నిందితుడు ఉమేష్
సాక్షి, సిటీబ్యూరో: ఔషధాల తయారీకి అవసరమైన ముడి సరుకులను అక్రమంగా తరలించి, నిల్వ చేసిన గోదాంపై రాచకొండ పోలీసులు దాడులు చేసి నిందితుడిని పట్టుకున్నారు. రూ.కోటి విలువ చేసే గడువు ముగిసిన 11 వేల కిలోల ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్‌ఓటీ) ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
● గుజరాత్‌కు చెందిన ఉమేష్ బాబూలాల్‌కు నగరంలోని కొత్తపేట ఫణిగిరి కాలనీలో డ్రగ్ ఇండియా మహావీరే పేరుతో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. చైతన్యపురి ఠాణా పరిధిలోని మారుతీనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గోదాం ఏర్పాటు చేశాడు. ఔషధాల తయారీలో వినియోగించే ముడి సరుకులను కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా దిగుమతి చేసుకొని గోదాంలో నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, ఉప్పల్ డ్రగ్ అధికారులు గోదాంపై దాడులు చేశారు. డిక్లోఫెనాక్ సోడియం, పారాసెటమాల్, నికోటినామైడ్, ఆస్కార్బిక్ ఆమ్లం, నియాసినామైడ్, ఎసిటమైనోఫెన్, ఆల్బెండజోల్‌తో పాటు గడువు ముగిసిన క్రాస్కార్మెలోస్ సోడియం, మైక్రో క్రైస్టలైన్ సెల్యులోజ్, డై కాల్షియం ఫాస్పేట్, కేవా ఫ్లేవర్స్, ఫెర్రస్ సల్ఫేట్, మెగ్నీషియం స్టిరేట్, స్టార్చ్, డ్రై అల్యూమినియం హైడ్రాకై ్సడ్ జెల్, లైసిన్ ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉమేష్‌ను అరెస్టు చేసి డగ్స్ కంట్రోల్ అధికారులకు అప్పగించారు.
ఎవరికి విక్రయించేందుకు?
నిందితుడు ఉమేష్‌ను పోలీసులు విచారించగా.. స్థానికంగా ఔషధ తయారీ సంస్థలకు విక్రయించేందుకే ఈ ముడి సరుకులను దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. గత పదేళ్లుగా ఈ దందా నిర్వహిస్తుండటంతో నిందితుడి నెట్‌వర్క్ భారీగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. కొన్ని ముడి సరుకులకు ఎలాంటి లేబుల్ లేకపోవటంతో పాటు పౌడర్ రూపంలో ఉన్నాయి. వీటిలో మత్తు పదార్థాలు ఉండొచ్చని అనుమానించిన పోలీసులు పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పోలీసులు స్వాధీనం వాటిల్లో 2019లో గడువు ముగిసిన ముడి సరుకులు కూడా ఉండటం గమనార్హం.
డ్రగ్స్ కంట్రోల్ ఎక్కడ?
నగర శివారు ప్రాంతాలలో మందులను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న మెడికల్ షాపులు, ఔషధ తయారీ సంస్థలు, ముడి సరుకుల సరఫరాలపై నిఘా ఉంచాల్సిన డ్రగ్ కంట్రోల్ విభాగం నిద్ర మత్తులో జోగుతుండటంతో అక్రమార్కుల ఆగడాలు కొనసాగుతున్నాయి. పోలీసుల తనిఖీలకు చిక్కకుండా లారీలు, ట్రక్‌లలో తరలిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా పండ్లు, కూరగాయలు, దాణా వంటి ఇతరత్రా ఉత్పత్తుల మాటున ఈ ముడి సరుకుల సంచులను ఉంచి, అక్రమంగా సరఫరా చేస్తున్నారు. కాటేదాన్, పాశమైలారం, బాలానగర్, ఉప్పల్ వంటి పారిశ్రామిక వాడలలో మూతపడిన కంపెనీలు, చిన్నాచితకా ఫార్మా కంపెనీలలో అక్రమంగా నకిలీ మందులను తయారు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment