సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మందుల మాఫియా కేసును ప్రభుత్వం వ్యూహాత్మకంగా నీరుగారుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత కుటుంబాన్ని కాపాడడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేసు దర్యాప్తు ప్రక్రియ నుంచి పోలీసు యంత్రాంగాన్ని దాదాపుగా తప్పించారు. విచారణ అధికారిగా ఉన్న ఔషధ నియంత్రణ విభాగం అధికారి పాత్రను నామమాత్రం చేశారు. కీలక నేత కుటుంబానికి సన్నిహితుడైన ఓ ఉన్నతాధికారికి ఈ కేసు బాధ్యతను అప్పగించారు.
ఈ కేసు మీరు చూడొద్దు: గుంటూరు జిల్లా నరసరావుపేట కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన నకిలీ మందుల మాఫియా కేసును పక్కాగా పక్కదారి పట్టిస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. వాస్తవానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ దందా వెలుగులోకి వచ్చింది. అనంతరం విజయవాడ, గుంటూరులో నిర్వహించిన సోదాల్లో నకిలీ మందుల బాగోతం బట్టబయలైంది. కానీ, కేసు దర్యాప్తు కీలక దశలో ఉండగా విజయవాడ, గుంటూరు పోలీసుల పాత్రను దాదాపు లేకుండా చేసేశారు. ‘‘ఈ కేసును ఔషధ నియంత్రణ శాఖ చూసుకుంటుంది. మీరు జోక్యం చేసుకోవాల్సిన పని లేదు’’ అంటూ ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో గుంటూరుకు చెందిన ఔషధ నియంత్రణ మండలి అధికారిని కొనసాగిస్తూనే ఆయన పాత్రను నామమాత్రం చేసేశారు. ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండాపోవడం గమనార్హం.
అంతా ఆయనే చూస్తారట...: నకిలీ మందుల దర్యాప్తు కేసులో పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను గుంటూరులో ఉండే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారికి అప్పగించారు. ఆయన గతంలో గుంటూరు జిల్లా పోలీసు శాఖలో పనిచేసినప్పటి నుంచి కీలక నేత కుటుంబానికి సన్నిహితుడు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఇతర శాఖలో ఉన్న ఆయనకే నకిలీ మందుల కేసును అప్పగించడం గమనార్హం. అందుకు తగ్గట్లుగానే ఆయన నడుచుకుంటున్నారు. ఈ కేసులో కీలకమైన నకిలీ మందుల పంపిణీదారులతో సమాలోచలు జరుపుతున్నారు. కేసును నీరుగార్చేందుకు ఎలా వ్యవహరించాలన్న దానిపై సూచనలు చేశారు. కేసును ఇప్పటికే అరెస్టయిన ఇద్దరికే పరిమితం చేయాలన్నది వ్యూహం. గుంటూరు జిల్లాలోనే రూ.60 కోట్లు విలువైన నకిలీ మందులు మార్కెట్‌లోకి పంపిణీ చేసినట్లు సోదాల్లో వెల్లడైంది. కానీ, ఇంతవరకు మార్కెట్ నుంచి ఆ నకిలీ మందులను వెనక్కి రప్పించాలన్న ధ్యాస కూడా ఆ ఉన్నతాధికారికి లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ మందుల వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది, మందుల ఏజెన్సీలు, దుకాణదారుల వరకూ అందరినీ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment