‘కృష్ణపట్నం’ తగాదా తేలిగ్గా తేలేదా?!  | ABK Prasad Article On Ayurveda And Allopathy | Sakshi
Sakshi News home page

‘కృష్ణపట్నం’ తగాదా తేలిగ్గా తేలేదా?! 

Published Tue, May 25 2021 12:59 AM | Last Updated on Tue, May 25 2021 4:01 AM

ABK Prasad Article On Ayurveda And Allopathy - Sakshi

చాలా కాలంగా సాగుతున్న  ‘ఆయుర్వేదం’ ‘అలోపతి’ వైద్య విధానాల మధ్య వివాదానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కేంద్రం కావడం విశేషం. ప్రస్తుతం కోవిడ్‌–19 వల్ల ప్రజాబాహుళ్యంలో ఏర్పడిన భయాందోళనలను సంబాళించే ధైర్యసై్థ్యర్యాలను కలిగించడం కోసం పక్కవాటుగా ఆ మాత్రం పాత్రను పోషించడంలో ‘‘ఆయుర్‌ వేదం’’ తోడ్పడితే సంతోషించాల్సిందే! నిజానికి ఆయుర్వేదం పేరుకే గానీ, ప్రకృతి ప్రసాదించిన సొంఠి, పసుపు, మిరప, బెల్లం, జొన్న వగైరా పంట లన్నీ శరీర కల్మషాలకు విరుగుళ్లే సుమా! శ్వాస ఉండే వరకూ మనిషిలో ఆశ చావదు. ఆ ఆశను బతికి బట్టకట్టనివ్వాలన్న ఆశ వొడిగట్టిపోకుండా ఉంచే లక్షణం ఆయుర్వేదాన్ని నమ్ముకున్న వారిలో సహితం ఉండటం  సర్వసాధారణం! 

‘‘కోవిడ్‌–19 (కరోనా) పెను వైరస్‌ వ్యాధి వ్యాప్తి వల్ల భారత్‌లో ప్రజల మరణాల సంఖ్య పెరిగిపోతున్నందున వారికి ప్రజారోగ్య సిబ్బంది నెలల తరబడిగా సేవలందిస్తూ ఆసుపత్రుల్లో లెక్కలేనన్ని గంటలు గడుపుతున్నారు. పైగా వైద్య సేవలందించడానికి సరిపడా వనరులు లేనందున రోగులతో పాటు సిబ్బందికి కూడా కోవిడ్‌ అంటువ్యాధి సోకిపోతోంది. ఈ దుస్థితిలో వైద్యసేవలందించే దేశ ఆరోగ్య రక్షణ సిబ్బంది మానసికమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవలసిన దుస్థితి ఏర్పడింది’’                                     ‘‘ది హిందూ’’ (23–5–21)

ఈ అత్యంత ప్రమాదకర దుస్థితిలో గొడ్డు వాడు గొడ్డు కోసం ఏడిస్తే, దాని తోలు కోసం మరొకరు ఏడ్చినట్టుగా నేటి దేశ వైద్య వృత్తిలో వింత తగాదాలు మరోసారి తలెత్తాయి. చాలా కాలంగా దేశ వ్యాప్తంగా సాగుతున్న  ‘ఆయుర్వేదం’ ‘అలోపతి’ వైద్య విధానాల మధ్య వివాదానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కేంద్రం కావడం విశేషం. పైగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ జిల్లా నాయకుడైనందున ‘‘ఆయుష్మాన్‌ భారత’’ సంస్థకు కేంద్రప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నందున ఆ సంస్థ పాలసీని అమలు జరిపే భారం లేదా బాధ్యతను కేంద్ర ‘ఆయుష్‌’ శాఖామంత్రి కిరణ్‌ రిజ్జూ మీద పెట్టారు. దీనితో పాటు కేంద్రం ఆధీనంలో పనిచేయాల్సిన భారత వైద్య పరిశోధనా మండలి (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) పైన పడింది. బీజేíపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత అత్యాధునిక వైద్యశాస్త్ర పరిశోధనలపై ఆధారపడి ప్రశంసార్హమైన శాస్త్ర, పరిశోధనా పలితాల్ని ప్రపంచానికి అందించి, కోట్లాదిమంది ప్రజలకు  జయప్రదంగా సేవలందించిన అలోపతి వైద్యానికి పోటీగా కేంద్రస్థాయిలో ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించింది.

ఈ పథకాన్ని అమలు జరపడానికి రెండేళ్ల క్రితమే పెద్ద ప్రయత్నం జరగగా వివాదం మధ్యలో ‘ఆయుష్మాన్‌ భారత్‌’ సంస్థలో పనిచేస్తున్న నిపుణులొకరు సంస్థ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయారన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి! ఆ తరువాత ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ముందుకు సాగలేదు. కారణం, రోగాలకు ‘అంటురోగ మహమ్మారులకు, వందల సంత్సరాలుగా వైద్యశాలల్లో, పరిశోధనాగారాల్లో శాస్త్రీయ ప్రాతిపదికపై జరిపిన వేల ప్రయోగాల ఆధారంగా మందులు మాకులు ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. ఆ మాటకొస్తే అరుదుగా లభించే వనమూలి కలు ఆధారంగా రోగాలకు ‘చిట్కా’ వైద్యాలు కూడా ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. అవి శాస్త్రీయ పరిశోధనలకు కొన్ని మాత్రమే తప్ప మిగతావి నిలబడలేదన్నది అలోపతి వైద్య శాస్త్రవేత్తలే కాదు ‘కొందరు ఆయుర్వేద’ వైద్యులు కూడా ఒప్పుకుంటారు. దీనికి కారణాన్ని– ఆయుర్వేద వైద్యశాస్త్రంలో నిపుణుడిగా తెలుగునాట ప్రసిద్ధికెక్కిన బాలరాజు మహర్షి పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్య మూలికల సేకరణ వాటి లభ్యత సాధ్యాసాధ్యాలపైన ఆధారపడింది కాబట్టి వాటి సేకరణ ఇతర ముడిపదార్థాల సేకరణపై కూడా ఆధార పడి ఉంది కాబట్టి ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదని బాలరాజు మహర్షి అభిప్రాయం. ఈ ప్రాతిపదిక మీద ఆయన దాన్ని తాత్కాలిక ‘చిట్కా వైద్యం’ గా మాత్రమే పరిగణిస్తూ వచ్చారు! 

ఆమాటకొస్తే ‘‘కోవిడ్‌–19’’ వైరస్‌పైన కేంద్రీకరించి తాజా పరిశోధనలు నిర్వహించిన ప్రసిద్ధ అమెరికన్‌ జీవ, గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ ఫ్రెడ్‌ ఆడ్లర్‌ ఇకపై మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గణనీయమైన మార్పులు ఏమేమి రాబోతున్నాయనే అంశంపై ఒక ఆశాజనకమైన విశ్వాసాన్ని ప్రకటించాడు!  ఈ విశిష్ట ప్రకటనకు సంబంధించిన తన పరిశోధనా ఫలితాన్ని ‘‘వైరసెస్‌’’ అన్న పరిశోధనా పత్రికలో వెల్లడించారు!  ఇక మీదట కోవిడ్‌–19 లాంటి హానికరమైన వైరస్‌కు కారణమైన ప్రమాదకరమైన కరోనా విషక్రిమి రానున్న పదేళ్లలోగానే జలుబు, దగ్గు లాంటి సాధారణ రుగ్మతలకు మించి దరిచేరబోవని అడ్లర్‌ భరోసా! ఈ పరిణామ క్రమంలో సామూహికంగా జనాభాలో రోగనిరోధక శక్తి పెరిగే కొలది కోవిడ్‌–19 క్రమంగా తోక ముడుస్తుందని చెప్పాడు! వైరస్‌లో వచ్చే మార్పుల కన్నా మన శరీరం రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులకు సర్దుబాటై పోతుందన్నాడు! పరిణామ క్రమంలో స్వల్పంగా సోకే ఇన్‌ఫెక్షన్‌లు– రాబోయే తీవ్రమైన అంటురోగాలను కూడా ఎదుర్కొనగల శక్తిని మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు  తరిఫీదు ఇస్తాయన్నాడు ప్రొఫెసర్‌ అలెగ్జాండర్‌ బీమ్స్‌ (ఉటా యూనివర్శిటీ– అమెరికా)! 

అయితే ఇంతకూ ఆయుర్వేద వైద్యులు ఒక కీలకమైన ప్రశ్నకు తడబడకుండా విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంతవరకూ ప్రపంచదేశాలను పలకరించి ఎంతో వినాశాన్ని మిగిల్చిన సుమారు 300 వైరస్‌ వ్యాధులలో ‘‘ఆయుర్వేద వైద్యం’’ ఎన్నింటిని పరిష్కరించగల్గిందో వివరించగల్గాలి! అన్నీ వేదాల్లోనే ఉన్నాయి. అని సర్దుకుంటే చాలదు. ఎందుకంటే అసలు సృష్టి రహ స్యాన్నే రుగ్వేదం (నాసదీయ సూక్తం 129 పదవ మండలం) హేతు వాదనతో ప్రశ్నించి విడమర్చింది! ఈ సృష్టి ఎలా జరిగింది’’ అని, అందుకు భగవంతుడు సృష్టి కారకుడా? అనీ, (2) కనీసం భగవంతు డికి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా, అని! అందుకు ‘‘నా సదీయ సూక్తం’’ చెప్పిన సమాధానం సృష్టి జరిగిన తరువాత వచ్చిన వాడు భగవంతుడు కాబట్టి, సృష్టికర్త కాజాలడు. అంచేత ఈ సృష్టి ఎలా జరిగిందో కూడా భగవంతుడికి తెలియదు’’ అని చెబుతుంది! కాబట్టి సృష్టికీ, భగవంతుడికీ ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది రుగ్వేదం! అంటే రుగ్వేద కాలం నాటికే భారతదేశంలో భౌతిక వాదం,హేతువాదం ఆవిర్భవించాయనుకోవాలా?! కాబట్టి మాన వుడి ‘‘ఆయుష్షు’’కి వేదానికీ సంబంధం లేకపోయినా ‘‘దైవాధీనం మోటారు సర్వీసు’’ అన్నట్టుగా వేదం నుంచి ఆయుర్వేదాన్ని లాగ సాగారు.! 

నిజానికి చైనాలో కూడా ‘‘ఆక్యుపంక్చర్‌’’ లాంటి నిరూపితమైన కేవలం కొన్ని ప్రాచీన వైద్య పద్ధతుల పునరుద్ధరణను అనుమతిం చారు గాని, శాస్త్రీయ పద్ధతులకు, ఆచరణలో నిరూపణలకు సరిపో లిన వాటినే అనుమతించారని మరవరాదు. మనకు చిన్నతనంలో ప్రకృతి సిద్ధమైన పిడుగులు వినిపిస్తే ‘‘అర్జునా! ఫల్గుణా అని వల్లిస్తుంటే పిడుగులు పోతాయని అంటూండేవారు. అంటే భయాన్ని తొలగించి మనస్సును కుదుట పరచడంలో అలా అనేవాళ్లు. ప్రస్తుతం కోవిడ్‌–19 వల్ల ప్రజాబాహుళ్యంలో ఏర్పడిన భయాందోళనలను సంబాళించే ధైర్యసై్థ్యర్యాలను కలిగించడం కోసం పక్కవాటుగా ఆ మాత్రం పాత్రను పోషించడంలో ‘‘ఆయుర్‌ వేదం’’ తోడ్పడితే సంతోషించాల్సిందే! 

ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో వడపోతల మధ్య కాశీనాథుని ‘‘అమృతాంజనం’’ ఆధునీకరణ తర్వాతనే కమర్షియల్‌ ప్రాజెక్టుగా బయటకొచ్చింది! నిజానికి ఆయుర్వేదం పేరుకే గానీ, ప్రకృతి ప్రసాదించిన సొంఠి, పసుపు, మిరప, బెల్లం, జొన్న వగైరా పంట లన్నీ శరీర కల్మషాలకు విరుగుళ్లే సుమా! పొట్టకిచ్చినా, బట్టకిచ్చినా నేలతల్లే గాని వేదాలు, ఆయుర్వేదాలు కావు! శొంఠి సోధిస్తేనే కడుపు శుభ్రమవుతుంది!  దీన్ని ఆయుర్వేదం కూడా కాదనలేదు అందుకే శ్వాస ఉండే వరకూ మనిషిలో ఆశ చావదు. ఆ ఆశను బతికి బట్టకట్టనివ్వాలన్న ఆశ వొడిగట్టిపోకుండా ఉంచే లక్షణం ఆయుర్వే దాన్ని నమ్ముకున్న వారిలో సహితం ఉండటం  సర్వ సాధారణం! మృత్యువు పంచాంగం చూసి పనిచేయదు! మందులు కూడా శరీర పరిస్థితులకు అతీతం గావు!  


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement