Skywalk
-
నాగోల్‌లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్‌లో కొత్తగా ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్‌కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్‌ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్‌పేట కారిడార్‌లో నాగోల్‌కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్‌పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్‌మెంట్‌పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్‌మెంట్‌ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్‌ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్‌రింగ్‌రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్‌ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్‌పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్‌పాస్‌తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్‌కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్‌పేట మీదుగా ఎల్బీ నగర్‌కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. ♦ బైరామల్‌గూడ, సాగర్‌రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్‌మెంట్‌ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
మెహిదీపట్నం స్కైవాక్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న స్కైవాక్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. స్కైవాక్ కోసం అవసరమైన భూమిని అప్పగించేందుకు రక్షణ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే స్కైవాక్ నిర్మాణ పనులను పునరుద్ధరించనున్నారు. వాహనాల రద్దీ, అత్యధిక జనసమ్మర్థం కలిగిన మెహిదీపట్నం కూడలిలో పాదచారులు నలువైపులా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ స్కైవాక్ విస్తరణకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మేరకు రక్షణ శాఖతో సంప్రదింపులు జరిపారు. కానీ అప్పట్లో భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ అధికారులు ససేమిరా అనడంతో పనులు నిలిచిపోయాయి. ఉప్పల్ స్కైవాక్ పూర్తి చేయడంతో పాటు మెహిదీపట్నం స్కైవాక్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ స్థలం లభ్యత సవాల్‌గా మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం స్కైవాక్‌కు అవసరమైన 3,380 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంతో పనులు పరుగులు పెట్టనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఫలించిన సీఎం రేవంత్‌రెడ్డి చొరవ.. ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లేవారి భద్రత దృష్ట్యా మెహిదీపట్నంలో స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. కానీ.. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అత్యంత రద్దీ ఉండే మెహిదీపట్నం రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. మెహిదీపట్నంలో ఉన్న రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు అక్కడ ఉన్న డిఫెన్స్ జోన్‌కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అధికారులు మార్పులు చేశారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు. దీంతో స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూముల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం డిఫెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి పదేళ్ల పాటు లైసైన్స్ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది. దీంతో మెహిదీపట్నం స్కై వాక్ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. వీలైనంత త్వరగా స్కైవే నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
వారెవ్వా అద్భుతంగా ఉప్పల్ స్కైవాక్.. (ఫొటోలు)
-
ఉప్పల్‌లో తిప్పలుండవ్!
హైదరాబాద్: మహా నగరానికి తూర్పు దిక్కున మరో మణిహారం సిద్ధమైంది. ఉప్పల్‌లో వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆకాశ నడక మార్గం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. మంత్రి కేటీఆర్ నేడు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రామంతాపూర్, సికింద్రాబాద్ వైపు నుంచి ఎల్బీనగర్ వైపు, ఉప్పల్ నుంచి రామంతాపూర్, సికింద్రాబాద్ వైపు.. ప్రతి రోజు వేలాది మంది పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఉప్పల్ రింగురోడ్డు వద్ద రోడ్డు దాటేందుకు ఎంతో ప్రయాస పడుతుండేవారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 30 వేల మందికి పైగా ప్రయాణికులు సైతం ఎటు వైపు వెళ్లాలన్నా ఎంతో ఇబ్బందిగానే ఉండేది. ఈ క్రమంలో ఈజీగా రోడ్డు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్కైవాక్‌తో ఉప్పల్ రింగురోడ్డు వద్ద పాదచారులు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించనున్నారు. నగరంలోనే మొదటిది.. దాదాపు రూ.25 కోట్లతో హెచ్ఎండీఏ ఉప్పల్ స్కైవాక్‌ను నిర్మించింది. 660 మీటర్ల పొడవు ఉన్న ఈ ఆకాశ నడక మార్గం నగరంలో మొట్టమొదటి నిర్మాణం. రాబోయే వందేళ్ల పాటు వినియోగంలో ఉండేలా ప్రజల అవసరాలకు అనుగుణంగా స్కైవాక్‌ను ఎంతో పటిష్టంగా నిర్మించినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికోసం సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు. వివిధ రకాల స్కైవాక్ నమూనాలను పరిశీలించిన అనంతరం హెచ్ఎండీఏ ప్రస్తుతం ఉన్న ఏర్పాటును ఖరారు చేసింది. ఇందుకోసం హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 2020లోనే పనులు ప్రారంభించినప్పటికీ కోవిడ్ కారణంగా నిర్మాణంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ప్రస్తుతం నిర్మా ణం పూర్తి చేసుకొని వినియోగంలోకి రానుంది. బహుళ ప్రయోజన ఫంక్షన్ హాల్‌కూ శ్రీకారం.. ఉప్పల్ శిల్పారామం వద్ద హెచ్ఎండీఏ నిర్మించిన బహుళ ప్రయోజనాల ఫంక్షన్‌హాల్‌ను కూడా మంత్రి కేటీఆర్ సోమవారం నాటి పర్యటనలో ప్రారంభించనున్నారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వంటి వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మించారు. శిల్పారామం వద్ద చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వినియోగ చార్జీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉప్పల్‌లో స్కైవాక్ ప్రత్యేకతలు ఇవీ.. ● మొత్తం పొడవు 660 మీటర్లు ● 37 పిల్లర్లు ఏర్పాటు చేశారు ● 3, 4, 6 మీటర్ల వెడల్పు కలిగి.. భూ ఉపరితలం నుంచి 6 మీటర్ల ఎత్తు ● నిర్మాణ వ్యయం : రూ.25 కోట్లు ● 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 8 ఎలివేటర్లు ● బ్యూటిఫికేషన్ లుక్ కోసం పైభాగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 40 శాతం మేరకు రూఫ్ టాప్ ● ప్రతిరోజు 20 వేల మందికి పైగా పాదచారులు, మరో 25 వేల మందికి పైగా మెట్రో ప్రయాణికులు స్కైవాక్‌ను వినియోగించుకోవచ్చు. ● ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా చేయడంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ● మెట్రో ప్రయాణికులు కాంకోర్ వరకు చేరుకుంటారు. -
అదిగదిగో..స్కైవాక్
హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉప్పల్ స్కైవాక్ త్వరలో ప్రారంభం కానుంది. సుమారు రూ.25 కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టిన ఈ స్కైవాక్ వందేళ్ల పాటు ఏ మాత్రం చెక్కు చెదరని విధంగా ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేశారు. స్కైవాక్ నిర్మాణం కోసం వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించినట్లు అంచనా. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద పాదచారులు నలువైపులా సురక్షితంగా రోడ్డు దాటేందుకు ఈ ఆకాశ వంతెన నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది సుదీర్ఘకాలం మన్నికగా ఉండేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, వైజాగ్ స్టీల్‌తో పాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు. పాదచారుల వంతెన నిర్మాణంలో భాగంగా 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, మరో 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. ఈ స్కైవాక్ కారిడార్ 660 మీటర్ల పొడవు ఉంటుంది. దీని కోసం 37 పిల్లర్లు వినియోగించారు. ఇది భూమి నుంచి 6 మీటర్ల ఎత్తులో ఉంటుంది. స్కైవాక్ బ్యూటిఫికేషన్ కోసం 40 శాతం వరకు రూఫ్ కవరింగ్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ చౌరస్తాలో ప్రతి రోజు నాలుగు వైపులా రాకపోకలు సాగించే సుమారు 20 వేల మందికి పైగా పాదచారులు ఈ స్కైవాక్‌ను వినియోగించుకొనే అవకాశం ఉంది. ఉప్పల్ మెట్రో ప్రయాణికులు ఇకపైన మెట్రో కాన్కోర్ నుంచి స్కై వాక్ మీదుగా స్టేషన్‌కు రాకపోకలు సాగించవచ్చు. లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం మొక్కలు పచ్చిక బయలతో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. -
ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ .. అంతేనా చక్కగా షాపింగ్ కూడా
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో నడక. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ వగైరా... అంతేనా చక్కగా షాపింగ్ చేయొచ్చు. అలా ఆకాశంలో నిల్చుని కాలక్షేపం కూడా చేయొచ్చు.ఇదంతా ఎలా సాధ్యమనుకుంటున్నారా? కచ్చితంగా సాధ్యమే. హైదరాబాద్ మహానగర కూడళ్లలో మణిహారాల్లా రూపుదిద్దుకుంటున్న స్కైవాక్‌లలో షాపింగ్ సెంటర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొదట మెహిదీపట్నం స్కైవాక్‌లో ఈ తరహా షాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. చిన్న చిన్న కియోస్క్‌ల రూపంలో ఉండే ఈ సెంటర్లు స్కైవాక్ పాదచారులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. టీ,కాఫీ, స్నాక్స్ వంటి వాటితో పాటు తక్కువ స్థలంలో విక్రయించేందుకు అనుగుణంగా ఉండే షాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. నగరంలోని స్కైవాక్‌లను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్కైవాక్ మార్గాల్లో ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లే పాదచారులు కొద్దిసేపు పైనే సేదతీరేందుకు వీలుగా ఇవి ఉంటాయి. రూ.28 కోట్ల వ్యయంతో.. ► మెహిదీపట్నం కూడలిలో ప్రస్తుతం నిర్మిస్తున్న స్కైవాక్‌లో అన్ని వైపులా సుమారు 20 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానున్నట్లు అంచనా. మొత్తం 350 మీటర్ల పొడవులో రూ.28 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు నాలుగు వైపులా నడుచుకుంటూ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కనీసం లక్షమందికి పైగా స్కైవాక్ మార్గంలో రాకపోకలు సాగించవచ్చు. ► ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు షాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ఈ స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా హెచ్ఎండీఏకు అదనపు ఆదాయం లభించనుంది. మరోవైపు పాదచారులకు కూడా ఆటవిడుపుగా మారనుంది. తక్కువ స్థలంలో ఏర్పాటు చేయగలిగే షాపులకే స్కైవాక్ అనుకూలంగా ఉంటుందని ఒక అధికారి చెప్పారు. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం సెప్టెంబర్ నాటికి ఉప్పల్‌లో స్కైవాక్.. ► నిత్యం వాహనాలు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఉప్పల్ కూడలిలో స్కైవాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 650 మీటర్ల పొడవుతో రూ.34 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్ రింగు రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించేవిధంగా ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తాము ఏ వైపునకు వెళ్లాలనుకొన్నా స్కైవాక్‌లోనే వెళ్లవచ్చు. అలాగే సిటీ బస్సులు, దూరప్రాంతాల బస్సుల్లో వచ్చేవారు ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నాటికి వినియోగించలోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో మరిన్ని.. జన సమ్మర్థం ఉన్న ప్రధాన కూడళ్లలో మరిన్ని స్కైవాక్‌లను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధ్యయనం చేపట్టింది. అమీర్‌పేట్, కోఠి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో స్కైవాక్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే!
-
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలా.. అయితే..
థాయ్ సంస్కృతీ, సంప్రదాయాలు, ఆకాశహార్మ్యాలతో ఆకట్టుకునే బ్యాంకాక్ మరో సరికొత్త నిర్మాణంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. స్కైవాక్ నిర్మించి టూరిస్టుల మనసు దోచుకుంటోంది. బ్యాంకాక్‌లో అతి ఎత్తైన బిల్డింగ్‌గా గుర్తింపు పొందిన ‘కింగ్ పవర్ మహనఖాన్’ నిర్మాణం ఇటీవలే పూర్తైన సంగతి తెలిసిందే. 78 అంతస్తులతో కూడిన ఈ బిల్డింగ్‌లో ఆఖరి అంతస్తు అంచు చివర స్కైవాక్‌ను నిర్మించారు. ఇది భూమి నుంచి సుమారు 1030 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాజుతో నిర్మితమైన ఈ స్కైవాక్పై నుంచి 360 డిగ్రీల కోణంలో సిటీ అందాలన్నీ వీక్షించవచ్చు. దీంతో ధైర్యవంతులు, ఉత్సాహవంతులైన పర్యాటకులు బ్యాంకాక్‌కు చేరుకుంటున్నారు. అంతేకాదు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇంకేం.. మీరు కూడా ధైర్యవంతులేనా..? అయితే ఈసారి బ్యాంకాక్‌కు వెళ్లినపుడు స్కైవాక్పై నడిచి సరదా తీర్చుకోండి. అయితే గాజు పలకపై నడిచేపుడు మాత్రం ఫ్యాబ్రిక్ షూస్ ధరించడం మాత్రం మర్చిపోకండి. -
స్కైవాక్..
దక్షిణ చైనాలోని తియాన్మెన్ పర్వతం అంచున నిర్మించిన ‘కాయిలింగ్ డ్రాగన్ క్లిఫ్’ ఇది. సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో ఉన్న దీని వెడల్పు 5 అడుగులు. కింది భాగమంతా అద్దాలతో నిర్మితమైంది. ప్రజల సందర్శనార్థం సోమవారం అధికారికంగా ప్రారంభించారు. -
నిరుపయోగంగా స్కైవాక్
సాక్షి, ముంబై : నగర వాసుల సౌకర్యార్థం సుమారు రూ.40 కోట్లు వెచ్చించి గ్రాంట్‌రోడ్‌లో నిర్మించిన స్కైవాక్ నిరుపయోగంగా మారింది. ఈ స్కైవాక్ ఉపయోగించాలంటే దాదాపు 60 మెట్లు ఎక్కి దిగాల్సి ఉంది. చాలా మంది ఈ స్కైవాక్‌ను ఉపయోగించుకోవడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. వృద్ధులు వీటి జోలికి వెళ్లడం లేదు. ప్రస్తుతం భిక్షగాళ్లు, తాగుబోతులకు అడ్డాగా మారింది. స్కైవాక్‌ను నానాచౌక్ నుంచి తాడ్‌దేవ్, కెంప్స్ కార్నర్, లామింగ్ టన్ రోడ్, గిర్గావ్ చౌపాటీ, ఒపేరా హౌజ్ ప్రాంతాల ప్రజలకు సౌకర్యాంగా ఉండేందుకు నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా, ఈ స్కైవాక్‌కు వ్యతిరేక దిశలో ఉన్న ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఫ్లై ఓవర్లో కొంత భాగాన్ని బారికేడ్లతో కవర్ చేయలేదు. వెండర్లు, భిక్షాటన చేసేవారు, ఆకాతాయిలు పరిసర ఇళ్లలోని నివాసితుల పట్ల అసభ్య దూషణకు పాల్పడుతున్నారు. కిటికీలకు వ్యతిరేక దిశలోనే స్కైవాక్ నిర్మించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని పలువురు నివాసితులు వాపోతున్నారు. ఈ విషయమై మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనితా పర్దేశి మాట్లాడుతూ..భిక్షాటన చేసేవారిని, తాగుబోతులను ఎప్పటికప్పుడు ఈ స్కైవాక్పై నుంచి తరిమేస్తున్నామని అన్నారు. మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.