సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లతో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తిందని ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలపై పోరాడుతున్న వైద్య బృందం ఆరోపించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రభావంపై మెడికల్ క్రైసెస్ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది.
ఇందులో భాగంగా డాక్టర్ గాయత్రి పండిట్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను వివరించారు. ‘‘ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిపడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలోని యెల్లోకార్డ్ సిస్టం, ఆస్ట్రేలియన్ అడ్వర్స్ ఈవెంట్ మానిటరింగ్ సిస్టం, యూరప్‌లోని యుడ్రా విజిలెన్స్ సిస్టంలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీజీ యాక్సిస్ డేటాబేస్ ద్వారా మేం గణాంకాలను సేకరించి పరిశీలించాం.
ఆ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల (కోటీ 10 లక్షల) మంది కోవిడ్ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలకు లోనయ్యారు. అందులో సుమారు 70 వేల మంది వ్యాక్సినేషన్ తదనంతర కారణాలతోనే చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెప్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..’’ అని వైద్యుల బృందం పేర్కొంది. తక్షణమే కోవిడ్ వ్యాక్సినేషన్లను నిలిపివేసి, వాటిద్వారా తలెత్తిన దుష్ప్రభావాలను గుర్తించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
34 దేశాల ప్రతినిధుల మద్దతు
కోవిడ్ వ్యాక్సినేషన్‌తో అంతర్జాతీయ వైద్య సంక్షోభం (ఇంటర్నేషనల్ మెడికల్ క్రైసెస్) తలెత్తుతోందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా తయారు చేసి, అతి తక్కువ కాలంలో క్లినికల్ ట్రయల్స్ జరిపి.. ప్రజలకు అందించారని.. ఈ క్రమంలో వ్యాక్సిన్ల దీర్ఘకాలిక ప్రభావాల సంగతిని తేల్చలేదని వివరించింది.
వ్యాక్సిన్ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత అనారోగ్యాల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాలను కోరింది. అన్ని కోవిడ్ వ్యాక్సిన్లపై లోతుగా పరిశీలన జరిపి.. మాలిక్యులర్, సెల్యులార్, బయోలాజికల్ ప్రభావాలను తేల్చాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment