allopathy
-
విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!
పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సహా వ్యవస్థాపకులు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారతదేశంలో లక్షల మంది సింథటిక్ డ్రగ్స్ వల్ల మరణిస్తున్నారని చెప్పారు. విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు హానికరమైన మందులు తయారు చేసి వాటిపై ఆధారపడేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలో అల్లోపతి మందుల వాడకం వల్ల లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. విదేశీ ఫార్మా కంపెనీలు సింథటిక్ డ్రగ్స్‌పై ఆధారపడుతున్నాయి. ప్రజలకు తెలియకుండానే ఆ విషపూరిత మందులకు అలవాటు పడేలా చేస్తున్నాయి. ‘పతంజలి స్వదేశీ ఉద్యమం’లో అందరూ భాగస్వాములు కావాలి. స్వదేశీ, సహజ ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: నదులు, కాలువల ద్వారా సరుకు రవాణా..!పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పదోవ పట్టించేలా ఉన్నాయని గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆయా ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పడంతో కోర్టు వాటిని అంగీకరించింది. -
గూగుల్‌లో వెతికిమరీ మందులు కొంటున్నారు.. ఇంత ‘అవసరమా?’
కర్నూలులోని బుధవారపేటకు చెందిన రాముకు ఇటీవల జ్వరం, దగ్గు, జలుబు రావడంతో వైద్యులను సంప్రదించకుండా నేరుగా మెడికల్‌షాపునకు వెళ్లి మందులు కొని వాడాడు. మూడు రోజుల తర్వాత అతనికి కోవిడ్ ఉందని నిర్ధారణ కావడంతో పాటు వాడిన మందులు సరిపోక ప్రాణం మీదకు వచ్చింది. బతుకు జీవుడా అని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది బయటపడ్డాడు. ఓర్వకల్లుకు చెందిన ఓ యువకుడు ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తాడు. అతను తరచూ మెడికల్‌షాపునకు వెళ్లి గ్యాస్ట్రబుల్, తలనొప్పి మాత్రలు తెచ్చుకుని వాడటం అలవాటుగా మారింది. కొంతకాలానికి అవి లేకుండా రోజు గడవని పరిస్థితి నెలకొంది. 40 ఏళ్లు నిండకుండానే అతనికి ఆస్టియోపోరోసిస్ రావడంతో వైద్యులు అతని జీవనశైలి గురించి ఆరా తీశారు. క్రమంగా గ్యాస్ట్రబుల్ మాత్రలు వాడటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తేల్చారు. కర్నూలు(హాస్పిటల్): వైద్యులను సంప్రదించకుండా సొంతంగా మందులు వాడటం ఇటీవల ఎక్కువైపోయింది.స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహా తో కొన్ని వ్యాధులకు మాత్రలు కొనుగోలు చేస్తుండగా, మరికొన్ని వ్యాధులకు గూగుల్‌లో శోధించి మరీ వాటి పేరు చెప్పి మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి తనకు కలిగిన ఇబ్బందులను మెడికల్ షాపు నిర్వాహకులకే చెప్పి వారు ఇచ్చినవే తీసుకుని వాడేస్తున్నారు. కాగా కొన్ని వ్యాధి లక్షణాలు ప్రమాదకర వ్యాధులకు మూలకారణమై ఉంటాయి. వాటిని గుర్తించకుండా లక్షణాలను బట్టి మందులు వాడుతూ వెళ్లడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 2,565 మందుల దుకాణాలున్నాయి. అందులో 1,960 దాకా రిటైల్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటిలో చాలా వరకు ప్రిస్కిప్షన్ లేకుండానే ప్రజలకు మందులను విక్రయిస్తున్నారు. ఒకే డోసు మందును దీర్ఘకాలం పాటు వాడితే ఇబ్బందులు ఉంటాయని తెలిసినా కొంత మంది మందుల దుకాణాల వారు ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారు. ప్రజలు సైతం ప్రతిసారీ డాక్టర్ వద్దకు వెళితే డబ్బు ఖర్చు అవుతుందని భావించి పాత ప్రిస్కిప్షన్ (మందుల చీటి) పట్టుకుని మందుల దుకాణాలకు వెళ్లి మందులు కొని వాడుతున్నారు. సాధారణంగా మనిషి జీవనశైలి, అతని శారీరక కదలికలను బట్టి శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. ఈ మేరకు వ్యాధికారక మందుల మోతాదు తగ్గించడం, పెంచడం చేయాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా మందులు కొని వాడితే కొన్నిసార్లు ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది. మందు డోసు ప్రకారం వాడితే ఔషధం, డోసు దాటితే విషంగా పనిచేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహిస్తుండటంతో దుష్పరిణాలు వచ్చే అవకాశం ఉన్న డిప్రెషన్, టెన్షన్‌కు వాడే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్‌ను మాత్రం ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించడం లేదు. స్వీయ మందుల వాడకం ప్రమాదకరం స్వీయ మందుల వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరం. కొన్ని ప్రతికూల ఆరోగ్యపరిస్థితులపై స్వీయ మందుల వాడకం ఆధారపడి ఉంటుంది. పెరిగిన ఔషధ నిరోధకత(డ్రగ్ రెసిస్టెన్స్), ఔషధ ఆధారపడటం(డ్రగ్ డిపెండెన్స్), ప్రతికూల ప్రభావాలు, ఔషధ పరస్పర చర్యలు మొదలైనవి మందుల వాడకంపై ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రతికూల ఆరోగ్య సందర్భాల్లో మరణానికి కూడా దారి తీయొచ్చు. – డాక్టర్ పి.జయచంద్ర, జనరల్ ఫిజీషియన్, కర్నూలు ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరం. అలా కొనుగోలు చేసిన మందుల వల్ల రోగికి ఏదైనా ఇబ్బంది కలిగితే సదరు దుకాణం లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. మందుల దుకాణాలపై ప్రతి నెలా 30కి పైగా దాడులు నిర్వహించి నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తున్నాం. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. అల్లోపతి మందులకు వ్యాధిని నయం చేసే శక్తి ఎంతగా ఉంటుందో... అతిగా వాడితే దుష్పరిణామాలు అంతే ఉంటాయి. – చంద్రశేఖర్‌రావు, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు -
రామ్‌దేవ్ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్ డే
సాక్షి, ఢిల్లీ/ హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో అల్లోపతి వైద్యం పని చేయడం లేదని.. వైద్యులు విఫలమయ్యారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాఖ్యలు చేసిన రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం నల్ల దినంగా (బ్లాక్ డే) వైద్యులు రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. పీపీఈ కిట్లు ధరించి.. నల్లబ్యాడ్జీలు పెట్టుకుని విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌పై ఉత్తరాఖండ్ ఐఎంఏ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీతోపాటు కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నె తదితర ప్రాంతాల్లో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోషల్ మీడియాలో కూడా రామ్‌దేవ్ బాబాకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. #ArrestRamdev అనే హ్యాష్‌ట్యాగ్ చేస్తూ ట్విటర్, ఫేసుబుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి, వైద్యారోగ్య మంత్రులను విజ్ఞప్తులు పంపుతున్నారు. చదవండి: బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు చదవండి: రామ్‌దేవ్ బాబా ఇది ‘తమాషా’ కాదు: ఆరోగ్యశాఖ మంత్రి -
రాందేవ్ బాబా వ్యాఖ్యలపై 1న దేశవ్యాప్త నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యాన్ని తప్పుపడుతూ యోగా గురు రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై జూన్ ఒకటో తేదీన బ్లాక్‌డేగా పాటించి, నిరసన తెలుపుతామని రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాందేవ్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్‌వోఆర్‌డీఏ శనివారం ట్విట్టర్లో పేర్కొంది. ఇందుకు నిరసనగా జూన్ 1వ తేదీన బ్లాక్‌డేగా పాటిస్తూ విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలుపుతామని తెలిపింది. ఇప్పటికే ఎఫ్‌వోఆర్‌డీఏ రాందేవ్‌పై రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా కూడా వేసింది. అల్లోపతి వైద్యులు, వైద్యంపై ఇటీవల రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. (చదవండి: రాజాకు సతీవియోగం) -
మీ నాన్న వల్ల కూడా కాదు: రాందేవ్ బాబా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యంపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై వైద్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ విభాగం రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా రాందేవ్ బాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను అరెస్ట్ చేయడం అతడి తండ్రి వల్ల కూడా కాదు’ అని వ్యాఖ్యానించాడు. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యల అనంతరం రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్‌గా మారింది. జూమ్ సమావేశంలో పైవిధంగా మాట్లాడారు. దుండగుడు రాందేవ్, మహాదొంగ రాందేవ్ వంటి పదాలు తనపై వస్తున్నాయని చెబుతూ నవ్వుకున్నారు. అయితే ‘నీ తండ్రి కూడా అరెస్ట్ చేయడు’ ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. Ramdev challenges Modi Govt into arresting him, says "UNKA BAAP BHI ARREST NAHI KAR SAKTA" Over to you, @narendramodi @AmitShah !! pic.twitter.com/73qd8AVLZE — Gaurav Pandhi (@GauravPandhi) May 25, 2021 -
పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు!
న్యూఢిల్లీ: అల్లోపతి ఓ పిచ్చిసైన్స్ అనే కామెంట్ల వీడియోతో దుమారం రేపిన రాందేవ్ బాబా.. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బన్సాల్ కరోనాతో చనిపోవడంతో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్‌కి జరిగిన కొవిడ్-19 ట్రీట్మెంట్లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యాభై ఏడేళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్మెంట్ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్ ట్రీట్మెంట్లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం’’ అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది రాజస్థాన్ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్ వేసినట్లయ్యింది. లక్ష కరోనిల్ బాబా రాందేవ్-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్ష పతాంజలి కరోనిల్ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించాడు. ఇందుకోసం సగం ఖర్చును పతాంజలి సంస్థ భరిస్తుందని, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు. हरियाणा में कोविड मरीजों के बीच एक लाख पतंजलि की कोरोनिल किट मुफ्त बांटी जाएंगी । कोरोनिल का आधा खर्च पतंजलि ने और आधा हरियाणा सरकार के कोविड राहत कोष ने वहन किया है। — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 24, 2021 -
‘కృష్ణపట్నం’ తగాదా తేలిగ్గా తేలేదా?!
చాలా కాలంగా సాగుతున్న ‘ఆయుర్వేదం’ ‘అలోపతి’ వైద్య విధానాల మధ్య వివాదానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కేంద్రం కావడం విశేషం. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ప్రజాబాహుళ్యంలో ఏర్పడిన భయాందోళనలను సంబాళించే ధైర్యసై్థ్యర్యాలను కలిగించడం కోసం పక్కవాటుగా ఆ మాత్రం పాత్రను పోషించడంలో ‘‘ఆయుర్ వేదం’’ తోడ్పడితే సంతోషించాల్సిందే! నిజానికి ఆయుర్వేదం పేరుకే గానీ, ప్రకృతి ప్రసాదించిన సొంఠి, పసుపు, మిరప, బెల్లం, జొన్న వగైరా పంట లన్నీ శరీర కల్మషాలకు విరుగుళ్లే సుమా! శ్వాస ఉండే వరకూ మనిషిలో ఆశ చావదు. ఆ ఆశను బతికి బట్టకట్టనివ్వాలన్న ఆశ వొడిగట్టిపోకుండా ఉంచే లక్షణం ఆయుర్వేదాన్ని నమ్ముకున్న వారిలో సహితం ఉండటం సర్వసాధారణం! ‘‘కోవిడ్–19 (కరోనా) పెను వైరస్ వ్యాధి వ్యాప్తి వల్ల భారత్‌లో ప్రజల మరణాల సంఖ్య పెరిగిపోతున్నందున వారికి ప్రజారోగ్య సిబ్బంది నెలల తరబడిగా సేవలందిస్తూ ఆసుపత్రుల్లో లెక్కలేనన్ని గంటలు గడుపుతున్నారు. పైగా వైద్య సేవలందించడానికి సరిపడా వనరులు లేనందున రోగులతో పాటు సిబ్బందికి కూడా కోవిడ్ అంటువ్యాధి సోకిపోతోంది. ఈ దుస్థితిలో వైద్యసేవలందించే దేశ ఆరోగ్య రక్షణ సిబ్బంది మానసికమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవలసిన దుస్థితి ఏర్పడింది’’ ‘‘ది హిందూ’’ (23–5–21) ఈ అత్యంత ప్రమాదకర దుస్థితిలో గొడ్డు వాడు గొడ్డు కోసం ఏడిస్తే, దాని తోలు కోసం మరొకరు ఏడ్చినట్టుగా నేటి దేశ వైద్య వృత్తిలో వింత తగాదాలు మరోసారి తలెత్తాయి. చాలా కాలంగా దేశ వ్యాప్తంగా సాగుతున్న ‘ఆయుర్వేదం’ ‘అలోపతి’ వైద్య విధానాల మధ్య వివాదానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కేంద్రం కావడం విశేషం. పైగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ జిల్లా నాయకుడైనందున ‘‘ఆయుష్మాన్ భారత’’ సంస్థకు కేంద్రప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నందున ఆ సంస్థ పాలసీని అమలు జరిపే భారం లేదా బాధ్యతను కేంద్ర ‘ఆయుష్’ శాఖామంత్రి కిరణ్ రిజ్జూ మీద పెట్టారు. దీనితో పాటు కేంద్రం ఆధీనంలో పనిచేయాల్సిన భారత వైద్య పరిశోధనా మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పైన పడింది. బీజేíపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత అత్యాధునిక వైద్యశాస్త్ర పరిశోధనలపై ఆధారపడి ప్రశంసార్హమైన శాస్త్ర, పరిశోధనా పలితాల్ని ప్రపంచానికి అందించి, కోట్లాదిమంది ప్రజలకు జయప్రదంగా సేవలందించిన అలోపతి వైద్యానికి పోటీగా కేంద్రస్థాయిలో ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ పథకాన్ని అమలు జరపడానికి రెండేళ్ల క్రితమే పెద్ద ప్రయత్నం జరగగా వివాదం మధ్యలో ‘ఆయుష్మాన్ భారత్’ సంస్థలో పనిచేస్తున్న నిపుణులొకరు సంస్థ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయారన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి! ఆ తరువాత ‘ఆయుష్మాన్ భారత్’ ముందుకు సాగలేదు. కారణం, రోగాలకు ‘అంటురోగ మహమ్మారులకు, వందల సంత్సరాలుగా వైద్యశాలల్లో, పరిశోధనాగారాల్లో శాస్త్రీయ ప్రాతిపదికపై జరిపిన వేల ప్రయోగాల ఆధారంగా మందులు మాకులు ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. ఆ మాటకొస్తే అరుదుగా లభించే వనమూలి కలు ఆధారంగా రోగాలకు ‘చిట్కా’ వైద్యాలు కూడా ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. అవి శాస్త్రీయ పరిశోధనలకు కొన్ని మాత్రమే తప్ప మిగతావి నిలబడలేదన్నది అలోపతి వైద్య శాస్త్రవేత్తలే కాదు ‘కొందరు ఆయుర్వేద’ వైద్యులు కూడా ఒప్పుకుంటారు. దీనికి కారణాన్ని– ఆయుర్వేద వైద్యశాస్త్రంలో నిపుణుడిగా తెలుగునాట ప్రసిద్ధికెక్కిన బాలరాజు మహర్షి పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్య మూలికల సేకరణ వాటి లభ్యత సాధ్యాసాధ్యాలపైన ఆధారపడింది కాబట్టి వాటి సేకరణ ఇతర ముడిపదార్థాల సేకరణపై కూడా ఆధార పడి ఉంది కాబట్టి ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదని బాలరాజు మహర్షి అభిప్రాయం. ఈ ప్రాతిపదిక మీద ఆయన దాన్ని తాత్కాలిక ‘చిట్కా వైద్యం’ గా మాత్రమే పరిగణిస్తూ వచ్చారు! ఆమాటకొస్తే ‘‘కోవిడ్–19’’ వైరస్‌పైన కేంద్రీకరించి తాజా పరిశోధనలు నిర్వహించిన ప్రసిద్ధ అమెరికన్ జీవ, గణిత శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రెడ్ ఆడ్లర్ ఇకపై మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గణనీయమైన మార్పులు ఏమేమి రాబోతున్నాయనే అంశంపై ఒక ఆశాజనకమైన విశ్వాసాన్ని ప్రకటించాడు! ఈ విశిష్ట ప్రకటనకు సంబంధించిన తన పరిశోధనా ఫలితాన్ని ‘‘వైరసెస్’’ అన్న పరిశోధనా పత్రికలో వెల్లడించారు! ఇక మీదట కోవిడ్–19 లాంటి హానికరమైన వైరస్‌కు కారణమైన ప్రమాదకరమైన కరోనా విషక్రిమి రానున్న పదేళ్లలోగానే జలుబు, దగ్గు లాంటి సాధారణ రుగ్మతలకు మించి దరిచేరబోవని అడ్లర్ భరోసా! ఈ పరిణామ క్రమంలో సామూహికంగా జనాభాలో రోగనిరోధక శక్తి పెరిగే కొలది కోవిడ్–19 క్రమంగా తోక ముడుస్తుందని చెప్పాడు! వైరస్‌లో వచ్చే మార్పుల కన్నా మన శరీరం రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులకు సర్దుబాటై పోతుందన్నాడు! పరిణామ క్రమంలో స్వల్పంగా సోకే ఇన్ఫెక్షన్లు– రాబోయే తీవ్రమైన అంటురోగాలను కూడా ఎదుర్కొనగల శక్తిని మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు తరిఫీదు ఇస్తాయన్నాడు ప్రొఫెసర్ అలెగ్జాండర్ బీమ్స్ (ఉటా యూనివర్శిటీ– అమెరికా)! అయితే ఇంతకూ ఆయుర్వేద వైద్యులు ఒక కీలకమైన ప్రశ్నకు తడబడకుండా విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంతవరకూ ప్రపంచదేశాలను పలకరించి ఎంతో వినాశాన్ని మిగిల్చిన సుమారు 300 వైరస్ వ్యాధులలో ‘‘ఆయుర్వేద వైద్యం’’ ఎన్నింటిని పరిష్కరించగల్గిందో వివరించగల్గాలి! అన్నీ వేదాల్లోనే ఉన్నాయి. అని సర్దుకుంటే చాలదు. ఎందుకంటే అసలు సృష్టి రహ స్యాన్నే రుగ్వేదం (నాసదీయ సూక్తం 129 పదవ మండలం) హేతు వాదనతో ప్రశ్నించి విడమర్చింది! ఈ సృష్టి ఎలా జరిగింది’’ అని, అందుకు భగవంతుడు సృష్టి కారకుడా? అనీ, (2) కనీసం భగవంతు డికి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా, అని! అందుకు ‘‘నా సదీయ సూక్తం’’ చెప్పిన సమాధానం సృష్టి జరిగిన తరువాత వచ్చిన వాడు భగవంతుడు కాబట్టి, సృష్టికర్త కాజాలడు. అంచేత ఈ సృష్టి ఎలా జరిగిందో కూడా భగవంతుడికి తెలియదు’’ అని చెబుతుంది! కాబట్టి సృష్టికీ, భగవంతుడికీ ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది రుగ్వేదం! అంటే రుగ్వేద కాలం నాటికే భారతదేశంలో భౌతిక వాదం,హేతువాదం ఆవిర్భవించాయనుకోవాలా?! కాబట్టి మాన వుడి ‘‘ఆయుష్షు’’కి వేదానికీ సంబంధం లేకపోయినా ‘‘దైవాధీనం మోటారు సర్వీసు’’ అన్నట్టుగా వేదం నుంచి ఆయుర్వేదాన్ని లాగ సాగారు.! నిజానికి చైనాలో కూడా ‘‘ఆక్యుపంక్చర్’’ లాంటి నిరూపితమైన కేవలం కొన్ని ప్రాచీన వైద్య పద్ధతుల పునరుద్ధరణను అనుమతిం చారు గాని, శాస్త్రీయ పద్ధతులకు, ఆచరణలో నిరూపణలకు సరిపో లిన వాటినే అనుమతించారని మరవరాదు. మనకు చిన్నతనంలో ప్రకృతి సిద్ధమైన పిడుగులు వినిపిస్తే ‘‘అర్జునా! ఫల్గుణా అని వల్లిస్తుంటే పిడుగులు పోతాయని అంటూండేవారు. అంటే భయాన్ని తొలగించి మనస్సును కుదుట పరచడంలో అలా అనేవాళ్లు. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ప్రజాబాహుళ్యంలో ఏర్పడిన భయాందోళనలను సంబాళించే ధైర్యసై్థ్యర్యాలను కలిగించడం కోసం పక్కవాటుగా ఆ మాత్రం పాత్రను పోషించడంలో ‘‘ఆయుర్ వేదం’’ తోడ్పడితే సంతోషించాల్సిందే! ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో వడపోతల మధ్య కాశీనాథుని ‘‘అమృతాంజనం’’ ఆధునీకరణ తర్వాతనే కమర్షియల్ ప్రాజెక్టుగా బయటకొచ్చింది! నిజానికి ఆయుర్వేదం పేరుకే గానీ, ప్రకృతి ప్రసాదించిన సొంఠి, పసుపు, మిరప, బెల్లం, జొన్న వగైరా పంట లన్నీ శరీర కల్మషాలకు విరుగుళ్లే సుమా! పొట్టకిచ్చినా, బట్టకిచ్చినా నేలతల్లే గాని వేదాలు, ఆయుర్వేదాలు కావు! శొంఠి సోధిస్తేనే కడుపు శుభ్రమవుతుంది! దీన్ని ఆయుర్వేదం కూడా కాదనలేదు అందుకే శ్వాస ఉండే వరకూ మనిషిలో ఆశ చావదు. ఆ ఆశను బతికి బట్టకట్టనివ్వాలన్న ఆశ వొడిగట్టిపోకుండా ఉంచే లక్షణం ఆయుర్వే దాన్ని నమ్ముకున్న వారిలో సహితం ఉండటం సర్వ సాధారణం! మృత్యువు పంచాంగం చూసి పనిచేయదు! మందులు కూడా శరీర పరిస్థితులకు అతీతం గావు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అల్లోపతిపై రామ్‌దేవ్ వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన హర్షవర్థన్
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యమంటే తమాషా కాదంటూ బాబా రామ్‌దేవ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. లక్షలాది మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచి.. కంటి తుడుపు చర్యగా రామ్‌దేవ్ ఇచ్చిన వివరణ కూడా సరిపోదన్నారు. ఈ మేరకు రామ్‌దేవ్‌బాబాకి హర్షవర్థన్ లేఖ రాశారు. కోవిడ్ కల్లోల సమయంలో ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలా, వారు చేస్తున్న త్యాగాలను అవమానించేనట్టుగా రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో ఎంతోమందిని బాధ పెట్టాయన్నారు. వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే .. మరోవైపు అల్లోపతి వైద్య విధానం వల్ల లక్షల మంది చనిపోయారని.. అదొక , మూర్ఖపు విజ్ఙానం... తమాషా అంటూ రామ్‌దేవ్ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తాము ఊహించలేదన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
అల్లోపతి వైద్యులకూ ప్రత్యేక లోగో
చండీగఢ్: అల్లోపతి డాక్టర్ల వినియోగం కోసం భారత వైద్య మండలి ఓ లోగోకు పేటెంట్ సంపాదిం చింది. కొత్త లోగోలో.. ఎర్రని ప్లస్ గుర్తులో కూపర్ ఫాంట్లో ఇంగ్లిష్ అక్షరాలు డీఆర్ రాసి ఉన్నాయి. ఆయుర్వేద, హోమియోపతి వైద్యుల తో పోల్చితే అల్లోపతి వైద్యులను ప్రత్యేకంగా గుర్తించేందుకే ఈ లోగోను తీసుకొచ్చామని చండీగఢ్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమనీక్ సింగ్ బేడీ చెప్పారు. ఈ గుర్తు సాయంతో రోగులు సులభంగా నిష్ణాతులైన వైద్యులను గుర్తించవచ్చని సింగ్ తెలిపారు. కేంద్రప్రభుత్వ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఈ లోగోను ఐఎంఏ మేధోసంపత్తి హక్కుగా నమోదుచేసింది. -
దగా వైద్యం
జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యులు - దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తామని ప్రచారం - అర్హత లేకపోయినా ప్రకటనలతో బురిడీ - అనువంశిక, గిరిజన వైద్యం పేరిట మోసం - నిలువు దోపిడీకి లోనవుతున్న రోగులు ఆయుర్వేదం అక్రమార్కులకు వరంగా మారింది. ఈ వైద్యం పేరిట అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి అల్లోపతి మందులను ఆయుర్వేదం మందుల్లో కలిపి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ప్రాణాలను హరిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని నియంత్రించే వ్యవస్థ బలంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. - కర్నూలు శివారులోని వీకర్ సెక్షన్కాలనీలో గతంలో ఓ వ్యక్తి అల్లోపతి మందులైన పెయిన్ కిల్లర్లను, స్టెరాయిడ్స్‌ను ఆయుర్వేద మందుల్లో కలిపి పలురకాల వ్యాధులు తగ్గిస్తామని జనానికి అంటగట్టారు. ఈ వ్యక్తిపై రెండేళ్ల క్రితం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. - ఇటీవల నంద్యాల రోడ్డులోని శిల్పా సింగపూర్ టౌన్షిప్ సమీపంలోనూ శ్రీనివాసులు అనే వ్యక్తి మందులు తయారు చేస్తుండగా అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని బనగానపల్లిలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఉంది. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 40 పైగా ఆయుర్వేద డిస్పెన్సరీలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వమే ఆయుర్వేద మందులను సరఫరా చేస్తోంది. కానీ ఈ ఆసుపత్రుల కంటే నకిలీ వైద్యులకే డిమాండ్ అధికంగా ఉంటోంది. దీర్ఘకాలిక వ్యాధులను, అల్లోపతి వైద్యానికి లొంగని వ్యాధులను మటుమాయం చేస్తామని నమ్మబలుకుతూ వీరిచ్చే ప్రకటనలను అమాయక ప్రజలు నమ్మి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఆయుర్వేదానికి సంబంధించి ఎలాంటి కోర్సులు చేయకపోయినా నిపుణులైన వైద్యులను తలదన్నేలా దర్జా కనబరుస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లి, ఆత్మకూరు, శ్రీశైలం, మహానంది, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, మంత్రాలయం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో నకిలీ ఆయుర్వేద వైద్యులు తిష్టవేసి తెలిసీ తెలియని వైద్యం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పర్యవేక్షణ లేదు.. శిక్షలూ పడవు ఆయుర్వేద వైద్యం చేయాలంటే బీఏఎంఎస్ కోర్సు తప్పనిసరి. కానీ కొంత మంది దూరవిద్య ద్వారా డిప్లమా సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. మరికొందరు అనువంశిక వైద్యమని, గిరిజన వైద్యమని చెబుతూ జనాన్ని మభ్యపెడుతున్నారు. ఏ మాత్రం అక్షరజ్ఞానం లేని వారు సైతం వైద్యులుగా చెలామణి అవుతున్నారు. చివరికి రహదారి పక్కన మూలికలు నూరిపోసి జనానికి ఇస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. ఆయుర్వేద మందులను విక్రయించాలన్నా, వాటిని తయారు చేయాలన్నా ఆయుష్ విభాగం నుంచి అనుమతి పొందాలి. వీరు ఏ మందులు విక్రయిస్తున్నారు, ఎలాంటి మందులు తయారు చేస్తున్నారో అధికారులు పర్యవేక్షించాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందులను తనిఖీ చేసేందుకు కేవలం ఇద్దరు మాత్రమే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. దీంతో వీరు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించవు. విజిలెన్స్ అధికారులు అడపాదడపా దాడులు చేసి పట్టుకుని, పోలీసులకు అప్పగించినా పెద్దగా శిక్షలు పడవు. నకిలీ మందులు వాడి కొన్ని వేల మంది ఇప్పటికే కిడ్నీ, కాలేయం వ్యాధులతో బాధపడుతున్నారు. మరికొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. కానీ అక్రమార్కులకు ఎలాంటి కఠిన శిక్షలూ పడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద మందులు విక్రయించే వారిపై పర్యవేక్షణ చేసే అధికారం ఇటు ఆయుష్ విభాగ అధికారులకు గానీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు, ఔషధ నియంత్రణ శాఖకు ఉండటం లేదు. దీంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. తనిఖీలు చేసే అధికారం మాకు లేదు జిల్లాలో అనేక మంది నకిలీ ఆయుర్వేద వైద్యులున్నట్లు మా దృష్టికి కూడా వస్తోంది. కానీ అలాంటి వారిపై తనిఖీలు చేసి, శిక్షించే అధికారం మాకు లేదు. నకిలీ వైద్యులు విక్రయించే మందుల వల్ల అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారు. కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్న వారు కొన్ని వేల మంది ఉన్నారు. ఆయుర్వేదం ఒక అద్భుత వైద్యం. ప్రజలు నిపుణులైన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ పి.వి.నాగరాజరావు, సీనియర్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ -
ఆయుర్వేదం.. అల్లోకల్లోలం
నకిలీ మందుల గుట్టురట్టు – అల్లోపతి మందులతో ఆయుర్వేద మందుల తయారీ – భారీగా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ స్వాధీనం – విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ దాడులు ఆయుర్వేదంపై ప్రజలకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని అల్లోపతి మందులను కలిపి మోసగిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇలా చేస్తే దీర్ఘకాలం కిడ్నీ వ్యాధుల బారిన పడతారనే ఆలోచన మరిచి యథేచ్ఛగా జనానికి అంటగట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఈ వ్యవహారం బట్టబయలయింది. కర్నూలు(హాస్పిటల్): తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పవనపు శ్రీనివాసులు అనే వ్యక్తి కొన్నేళ్లుగా స్థానిక వెంకటరమణకాలనీలో నివాసం ఉంటున్నాడు. మొదట్లో కల్లూరు ఎస్టేట్స్‌లో ఎవాన్ అనే పేరుతో మినరల్ వాటర్ కంపెనీ స్థాపించి కొన్నాళ్ల పాటు నిర్వహించాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్స్ రంగంలో కొన్నాళ్లు వ్యాపారం చేశాడు. అనంతరం ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు వైద్యనాథ్ అనే కంపెనీని స్థాపించాడు. ఆరేళ్ల క్రితం వెంకటరమణ కాలనీలోని మెయిన్ రోడ్డులో క్లీనిక్ ఏర్పాటు చేసి ప్రముఖ నటుడు చంద్రమోహన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయుర్వేద మందులను ప్రారంభించాడు. షుగర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, అధిక బరువు తగ్గిస్తామంటూ ప్రకటనలు గుప్పించాడు. ఈ మేరకు టీవీ యాంకర్లచే ప్రచారం చేసుకున్నాడు. అల్లోపతి మందులతో ఆయుర్వేద పొడులు, గుళికలు ఆయుర్వేదంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆసరగా చేసుకుని శ్రీనివాసులు భారీ పథకాన్ని రచించాడు. హైదరాబాద్ నుంచి ఆయుర్వేద చూర్ణాలను, కర్నూలులోని రంగ మెడికల్ ఏజెన్సీస్, రెడ్డి మెడికల్ ఏజెన్సీల నుంచి భారీగా బిల్లులు లేకుండా బెటామెటాసోన్, డెక్సామెటాసోన్, డైక్లోఫెనాక్, పారాసీటమాల్ జనరిక్ మందులను భారీగా కొనుగోలు చేసేవాడు. అల్లోపతి, ఆయుర్వేద చూర్ణాలను గ్రైండర్లో వేసి మెత్తగా చేసి.. వాటిని ఒక యంత్రం ద్వారా సన్నటి గోళీలను తయారు చేసి అద్దెకు తీసుకున్న గదిలో ఆరబెడతాడు. ఇలా ఎండిన గుళికలను ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాలలో వేసి అందమైన్ లేబుళ్లతో ప్యాకింగ్ చేస్తాడు. వీటిని కర్నూలు జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకినాడు, నిడదవోలు, రావులపాలెం, పెద్దాపురం, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లోని పల్లెలకు పంపించి విక్రయిస్తాడు. ప్రతి నెలా ఒక్కో ప్రాంతానికి ఒక సుమో మందులను తరలిస్తాడని అధికారులు గుర్తించారు. భారీ ఎత్తున మందులు స్వాధీనం నగర శివారులోని శిల్పా సింగపూర్ టౌన్‌షిప్‌కు వెళ్లేదారిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శ్రీనివాసులు నకిలీ మందుల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. విషయాన్ని తెలుసుకున్న రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బాబూరావు నేతృత్వంలో సీఐ జగన్మోహన్రెడ్డి, ఎస్ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు మునిస్వామి, ఈశ్వరరెడ్డి, నాగభూషణంలు కలిసి ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఒ.కుమార్, ఏడీ చంద్రశేఖరరావు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబీద్ అలి, విజయలక్ష్మి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఒక గదిలో నువ్వుల నూనె డబ్బాలు, మరో గదిలో ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు, ఆయుర్వేద చూర్ణాలు, ఇంకో గదిలో స్టెరాయిడ్, పెయిన్‌కిల్లర్ మందులు, హాలులో మందులను పిండి ముద్ద చేసేందుకు గ్రైండర్, ముద్దను గోళీలుగా మార్చే మరో యంత్రాన్ని అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని నిందితులు శ్రీనివాసులుపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ బాబూరావు తెలిపారు. ఆయుర్వేద మందులను తాము తప్పు పట్టడం లేదని, నిపుణులైన అర్హులైన ఆయుర్వేద వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలని ఆయన చెప్పారు. నకిలీ మందులతో కిడ్నీజబ్బులు స్టెరాయిడ్స్, పెయిన్కిల్లర్లు కలిపి తయారు చేసిన ఆయుర్వేద మందులను వాడిన వారికి తప్పనిసరిగా కిడ్నీ జబ్బులు వస్తాయని ఔషధ నియంత్రణ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ అలి, విజయలక్ష్మి చెప్పారు. కిడ్నీలు పాడై డయాలసిస్‌కు వెళ్తున్న ఎందరో రోగులు ఇలాంటి మందులు వాడిన వారేనన్నారు. దీంతో పాటు కాలేయం దెబ్బతింటుందని, బరువు పెరుగుతారని, హార్మోన్ల అసమతుల్యత సమస్య ఏర్పడుతుందన్నారు. స్టెరాయిడ్స్‌ను అల్లోపతి వైద్యులే రాయడానికి జంకుతారని, కానీ శ్రీనివాసులు అనే వ్యక్తి యథేచ్ఛగా వాటిని కొని ఆయుర్వేద మందుల్లో కలిపి విక్రయించడం దారుణమన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.