికారులు ముందుగా ప్రచారం చేశారు. ఇవన్నీ సిద్ధం చేసుకుని సమయానికి క్యూలో నిల్చున్న తరువాత.. మున్సిపాలిటీతోపాటు ఆయా గ్రామ పంచాయతీల నుంచి టోకెన్‌తో వచ్చిన వారినే లోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దీంతో వికలాంగులు హతాశులయ్యారు. మండలంలోని గ్రామ కార్యదర్శులు టోకెన్లు ఇచ్చారు. టోకెన్ల విషయమే తెలీని కార్పొరేషన్ పరిధిలోని అనేకమంది వికలాంగులు అప్పటికప్పుడు పరుగు పరుగున కార్పొరేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ, ఎలాంటి టోకెన్లు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చి, అక్కడి అధికారులకు విషయం చెప్పారు. దీనిని వారు పట్టించుకోకుండా.. ‘‘టోకెన్లు ఉంటేనే అనుమతిస్తా’’మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఏజేసీకి ఫిర్యాదు టోకెన్ లేని వికలాంగులను లోనికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వికలాంగు లు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకుదిగారు. ముందస్తు సమాచారంగానీ, సరైన ప్రచారంగనీ లేకుండా తీరా ఆస్పత్రికి వచ్చిన తర్వాత టోకెన్లు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేదని వారు ప్రశ్నించారు. ధర్నా అనంతరం, కలెక్టరేట్‌కు వెళ్లి అదనపు జాయింట్ కలెక్టర్ బాబూరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఆయన స్పంది స్తూ.. టోకెన్ లేకుండా వచ్చిన వారికి ప్రత్యేక తేదీలలో క్యాంపు నిర్వహిస్తామన్నారు. ప్రతి క్యాంప్‌లో ఐదుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో 200మంది వికలాంగులకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు షర్మిలా సంపత్, షకీనా, గరిడేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధికారుల సమన్వయ లేమి ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కార్పొరేషన్ పరిధిలోని వికలాంగులకు ఒకే రోజు సదరమ్ క్యాంపు నిర్వహించడం తో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్యశాఖ, డీఆర్డీఏ, కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయ లో పం కారణంగా సదరమ్ క్యాంపులో వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. ఏ విభాగానికి చెందిన వైద్యుడు ఎక్కడ ఉంటారు? ముందుగా ఎవరిని సంప్రదించాలి? దరఖాస్తు లు ఎక్కడ ఇస్తారు? ఇత్యాది వివరాలు తెలియకపోవడంతో వికలాంగులు ఇబ్బందిపడ్డారు. సదరమ్ క్యాంపు నిర్వహణలో ప్రైవేట్ ఫిజియోథెరపిస్టులు కూడా సేవలందించారు. వారికి కుర్చీలు, మంచినీళ్లు కూడా లేవంటే.. ఏర్పాట్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.