కేన్సర్ వ్యాధిపై మరోసారి చర్చ మొదలైంది. అల్లోపతి పద్ధతులు మేలైనవా? లేక ప్రాచీన ఆయుర్వేదమే గట్టిదా అన్న ఈ చర్చకు ప్రముఖ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కారణమయ్యారు. సిద్ధూ భార్య, స్వయానా అల్లోపతి డాక్టర్ అయిన నవజోత్ కౌర్ సిద్ధూ ఆయుర్వేద పద్ధతు లను అవలంబించిన కారణంగానే కేన్సర్ నుంచి విముక్తు రాలినైనట్లు చెప్పడం ఒక రకంగా తేనెతుట్టెను కదిపి నట్లయింది. దేశంలోనే ప్రముఖ కేన్సర్ చికిత్సా కేంద్రం ‘టాటా మెమోరియల్ హాస్పిటల్’ ఇప్పటికే సిద్ధూ మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనీ, శాస్త్రీయ పద్ధతుల్లో నిరూపణ అయిన చికిత్స పద్ధతులకే ప్రాధాన్య మివ్వాలనీ హెచ్చరించగా... తామేం చేశామో, ఎలా చేశామో వివరించేందుకు సిద్ధూ కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండు వైద్యవిధానాల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ వ్యాసం.
పిండంతో మొదలై మరణించేంతవరకూ జరిగే కణ విభజన ప్రక్రియలో వచ్చే తేడా ఈ కేన్సర్ మహమ్మారికి కారణం. అదుపు తప్పి విచ్చలవిడిగా విభజితమయ్యే కణాలు కణితిగా ఏర్పడటం లేదా అవయవాల పనిని అడ్డుకునే స్థాయిలో మితిమీరి పెరిగిపోవడం జరుగుతూంటుంది. శతాబ్దాలుగా మనిషిని పట్టిపీడిస్తున్న ఈ వ్యాధికి అల్లోపతి సూచించే వైద్యం... శస్త్రచికిత్స, రేడియేషన్, కీమో థెరపీ! వ్యాధి ముదిరిన స్థాయిని బట్టి, ఏ అవయ వానికి సోకిందన్న అంశం ఆధారంగా ఈ మూడింటిని లేదా విడివిడిగా, రెండింటిని కలిపి వాడుతూంటారు. అయితే శస్త్రచికిత్స తరువాత కూడా కేన్సర్ మళ్లీ తిరగ బెట్టవచ్చు.
రేడియేషన్, కీమోథెరపీలు శరీరాన్ని గుల్ల బార్చేంత బాధాకరమైన ప్రక్రియలు. అందుకే చాలామంది చెప్పేదేమిటంటే... కేన్సర్ వ్యాధితో కంటే దానికి చేసే చికిత్సతోనే ఎక్కువమంది మరణిస్తూంటారూ అని! కొన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న ఈ మూడు రకాల ఆధునిక వైద్య పద్ధతులకు ఇటీవలి కాలంలో కొన్ని వినూత్నమైన చికిత్స పద్ధతులు వచ్చి చేరాయి. రోగ నిరోధక శక్తినే కేన్సర్ కణాలపై దాడి చేసేలా చేయడం (ఇమ్యూనో థెరపీ), కణితులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రాంతానికి మాత్రమే రేడియేషన్ అందించడం (ప్రిసిషన్ ఆంకాలజీ), తక్కువ డోసు కీమోథెరపీ మందులను ఎక్కువసార్లు ఇవ్వడం (భారత్‌లో ఆవిష్కృతమైన పద్ధతి) మునుపటి వాటి కంటే కొంత మెరుగైన ఫలితాలిస్తున్నాయి. అయితే ఈ రోజు వరకూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనా ఏమిటీ అంటే... కేన్సర్‌కు చికిత్స లేదు అని! కాకపోతే మరణాన్ని కొన్నేళ్లపాటు వాయిదా వేయడం మాత్రం సాధ్యమైంది. అది ఐదేళ్లా? (సర్వైవల్ రేట్) పదేళ్లా అన్న చర్చ వేరే!
ప్రత్యామ్నాయ పద్ధతుల మాటేమిటి?
వేల సంవత్సరాల మానవజాతి పయనంలో ఎంతో ప్రగతి సాధించినమాట నిజమే. కానీ ఇప్పటికీ కనీసం మనిషి తాను నివసిస్తున్న భూమిని పూర్తిగా అర్థం చేసుకో గలిగాడా? లేదనే చెప్పాలి. చేసుకోగలిగి ఉంటే... వాతా వరణ కాలుష్యం లాంటి సమస్యకైనా... కేన్సర్ లాంటి వ్యాధి చికిత్సకైనా ఎప్పుడో పరిష్కారాలు దొరికి ఉండేవి. దొరకలేదు కాబట్టే ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతులు, మందులు కనుక్కుంటున్నారు. వ్యాధులను జయించే దిశగా ప్రయాణిస్తు న్నారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్ర శేఖర్ మాటలను ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిఉంటుంది. సైన్స్... సత్యాన్వేషణకు జరిగే నిరంతర ప్రయాణమంటారాయన. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మనం కొత్త మైలు రాళ్లను చేరుకుంటూ ఉంటామే తప్ప... అంతిమ సత్యాన్ని ఆవిష్కరించలేము అని మనం అర్థం చేసుకోవాలి.
కేన్సర్ విషయానికే వద్దాం... అల్లోపతి విధానాల్లోని లోటుపాట్లను గుర్తించిన చాలామంది వైద్యులు ప్రత్యా మ్నాయ మార్గాలపై కూడా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆయుర్వేదం కూడా వీటిల్లో ఒకటి. కానీ... ఆయుర్వేదంలో ఉన్న చిక్కు గురించి ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ఒకరి మాటలు వింటే సమస్య ఏమిటన్నది
కొంత అవగతమవుతుంది. ఆయుర్వేదంలో ఉపయోగించే మొక్కల్లో కొన్ని వందలు, వేల రసాయనాలు ఉంటాయి. వాటిల్లో ఏ రసాయనం, లేదా కొన్ని రసాయనాల మిశ్రమం వ్యాధి చికిత్సలో ఉపయోగపడిందో తెలుసు కోవడం కష్టమని ఆయన చెబుతారు. నిజం కావచ్చు కానీ... పాటించే పద్ధతీ, ఏ రసాయనం ఉపయోగపడిందో కచ్చితంగా మనకు తెలియాల్సిన అవసరముందా? రోగికి మేలు జరిగితే చాలు కదా? పైగా ఆయుర్వేదాన్ని, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను కూడా శాస్త్రవేత్తలు అను మానపు దృష్టితోనే చూశారు. చాలా కొద్దిమంది అందు లోని సైన్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పాలి. అల్లోపతి వైద్యం ఫూల్ ప్రూఫా? కానేకాదు. ఒక మందు తయారయ్యేందుకు పది పన్నెండేళ్లు పట్టడం ఒక విషయమైతే... దాదాపు ప్రతి మందుతోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొన్ని కేన్సర్‌కూ కారణమవుతూండటం చెప్పు కోవాలి.
అల్లోపతితోనే వినూత్నంగా...
కేన్సర్ విషయంలో అల్లోపతి, ఆయుర్వేదాల మధ్య చర్చ ఒకపక్క ఇలా నడుస్తూండగానే... అమెరికాలో ఇంకో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. డా‘‘ ఇల్యెస్ బాగ్లీ, పియెరిక్ మార్టినెజ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఐవర్ మెక్టిన్, మెబెండజోల్, ఫెన్‌బెండజోల్ వంటి మాత్రలను కేన్సర్‌పై ప్రయోగించారు. ఈ మందులు మామూలుగా పేవుల్లోని హానికారక పరాన్నజీవులను నాశనం చేసేందుకు వాడుతూంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమి టంటే... ఐవర్ మెక్టిన్, మెబెండజోల్ మాత్రలతో కొంత మంది వైద్యులు అభివృద్ధి చేసిన చికిత్స పద్ధతి అద్భుతంగా పనిచేయడం. పైగా... శాస్త్రవేత్తలు కొందరు ఈ పద్ధతి, ఫలితాలను ధ్రువీకరించడం. ఫలితంగా ఈ పద్ధతి ‘జర్నల్ ఆఫ్ ఆర్థో మాలిక్యులర్ మెడిసిన్’లో ‘టార్గెటింగ్ ద మైటోకాండ్రియల్ స్టెమ్ సెల్ కనెక్షన్ ఇన్ కేన్సర్ ట్రీట్‌మెంట్’ పేరుతో ఈ ఏడాది సెప్టెంబరు 19న ప్రచురి తమైంది.
ఇల్యెస్ బాగ్లీ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆర్థో మాలిక్యులర్ మెడిసిన్ అధ్యక్షుడు. అల్జీరియా దేశస్థుడు. పియెరిక్ మార్టినెజ్ కేన్సర్ పరిశోధనల్లో బాగ్లీతో కలిసి పనిచేశారు. థైరాయిడ్ కేన్సర్‌తో పాటు నవ్‌జోత్ కౌర్ సిద్ధూను వేధించిన రొమ్ము కేన్సర్, పాంక్రియాస్ కేన్సర్లపై ఈ రెండు మందులు ప్రభావం చూపుతున్నట్లు ప్రస్తుతా నికి ఉన్న సమాచారం. మరిన్ని కేన్సర్లపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఒకప్పుడు గుర్రాల్లో పురుగులను తొలగించేందుకు వాడిన ఐవర్ మెక్టిన్‌లో కేన్సర్ కణాలను మట్టుబెట్టగల కనీసం 15 మూలకాలు ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. డా‘‘ బాగ్లీ, డా‘‘ మార్టినెజ్ వంటి వారు సంప్రదాయవాదుల మాటలకే కట్టుబడి ఈ ప్రయోగం చేసి ఉండకపోతే... కేన్సర్ చికిత్సకు ఇతర మార్గాలూ ఉన్నాయన్న విషయం ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో.
చివరగా... ఒక్క విషయం: కేన్సర్ చికిత్సకు ఐవర్ మెక్టిన్, ఫెన్‌బెండజోల్‌ల వాడకానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనుమతులూ లేవు. కాబట్టి.. పరిశోధన ఫలితాలను రూఢి చేసుకోవడంతోపాటు మరిన్ని చేప ట్టడం కూడా అవసరం. అంత వరకూ మనం కేన్సర్ మహ మ్మారికి అణిగిమణిగి ఉండా లన్నది నిష్ఠుర సత్యం!
– గిళియారు గోపాలకృష్ణ మయ్యా
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment