
పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సహా వ్యవస్థాపకులు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారతదేశంలో లక్షల మంది సింథటిక్ డ్రగ్స్ వల్ల మరణిస్తున్నారని చెప్పారు. విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు హానికరమైన మందులు తయారు చేసి వాటిపై ఆధారపడేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలో అల్లోపతి మందుల వాడకం వల్ల లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. విదేశీ ఫార్మా కంపెనీలు సింథటిక్ డ్రగ్స్‌పై ఆధారపడుతున్నాయి. ప్రజలకు తెలియకుండానే ఆ విషపూరిత మందులకు అలవాటు పడేలా చేస్తున్నాయి. ‘పతంజలి స్వదేశీ ఉద్యమం’లో అందరూ భాగస్వాములు కావాలి. స్వదేశీ, సహజ ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అన్నారు.
ఇదీ చదవండి: నదులు, కాలువల ద్వారా సరుకు రవాణా..!
పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పదోవ పట్టించేలా ఉన్నాయని గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆయా ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పడంతో కోర్టు వాటిని అంగీకరించింది.