కర్నూలులోని బుధవారపేటకు చెందిన రాముకు ఇటీవల జ్వరం, దగ్గు, జలుబు రావడంతో వైద్యులను సంప్రదించకుండా నేరుగా మెడికల్‌షాపునకు వెళ్లి మందులు కొని వాడాడు. మూడు రోజుల తర్వాత అతనికి కోవిడ్ ఉందని నిర్ధారణ కావడంతో పాటు వాడిన మందులు సరిపోక ప్రాణం మీదకు వచ్చింది. బతుకు జీవుడా అని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది బయటపడ్డాడు.
ఓర్వకల్లుకు చెందిన ఓ యువకుడు ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తాడు. అతను తరచూ మెడికల్‌షాపునకు వెళ్లి గ్యాస్ట్రబుల్, తలనొప్పి మాత్రలు తెచ్చుకుని వాడటం అలవాటుగా మారింది. కొంతకాలానికి అవి లేకుండా రోజు గడవని పరిస్థితి నెలకొంది. 40 ఏళ్లు నిండకుండానే అతనికి ఆస్టియోపోరోసిస్ రావడంతో వైద్యులు అతని జీవనశైలి గురించి ఆరా తీశారు. క్రమంగా గ్యాస్ట్రబుల్ మాత్రలు వాడటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తేల్చారు.
కర్నూలు(హాస్పిటల్): వైద్యులను సంప్రదించకుండా సొంతంగా మందులు వాడటం ఇటీవల ఎక్కువైపోయింది.స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహా తో కొన్ని వ్యాధులకు మాత్రలు కొనుగోలు చేస్తుండగా, మరికొన్ని వ్యాధులకు గూగుల్‌లో శోధించి మరీ వాటి పేరు చెప్పి మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి తనకు కలిగిన ఇబ్బందులను మెడికల్ షాపు నిర్వాహకులకే చెప్పి వారు ఇచ్చినవే తీసుకుని వాడేస్తున్నారు. కాగా కొన్ని వ్యాధి లక్షణాలు ప్రమాదకర వ్యాధులకు మూలకారణమై ఉంటాయి. వాటిని గుర్తించకుండా లక్షణాలను బట్టి మందులు వాడుతూ వెళ్లడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది.
జిల్లా వ్యాప్తంగా 2,565 మందుల దుకాణాలున్నాయి. అందులో 1,960 దాకా రిటైల్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటిలో చాలా వరకు ప్రిస్కిప్షన్ లేకుండానే ప్రజలకు మందులను విక్రయిస్తున్నారు. ఒకే డోసు మందును దీర్ఘకాలం పాటు వాడితే ఇబ్బందులు ఉంటాయని తెలిసినా కొంత మంది మందుల దుకాణాల వారు ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారు. ప్రజలు సైతం ప్రతిసారీ డాక్టర్ వద్దకు వెళితే డబ్బు ఖర్చు అవుతుందని భావించి పాత ప్రిస్కిప్షన్ (మందుల చీటి) పట్టుకుని మందుల దుకాణాలకు వెళ్లి మందులు కొని వాడుతున్నారు.
సాధారణంగా మనిషి జీవనశైలి, అతని శారీరక కదలికలను బట్టి శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. ఈ మేరకు వ్యాధికారక మందుల మోతాదు తగ్గించడం, పెంచడం చేయాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా మందులు కొని వాడితే కొన్నిసార్లు ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది. మందు డోసు ప్రకారం వాడితే ఔషధం, డోసు దాటితే విషంగా పనిచేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహిస్తుండటంతో దుష్పరిణాలు వచ్చే అవకాశం ఉన్న డిప్రెషన్, టెన్షన్‌కు వాడే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్‌ను మాత్రం ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించడం లేదు.
స్వీయ మందుల వాడకం ప్రమాదకరం
స్వీయ మందుల వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరం. కొన్ని ప్రతికూల ఆరోగ్యపరిస్థితులపై స్వీయ మందుల వాడకం ఆధారపడి ఉంటుంది. పెరిగిన ఔషధ నిరోధకత(డ్రగ్ రెసిస్టెన్స్), ఔషధ ఆధారపడటం(డ్రగ్ డిపెండెన్స్), ప్రతికూల ప్రభావాలు, ఔషధ పరస్పర చర్యలు మొదలైనవి మందుల వాడకంపై ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రతికూల ఆరోగ్య సందర్భాల్లో మరణానికి కూడా దారి తీయొచ్చు. – డాక్టర్ పి.జయచంద్ర, జనరల్ ఫిజీషియన్, కర్నూలు
ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరం. అలా కొనుగోలు చేసిన మందుల వల్ల రోగికి ఏదైనా ఇబ్బంది కలిగితే సదరు దుకాణం లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. మందుల దుకాణాలపై ప్రతి నెలా 30కి పైగా దాడులు నిర్వహించి నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తున్నాం. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. అల్లోపతి మందులకు వ్యాధిని నయం చేసే శక్తి ఎంతగా ఉంటుందో... అతిగా వాడితే దుష్పరిణామాలు అంతే ఉంటాయి. – చంద్రశేఖర్‌రావు, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment