హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉప్పల్ స్కైవాక్ త్వరలో ప్రారంభం కానుంది. సుమారు రూ.25 కోట్లతో హెచ్‌ఎండీఏ చేపట్టిన ఈ స్కైవాక్ వందేళ్ల పాటు ఏ మాత్రం చెక్కు చెదరని విధంగా ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేశారు. స్కైవాక్ నిర్మాణం కోసం వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించినట్లు అంచనా.
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద పాదచారులు నలువైపులా సురక్షితంగా రోడ్డు దాటేందుకు ఈ ఆకాశ వంతెన నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది సుదీర్ఘకాలం మన్నికగా ఉండేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, వైజాగ్ స్టీల్‌తో పాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు. పాదచారుల వంతెన నిర్మాణంలో భాగంగా 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, మరో 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. ఈ స్కైవాక్ కారిడార్ 660 మీటర్ల పొడవు ఉంటుంది. దీని కోసం 37 పిల్లర్లు వినియోగించారు.
ఇది భూమి నుంచి 6 మీటర్ల ఎత్తులో ఉంటుంది. స్కైవాక్ బ్యూటిఫికేషన్ కోసం 40 శాతం వరకు రూఫ్ కవరింగ్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ చౌరస్తాలో ప్రతి రోజు నాలుగు వైపులా రాకపోకలు సాగించే సుమారు 20 వేల మందికి పైగా పాదచారులు ఈ స్కైవాక్‌ను వినియోగించుకొనే అవకాశం ఉంది. ఉప్పల్ మెట్రో ప్రయాణికులు ఇకపైన మెట్రో కాన్‌కోర్ నుంచి స్కై వాక్ మీదుగా స్టేషన్‌కు రాకపోకలు సాగించవచ్చు. లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో హెచ్‌ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం మొక్కలు పచ్చిక బయలతో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment