అలలపై అలా.. | 10 km cycle and walking track around Hussain Sagar | Sakshi
Sakshi News home page

అలలపై అలా..

Published Fri, Jan 31 2025 1:48 AM | Last Updated on Fri, Jan 31 2025 1:55 AM

10 km cycle and walking track around Hussain Sagar

సాగర్‌పై సరదాల నడక !

ఆట పాటలు, ఆనందోత్సాహాలు 

బాక్స్‌ క్రికెట్, ఫ్లోటెడ్‌ నైట్‌లైఫ్‌ 

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 10 కిలోమీటర్ల సైకిల్, వాక్‌ ట్రాక్‌ 

పార్కులు, రెస్టారెంట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రాజెక్టులు 

రూ.500 కోట్లకు పైగా అంచనా వ్యయం 

పర్యాటక పాలసీకి అనుగుణంగా హుమ్టా ప్రణాళికలు

సాక్షి, హైదరాబాద్‌: పోటెత్తే అలలను వీక్షిస్తూ హుస్సేన్‌ సాగర్‌లో ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళితే  ఎలా ఉంటుంది? నీటిపై తేలే బాక్సుల్లో చేరి ఏదో ఒక ఆట ఆడితే ఆ థ్రిల్‌ ఎలా ఉంటుంది? అర్ధరాత్రి దాటిన తర్వాత  స్ట్రీట్‌ ఫర్నిచర్‌ వద్ద  నింగిని తాకే  ఫౌంటేన్‌ వెల్లువను  చూస్తూ  గడపడం చక్కటి అనుభూతినిస్తుంది కదా. అంతేకాదు, సాగర్‌ చుట్టూ సైకిల్‌ తొక్కవచ్చు. హాయిగా నడుచుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు. అందమైన పార్కుల్లో సేదతీరొచ్చు. పార్టీలు, ఫంక్షన్‌లు, విందులు, వినోదాలు, ఆటా పాటలు వెరసీ.. ఒక అద్భుతమైన నైట్‌లైఫ్‌. నగరవాసులకే కాదు. 

దేశ విదేశాలకు చెందిన  పర్యాటకులను సైతం ఆకట్టుకొనేలా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ  స్కైవాక్, సైకిలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, నైట్‌లైఫ్‌ షాపింగ్‌ వంటి సదుపాయాలను  అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అనుబంధ హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (హుమ్టా) ప్రణాళికలను సిద్ధం చేసింది. 

ఇప్పటికే శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, బాబాసాహెచ్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం, ఎన్టీఆర్‌ గార్డెన్, లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులతో ఆకట్టుకుంటున్న ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు హుమ్టా దృష్టి సారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో  ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్‌ డిజైన్‌లను  రూపొందించింది. 

స్కైవాక్, సైక్లింగ్‌..  
హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో  స్కైవాక్, సైకిల్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. ఈ ట్రాక్‌ అటు ట్యాంక్‌బండ్, సంజీవయ్య పార్కు నుంచి ఇటు  ఐమాక్స్‌ థియేటర్‌ వరకు, ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌కు కనెక్టివిటీని కలిగి ఉంటుంది.  పర్యాటకులు ట్యాంక్‌బండ్‌ మీ దుగా ఇందిరా పార్కుకు వెళ్లేందుకు అనుగుణంగా  నిర్మి స్తారు. ఇలా నలువైపులా కనెక్టివిటీ ఉండడంతో పర్యాటకులు అన్ని వైపులా రాకపోకలు సాగిస్తారు. 

సైకిలింగ్‌ పట్ల అభిరుచి ఉన్నవాళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్‌ స్లాట్‌లను ఏర్పాటు చేసి  సైకిళ్లను అందుబాటులో ఉంచుతారు. సొంత సైకిళ్లను  తెచ్చుకోవచ్చు. గంటల చొప్పున అద్దెకు తీసుకోవచ్చు. మొత్తం 5.5 మీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయనున్న స్కైవాక్‌లో  3.3 మీటర్లు సైకిలింగ్‌ కోసం కేటాయిస్తారు. అలాగే 10 కిలోమీటర్ల మార్గంలో అక్కడక్కడా రెస్టరెంట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌లు ఉంటాయి. సాగర్‌లోంచి  రాకపోకలు సాగించేవిధంగా  స్కైవాక్, సైక్లింగ్‌ సదుపాయాలు ఉంటాయి.  

నైట్‌లైఫ్‌ ప్లాజాలు.. 
నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా ప్రాంతంలో నైట్‌లైఫ్‌ షాపింగ్‌లో భాగంగా ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాజాలను ఏర్పాటు చేయాలని హుమ్టా  ప్రతిపాదించింది. పర్యాటకులు రాత్రి వేళల్లో హాయిగా కాలక్షేపం చేసేందుకు వీలుగా స్ట్రీట్‌ ఫర్నిచర్‌ ఉంటుంది.  రెస్టరెంట్‌లు, హోటళ్లు రాత్రిపూట అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఉన్న పార్కులతో  పాటు  అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో మరిన్ని పార్కులను  ఏర్పాటు చేయనున్నారు. 

స్పోర్ట్స్‌ బాక్సులు.. 
సింగపూర్‌లోని ఫ్లోటెడ్‌ ఫుట్‌బాల్‌ తరహాలో హుస్సేన్‌సాగర్‌లో  చిన్న గ్రౌండ్‌లో  ఒక క్రికెట్‌బాక్సు లేదా ఇతర ఆటలకు అనుగుణమైన బాక్సులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నీటిపై తేలియాడే వేదికలపై క్రీడాకారులు ఆటలాడుకోవచ్చు.  మరోవైపు  ఫ్లోటెడ్‌ ఫౌంటెన్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. 

పర్యాటకులు  ప్రశాంతంగా ఫౌంటెన్‌ చుట్టూ కూర్చొని గడిపేందుకు వీలుగా  ఏర్పాట్లు చేస్తారు. ఈ భారీ ప్రాజెక్టుకు సుమారు రూ.500 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. పబ్లిక్‌ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో  నిర్మించాలని  హుమ్టా  ప్రతిపాదించింది.   సందర్శకుల నుంచి కొంత మొత్తం రుసుము వసూలు చేస్తారు.

చదవండి : భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement