హైదరాబాద్: మహా నగరానికి తూర్పు దిక్కున మరో మణిహారం సిద్ధమైంది. ఉప్పల్‌లో వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆకాశ నడక మార్గం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. మంత్రి కేటీఆర్ నేడు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రామంతాపూర్, సికింద్రాబాద్ వైపు నుంచి ఎల్‌బీనగర్ వైపు, ఉప్పల్ నుంచి రామంతాపూర్, సికింద్రాబాద్ వైపు.. ప్రతి రోజు వేలాది మంది పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఉప్పల్ రింగురోడ్డు వద్ద రోడ్డు దాటేందుకు ఎంతో ప్రయాస పడుతుండేవారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 30 వేల మందికి పైగా ప్రయాణికులు సైతం ఎటు వైపు వెళ్లాలన్నా ఎంతో ఇబ్బందిగానే ఉండేది. ఈ క్రమంలో ఈజీగా రోడ్డు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్కైవాక్‌తో ఉప్పల్ రింగురోడ్డు వద్ద పాదచారులు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించనున్నారు.
నగరంలోనే మొదటిది..
దాదాపు రూ.25 కోట్లతో హెచ్‌ఎండీఏ ఉప్పల్ స్కైవాక్‌ను నిర్మించింది. 660 మీటర్ల పొడవు ఉన్న ఈ ఆకాశ నడక మార్గం నగరంలో మొట్టమొదటి నిర్మాణం. రాబోయే వందేళ్ల పాటు వినియోగంలో ఉండేలా ప్రజల అవసరాలకు అనుగుణంగా స్కైవాక్‌ను ఎంతో పటిష్టంగా నిర్మించినట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికోసం సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు. వివిధ రకాల స్కైవాక్ నమూనాలను పరిశీలించిన అనంతరం హెచ్‌ఎండీఏ ప్రస్తుతం ఉన్న ఏర్పాటును ఖరారు చేసింది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 2020లోనే పనులు ప్రారంభించినప్పటికీ కోవిడ్ కారణంగా నిర్మాణంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ప్రస్తుతం నిర్మా ణం పూర్తి చేసుకొని వినియోగంలోకి రానుంది.
బహుళ ప్రయోజన ఫంక్షన్ హాల్‌కూ శ్రీకారం..
ఉప్పల్ శిల్పారామం వద్ద హెచ్‌ఎండీఏ నిర్మించిన బహుళ ప్రయోజనాల ఫంక్షన్‌హాల్‌ను కూడా మంత్రి కేటీఆర్ సోమవారం నాటి పర్యటనలో ప్రారంభించనున్నారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వంటి వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మించారు. శిల్పారామం వద్ద చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వినియోగ చార్జీలు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఉప్పల్‌లో స్కైవాక్ ప్రత్యేకతలు ఇవీ..
● మొత్తం పొడవు 660 మీటర్లు
● 37 పిల్లర్లు ఏర్పాటు చేశారు
● 3, 4, 6 మీటర్ల వెడల్పు కలిగి.. భూ ఉపరితలం నుంచి 6 మీటర్ల ఎత్తు
● నిర్మాణ వ్యయం : రూ.25 కోట్లు
● 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 8 ఎలివేటర్లు
● బ్యూటిఫికేషన్ లుక్ కోసం పైభాగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 40 శాతం మేరకు రూఫ్ టాప్
● ప్రతిరోజు 20 వేల మందికి పైగా పాదచారులు, మరో 25 వేల మందికి పైగా మెట్రో ప్రయాణికులు స్కైవాక్‌ను వినియోగించుకోవచ్చు.
● ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా చేయడంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
● మెట్రో ప్రయాణికులు కాంకోర్ వరకు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment