పల్లెకు డెంగీ కాటు
రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
నీటి నిల్వలే కొంప ముంచుతున్న వైనం
పట్టించుకోని ప్రభుత్వం
జిల్లాను డెంగీ వణికిస్తోంది. బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు డెంగీ కాటుకు బలైపోతున్నారు. నీటి నిల్వలు, అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం, దీనికితోడు ఉధృతమవుతున్న దోమలు, మరో వైపు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి పడమటి మండలాల్లోని గ్రామాలు ‘గజగజ’ వణికిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి.
తిరుపతి : జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు, భాకరాపేట, కుప్పం, యాదమరి, ఐరాల, బి.కొత్తకోట, పలమనేరు, బొమ్మన చెరువు, రాయలపేట, చెంబుకూరు, ముదిబాపన పల్లె, పెద్దమండ్యం, తిరుపతి అర్బన్, కోసువారిపల్లె, ములకలచెరువు, సోమల, రొంపిచెర్ల, నిమ్మనపల్లె, కల్లూరు, చింతపర్తి గ్రామాల ప్రజలు జ్వరాలతో వణికిపోతున్నారు. ముఖ్యంగా మదనపల్లె డివిజన్‌లో ఈ జ్వరాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల సైతం ధ్రువీకరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 738 డెంగీ కేసులు నమోదైనట్లు తెలుపుతున్నారు. అనధికారికంగా రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది.
నీటి నిల్వలే కారణం...
ముఖ్యంగా పడమటి మండలాల్లో ఎక్కువ గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటి కోసం సైతం ట్యాంకర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇవి కూడా కొన్ని చోట్ల వారానికి ఒక సారి వస్తుండడంతో ప్రజలు నీటిని నిల్వ ఉంచుకుంటున్నారు. ఇదే ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ నీటి వల్లే దోమలు వృద్ధి చెంది ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయని వైద్యశాఖ అధికారుల సైతం ధ్రువీకరిస్తున్నారు.
డెంగీకి దూరంగా ఉండాలంటే...
- నీటిని నిల్వ ఉంచుకునే పాత్రలు, డ్రమ్ములు కచ్చితంగా వారానికి ఒకసారి కడిగి ఎండబెట్టిన తరువాత మాత్రమే వాటిలో తిరిగి నీటిని నింపుకోవాలి.
- నీరు నిల్వ ఉండే ఓవర్‌హెడ్‌ట్యాంక్‌లు, బిందెలు, డ్రమ్ములపై మూతలు తప్పకుండా పెట్టుకోవాలి.
- ఇంటి పరిసరాల్లో ఖాళీ కూల్‌డ్రింక్ బాటిళ్లు, పగిలిన టీకప్పులు, కొబ్బరి బోండాలు, పాత టైర్లు, రోళ్లలో నీటి నిల్వలు ఉండకుండా చూడాలి.
- వారంలో ఒక రోజు డ్రైడేను పాటించాలి.
- ఈ డెంగీ వైరస్ మంచి నీళ్లల్లోనే గుడ్లు పెట్టి వృద్ధి చెందుతుంది, కాబట్టి మూతలు తప్పని సరిగా పెట్టుకోవాలి.
- దోమలు కుట్టకుండా దోమతెరలు,పూర్తి డ్రస్సులు, ప్రొటెక్ట్ చేసే మస్కిటో కాయల్స్ వాడుకోవాలి
జ్వరం వచ్చిన వెంటనే...
డెంగీ అయితే నీరసంతో పాటు జ్వరం ఎక్కువగా వస్తుంది. కళ్లు నొప్పిగా ఉంటాయి. వాంతులు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం వచ్చిన వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్లు అంటే దగ్గరల్లోని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించాలి. జ్వరం తగ్గక పోతే జిల్లా ఆస్పత్రి, రుయా వంటి ప్రధాన ఆస్పత్రులకు తీసుకెళ్లాలి.
చైతన్యం చేస్తున్నాం...
డెంగీ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. నీటిని నిల్వ ఉంచుకోకుండా ఉండటంతో పాటు, గ్రామాల్లో పారిశుధ్యంపైన దృష్టి సారించాం. ప్రజలు దోమల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పల్లె ప్రజలకు వివరిస్తున్నాం. - కోటేశ్వరి,డీఎంహెచ్‌వో, చిత్తూరు