సాక్షి, వికారాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల నుంచి ప్రారంభించనున్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుకోసం శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలను తరలించేందుకు సన్నద్ధమయ్యారు.
ఈ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటే బీఆర్‌ఎస్‌కు తిరుగుండదని నిరూపించాలని చూస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం రావాంటే ఈ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరని భావిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు.
తెరపైకి బీసీ నినాదం
చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బీసీ వాదానికి తెరతీసింది. అందరికంటే ముందుగా సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం.. ప్రచారంలో భాగంగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది.అయితే అనూహ్య పరిణామాల మధ్య పోటీ నుంచి రంజిత్‌రెడ్డి తప్పుకోవడంతో మరో అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది. పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినా వారు పోటీకి ససేమిరా అనడంతో చివరకు జిల్లాకు సుపరిచితుడు బీసీ ఉద్యమ నేత, రంగారెడ్డి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్‌ఎస్ అధినేత చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు.
బీఆర్‌ఎస్ పోటీలోనే ఉండదు.. కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ అని అందరు భావించిన తరుణంలో కాసానిని అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ ట్రయాంగిల్‌గా మారిందనే చర్చ మొదలైంది. కాసానికి జిల్లాతో ఉన్న అనుబంధం, ఆయనకు ఉన్న పరిచయాలు, బీసీ ఉద్యమంలో ఆయన పాత్ర తదితర అంశాలు బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో అదనపు బలంగా మారాయి. అనుకున్న స్థాయిలో బీసీ వాదాన్ని తట్టి లేపగలిగితే ఆయనకు గెలుపు అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment