fake medicine
-
HYD: కోట్ల విలువైన నకిలీ మందుల పట్టివేత
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ శివార్లలో బుధవారం(జనవరి1) భారీగా నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.ఏకంగా రూ.2 కోట్ల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోంటెక్ ఎల్సీ ట్యాబ్లెట్లతో పాటు పలు మందులను సీజ్ చేశారు. హైదరాబాద్ శివార్లలోని జిన్నారంలో మందుల తయారీ ఫ్యాక్టరీ పెట్టి నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది.ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో నకిలీ మెడిసిన్లతో పాటు కాలం చెల్లిన మందులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మనుషుల పప్రాణాలకు ముప్పుతెచ్చే ఈ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని బాధ్యులపై కేసులు పెడుతున్నారు. -
నకిలీ మెడిసిన్ పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం
-
తెలంగాణలో నకిలీ మెడిసిన్స్ దందా
-
హైదరాబాద్‌లో నకిలీ మందుల కలకలం.. రూ.కోటి విలువైన మందులు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: ఔషధాల తయారీకి అవసరమైన ముడి సరుకులను అక్రమంగా తరలించి, నిల్వ చేసిన గోదాంపై రాచకొండ పోలీసులు దాడులు చేసి నిందితుడిని పట్టుకున్నారు. రూ.కోటి విలువ చేసే గడువు ముగిసిన 11 వేల కిలోల ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ● గుజరాత్‌కు చెందిన ఉమేష్ బాబూలాల్‌కు నగరంలోని కొత్తపేట ఫణిగిరి కాలనీలో డ్రగ్ ఇండియా మహావీరే పేరుతో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. చైతన్యపురి ఠాణా పరిధిలోని మారుతీనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గోదాం ఏర్పాటు చేశాడు. ఔషధాల తయారీలో వినియోగించే ముడి సరుకులను కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా దిగుమతి చేసుకొని గోదాంలో నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, ఉప్పల్ డ్రగ్ అధికారులు గోదాంపై దాడులు చేశారు. డిక్లోఫెనాక్ సోడియం, పారాసెటమాల్, నికోటినామైడ్, ఆస్కార్బిక్ ఆమ్లం, నియాసినామైడ్, ఎసిటమైనోఫెన్, ఆల్బెండజోల్‌తో పాటు గడువు ముగిసిన క్రాస్కార్మెలోస్ సోడియం, మైక్రో క్రైస్టలైన్ సెల్యులోజ్, డై కాల్షియం ఫాస్పేట్, కేవా ఫ్లేవర్స్, ఫెర్రస్ సల్ఫేట్, మెగ్నీషియం స్టిరేట్, స్టార్చ్, డ్రై అల్యూమినియం హైడ్రాకై ్సడ్ జెల్, లైసిన్ ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉమేష్‌ను అరెస్టు చేసి డగ్స్ కంట్రోల్ అధికారులకు అప్పగించారు. ఎవరికి విక్రయించేందుకు? నిందితుడు ఉమేష్‌ను పోలీసులు విచారించగా.. స్థానికంగా ఔషధ తయారీ సంస్థలకు విక్రయించేందుకే ఈ ముడి సరుకులను దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. గత పదేళ్లుగా ఈ దందా నిర్వహిస్తుండటంతో నిందితుడి నెట్వర్క్ భారీగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. కొన్ని ముడి సరుకులకు ఎలాంటి లేబుల్ లేకపోవటంతో పాటు పౌడర్ రూపంలో ఉన్నాయి. వీటిలో మత్తు పదార్థాలు ఉండొచ్చని అనుమానించిన పోలీసులు పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పోలీసులు స్వాధీనం వాటిల్లో 2019లో గడువు ముగిసిన ముడి సరుకులు కూడా ఉండటం గమనార్హం. డ్రగ్స్ కంట్రోల్ ఎక్కడ? నగర శివారు ప్రాంతాలలో మందులను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న మెడికల్ షాపులు, ఔషధ తయారీ సంస్థలు, ముడి సరుకుల సరఫరాలపై నిఘా ఉంచాల్సిన డ్రగ్ కంట్రోల్ విభాగం నిద్ర మత్తులో జోగుతుండటంతో అక్రమార్కుల ఆగడాలు కొనసాగుతున్నాయి. పోలీసుల తనిఖీలకు చిక్కకుండా లారీలు, ట్రక్‌లలో తరలిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా పండ్లు, కూరగాయలు, దాణా వంటి ఇతరత్రా ఉత్పత్తుల మాటున ఈ ముడి సరుకుల సంచులను ఉంచి, అక్రమంగా సరఫరా చేస్తున్నారు. కాటేదాన్, పాశమైలారం, బాలానగర్, ఉప్పల్ వంటి పారిశ్రామిక వాడలలో మూతపడిన కంపెనీలు, చిన్నాచితకా ఫార్మా కంపెనీలలో అక్రమంగా నకిలీ మందులను తయారు చేస్తున్నారు. -
నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్
ముత్తుకూరు: కరోనా నివారణకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందును ఆయుష్ అధ్యయనం నేపథ్యంలో నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అదునుగా ఆనందయ్య శిష్యులుగా చెప్పుకునే కొందరు నకిలీ మందు తయారు చేసి వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారు. తోటపల్లిగూడూరు మండలం కుమ్మరమిట్టకు చెందిన యడవల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నకిలీ ఆయుర్వేద మందు తయారు చేస్తున్నట్టు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథరెడ్డి, కృష్ణపట్నం సీఐ షేక్‌ఖాజావలి చెప్పారు. ముత్తుకూరులోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. నిందితుడు గతంలో ఆనందయ్య వద్ద మందు తెచ్చుకున్నాడని, సరిగ్గా అలాంటి మందు తయారు చేసి పంపిణీ చేయడం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. నిందితుడితో పాటు నకిలీ మందును స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. -
గ్లూకోజ్ నింపి వ్యాక్సిన్‌గా..! గుజరాత్ టూ మధ్యప్రదేశ్
భోపాల్: కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. వ్యాక్సిన్ కొరతను కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వ్యాక్సిన్ మాటున గ్లూకోజ్ నీళ్లు నింపి అత్యధిక ధరకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. నకిలీ వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నకిలీ వ్యాక్సిన్ ప్రజల ప్రాణానికే ప్రమాదంగా మారింది. మధ్యప్రదేశ్‌లో నకిలీ వ్యాక్సిన్ వేసుకోవడంతో పది మంది మృతి చెందారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అంత మంది మృతి చెందడంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తు చేపట్టగా.. రెమిడిసివర్ వ్యాక్సిన్ పేరుతో గ్లూకోజ్ నింపిన బాటిళ్లను ఓ ముఠా విక్రయిస్తోందని మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఆ మందు కొని వేసుకున్న ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని తేలింది. అయితే ఆ వ్యాక్సిన్ వేసుకున్న వారు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలుసకుని షాకయ్యారు. అలా పది మంది మృతి చెందారని తెలియడంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. విచారణ క్రమంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై నుంచి ఖాళీ సీసాలను తీసుకొచ్చి వాటిలో గ్లూకోజ్ వాటర్ నింపి దానికి నకిలీ రెమిడిసివర్ అనే పేపర్ అంటించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఈ ముఠాకు చెందిన వారు నిలబడి వ్యాక్సిన్ బ్లాక్‌లో అమ్ముతున్నారు. అత్యవసరం కావడంతో ప్రజలు వారి నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ ముఠా ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 1,200 (ఇండోర్‌లో 700, జబాల్‌పూర్ 500) విక్రయించారు. అయితే మే 1వ తేదీన గుజరాత్లో ఈ ముఠా ఆగడాలు బయటపడ్డాయి. అక్కడి పోలీసుల సమాచారంతో మధ్యప్రదేశ్ పోలీసులు వీరి గుట్టు రట్టు చేశారు. ‘ఈ రాకెట్‌ను బట్టబయలు చేస్తాం. దీనిలో ఉన్న చివరి వ్యక్తిని అరెస్ట్ చేసేదాక దర్యాప్తు కొనసాగుతుంది’ అని ఇండోర్ ఐజీ హరినారాయణ్ చారి మిశ్రా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో దాదాపు 90శాతం నకిలీ రెమిడిసివర్ వ్యాక్సిన్ లభించిందని గుర్తించారు. జబాల్పూర్లోని ఓమ్తి పోలీస్‌స్టేషన్‌లో నిందితులు జరాబ్జిత్ సింగ్, సపన్ జైన్, దేవేశ్లపై కేసులు నమోదయ్యాయి. ఈ ముఠానే నకిలీ మందుల రాకెట్ నడిపిస్తున్నట్లు భావిస్తున్నారు. గుజరాత్ నుంచి ఈ ముఠా వ్యవహారం నడుస్తోందని గుర్తించారు. అక్కడి పోలీసుల సహాయం కూడా మధ్యప్రదేశ్ పోలీసులు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ కొనేముందు జాగ్రత్తలు తీసుకోవాలని, బ్లాక్‌లో కొనుగోలు చేయొద్దని స్పష్టం చేశారు. చదవండి: శభాష్ చౌహన్‌జీ.. దేశానికి మార్గం చూపారు చదవండి: రేషన్ బియ్యం: బస్తాకు 4 నుంచి 11 కిలోల తక్కువ -
భారీ మోసం: సెలైన్ నింపి రెమిడెసివిర్‌గా బురిడీ
నిజామాబాద్ అర్బన్: రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఖాళీ బాటిల్లో సెలైన్ వాటర్ నింపి బ్లాక్‌లో రూ.30 వేలకు విక్రయించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన మహేశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇటీవల కరోనా వైరస్ సోకగా ఆర్మూర్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రిలో ఈనెల 22న చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తీసుకెళ్లిపోవాలని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో బాధితుడి బంధువులు మహేశ్‌ను నిజామాబాద్‌లోని అంకం ప్రైవేటు ఆస్పత్రిలో ఈ నెల 24న చేర్చారు. అక్కడి వైద్యులు రెమిడెసివిర్ ఇంజెక్షన్ తెచ్చుకోవాలని చెప్పడంతో.. మహేశ్ తమ్ముడు రంజిత్ ఇంజెక్షన్ల కోసం ఆర్మూర్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రిని సంప్రదించాడు. అక్కడి వైద్యుడు సాయికృష్ణనాయుడు నిజామాబాద్‌లోని శ్రీకాంత్‌గౌడ్‌ను కలవాలని సూచించాడు. నిజామాబాద్‌లోని తిరుమల ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీకాంత్‌గౌడ్ రోజువారీ వేతనంతో మేల్ స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నాడు. శ్రీకాంత్‌గౌడ్‌ను రంజిత్ కలవగా రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఒక్కోటి రూ.30 వేలు ఉంటుందని చెప్పాడు. గత్యంతరం లేక మూడు ఇంజెక్షన్లను రూ.90 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం మళ్లీ మరో 3 ఇంజెక్షన్లను రూ.90 వేలకు కొన్నాడు. రెండోసారి కొనుగోలు చేసిన మూడు ఇంజెక్షన్లు నకిలీవని అంకం ఆస్పత్రి వైద్యుడు అనుమానించాడు. ఆ ఇంజెక్షన్లు వాడినట్లు మార్క్‌లు కన్పించడంతో పరిశీలించి అందులో సెలైన్ వాటర్ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని కరోనా బాధితుడు మహేశ్‌కు తెలిపాడు. మహేశ్ తన తమ్ముడు రంజిత్‌కు చెప్పగా, ఆయన వెళ్లి శ్రీకాంత్‌గౌడ్‌ను నిలదీశాడు. దీంతో ఆ మూడు ఇంజెక్షన్ల డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు. అయితే ఈ సంఘటనపై ఒకటో టౌన్ పోలీసులకు రంజిత్ ఈ నెల 26న ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తిరుమల ఆస్పత్రిపై దాడి చేసి శ్రీకాంత్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజం ఒప్పుకొన్నాడు. తిరుమల ఆస్పత్రిలో వాడిపారేసిన రెమిడెసివిర్ ఖాళీ బాటిల్లో నిందితుడు సెలైన్ వాటర్ నింపినట్లు గుర్తించారు. లైఫ్‌లైన్ ఆస్పత్రి వైద్యుడు సాయికృష్ణనాయుడు, ఇంజెక్షన్లు విక్రయించిన శ్రీకాంత్‌గౌడ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మూడు నకిలీ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎంతమందికి సెలైన్ వాటర్‌ను రెమిడెసివిర్ ఇంజెక్షన్లుగా విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. . చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. నిజామాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సెలైన్ వాటర్‌తో నింపిన రెమెడిసివర్ వ్యాక్సిన్ -
నకిలీ 'బయోం'దోళన
ఆదోని పట్టణం ఆలూరు రోడ్డులోని ఓ పాత భవనంలో న్యూ ఇండియా క్రాప్ సైన్స్ పేరుతో పైరు ఎదుగుదలకు తోడ్పడే పోషకాల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ద్రవ, గుళికలు తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్నారు. గత నెల 26వ తేదీన వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించగా.. తయారు చేస్తున్న బయో మందుల్లో రసాయనాలు ఉన్నట్లు తేలింది. దాదాపు రూ.50 లక్షల విలువైన ఉత్పత్తులను సీజ్ చేశారు. జిల్లాలో విక్రయిస్తున్న అనేక బయో మందులు నకిలీవేనని తెలుస్తోంది. సాక్షి, కర్నూలు : బయో మందులు.. పైరు ఏపుగా పెరగడానికి, మంచి పూత రావడానికి రైతులు వాడుతున్నారు. అన్నదాతల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ వ్యాపారులు.. నకిలీలను అంటగడుతున్నారు. వీటిని వాడితే మొక్క తన సహజ లక్షణాలు కోల్పోతుంది. పచ్చగా ఏపుగా పెరిగినా.. పూత, కాపు రాక రైతు నష్టపోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పైరు ఎరుపు రావడంతోపాటు పూతకూడా రాలుతుంది. వీటి దుష్పరిణామాలను నివారించేందుకు ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడినా ప్రయోజనం ఉండబోదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగా ఉంది. అత్యధికంగా పత్తి 2,63,595 హెక్టార్లలో సాగైంది. పైరు వివిధ దశల్లో ఉంది. పూత బాగా రావాలని చాలా మంది రైతులు బయో మందులు వాడుతున్నారు. అవి నకిలీవని తెలియక మోసపోతున్నారు. కంది 63,906, కొర్ర 6,455, సజ్జ 5,683, మినుము 1,953, ఆముదం 16,653, మిరప 10,882 హెక్టార్లలో సాగయ్యాయి. మంచి దిగుబడులు రావాలనే ఆశతో వాటికి కూడా రైతులు బయో మందులను వాడుతున్నారు. మోసాలు ఇలా చేస్తున్నారు... బయో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు 2004లో రాష్ట్రంలో ఐదు మాత్రమే ఉండేవి. నేడు అవి వందల సంఖ్యకు పెరిగిపోయాయి. నిబంధనల ప్రకారం బయో ఉత్పత్తులు అమ్మకోవాలంటే ముందుగా వ్యవసాయశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇందు కోసం దరఖాస్తు చేసుకుంటే వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహిస్తారు. అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే అనుమతులు ఇస్తారు. ఏవైనా బయో ఉత్పత్తులు అమ్ముకోవాలంటే కేంద్రం/ రాష్ట్రానికి చెందిన ప్రయోగశాలు ధ్రువీకరించిన సర్టిఫికెట్లు ఉండాలి. ఆ ఉత్పత్తుల్లో ఏయే పోషకాలు.. ఎంతెంత మోతాదులో ఉన్నాయనేది ప్రయోగశాలల్లో నిర్ధారిస్తారు. ప్రయోగశాలలో ధ్రువపత్రాలు లేకుండా బయో మందులు అమ్మడానికి అవకాశం లేదు. ఈ మేరకు వ్యవసాయ శాఖ నుంచి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని ఎక్కడా పాటించడం లేదు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో బయో కంపెనీలు 75 ఉన్నాయి. అయితే అనధికారికంగా నడుస్తున్న బయో కంపెనీలు వంద వరకు ఉన్నట్లు అంచనా. చైనా నుంచి విషపూరిత రసాయనాలు దిగుమతి చేసుకొని.. బయో ఉత్పత్తుల పేరుతో రైతులను ఈ కంపెనీలు ముంచుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యాపారం... బోగస్ కంపెనీలు తప్పుడు అడ్రస్‌లు, గ్రాఫిక్ లేబుళ్లతో బయో మందులను సృషిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకనే వారు కరువయ్యారు. కొంతమంది వ్యవసాయాధికారుల కుటుంబీకులే అక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు, మంత్రాలయం, నంద్యాల, ఎమ్మిగనూరు, కోసిగి, గోనెగండ్ల, డోన్, ఆదోని, నందికొట్కూరు, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో దొంగ బయో ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా వీటిని విక్రయిస్తున్నారు. కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని పెస్టిసైడ్ బయో పెస్టిసైడ్ దుకాణాలు ఉన్నాయి. వీటిల్లో దొంగ బయో ఉత్పత్తులకు ఒక బిల్లు బుక్కు, కంపెనీలకు ఉత్పత్తులకు మరో బిల్లు బుక్ నిర్వహిస్తూ జీరో వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నకిలీలను ఎలా తెలుసుకోవాలంటే... భూమిలో నుంచి మొక్క వేరు ప్రాంతంలోని మట్టిని సేకరించి దాని నుంచి సూక్ష్మ జీవులను ఉత్పత్తి చేస్తారు. అందులో మనుషులు, మొక్కలు, పశుసంపదకు హాని, కీడు చేసే వాటిని, వాటి లక్షణాలను బట్టి వేరుచేసి జీవ సాంకేతిక ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయాల్సి ఉంది. పులియ బెట్టే విధానంలో బయో మందులు తయారు చేస్తారు. ఇవి చేతిమీద పోసుకుంటే దురుద రాదు. ముక్కు మంటపుడితే అది నకిలీదిగా భావించాలి. నీళ్లలో పోస్తే నురగ రాకూడదు. నేలమీద పడితే వెంటనే ఆరిపోకూడదు. చీమలు, తేనెటీగలు తిన్నా చనిపోకూడదు. ఈ లక్షణాలను గమనిస్తే బయో మందులని నిర్ధారించుకోవచ్చు. -
నకిలీ మందుల మాయగాళ్లు!
జిల్లాలో నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో, విదేశీ పర్యటనలపై మోజుతో నాసిరకం మందులను రోగులకు రాసిస్తున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, ఇతర పట్టణాల్లో ఈ దందా కొనసాగుతోంది. కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు కూడా నకిలీ మందులతో జీరో బిజినెస్ చేస్తున్నారు. దీనివల్ల ఒకవైపు రోగులకు నష్టం జరగడంతో పాటు మరో వైపు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. సాక్షి , కర్నూలు : రాయలసీమలో అత్యధికంగా మెడికల్ ఏజెన్సీలు ఉన్న ప్రాంతం కర్నూలు జిల్లా. ఇందులో కొన్ని ఏజెన్సీలు నకిలీ ఔషధ దందా సాగిస్తున్నాయి. కాంట్రాక్టు బేసిస్ మెడిసిన్ పేరుతో ఈ దందా సాగుతోంది. ఏజెన్సీలతో పాటు మందుల తయారీ కంపెనీలు కొన్ని నేరుగా వైద్యులతో సంబంధాలు పెట్టుకుని, వారు నడుపుతున్న ఆస్పత్రులకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నాయి. వీటికి ఎలాంటి బిల్లులు ఉండవు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల నకిలీ మందులనే రాసిస్తున్నారు. ప్రతి ఫలంగా భారీ పర్సెంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం డ్రగ్ కంట్రోల్ అధికారులకు తెలిసినా కాసుల కక్కుర్తితో దుకాణాలపై దాడులు చేయడం లేదు. భారీ నజరానాలు కాంట్రాక్ట్ బేసిస్ మందులు సిఫారసు చేసినందుకు డాక్టర్లకు కంపెనీ ప్రతినిధులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.లక్ష వరకూ ముట్టజెబుతున్నారు. అలాగే ఖరీదైన బహుమతులు అందజేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు థాయ్‌లాండ్, దుబాయ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ పర్యటనలకు పంపుతున్నారు. అలాగే దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సమావేశాల పేరుతో స్టార్ హోటళ్లలో విందులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల అండ కోసం కంపెనీలు ఇంత భారీగా వ్యయం చేస్తున్నాయంటే వారికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవసరార్థం వచ్చే రోగుల నుంచి మెడికల్ కంపెనీలు అడ్డగోలుగా దండుకున్న సొమ్మునే ఇలా ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది. సంగారెడ్డి, మెదక్ నుంచి సరఫరా నకిలీ మందులు ఎక్కువగా సంగారెడ్డి, మెదక్ కేంద్రంగా కర్నూలు జిల్లాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో డ్రగ్స్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో నకిలీ మందులు తయారు చేసి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మందులు వాడటం వల్ల రోగులకు కొత్తగా ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. ఆరోగ్యానికి హానికరం కాని పౌడర్లను ఉపయోగించి తయారుచేస్తుండడమే ఇందుకు కారణం. ఈ నకిలీ మందుల తయారీకి అయ్యే ఖర్చు తక్కువ. కానీ ఎమ్మార్పీ మాత్రం భారీగా ఉంటుంది. ఈ మందులు వాడితే రోగికి ఉన్న జబ్బు నయం కాదు. పైగా మరింత ముదిరి రోగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. నకిలీ మందులు ఇవిగో.. నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో ‘ఎ...ఆ...’అనే రెండురకాల కంపెనీల పేర్లతో ఉన్న మందులు అంటగడుతున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్‌న్‌స్థానంలో ఓ..సె.., ఆ.. పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రిజోల్ స్థానంలో ‘ ఫా’ పేరుతో ఉండే మరో మూడు రకాల నకిలీ మందులను రాసిస్తున్నారు. ఇలా చాలా రకాల నకిలీ మందులు మెడికల్ స్టోర్ల నుంచి రోగులకు చేరుతున్నాయి. వీటిపై లాభాల శాతం అధికంగా ఉంటోంది. దీంతో మందుల దుకాణ యజమానులు భారీగా దండుకుంటున్నారు. ఇందులో కొంత పర్సెంటేజీ వైద్యులకు ముట్టజెప్పుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేసిన వారు ఆస్పత్రి కరెంటు బిల్లు, ఇతర ఖర్చులను కూడా భరిస్తున్నారు. రుగ్మతలతో డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను డాక్టర్లు, మెడికల్స్టోర్ నిర్వాహకులు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రం చర్యలు తీసుకోకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. -
ఔషధం..గరళం
ఏదైనా అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మందులు తీసుకున్నారా..? వాళ్లిచ్చిన మందులు వాడినా ఏమాత్రం అనారోగ్యం తగ్గలేదా..అయితే మీకిచ్చినవి నాసిరకం మందులేమో ఓ సారి పరిశీలించుకోండి. నాణ్యతా పరీక్షలు పూర్తికాకుండానే బడా ఫార్మాసూటికల్ కంపెనీలు పంపే నాసిరకం మందులను నేరుగా వైద్యశాలలకు పంపిణీ చేసి రోగులకు ఇచ్చేస్తున్నారు. ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ పంపిన ల్యాబ్ తనిఖీల్లో ఈ నాసిరకం మందుల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వ వైద్యశాలల్లో నాసిరకం మందులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నాసిరకం మందులు తయారు చేస్తున్న మందుల కంపెనీలు రాష్ట్ర స్థాయిలో మందుల సరఫరాకు కమీషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందుతున్నాయి. గతంలో కంపెనీలు మందులను సరఫరా చేసిన అనంతరం రాష్ట్ర స్థాయిలోనే నాణ్యతాపరీక్షలకు పంపించే వారు. ఆ పరీక్షలలో నాణ్యమైన మందులు అని తేలితేనే జిల్లాలకు పంపించేవారు. అయితే నాలుగేళ్లుగా జిల్లాలకు పంపించి, అక్కడ నుంచి మందుల నాణ్యతకు ల్యాబొరేటరీలకు పంపుతున్నారు. ఈ సమయాన్నే క్వారన్‌టైమ్ అంటారు. అయితే మందులకు సంబంధించిన నాణ్యతా నివేదికలు రాకుండానే మందులు క్షేత్ర స్థాయిలో అయిపోతుండటంతో విడుదల చేస్తున్నారు. దీంతో మందులు వాడిన తర్వాత నాణ్యతా పరీక్షలలో మందుల కంపెనీలు నిలబడటంలేదు. అయితే అప్పటికే మందులను దాదాపు పూర్తి స్థాయిలో రోగులు వినియోగిస్తున్నారు. ఒంగోలు డ్రగ్ఇన్స్పెక్టర్ కొన్ని రకాల మందులను ఈ మధ్య కాలంలో నాణ్యతా పరీక్షల కోసం ల్యాబొరేటరీలకు పంపించారు. ఈ పరీక్షలలో చాలా వరకూ కంపెనీలు నెగ్గలేదు. పైగా కొన్ని కంపెనీలు సెంట్రల్ ల్యాబొరేటరీలకు తమ మందులను పంపినా అక్కడ కూడా నెగ్గలేదు. దీంతో ఇటువంటి నాణ్యతా లోపం ఉన్న మందులను సరఫరా చేసిన కంపెనీలపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అమాక్సీ క్లావనేట్:ఇది యాంటి బయోటెక్ ఈ మందును అనేక రోగాలకు, జ్వరాలకు వైద్యులు విరివిగా వాడుతుంటారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కువగా వాడే రెండు, మూడు రకాల యాంటి బయోటెక్ లలో దీనిది రెండో స్థానం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తదితర కారణాలతో వచ్చే జ్వరాలకు వాడుతుంటారు. ఇంతటి ముఖ్య అవసరమైన ఈ యాంటిబయోటెక్ను ఈ మధ్య కాలంలో స్టాండార్ట్ ఫార్మస్యూటికల్స్ అనే కోల్‌కతాకు చెందిన కంపెనీ సరఫరా చేసింది. ఈ కంపెనీ బ్యాచ్ నెంబర్ సిఎల్ఎండీ 743 కింద 1,90,000ల ట్యాబ్లెట్లను సరఫరా చేసింది. అయితే కంపెనీ తయారు చేసిన ఈ మందుల నాణ్యతపై అధికారులకు అనుమానం రావడంతో ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ మందులను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీలకు పంపించారు. అక్కడ నాణ్యత లేనట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై కంపెనీకి నోటీసులు ఇవ్వడంతో కంపెనీ సెంట్రల్ ల్యాబొరేటరీకి నాణ్యత పరీక్షల కోసం పంపగా అక్కడ కూడా మందులు నాణ్యత లేవన్నట్లు నివేదిక వచ్చింది. దీంతో అధికారులు సదరు కంపెనీపై ఒంగోలు కోర్టులో కేసు నమోదు చేశారు. అయితే కంపెనీ సరఫరా చేసిన లక్షా తొంభైవేల మాత్రలను అధికారులు నివేదికలు రాకుండానే పీహెచ్‌సీలకు, ప్రాంతీయ వైద్యశాలలకు పంపించారు. అక్కడి వైద్యులు రోగులకు కూడా వాడారు. మిగిలిన 1800 మాత్రలను మాత్రమే వెనక్కి తెప్పించారు. ఇటువంటి నాసిరకం మందులు వాడటంతో చాలా మందికి రోగం నయం కావడంలేదు. పైగా ఎక్కువ శక్తివంతమైన యాంటిబయోటెక్లను వాడాల్సి వస్తుంది. హైయోసిన్ బ్యుటైల్ బ్రొమైడ్–బుస్కొపాన్:హైయోసిన్ బ్యుటైల్ బ్రొమైడ్ దీన్నే బుస్కోపాన్ అని కూడా అంటారు. ఈ మందును రోగులకు అనేక తీవ్రమైన నొప్పులకు వాడతారు. ఇది ఖరీదు కూడా తక్కువగానే ఉంటుంది. అరియన్ హెల్త్ కేర్ అనే కంపెనీ ఈ మందులను ఎస్7005 సరఫరా చేసింది. అయితే ఈ కంపెనీ తయారు చేసిన మందులు కుడా నాణ్యతా పరీక్షలలో విఫలమయ్యాయి. అయితే మందులను వైద్యశాలలకు సరఫరా చేయలేదు. వీటిని వెనక్కి పంపించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్:ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ మందును రక్తహీనతకు వాడతారు. ముఖ్యంగా మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుంటారు. దీంతో ఈ మందును ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. రక్త హీనతతోనే ఎక్కువ మంది గర్భిణులు కాన్పు సమయంలో మరణిస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన ఔషధంలో నాణ్యత లేదు. గత నెలలో ఈ మందులను ర్యాడికో రెమిడీస్ అనే కంపెనీ సరఫరా చేసింది. అయితే అప్పటికే క్షేత్ర స్థాయిలో చాలా మందులను వినియోగించారు. మిగిలిన 550 బాటిళ్ల సిరప్‌ను మాత్రమే వెనక్కి తెప్పించారు. స్థానిక బాలాజీ నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్లో మందులు నాణ్యత లేనివిగా అధికారులు గుర్తించి, కేసులు నమోదు చేశారు. అసిటైల్ శాల్సిలిక్ యాసిడ్–ఆస్పిరిన్:ఈ మందును అర్ధరైటిస్ ద్వారా వచ్చే జ్వరాలకు, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించేందుకు, అదేవిధంగా ఇతర జ్వరాలకు వాడుతుంటారు. అయితే ఈ మందును ల్యాక్కెమ్కో అనే కంపెనీ సరఫరా చేసింది. ఈ కంపెనీ 64 వేల మందులను సరఫరా చేసింది. ఈ కంపెనీ సరఫరా చేసిన మందులు నాణ్యత లేనట్లుగా పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు ఈ మందులను వెనక్కి తెప్పిస్తున్నారు.ఇలా అనేక రకాల మందులు క్షుణ్ణంగా పరిశీలిస్తే నాణ్యత లోపం బయటపడే అవకాశం ఉంది. కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అధికారులు ఇటువంటి మందులను సరఫరా చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
మందుల మోసం..
కాకినాడ లీగల్: జిల్లాలో అధిక ధరలకు మందుల విక్రయం, నాసిరకం మందులు అమ్ముతు న్న కంపెనీలు, దుకాణదారులపై జిల్లా ఔషధ నియంత్రణ ఏడీ టి.శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో డ్రగ్ఇన్స్పెక్టర్లు మంగళవారం దాడులు చేశారు. కొన్ని రకాల మందుల షీట్స్‌పై అధిక రేట్లు వేసి విక్రయించడమే కాకుండా..నాసిరకం మందులు విక్రయిస్తున్న కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు. కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రరావు, కాకినాడ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వీఎస్ జ్యోతి మంగళవారం కాకినాడలో వివిధ ముందులదుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. శ్రీరామ్‌సాయి మెడకిల్ డిస్ట్రిబ్యూటర్స్‌కు చెందిన దుకాణంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన లేబొరేట్ ఫార్మాస్యుటికల్స్ ఇండియాలిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మూడు రకాల మందులపై అధిక ధరలు ముద్రించినట్టు గుర్తించారు. జెంటాలాబ్ ఇంజక్షన్ 30ఎంఎల్ ఎంఆర్పీ 73.50 పైసలుగా ముద్రించారు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.27.65పైసలు మాత్రమే. జెంటాలాబ్ ఇంజక్షన్ 10ఎంఎల్ ఎంఆర్పీ 24.50 పైసలుగా ముద్రించారు. అసలు ధర రూ.16.675 పైసలకు విక్రయించాలి. డిక్సీలాబ్ ఇంజక్షన్ 30 ఎంఎల్ ఒకటి రూ.84.50పైసలుగా ముద్రించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.35.85పైసలు ఉండాలి. అధిక ధరకు విక్రయిస్తున్నందుకు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్–2013 చట్టం ఉల్లంఘన కింద డ్రగ్ఇన్స్పెపెక్టర్లు మందులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత మందుల కంపెనీపై కేసు నమోదుచేసి కాకినాడ మూడో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్కోర్టులో హాజరుపరిచారు. ఏడీ టి.శ్రీరామమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని దుకాణాలు, కంపెనీలను తనిఖీ చేయనున్నట్టు వెల్లడించారు. -
బల్లా దాదా... ఎస్ఎస్సీ!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు రాకేష్ వర్మ అలియాస్ బల్లా.. చదివింది కేవలం పదో తరగతి.. తండ్రి నుంచి ‘వారసత్వంగా’ ఆయుర్వేద వైద్యుడిగా మారాడు.. అసలు ఆయుర్వేద మందులు ఖరీదు కావడంతో నకిలీవి తయారు చేసి ఇవ్వడం మొదలెట్టాడు.. క్యాన్సర్, పక్షవాతం సహా ప్రాణాంతక వ్యాధులకూ వైద్యం చేస్తానంటూ అందినకాడికి దండుకుంటున్నాడు... ఈ ఘరానా మోసగాడిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. హర్యానాకు చెందిన బల్లా పదో తరగతిలో చదువుకు స్వస్థి చెప్పాడు. తండ్రి రామ్‌గోపాల్ వర్మ నుంచి ఆయుర్వేద వైద్యం చేయడం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళ పాటు హర్యానాలోనే ఈ వృత్తి కొనసాగించాడు. ఎనిమిదేళ్ళ క్రితం ఇతడికి వివాహం కావడంతో పాటు ఇద్దరు పిల్లలు పుట్టారు. దీంతో ఖర్చులు పెరిగి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాడు. ఇతడి సోదరిని కొన్నేళ్ళ క్రితం చార్మినార్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇలా నగరంతో సంబంధం ఏర్పడిన బల్లా తరచూ ఇక్కడకు వచ్చి చార్మినార్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేయడం, ఆయుర్వేద వైద్యుడినంటూ ప్రచారం చేసుకోవడం మొదలెట్టాడు. లాడ్జికి వచ్చిన రోగులకు కొన్నాళ్ళ పాటు నిజమైన ఆయుర్వేద మందులే ఇచ్చాడు. అవి ఖరీదు ఎక్కువ కావడం, తనకు గిట్టుబాటు కాకపోవడంతో తానే నకిలీ ఆయుర్వేద మందులు తయారు చేసి ఇవ్వడం మొదలెట్టాడు. ఓ దశలో క్యాన్సర్, పక్షవాతం, పటుత్వంతో పాటు అనేక ప్రాణాంతక వ్యాధులకు వైద్యం చేస్తానంటూ అనేక మందిని నమ్మించాడు. వివాహితులకు మగ పిల్లలు పుట్టేందుకు తన వద్ద మందులు ఉన్నాయంటూ అంటగట్టాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇంగ్లీషు మందులు ఇవ్వడం, ఇంజెక్షన్లు చేయడం కూడా చేస్తున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడంతో కుల్సుంపురం, చార్మినార్, హుస్సేనిఆలం ఠాణాల్లో బల్లాపై కేసులు నమోదయ్యాయి. వీటిలో వాంటెడ్‌గా ఉండటంతో పోలీసులకు చిక్కుతాననే భయంతో సిటీలో మకాం మార్చాడు. పాతబస్తీకి బదులుగా అమీర్‌పేట, ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం ప్రాంతాల్లో ఉన్న లాడ్జిల్లో ఉంటూ రోగుల్ని ఫోన్ చేసి పిలిపించుకుని వైద్యం చేస్తున్నాడు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారి నుంచి కనిష్టంగా రూ.50 వేలు, గరిష్టంగా రూ.లక్ష వసూలు చేస్తున్నాడు. బల్లా వ్యవహారాలపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి వారం రోజుల పాటు వలపన్నారు. శుక్రవారం నగరానికి వచ్చిన బల్లాను పట్టుకుని ఇతడి నుంచి నకిలీ ఆయుర్వేద మందులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని కుల్సుంపుర పోలీసులకు అప్పగించారు. -
చంద్రబాబు రైతు వ్యతిరేకి
విజయవాడ సిటీ: పోలీసులతో రైతుల్ని కాల్చి చంపించిన ఘనచరిత్ర ఉన్న చంద్రబాబుది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. నకిలీ మందుల కారణంగా నష్టపోయి పరిహారం కోసం ఉద్యమించిన రైతులను ఆత్మహత్యాయత్నం చేసుకునే విధంగా చేశారని మండిపడ్డారు. నకిలీ విత్తనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారిందని దుయ్యబట్టారు. విజయవాడ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాల కారణంగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తే పరిష్కారమవుతుందేమోనని ఆశించి అసెంబ్లీకి బయలు దేరిన రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా చంద్రబాబు చేశారని విమర్శించారు. నష్ట పరిహారం కోసం రైతులు వస్తే చంద్రబాబు ఎందుకు భయపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బిడ్డనని నోటి నుంచి చెప్పుకోవడం కాదు చంద్రబాబూ... ఆలోచనా విధానాలూ రైతులకు మేలు చేసేలా ఉండాలని సూచించారు. రైతులను చంపిన నువ్వు రైతు బిడ్డవు ఎలా అవుతావని ఎద్దేవా చేశారు. నష్టపోయిన రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వారిపై అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. రైతులకు నిరసనలు తెలిపే హక్కులేదా? అని ప్రశ్నించారు. జిల్లాలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని కృష్ణా జిల్లా మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని, పోలీసులను వాడుకుంటూ రైతులను వేధిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎప్పటిలోగా నష్టపరిహారం చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నటనకు నంది అవార్డు... పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబుప్రహసనంగా మార్చేశారని పార్థసారథి ధ్వజమెత్తారు. పోలవరంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు నటించిన నటనకు నంది అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. 2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడేమో కేంద్రం సహకరిస్తేనే పోలవరం పూర్తి చేస్తానని కొత్త పల్లవి అందుకున్నారని దుయ్యబట్టారు. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. -
కేస్ క్లోజ్... వాళ్లు సేఫ్!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మందుల మాఫియా కేసును ప్రభుత్వం వ్యూహాత్మకంగా నీరుగారుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత కుటుంబాన్ని కాపాడడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేసు దర్యాప్తు ప్రక్రియ నుంచి పోలీసు యంత్రాంగాన్ని దాదాపుగా తప్పించారు. విచారణ అధికారిగా ఉన్న ఔషధ నియంత్రణ విభాగం అధికారి పాత్రను నామమాత్రం చేశారు. కీలక నేత కుటుంబానికి సన్నిహితుడైన ఓ ఉన్నతాధికారికి ఈ కేసు బాధ్యతను అప్పగించారు. ఈ కేసు మీరు చూడొద్దు: గుంటూరు జిల్లా నరసరావుపేట కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన నకిలీ మందుల మాఫియా కేసును పక్కాగా పక్కదారి పట్టిస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. వాస్తవానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ దందా వెలుగులోకి వచ్చింది. అనంతరం విజయవాడ, గుంటూరులో నిర్వహించిన సోదాల్లో నకిలీ మందుల బాగోతం బట్టబయలైంది. కానీ, కేసు దర్యాప్తు కీలక దశలో ఉండగా విజయవాడ, గుంటూరు పోలీసుల పాత్రను దాదాపు లేకుండా చేసేశారు. ‘‘ఈ కేసును ఔషధ నియంత్రణ శాఖ చూసుకుంటుంది. మీరు జోక్యం చేసుకోవాల్సిన పని లేదు’’ అంటూ ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో గుంటూరుకు చెందిన ఔషధ నియంత్రణ మండలి అధికారిని కొనసాగిస్తూనే ఆయన పాత్రను నామమాత్రం చేసేశారు. ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండాపోవడం గమనార్హం. అంతా ఆయనే చూస్తారట...: నకిలీ మందుల దర్యాప్తు కేసులో పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను గుంటూరులో ఉండే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారికి అప్పగించారు. ఆయన గతంలో గుంటూరు జిల్లా పోలీసు శాఖలో పనిచేసినప్పటి నుంచి కీలక నేత కుటుంబానికి సన్నిహితుడు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఇతర శాఖలో ఉన్న ఆయనకే నకిలీ మందుల కేసును అప్పగించడం గమనార్హం. అందుకు తగ్గట్లుగానే ఆయన నడుచుకుంటున్నారు. ఈ కేసులో కీలకమైన నకిలీ మందుల పంపిణీదారులతో సమాలోచలు జరుపుతున్నారు. కేసును నీరుగార్చేందుకు ఎలా వ్యవహరించాలన్న దానిపై సూచనలు చేశారు. కేసును ఇప్పటికే అరెస్టయిన ఇద్దరికే పరిమితం చేయాలన్నది వ్యూహం. గుంటూరు జిల్లాలోనే రూ.60 కోట్లు విలువైన నకిలీ మందులు మార్కెట్లోకి పంపిణీ చేసినట్లు సోదాల్లో వెల్లడైంది. కానీ, ఇంతవరకు మార్కెట్ నుంచి ఆ నకిలీ మందులను వెనక్కి రప్పించాలన్న ధ్యాస కూడా ఆ ఉన్నతాధికారికి లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ మందుల వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది, మందుల ఏజెన్సీలు, దుకాణదారుల వరకూ అందరినీ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. -
నకిలీ.. మందుల మకిలి!
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని మందుల(ఔషదం) దుకాణాల్లో నకిలీ మందులు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. బ్రాండెడ్ మందులపై ప్రజలకున్న నమ్మకాన్ని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. బ్రాండెడ్ కంపెనీల మందులను పోలి ఉండేలా తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్నారు. నకిలీ గుట్టు ఇలా వెలుగులోకి... జాన్సన్ కంపెనీ తమ ఉత్పత్తి అల్ట్రాసెట్ అనే మాత్రల అమ్మకాలు కొన్ని నెలల నుంచి తగ్గినట్లు గుర్తించింది. అయితే వారి పరిశోధనలో తమ ఉత్పత్తులను పోలి ఉండే నకిలీ మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కాపీరైట్ యాక్ట్ కింద విజయవాడ పోలీస్ కమిషనర్ గత నెల 28న ఫిర్యాదు చేశారు. విచారణలో నంద్యాలకు చెందిన అన్నదమ్ములు గూడూరు పృథ్వీతేజ, గూడూరు చరణ్‌తేజ దందా చేస్తున్నట్లు తేలింది. ఈ మేరకు అధికారులు ఈ నెల 2న నంద్యాలకు వచ్చి చరణ్‌తేజ్‌ను అదుపులో తీసుకుని ప్రశ్నించారు. ఢిల్లీలోని ప్రేమ్‌జీ ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తున్న రామాషిష్శర్మ నుంచి నకిలీ మందులు కొనుగోలు చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఇప్పటిదాకా విజయవాడలో దుర్గా ఏజెన్సీ ద్వారా అధికారులు రూ.60 లక్షల విలువ జేసే నకిలీ అల్ట్రాసెట్ మాత్రలను విక్రయించినట్లు తెలుసుకున్నారు. అల్ట్రాసెట్ మాత్రమే గాకుండా మరో ఏడు రకాల బ్రాండెడ్ మందులు మార్కెట్ చేసినట్లు తేలింది. వాటితో భారీ లాభాలు... సాధారణంగా బ్రాండెడ్ కంపెనీల మందులపై రిటైలర్లకు తక్కువ లాభాలు వస్తాయి. నకిలీ మందులు విక్రయిస్తే భారీ లాభాలు వస్తాయి. ఈ విషయం తెలిసి జిల్లాలోని పలువురు డీలర్లు, ఏజెన్సీలు, రిటైలర్లు నకిలీ మందుల విక్రయాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. అధికారులు నిరంతరం దాడులు నిర్వహిస్తే అధిక మొత్తంలో నకిలీ మందులు బయటపడే అవకాశం ఉంది. నకిలీ మందులు స్వాధీనం చేసుకుంటున్నాం జిల్లాలో 8 రకాల బ్రాండెడ్ కంపెనీలను పోలి ఉండే నకిలీ మందులను గుర్తించాం. మొత్తం 12 దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. నకిలీ మందులు విక్రయించే వారిపై డ్రగ్స్‌అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తాం. నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల నుంచి జీవితఖైదు, రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నకిలీ మందులకు సంబంధించి జిల్లా నోడల్ ఆఫీసర్‌గా ఎస్.విజయకుమార్ నియమితులయ్యారు. – చంద్రశేఖరరావు, ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నకిలీ మాత్రల్లో ఔషధమే లేదు అల్ట్రాసెట్ మాత్రలను నొప్పుల నివారణకు వాడతారు. ఇందులో పారాసిటమాల్ 325 ఎంజీ, ట్రమడాల్ 37.5 ఎంజీ ఉండాలి. కానీ నకిలీ మాత్రల్లో ట్రమడాల్ మందు లేనేలేదు. పారాసిటమాల్ కూడా 200 ఎంజీ ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. పాంటాసిడ్లో కూడా ప్యాంటాప్రొజోల్ మందు అసలే లేదు. కేవలం సుద్దముక్కను మాత్రలుగా తయారు చేసి మార్కెట్లోకి వదిలేశారు. జిల్లాలోని పలు మందుల దుకాణాల్లో ప్రస్తుతం అల్ట్రాసెట్(జాన్సన్ కంపెనీ)తో పాటు పాంటాసిడ్ డీఎస్ఆర్, పాంటాసిడ్ 40, పాంటాసిడ్, కౌమోరల్ ఫోర్ట్, షెల్కాల్ 500, స్కిన్లైట్, యుడిలివ్ 300 మాత్రలు చెలామణిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
ఆయుర్వేదం.. అల్లోకల్లోలం
నకిలీ మందుల గుట్టురట్టు – అల్లోపతి మందులతో ఆయుర్వేద మందుల తయారీ – భారీగా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ స్వాధీనం – విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ దాడులు ఆయుర్వేదంపై ప్రజలకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని అల్లోపతి మందులను కలిపి మోసగిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇలా చేస్తే దీర్ఘకాలం కిడ్నీ వ్యాధుల బారిన పడతారనే ఆలోచన మరిచి యథేచ్ఛగా జనానికి అంటగట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఈ వ్యవహారం బట్టబయలయింది. కర్నూలు(హాస్పిటల్): తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పవనపు శ్రీనివాసులు అనే వ్యక్తి కొన్నేళ్లుగా స్థానిక వెంకటరమణకాలనీలో నివాసం ఉంటున్నాడు. మొదట్లో కల్లూరు ఎస్టేట్స్‌లో ఎవాన్ అనే పేరుతో మినరల్ వాటర్ కంపెనీ స్థాపించి కొన్నాళ్ల పాటు నిర్వహించాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్స్ రంగంలో కొన్నాళ్లు వ్యాపారం చేశాడు. అనంతరం ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు వైద్యనాథ్ అనే కంపెనీని స్థాపించాడు. ఆరేళ్ల క్రితం వెంకటరమణ కాలనీలోని మెయిన్ రోడ్డులో క్లీనిక్ ఏర్పాటు చేసి ప్రముఖ నటుడు చంద్రమోహన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయుర్వేద మందులను ప్రారంభించాడు. షుగర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, అధిక బరువు తగ్గిస్తామంటూ ప్రకటనలు గుప్పించాడు. ఈ మేరకు టీవీ యాంకర్లచే ప్రచారం చేసుకున్నాడు. అల్లోపతి మందులతో ఆయుర్వేద పొడులు, గుళికలు ఆయుర్వేదంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆసరగా చేసుకుని శ్రీనివాసులు భారీ పథకాన్ని రచించాడు. హైదరాబాద్ నుంచి ఆయుర్వేద చూర్ణాలను, కర్నూలులోని రంగ మెడికల్ ఏజెన్సీస్, రెడ్డి మెడికల్ ఏజెన్సీల నుంచి భారీగా బిల్లులు లేకుండా బెటామెటాసోన్, డెక్సామెటాసోన్, డైక్లోఫెనాక్, పారాసీటమాల్ జనరిక్ మందులను భారీగా కొనుగోలు చేసేవాడు. అల్లోపతి, ఆయుర్వేద చూర్ణాలను గ్రైండర్లో వేసి మెత్తగా చేసి.. వాటిని ఒక యంత్రం ద్వారా సన్నటి గోళీలను తయారు చేసి అద్దెకు తీసుకున్న గదిలో ఆరబెడతాడు. ఇలా ఎండిన గుళికలను ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాలలో వేసి అందమైన్ లేబుళ్లతో ప్యాకింగ్ చేస్తాడు. వీటిని కర్నూలు జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకినాడు, నిడదవోలు, రావులపాలెం, పెద్దాపురం, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లోని పల్లెలకు పంపించి విక్రయిస్తాడు. ప్రతి నెలా ఒక్కో ప్రాంతానికి ఒక సుమో మందులను తరలిస్తాడని అధికారులు గుర్తించారు. భారీ ఎత్తున మందులు స్వాధీనం నగర శివారులోని శిల్పా సింగపూర్ టౌన్‌షిప్‌కు వెళ్లేదారిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శ్రీనివాసులు నకిలీ మందుల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. విషయాన్ని తెలుసుకున్న రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బాబూరావు నేతృత్వంలో సీఐ జగన్మోహన్రెడ్డి, ఎస్ఐ సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు మునిస్వామి, ఈశ్వరరెడ్డి, నాగభూషణంలు కలిసి ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఒ.కుమార్, ఏడీ చంద్రశేఖరరావు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబీద్ అలి, విజయలక్ష్మి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఒక గదిలో నువ్వుల నూనె డబ్బాలు, మరో గదిలో ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు, ఆయుర్వేద చూర్ణాలు, ఇంకో గదిలో స్టెరాయిడ్, పెయిన్‌కిల్లర్ మందులు, హాలులో మందులను పిండి ముద్ద చేసేందుకు గ్రైండర్, ముద్దను గోళీలుగా మార్చే మరో యంత్రాన్ని అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని నిందితులు శ్రీనివాసులుపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ బాబూరావు తెలిపారు. ఆయుర్వేద మందులను తాము తప్పు పట్టడం లేదని, నిపుణులైన అర్హులైన ఆయుర్వేద వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలని ఆయన చెప్పారు. నకిలీ మందులతో కిడ్నీజబ్బులు స్టెరాయిడ్స్, పెయిన్కిల్లర్లు కలిపి తయారు చేసిన ఆయుర్వేద మందులను వాడిన వారికి తప్పనిసరిగా కిడ్నీ జబ్బులు వస్తాయని ఔషధ నియంత్రణ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ అలి, విజయలక్ష్మి చెప్పారు. కిడ్నీలు పాడై డయాలసిస్‌కు వెళ్తున్న ఎందరో రోగులు ఇలాంటి మందులు వాడిన వారేనన్నారు. దీంతో పాటు కాలేయం దెబ్బతింటుందని, బరువు పెరుగుతారని, హార్మోన్ల అసమతుల్యత సమస్య ఏర్పడుతుందన్నారు. స్టెరాయిడ్స్‌ను అల్లోపతి వైద్యులే రాయడానికి జంకుతారని, కానీ శ్రీనివాసులు అనే వ్యక్తి యథేచ్ఛగా వాటిని కొని ఆయుర్వేద మందుల్లో కలిపి విక్రయించడం దారుణమన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.