Skywalk bridges
-
ఉప్పల్‌లో తిప్పలుండవ్!
హైదరాబాద్: మహా నగరానికి తూర్పు దిక్కున మరో మణిహారం సిద్ధమైంది. ఉప్పల్‌లో వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆకాశ నడక మార్గం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. మంత్రి కేటీఆర్ నేడు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రామంతాపూర్, సికింద్రాబాద్ వైపు నుంచి ఎల్బీనగర్ వైపు, ఉప్పల్ నుంచి రామంతాపూర్, సికింద్రాబాద్ వైపు.. ప్రతి రోజు వేలాది మంది పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఉప్పల్ రింగురోడ్డు వద్ద రోడ్డు దాటేందుకు ఎంతో ప్రయాస పడుతుండేవారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 30 వేల మందికి పైగా ప్రయాణికులు సైతం ఎటు వైపు వెళ్లాలన్నా ఎంతో ఇబ్బందిగానే ఉండేది. ఈ క్రమంలో ఈజీగా రోడ్డు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్కైవాక్‌తో ఉప్పల్ రింగురోడ్డు వద్ద పాదచారులు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించనున్నారు. నగరంలోనే మొదటిది.. దాదాపు రూ.25 కోట్లతో హెచ్ఎండీఏ ఉప్పల్ స్కైవాక్‌ను నిర్మించింది. 660 మీటర్ల పొడవు ఉన్న ఈ ఆకాశ నడక మార్గం నగరంలో మొట్టమొదటి నిర్మాణం. రాబోయే వందేళ్ల పాటు వినియోగంలో ఉండేలా ప్రజల అవసరాలకు అనుగుణంగా స్కైవాక్‌ను ఎంతో పటిష్టంగా నిర్మించినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికోసం సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు. వివిధ రకాల స్కైవాక్ నమూనాలను పరిశీలించిన అనంతరం హెచ్ఎండీఏ ప్రస్తుతం ఉన్న ఏర్పాటును ఖరారు చేసింది. ఇందుకోసం హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 2020లోనే పనులు ప్రారంభించినప్పటికీ కోవిడ్ కారణంగా నిర్మాణంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ప్రస్తుతం నిర్మా ణం పూర్తి చేసుకొని వినియోగంలోకి రానుంది. బహుళ ప్రయోజన ఫంక్షన్ హాల్‌కూ శ్రీకారం.. ఉప్పల్ శిల్పారామం వద్ద హెచ్ఎండీఏ నిర్మించిన బహుళ ప్రయోజనాల ఫంక్షన్‌హాల్‌ను కూడా మంత్రి కేటీఆర్ సోమవారం నాటి పర్యటనలో ప్రారంభించనున్నారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వంటి వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మించారు. శిల్పారామం వద్ద చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వినియోగ చార్జీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉప్పల్‌లో స్కైవాక్ ప్రత్యేకతలు ఇవీ.. ● మొత్తం పొడవు 660 మీటర్లు ● 37 పిల్లర్లు ఏర్పాటు చేశారు ● 3, 4, 6 మీటర్ల వెడల్పు కలిగి.. భూ ఉపరితలం నుంచి 6 మీటర్ల ఎత్తు ● నిర్మాణ వ్యయం : రూ.25 కోట్లు ● 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 8 ఎలివేటర్లు ● బ్యూటిఫికేషన్ లుక్ కోసం పైభాగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 40 శాతం మేరకు రూఫ్ టాప్ ● ప్రతిరోజు 20 వేల మందికి పైగా పాదచారులు, మరో 25 వేల మందికి పైగా మెట్రో ప్రయాణికులు స్కైవాక్‌ను వినియోగించుకోవచ్చు. ● ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా చేయడంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ● మెట్రో ప్రయాణికులు కాంకోర్ వరకు చేరుకుంటారు. -
Haimanti Sen: అ అంటే ఆకాశ బడి
అ అంటే అమ్మ. కాని అమ్మ పనికి పోతుంది. ఆ అంటే ఆకలి. నాన్న పనికి వెళ్లమంటాడు. చదువు ఇప్పటికీ కొందరికి అందదు. అక్షరాలు, పుస్తకాలు, క్లాస్‌రూములు చూడకుండా వాళ్లు పెద్దవాళ్లై మురికివాడలకు పరిమితమవుతారు. ‘వెర్రి కోరికే కావచ్చు. కాని నా ప్రయత్నం నేను చేస్తాను’ అనుకుంది హైమంతి సేన్. వీధి బాలల కోసం ముంబైలో ‘జునూన్’ (వెర్రి కోరిక) అనే సంస్థ స్థాపించి వారికి ‘స్కైవాక్’ల మీద అక్షరాలు నేర్పే పని చేస్తోంది. ఒక రకంగా ఆమె నడుపుతున్నది ఆకాశబడులు. ముంబైలో పాదచారుల కోసం స్కైవాక్‌లు ఏర్పాటు చేయడం హైమంతి సేన్‌కు మేలు చేసింది. స్కూల్ కోసం బిల్డింగ్‌ను అద్దెకు తీసుకోవడం, బల్లలు పెట్టడం, లైట్లు వెలిగించడం లాంటి ఖర్చులేమీ పెట్టే అవసరం లేకపోయింది. నాలుగు చాపలు పట్టుకుని వెళ్లి, వస్తూ పోతున్న వారిని పట్టించుకోకుండా ఒక వైపుగా పరిస్తే, రెయిలింగ్‌కి నాలుగు చార్టులు బిగిస్తే అదే బడి. అలాంటి బడే వీధిపిల్లలను ఆకర్షిస్తుంది అని భావించిందామె. గత రెండేళ్లుగా ఆ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది కూడా. ముంబై కండీవాలి రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న స్కైవాక్ మీదకు వెళితే ఏ పని దినాల్లోనైనా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ స్కూలు నడుస్తూ కనిపిస్తుంది. స్కూల్ అంటే ఒకటి రెండు చాపలు పరువగా ఐదు పది మంది వీధి బాలలు కూచోగా నడిచే స్కూలు. ఇలాంటి స్కూళ్లు ముంబైలోని స్కైవాక్‌ల మీద హైమంతి ఆధ్వర్యంలో ఇప్పుడు నాలుగు నడుస్తున్నాయి. రోజూ ‘జునూన్’ తరఫున వాలంటీర్లు ఈ స్కూళ్లు నడుపుతారు. వీధి బాలలు వాటిలో చదువుకుంటారు. ఇలా నడుస్తున్న స్కూళ్లు ఇవే కావచ్చు. ‘నేను కొన్నాళ్లు టీచర్‌గా, పర్సనాల్టీ డెవలప్మెంట్ కౌన్సిలర్‌గా పని చేశాను. మంచి జీతం వచ్చే ఆ ఉద్యోగంలో నాకు తృప్తి కనిపించలేదు. ముంబైలో ఎక్కడ చూసినా రోడ్డు మీద ఏవో కొన్ని చిల్లర వస్తువులు అమ్మే బాలలు, భిక్షాటన చేసే బాలలు కనిపించేవారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసున్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. కాని ఆ చట్టం వచ్చాక కూడా చాలామంది పిల్లలకు చదువు అబ్బడం లేదు. అందరం సమస్యను గమనిస్తూ ఉంటాం. కాని దాని పరిష్కారానికి ఎంతో కొంత పని చేయడం అవసరం. నేను ఆ పని చేయాలనుకున్నాను’ అంటుంది హైమంతి సేన్. వీధి బాలల కోసం పని చేయాలి అని 2018లో అనుకున్నాక మురికివాడల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ బడుల్లోకి వెళ్లి అక్కడి హెడ్మాస్టర్లతో మాట్లాడింది ఆమె. ‘ఆ పిల్లలతో వేగలేము. వాళ్లు సరిగ్గా స్కూళ్లకు రారు. వచ్చినా సాటి పిల్లలను చెడగొడతారు. యూనిఫామ్‌లు పుస్తకాలు తీసుకెళ్లి పత్తా ఉండరు.’ అని వారు చెప్పారు. అదొక్కటే కాదు... ఆరేడేళ్ల వయసు వచ్చాక కూడా స్కూల్‌కు పంపకపోవడం వల్ల ఆ వయసు పిల్లలను నేరుగా రెండో క్లాసులోనో మూడో క్లాసులోనో వేయడం సమస్య అవుతోంది. ఆ క్లాసును వాళ్లు అందుకోలేరు. చిన్న క్లాసులో కూచోలేరు. ‘ఇవన్నీ చూశాక ఆ పిల్లలను చదివించి బ్రిడ్జ్ కోర్స్లాంటిది చేయించి నేరుగా స్కూళ్లలో చేర్పించాలి అనుకున్నాను’ అంది హైమంతి. ముందు ఆమె ఏదైనా స్థలం వెతికి ఆ పని చేయాలనుకుంది కాని పిల్లలను ఆకర్షించాలంటే వాళ్లు స్వేచ్ఛగా నేర్చుకుంటున్నాము అనుకోవాలంటే స్కైవాక్లే సరైనవి అనుకుంది. ‘అయితే పిల్లలను పట్టుకురావడం అంత సులభం కాదు. మురికివాడల్లోని తల్లిదండ్రులు వారి చేత పని చేయిద్దామనుకుంటారు. వారిని ఒప్పించి తీసుకురావాల్సి వచ్చింది’ అందామె. ఈ రెండేళ్లలో దాదాపు 35 కుటుంబాల పిల్లలు ముంబైలోని నాలుగు స్కైవాక్ స్కూళ్లలో చదువుకున్నారు. ‘ఉషిక అనే అమ్మాయి మా బడి చూశాక వాళ్ల అమ్మా నాన్న మీద పెద్ద యుద్ధం చేసి మా దగ్గర చదువుకుంది. ఈ సంవత్సరం స్కూల్లో చేరనుంది. ఇంతకు మునుపు మట్టిలో ఆడుకుంటూ మురిగ్గా ఉండే తమ పిల్లలు ఇప్పుడు అక్షరాలు చదవడం చూసి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఉషిక చదువుకోవడం మొదలెట్టాక మా సహాయంతో ఆమె తల్లిదండ్రులు ఒక స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు’ అంది హైమంతి. స్కైవాక్‌ల మీద వచ్చే పోయేవారిలో ఈ పిల్లల పట్ల ఇలాంటి పిల్లల పట్ల సానుభూతి ఏర్పడి సాయానికి ముందుకు రావాలని కూడా హైమంతి ఆలోచన. హైమంతి చేస్తున్న పని చాలా ప్రశంసలకే పాత్రమైంది. కాని ‘ఈ పిల్లలు ఏం చేసినా బాగుపడరు’ అనే నిరాశ కూడా వ్యక్తమైంది. కాని హైమంతితో కలిసి నడిచే వాలంటీర్లు వస్తున్నారు. పిల్లలను వెతికి వెతికి వారికి ఆసక్తి కలిగేలా పాఠాలు చెబుతున్నారు. వారి చేతికి అక్షరాలు అనే దారి దీపాలు ఇవ్వడానికి చూస్తున్నారు. నగరాల్లో ఇలాంటి పిల్లలను వెతికి ఈ పని చేసే ఇలాంటి వారు మరింత మంది ఉంటే బాగుణ్ణు. -
ఆకాశవంతెనలు నిరుపయోగం
సాక్షి, ముంబై: నగరంలోని అనేక ప్రాంతాల్లో నిర్మించిన ఆకాశవంతెన (స్కైవాక్)లు నిరుపయోగంగా మారుతున్నాయి. అవి యాచకులు, మాదకద్రవ్యాల బానిసలు, మద్యప్రియులు, జూదగాళ్లు, ప్రేమికులు, ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. వీరంతా స్కైవాక్లపైనే తిష్టవేస్తున్నారు. వాటిని దుర్గంధమయం చేస్తున్నారు. దీంతో వాటిని వినియోగించుకునేందుకు బాటసారులు, మహిళలు, పిల్లలు జంకుతున్నారు. రాత్రి వేళల్లో వెళ్లేందుకు పురుషులు కూడా జంకుతున్నారు. కాగా నగర రహదారులను హాకర్లు ఆక్రమిస్తున్నారు. సమస్య రైల్వేస్టేషన్ల వద్ద తీవ్రంగా ఉంది. రైలు దిగిన ప్రయాణికులు రోడ్డెక్కాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) స్కైవాక్‌ల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా రైలు దిగిన ప్రయాణికులు నేరుగా ఆటో, బస్టాండ్ లేదా రహదారి చేరుకుంటారని ఆ సంస్థ భావించింది. అయితే అనుకున్నదొక్కది.... అయ్యిందొక్కటి అనే చందంగా స్కైవాక్‌ల పరిస్థితి మారింది. స్కైవాక్‌లను ఎక్కడం బాగా కష్టంగా ఉండడంతో వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు రహదారులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో వీటి నిర్మాణానికి అర్థమే లేకుండాపోయింది. ఈ కారణంగా ఇవి అలంకార ప్రాయంగా మారాయి.