జిల్లాలో నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో, విదేశీ పర్యటనలపై మోజుతో నాసిరకం మందులను రోగులకు రాసిస్తున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, ఇతర పట్టణాల్లో ఈ దందా కొనసాగుతోంది. కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు కూడా నకిలీ మందులతో జీరో బిజినెస్ చేస్తున్నారు. దీనివల్ల ఒకవైపు రోగులకు నష్టం జరగడంతో పాటు మరో వైపు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది.
సాక్షి , కర్నూలు : రాయలసీమలో అత్యధికంగా మెడికల్ ఏజెన్సీలు ఉన్న ప్రాంతం కర్నూలు జిల్లా. ఇందులో కొన్ని ఏజెన్సీలు నకిలీ ఔషధ దందా సాగిస్తున్నాయి. కాంట్రాక్టు బేసిస్ మెడిసిన్ పేరుతో ఈ దందా సాగుతోంది. ఏజెన్సీలతో పాటు మందుల తయారీ కంపెనీలు కొన్ని నేరుగా వైద్యులతో సంబంధాలు పెట్టుకుని, వారు నడుపుతున్న ఆస్పత్రులకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నాయి.
వీటికి ఎలాంటి బిల్లులు ఉండవు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల నకిలీ మందులనే రాసిస్తున్నారు. ప్రతి ఫలంగా భారీ పర్సెంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం డ్రగ్ కంట్రోల్ అధికారులకు తెలిసినా కాసుల కక్కుర్తితో దుకాణాలపై దాడులు చేయడం లేదు.
భారీ నజరానాలు
కాంట్రాక్ట్ బేసిస్ మందులు సిఫారసు చేసినందుకు డాక్టర్లకు కంపెనీ ప్రతినిధులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.లక్ష వరకూ ముట్టజెబుతున్నారు. అలాగే ఖరీదైన బహుమతులు అందజేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు థాయ్‌లాండ్, దుబాయ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ పర్యటనలకు పంపుతున్నారు.
అలాగే దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సమావేశాల పేరుతో స్టార్ హోటళ్లలో విందులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల అండ కోసం కంపెనీలు ఇంత భారీగా వ్యయం చేస్తున్నాయంటే వారికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవసరార్థం వచ్చే రోగుల నుంచి మెడికల్ కంపెనీలు అడ్డగోలుగా దండుకున్న సొమ్మునే ఇలా ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది.
సంగారెడ్డి, మెదక్ నుంచి సరఫరా
నకిలీ మందులు ఎక్కువగా సంగారెడ్డి, మెదక్ కేంద్రంగా కర్నూలు జిల్లాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో డ్రగ్స్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో నకిలీ మందులు తయారు చేసి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మందులు వాడటం వల్ల రోగులకు కొత్తగా ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. ఆరోగ్యానికి హానికరం కాని పౌడర్లను ఉపయోగించి తయారుచేస్తుండడమే ఇందుకు కారణం.
ఈ నకిలీ మందుల తయారీకి అయ్యే ఖర్చు తక్కువ. కానీ ఎమ్మార్పీ మాత్రం భారీగా ఉంటుంది. ఈ మందులు వాడితే రోగికి ఉన్న జబ్బు నయం కాదు. పైగా మరింత ముదిరి రోగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది.
నకిలీ మందులు ఇవిగో..
నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో ‘ఎ...ఆ...’అనే రెండురకాల కంపెనీల పేర్లతో ఉన్న మందులు అంటగడుతున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్‌న్‌స్థానంలో ఓ..సె.., ఆ.. పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రిజోల్ స్థానంలో ‘ ఫా’ పేరుతో ఉండే మరో మూడు రకాల నకిలీ మందులను రాసిస్తున్నారు. ఇలా చాలా రకాల నకిలీ మందులు మెడికల్ స్టోర్ల నుంచి రోగులకు చేరుతున్నాయి.
వీటిపై లాభాల శాతం అధికంగా ఉంటోంది. దీంతో మందుల దుకాణ యజమానులు భారీగా దండుకుంటున్నారు. ఇందులో కొంత పర్సెంటేజీ వైద్యులకు ముట్టజెప్పుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేసిన వారు ఆస్పత్రి కరెంటు బిల్లు, ఇతర ఖర్చులను కూడా భరిస్తున్నారు. రుగ్మతలతో డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను డాక్టర్లు, మెడికల్‌స్టోర్ నిర్వాహకులు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రం చర్యలు తీసుకోకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment