భోపాల్: కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. వ్యాక్సిన్ కొరతను కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వ్యాక్సిన్ మాటున గ్లూకోజ్ నీళ్లు నింపి అత్యధిక ధరకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. నకిలీ వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నకిలీ వ్యాక్సిన్ ప్రజల ప్రాణానికే ప్రమాదంగా మారింది. మధ్యప్రదేశ్‌లో నకిలీ వ్యాక్సిన్ వేసుకోవడంతో పది మంది మృతి చెందారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అంత మంది మృతి చెందడంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ఆదేశాల మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తు చేపట్టగా.. రెమిడిసివర్ వ్యాక్సిన్ పేరుతో గ్లూకోజ్ నింపిన బాటిళ్లను ఓ ముఠా విక్రయిస్తోందని మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఆ మందు కొని వేసుకున్న ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని తేలింది. అయితే ఆ వ్యాక్సిన్ వేసుకున్న వారు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలుసకుని షాకయ్యారు. అలా పది మంది మృతి చెందారని తెలియడంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. విచారణ క్రమంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ముంబై నుంచి ఖాళీ సీసాలను తీసుకొచ్చి వాటిలో గ్లూకోజ్ వాటర్ నింపి దానికి నకిలీ రెమిడిసివర్ అనే పేపర్ అంటించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఈ ముఠాకు చెందిన వారు నిలబడి వ్యాక్సిన్ బ్లాక్‌లో అమ్ముతున్నారు. అత్యవసరం కావడంతో ప్రజలు వారి నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ ముఠా ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 1,200 (ఇండోర్‌లో 700, జబాల్‌పూర్ 500) విక్రయించారు.
అయితే మే 1వ తేదీన గుజరాత్‌లో ఈ ముఠా ఆగడాలు బయటపడ్డాయి. అక్కడి పోలీసుల సమాచారంతో మధ్యప్రదేశ్ పోలీసులు వీరి గుట్టు రట్టు చేశారు. ‘ఈ రాకెట్‌ను బట్టబయలు చేస్తాం. దీనిలో ఉన్న చివరి వ్యక్తిని అరెస్ట్ చేసేదాక దర్యాప్తు కొనసాగుతుంది’ అని ఇండోర్ ఐజీ హరినారాయణ్ చారి మిశ్రా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో దాదాపు 90శాతం నకిలీ రెమిడిసివర్ వ్యాక్సిన్ లభించిందని గుర్తించారు.
జబాల్‌పూర్‌లోని ఓమ్తి పోలీస్‌స్టేషన్‌లో నిందితులు జరాబ్జిత్ సింగ్, సపన్ జైన్, దేవేశ్‌లపై కేసులు నమోదయ్యాయి. ఈ ముఠానే నకిలీ మందుల రాకెట్ నడిపిస్తున్నట్లు భావిస్తున్నారు. గుజరాత్ నుంచి ఈ ముఠా వ్యవహారం నడుస్తోందని గుర్తించారు. అక్కడి పోలీసుల సహాయం కూడా మధ్యప్రదేశ్ పోలీసులు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ కొనేముందు జాగ్రత్తలు తీసుకోవాలని, బ్లాక్‌లో కొనుగోలు చేయొద్దని స్పష్టం చేశారు.
చదవండి: శభాష్ చౌహన్‌జీ.. దేశానికి మార్గం చూపారు
చదవండి: రేషన్ బియ్యం: బస్తాకు 4 నుంచి 11 కిలోల తక్కువ
Comments
Please login to add a commentAdd a comment