జిల్లాలోని వివిధ శాఖల్లో వికలాంగుల కోసం రిజర్వు చేసిన ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరుగుతోంది. వీటి భర్తీకి జనవరి 19న కలెక్టర్ కార్యాలయం (వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ) నుంచి ప్రకటనను విడుదల చేశారు. వికలాంగుల బ్యాక్ లాగ్ గ్రూపు 4, గ్రూపు 4 కాని ఉద్యోగాల పరిమిత నియామకాల కోసం ఫిబ్రవరి 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
మొత్తం 52 పోస్టులు కాగా గ్రూపు 4 ఉద్యోగాలుగా టైపిస్ట్ పోస్ట్‌లు 8, జూనియర్ అసిస్టెంట్ 3, బిల్ కలెక్టర్ 1, కాంపౌండర్ (ఆయుర్వేదం)1, కాంపౌండర్ (హోమియో) 1, ఎంపీహెచ్‌ఏ (పురుష) 9, ల్యాబ్ టెక్నిషియన్ (గ్రేడ్)1 పోస్ట్‌ను కేటాయించారు. వీటి భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతగా ప్రకటించారు. అలాగే గ్రూప్ 4 కాని ఉద్యోగులుగా అటెండర్, ఆఫీస్ సబార్డునేట్ 8, పీహెచ్ వర్కర్ 2, కామాటి 5, కుక్ 5, వాచ్‌మెన్ 6, వాటర్ బాయ్ 1, ల్యాబ్ అటెండర్ 1 పోస్ట్‌ను ప్రకటించారు. వీటికి విద్యార్హత ఐదో తరగతి నుంచి ఐటీఐ వరకు ప్రకటించారు. వీటిని వివిధ వైకల్యాలతో ఉన్న వారి కోసం గ్రూపు 4 సర్వీసులతో ఆయా పోస్టులకు ఉద్దేశించి నిర్దిష్ట విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పోస్టులను ఇంకా పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఉద్యోగాల కోసం సదరమ్ క్యాంపు లేదా మెడికల్ బోర్డు నుంచి 40 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత పత్రాలతో అర్హులైన అంధులు, బదిరులు, శారీరక వికలాంగులు వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జరిగి పది నెలలు గడుస్తున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో వికలాంగుల సమాఖ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ పోస్టుల భర్తీకి మోక్షం కలిగేలా చూడాలని కోరుతున్నారు.
వికలాంగ అభ్యర్థులకు న్యాయం జరిగేనా..?
Published Sun, Nov 16 2014 3:01 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement