ఔషధం..గరళం | Fake Medicines In Government Hospitals | Sakshi
Sakshi News home page

ఔషధం..గరళం

Published Fri, Mar 30 2018 11:41 AM | Last Updated on Fri, Mar 30 2018 11:41 AM

Fake Medicines In Government Hospitals - Sakshi

నాణ్యతలేని అమాక్సీ క్లావనేట్‌ మాత్రలు

ఏదైనా అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మందులు తీసుకున్నారా..? వాళ్లిచ్చిన మందులు వాడినా ఏమాత్రం అనారోగ్యం తగ్గలేదా..అయితే మీకిచ్చినవి నాసిరకం మందులేమో ఓ సారి పరిశీలించుకోండి. నాణ్యతా పరీక్షలు పూర్తికాకుండానే బడా ఫార్మాసూటికల్‌ కంపెనీలు పంపే నాసిరకం మందులను నేరుగా వైద్యశాలలకు పంపిణీ చేసి రోగులకు ఇచ్చేస్తున్నారు. ఒంగోలు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పంపిన ల్యాబ్‌ తనిఖీల్లో ఈ నాసిరకం మందుల బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఒంగోలు సెంట్రల్‌: ప్రభుత్వ వైద్యశాలల్లో నాసిరకం మందులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నాసిరకం మందులు తయారు చేస్తున్న మందుల కంపెనీలు రాష్ట్ర స్థాయిలో మందుల సరఫరాకు కమీషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందుతున్నాయి. గతంలో కంపెనీలు మందులను సరఫరా చేసిన అనంతరం రాష్ట్ర స్థాయిలోనే నాణ్యతాపరీక్షలకు పంపించే వారు. ఆ పరీక్షలలో నాణ్యమైన మందులు అని తేలితేనే జిల్లాలకు పంపించేవారు. అయితే నాలుగేళ్లుగా జిల్లాలకు పంపించి, అక్కడ నుంచి మందుల నాణ్యతకు ల్యాబొరేటరీలకు పంపుతున్నారు. ఈ సమయాన్నే క్వారన్‌టైమ్‌ అంటారు. అయితే మందులకు సంబంధించిన నాణ్యతా నివేదికలు రాకుండానే మందులు క్షేత్ర స్థాయిలో అయిపోతుండటంతో విడుదల చేస్తున్నారు. దీంతో మందులు వాడిన తర్వాత నాణ్యతా పరీక్షలలో మందుల కంపెనీలు నిలబడటంలేదు. అయితే అప్పటికే మందులను దాదాపు పూర్తి స్థాయిలో రోగులు వినియోగిస్తున్నారు.

ఒంగోలు డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌ కొన్ని రకాల మందులను ఈ మధ్య కాలంలో నాణ్యతా పరీక్షల కోసం ల్యాబొరేటరీలకు పంపించారు. ఈ పరీక్షలలో చాలా వరకూ కంపెనీలు నెగ్గలేదు. పైగా కొన్ని కంపెనీలు సెంట్రల్‌ ల్యాబొరేటరీలకు తమ మందులను పంపినా అక్కడ కూడా నెగ్గలేదు. దీంతో ఇటువంటి నాణ్యతా లోపం ఉన్న మందులను సరఫరా చేసిన కంపెనీలపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.

అమాక్సీ క్లావనేట్‌:ఇది యాంటి బయోటెక్‌ ఈ మందును అనేక రోగాలకు, జ్వరాలకు వైద్యులు విరివిగా వాడుతుంటారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కువగా వాడే రెండు, మూడు రకాల యాంటి బయోటెక్‌ లలో దీనిది రెండో స్థానం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తదితర కారణాలతో వచ్చే జ్వరాలకు వాడుతుంటారు.

ఇంతటి ముఖ్య అవసరమైన ఈ యాంటిబయోటెక్‌ను ఈ మధ్య కాలంలో స్టాండార్ట్‌ ఫార్మస్యూటికల్స్‌ అనే కోల్‌కతాకు చెందిన కంపెనీ సరఫరా చేసింది. ఈ కంపెనీ బ్యాచ్‌ నెంబర్‌ సిఎల్‌ఎండీ 743 కింద 1,90,000ల ట్యాబ్లెట్‌లను సరఫరా చేసింది. అయితే కంపెనీ తయారు చేసిన ఈ మందుల నాణ్యతపై అధికారులకు అనుమానం రావడంతో ఒంగోలు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ మందులను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీలకు పంపించారు. అక్కడ నాణ్యత లేనట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై కంపెనీకి నోటీసులు ఇవ్వడంతో కంపెనీ సెంట్రల్‌ ల్యాబొరేటరీకి నాణ్యత పరీక్షల కోసం పంపగా అక్కడ కూడా మందులు నాణ్యత లేవన్నట్లు నివేదిక వచ్చింది. దీంతో అధికారులు సదరు కంపెనీపై ఒంగోలు కోర్టులో కేసు నమోదు చేశారు. అయితే కంపెనీ సరఫరా చేసిన లక్షా తొంభైవేల మాత్రలను అధికారులు నివేదికలు రాకుండానే పీహెచ్‌సీలకు, ప్రాంతీయ వైద్యశాలలకు పంపించారు.  అక్కడి వైద్యులు రోగులకు కూడా వాడారు. మిగిలిన 1800 మాత్రలను మాత్రమే వెనక్కి తెప్పించారు. ఇటువంటి నాసిరకం మందులు వాడటంతో చాలా మందికి రోగం నయం కావడంలేదు. పైగా ఎక్కువ శక్తివంతమైన యాంటిబయోటెక్‌లను వాడాల్సి వస్తుంది.

హైయోసిన్‌ బ్యుటైల్‌ బ్రొమైడ్‌–బుస్కొపాన్‌:హైయోసిన్‌ బ్యుటైల్‌ బ్రొమైడ్‌ దీన్నే బుస్కోపాన్‌ అని కూడా అంటారు. ఈ మందును రోగులకు అనేక తీవ్రమైన నొప్పులకు వాడతారు. ఇది ఖరీదు కూడా తక్కువగానే ఉంటుంది. అరియన్‌ హెల్త్‌ కేర్‌ అనే కంపెనీ ఈ మందులను ఎస్‌7005 సరఫరా చేసింది. అయితే ఈ కంపెనీ తయారు చేసిన మందులు కుడా నాణ్యతా పరీక్షలలో విఫలమయ్యాయి. అయితే మందులను వైద్యశాలలకు సరఫరా చేయలేదు. వీటిని వెనక్కి పంపించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి

ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ సిరప్‌:ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ ఈ మందును రక్తహీనతకు వాడతారు. ముఖ్యంగా మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుంటారు. దీంతో ఈ మందును ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. రక్త హీనతతోనే ఎక్కువ మంది గర్భిణులు కాన్పు సమయంలో మరణిస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన ఔషధంలో నాణ్యత లేదు. గత నెలలో ఈ మందులను ర్యాడికో రెమిడీస్‌ అనే కంపెనీ సరఫరా చేసింది. అయితే అప్పటికే క్షేత్ర స్థాయిలో చాలా మందులను వినియోగించారు. మిగిలిన 550 బాటిళ్ల సిరప్‌ను మాత్రమే వెనక్కి తెప్పించారు. స్థానిక బాలాజీ నగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో మందులు నాణ్యత లేనివిగా అధికారులు గుర్తించి, కేసులు నమోదు చేశారు.

అసిటైల్‌ శాల్సిలిక్‌ యాసిడ్‌–ఆస్పిరిన్‌:ఈ మందును అర్ధరైటిస్‌ ద్వారా వచ్చే జ్వరాలకు, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించేందుకు, అదేవిధంగా ఇతర జ్వరాలకు వాడుతుంటారు. అయితే ఈ మందును ల్యాక్‌కెమ్‌కో అనే కంపెనీ సరఫరా చేసింది. ఈ కంపెనీ 64 వేల మందులను సరఫరా చేసింది. ఈ కంపెనీ సరఫరా చేసిన మందులు నాణ్యత లేనట్లుగా పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు ఈ మందులను వెనక్కి తెప్పిస్తున్నారు.ఇలా అనేక రకాల మందులు క్షుణ్ణంగా పరిశీలిస్తే నాణ్యత లోపం బయటపడే అవకాశం ఉంది. కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అధికారులు ఇటువంటి మందులను సరఫరా చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement