‘సదరమ్’ శిబిరానికి భారీ స్పందన
చేవెళ్ల: చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంప్‌నకు విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాలకు సంబంధించి ఈ క్యాంపులో మొత్తం 581 మంది వికలాంగులు పాల్గొన్నారు. శారీరక వికలాంగుల కోసం చేవెళ్ల ఆస్పత్రిలో భవనం ఆవరణలో, కంటి చూపు లోపమున్న వారి కోసం మహిళా సమాఖ్య భవనంలో, చెవిటి, మూగవారి కోసం ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఆవరణలో కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. వైద్యులు బాలరాజ్, సుప్రియ, బి. శేఖర్‌గౌడ్‌లు దరఖాస్తులను స్వీకరించారు.
డీఆర్‌డీఏ ఏరియా కో ఆర్డినేటర్ పద్మావతి, జిల్లా యాంకర్ పర్సన్ శేఖర్, మూడు మండలాల ఏపీఎంలు మంజులవాణి, రవీందర్, నర్సింలు, ఐకేపీ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. శారీరక వికలత్వం కలవారు 400 మంది కాగా చూపు లోపం ఉన్న వారు 69 మంది, మూగ, చెవిటి సమస్యలు ఉన్న వారు 112 మందిగా నమోదు చేసుకున్నట్లు ఏరియా కోఆర్డినేటర్ పద్మావతి తెలిపారు. కాగా.. అంధత్వ పరీక్షల కోసం వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు.
ఫాంలు నింపి వాటిని వైద్యులకు చూపించేందుకు వెళ్తే తమను వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఏ సమస్యపై వచ్చారని అడగకుండానే ఫాంలు తీసుకొని పంపించారని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సర్టిఫికెట్ వస్తుందో రాదో కూడా చెప్పలేదని ఆందోళన చెందారు. దీంతో ఒకానొక దశలో వైద్యులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపునకు వచ్చిన వారిలో ఎంతమంది అర్హులు.. ఎంతమందికి సర్టిఫికెట్లు వస్తాయో కూడా తెలియకపోవటంతో వెళ్లిపోయారు.
వికలాంగుల సౌకర్యం కోసమే ‘సదరమ్’
మేడ్చల్ : వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం వికలాంగులు ఆస్పత్రుల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతోనే డివిజన్ల వారీగా జిల్లాలో సదరం క్యాంపులు ఏర్పాటు చేసినట్టు డీఆర్‌డీఏ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ సూర్యారావు పేర్కొన్నారు. మేడ్చల్ సివిల్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడ్చల్ లో నిర్వహించిన శిబిరానికి మేడ్చల్, కీసర, మేడ్చల్ నగరపంచాయతీల నుంచి 339 మంది హాజరయ్యారన్నారు.
వీరిలో 242 మందికి వైకల్యం ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు. మేడ్చల్ మండలం నుంచి 179 మంది, కీసర నుంచి 160 మంది హాజరైనట్టు చెప్పారు. అర్హులైన వికలాంగులకు రెండు రోజుల్లో ధ్రువపత్రాలు స్థానికంగానే అందజేస్తామని అన్నారు. శిబిరాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డినేటర్ సరస్వతీ, ఏపీఎం లీలాకుమారి పరిశీలించారు.