ఆయుర్వేదం.. అల్లోకల్లోలం | Ayurveda .. sensation | Sakshi
Sakshi News home page

ఆయుర్వేదం.. అల్లోకల్లోలం

Published Tue, Jan 10 2017 9:54 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

ఆయుర్వేదం.. అల్లోకల్లోలం

ఆయుర్వేదం.. అల్లోకల్లోలం

నకిలీ మందుల గుట్టురట్టు
– అల్లోపతి మందులతో
   ఆయుర్వేద మందుల తయారీ
– భారీగా స్టెరాయిడ్స్,
   పెయిన్‌ కిల్లర్స్‌ స్వాధీనం
– విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్,
   ఔషధ నియంత్రణ శాఖ దాడులు
 
ఆయుర్వేదంపై ప్రజలకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని అల్లోపతి మందులను కలిపి మోసగిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇలా చేస్తే దీర్ఘకాలం కిడ్నీ వ్యాధుల బారిన పడతారనే ఆలోచన మరిచి యథేచ్ఛగా జనానికి అంటగట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఈ వ్యవహారం బట్టబయలయింది.
 
కర్నూలు(హాస్పిటల్‌): తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పవనపు శ్రీనివాసులు అనే వ్యక్తి కొన్నేళ్లుగా స్థానిక వెంకటరమణకాలనీలో నివాసం ఉంటున్నాడు. మొదట్లో కల్లూరు ఎస్టేట్స్‌లో ఎవాన్‌ అనే పేరుతో మినరల్‌ వాటర్‌ కంపెనీ స్థాపించి కొన్నాళ్ల పాటు నిర్వహించాడు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్స్‌ రంగంలో కొన్నాళ్లు వ్యాపారం చేశాడు. అనంతరం ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు వైద్యనాథ్‌ అనే కంపెనీని స్థాపించాడు. ఆరేళ్ల క్రితం వెంకటరమణ కాలనీలోని మెయిన్‌ రోడ్డులో క్లీనిక్‌ ఏర్పాటు చేసి ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆయుర్వేద మందులను ప్రారంభించాడు. షుగర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, అధిక బరువు తగ్గిస్తామంటూ ప్రకటనలు గుప్పించాడు. ఈ మేరకు టీవీ యాంకర్లచే ప్రచారం చేసుకున్నాడు.
 
అల్లోపతి మందులతో ఆయుర్వేద పొడులు, గుళికలు
ఆయుర్వేదంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆసరగా చేసుకుని శ్రీనివాసులు భారీ పథకాన్ని రచించాడు. హైదరాబాద్‌ నుంచి ఆయుర్వేద చూర్ణాలను, కర్నూలులోని రంగ మెడికల్‌ ఏజెన్సీస్, రెడ్డి మెడికల్‌ ఏజెన్సీల నుంచి భారీగా బిల్లులు లేకుండా బెటామెటాసోన్, డెక్సామెటాసోన్, డైక్లోఫెనాక్, పారాసీటమాల్‌ జనరిక్‌ మందులను భారీగా కొనుగోలు చేసేవాడు. అల్లోపతి, ఆయుర్వేద చూర్ణాలను గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసి.. వాటిని ఒక యంత్రం ద్వారా సన్నటి గోళీలను తయారు చేసి అద్దెకు తీసుకున్న గదిలో ఆరబెడతాడు. ఇలా ఎండిన గుళికలను ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాలలో వేసి అందమైన్‌ లేబుళ్లతో ప్యాకింగ్‌ చేస్తాడు. వీటిని కర్నూలు జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకినాడు, నిడదవోలు, రావులపాలెం, పెద్దాపురం, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లోని పల్లెలకు పంపించి విక్రయిస్తాడు. ప్రతి నెలా ఒక్కో ప్రాంతానికి ఒక సుమో మందులను తరలిస్తాడని అధికారులు గుర్తించారు.
 
భారీ ఎత్తున మందులు స్వాధీనం
నగర శివారులోని శిల్పా సింగపూర్‌ టౌన్‌షిప్‌కు వెళ్లేదారిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శ్రీనివాసులు నకిలీ మందుల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. విషయాన్ని తెలుసుకున్న రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌పీ బాబూరావు నేతృత్వంలో సీఐ జగన్మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు మునిస్వామి, ఈశ్వరరెడ్డి, నాగభూషణంలు కలిసి ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఒ.కుమార్, ఏడీ చంద్రశేఖరరావు, డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లు అబీద్‌ అలి, విజయలక్ష్మి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఒక గదిలో నువ్వుల నూనె డబ్బాలు, మరో గదిలో ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు, ఆయుర్వేద చూర్ణాలు, ఇంకో గదిలో స్టెరాయిడ్, పెయిన్‌కిల్లర్‌ మందులు, హాలులో మందులను పిండి ముద్ద చేసేందుకు గ్రైండర్, ముద్దను గోళీలుగా మార్చే మరో యంత్రాన్ని అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని నిందితులు శ్రీనివాసులుపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌పీ బాబూరావు తెలిపారు. ఆయుర్వేద మందులను తాము తప్పు పట్టడం లేదని, నిపుణులైన అర్హులైన ఆయుర్వేద వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలని ఆయన చెప్పారు.
 
నకిలీ మందులతో కిడ్నీజబ్బులు
స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్లు కలిపి తయారు చేసిన ఆయుర్వేద మందులను వాడిన వారికి తప్పనిసరిగా కిడ్నీ జబ్బులు వస్తాయని ఔషధ నియంత్రణ శాఖ డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ అబిద్‌ అలి, విజయలక్ష్మి చెప్పారు. కిడ్నీలు పాడై డయాలసిస్‌కు వెళ్తున్న ఎందరో రోగులు ఇలాంటి మందులు వాడిన వారేనన్నారు. దీంతో పాటు కాలేయం దెబ్బతింటుందని, బరువు పెరుగుతారని, హార్మోన్ల అసమతుల్యత సమస్య ఏర్పడుతుందన్నారు. స్టెరాయిడ్స్‌ను అల్లోపతి వైద్యులే రాయడానికి జంకుతారని, కానీ శ్రీనివాసులు అనే వ్యక్తి యథేచ్ఛగా వాటిని కొని ఆయుర్వేద మందుల్లో కలిపి విక్రయించడం దారుణమన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement