రాకేష్ వర్మ అలియాస్ బల్లా
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు రాకేష్ వర్మ అలియాస్ బల్లా.. చదివింది కేవలం పదో తరగతి.. తండ్రి నుంచి ‘వారసత్వంగా’ ఆయుర్వేద వైద్యుడిగా మారాడు.. అసలు ఆయుర్వేద మందులు ఖరీదు కావడంతో నకిలీవి తయారు చేసి ఇవ్వడం మొదలెట్టాడు.. క్యాన్సర్, పక్షవాతం సహా ప్రాణాంతక వ్యాధులకూ వైద్యం చేస్తానంటూ అందినకాడికి దండుకుంటున్నాడు... ఈ ఘరానా మోసగాడిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. హర్యానాకు చెందిన బల్లా పదో తరగతిలో చదువుకు స్వస్థి చెప్పాడు. తండ్రి రామ్‌గోపాల్ వర్మ నుంచి ఆయుర్వేద వైద్యం చేయడం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళ పాటు హర్యానాలోనే ఈ వృత్తి కొనసాగించాడు. ఎనిమిదేళ్ళ క్రితం ఇతడికి వివాహం కావడంతో పాటు ఇద్దరు పిల్లలు పుట్టారు. దీంతో ఖర్చులు పెరిగి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాడు. ఇతడి సోదరిని కొన్నేళ్ళ క్రితం చార్మినార్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.
ఇలా నగరంతో సంబంధం ఏర్పడిన బల్లా తరచూ ఇక్కడకు వచ్చి చార్మినార్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేయడం, ఆయుర్వేద వైద్యుడినంటూ ప్రచారం చేసుకోవడం మొదలెట్టాడు. లాడ్జికి వచ్చిన రోగులకు కొన్నాళ్ళ పాటు నిజమైన ఆయుర్వేద మందులే ఇచ్చాడు. అవి ఖరీదు ఎక్కువ కావడం, తనకు గిట్టుబాటు కాకపోవడంతో తానే నకిలీ ఆయుర్వేద మందులు తయారు చేసి ఇవ్వడం మొదలెట్టాడు. ఓ దశలో క్యాన్సర్, పక్షవాతం, పటుత్వంతో పాటు అనేక ప్రాణాంతక వ్యాధులకు వైద్యం చేస్తానంటూ అనేక మందిని నమ్మించాడు. వివాహితులకు మగ పిల్లలు పుట్టేందుకు తన వద్ద మందులు ఉన్నాయంటూ అంటగట్టాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇంగ్లీషు మందులు ఇవ్వడం, ఇంజెక్షన్లు చేయడం కూడా చేస్తున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడంతో కుల్సుంపురం, చార్మినార్, హుస్సేనిఆలం ఠాణాల్లో బల్లాపై కేసులు నమోదయ్యాయి. వీటిలో వాంటెడ్‌గా ఉండటంతో పోలీసులకు చిక్కుతాననే భయంతో సిటీలో మకాం మార్చాడు.
పాతబస్తీకి బదులుగా అమీర్‌పేట, ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం ప్రాంతాల్లో ఉన్న లాడ్జిల్లో ఉంటూ రోగుల్ని ఫోన్ చేసి పిలిపించుకుని వైద్యం చేస్తున్నాడు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారి నుంచి కనిష్టంగా రూ.50 వేలు, గరిష్టంగా రూ.లక్ష వసూలు చేస్తున్నాడు. బల్లా వ్యవహారాలపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి వారం రోజుల పాటు వలపన్నారు. శుక్రవారం నగరానికి వచ్చిన బల్లాను పట్టుకుని ఇతడి నుంచి నకిలీ ఆయుర్వేద మందులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని కుల్సుంపుర పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment