Haimanti Sen: అ అంటే ఆకాశ బడి | Haimanti Sen sets turn skywalk into a classroom in mumbai | Sakshi
Sakshi News home page

Haimanti Sen: అ అంటే ఆకాశ బడి

Published Sat, Feb 19 2022 12:26 AM | Last Updated on Sat, Feb 19 2022 3:55 PM

Haimanti Sen sets turn skywalk into a classroom in mumbai - Sakshi

అ అంటే అమ్మ. కాని అమ్మ పనికి పోతుంది. ఆ అంటే ఆకలి.  నాన్న పనికి వెళ్లమంటాడు. చదువు ఇప్పటికీ కొందరికి అందదు. అక్షరాలు, పుస్తకాలు, క్లాస్‌రూములు చూడకుండా వాళ్లు పెద్దవాళ్లై మురికివాడలకు పరిమితమవుతారు. ‘వెర్రి కోరికే కావచ్చు. కాని నా ప్రయత్నం నేను చేస్తాను’ అనుకుంది హైమంతి సేన్‌. వీధి బాలల కోసం ముంబైలో ‘జునూన్‌’ (వెర్రి కోరిక) అనే సంస్థ స్థాపించి వారికి ‘స్కైవాక్‌’ల మీద అక్షరాలు నేర్పే పని చేస్తోంది. ఒక రకంగా ఆమె నడుపుతున్నది ఆకాశబడులు.

ముంబైలో పాదచారుల కోసం స్కైవాక్‌లు ఏర్పాటు చేయడం హైమంతి సేన్‌కు మేలు చేసింది. స్కూల్‌ కోసం బిల్డింగ్‌ను అద్దెకు తీసుకోవడం, బల్లలు పెట్టడం, లైట్లు వెలిగించడం లాంటి ఖర్చులేమీ పెట్టే అవసరం లేకపోయింది. నాలుగు చాపలు పట్టుకుని వెళ్లి, వస్తూ పోతున్న వారిని పట్టించుకోకుండా ఒక వైపుగా పరిస్తే, రెయిలింగ్‌కి నాలుగు చార్టులు బిగిస్తే అదే బడి. అలాంటి బడే వీధిపిల్లలను ఆకర్షిస్తుంది అని భావించిందామె. గత రెండేళ్లుగా ఆ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది కూడా.

ముంబై కండీవాలి రైల్వేస్టేషన్‌ దగ్గర ఉన్న స్కైవాక్‌ మీదకు వెళితే ఏ పని దినాల్లోనైనా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ స్కూలు నడుస్తూ కనిపిస్తుంది. స్కూల్‌ అంటే ఒకటి రెండు చాపలు పరువగా ఐదు పది మంది వీధి బాలలు కూచోగా నడిచే స్కూలు. ఇలాంటి స్కూళ్లు ముంబైలోని స్కైవాక్‌ల మీద హైమంతి ఆధ్వర్యంలో ఇప్పుడు నాలుగు నడుస్తున్నాయి. రోజూ ‘జునూన్‌’ తరఫున వాలంటీర్లు ఈ స్కూళ్లు నడుపుతారు. వీధి బాలలు వాటిలో చదువుకుంటారు. ఇలా నడుస్తున్న స్కూళ్లు ఇవే కావచ్చు.

‘నేను కొన్నాళ్లు టీచర్‌గా, పర్సనాల్టీ డెవలప్‌మెంట్‌ కౌన్సిలర్‌గా పని చేశాను. మంచి జీతం వచ్చే ఆ ఉద్యోగంలో నాకు తృప్తి కనిపించలేదు. ముంబైలో ఎక్కడ చూసినా రోడ్డు మీద ఏవో కొన్ని చిల్లర వస్తువులు అమ్మే బాలలు, భిక్షాటన చేసే బాలలు కనిపించేవారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసున్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. కాని ఆ చట్టం వచ్చాక కూడా చాలామంది పిల్లలకు చదువు అబ్బడం లేదు. అందరం సమస్యను గమనిస్తూ ఉంటాం. కాని దాని పరిష్కారానికి ఎంతో కొంత పని చేయడం అవసరం. నేను ఆ పని చేయాలనుకున్నాను’ అంటుంది హైమంతి సేన్‌.

వీధి బాలల కోసం పని చేయాలి అని 2018లో అనుకున్నాక మురికివాడల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ బడుల్లోకి వెళ్లి అక్కడి హెడ్‌మాస్టర్లతో మాట్లాడింది ఆమె. ‘ఆ పిల్లలతో వేగలేము. వాళ్లు సరిగ్గా స్కూళ్లకు రారు. వచ్చినా సాటి పిల్లలను చెడగొడతారు. యూనిఫామ్‌లు పుస్తకాలు తీసుకెళ్లి పత్తా ఉండరు.’ అని వారు చెప్పారు. అదొక్కటే కాదు... ఆరేడేళ్ల వయసు వచ్చాక కూడా స్కూల్‌కు పంపకపోవడం వల్ల ఆ వయసు పిల్లలను నేరుగా రెండో క్లాసులోనో మూడో క్లాసులోనో వేయడం సమస్య అవుతోంది. ఆ క్లాసును వాళ్లు అందుకోలేరు. చిన్న క్లాసులో కూచోలేరు.

‘ఇవన్నీ చూశాక ఆ పిల్లలను చదివించి బ్రిడ్జ్‌ కోర్స్‌లాంటిది చేయించి నేరుగా స్కూళ్లలో చేర్పించాలి అనుకున్నాను’ అంది హైమంతి. ముందు ఆమె ఏదైనా స్థలం వెతికి ఆ పని చేయాలనుకుంది కాని పిల్లలను ఆకర్షించాలంటే వాళ్లు స్వేచ్ఛగా నేర్చుకుంటున్నాము అనుకోవాలంటే స్కైవాక్‌లే సరైనవి అనుకుంది.

‘అయితే పిల్లలను పట్టుకురావడం అంత సులభం కాదు. మురికివాడల్లోని తల్లిదండ్రులు వారి చేత పని చేయిద్దామనుకుంటారు. వారిని ఒప్పించి తీసుకురావాల్సి వచ్చింది’ అందామె. ఈ రెండేళ్లలో దాదాపు 35 కుటుంబాల పిల్లలు ముంబైలోని నాలుగు స్కైవాక్‌ స్కూళ్లలో చదువుకున్నారు. ‘ఉషిక అనే అమ్మాయి మా బడి చూశాక వాళ్ల అమ్మా నాన్న మీద పెద్ద యుద్ధం చేసి మా దగ్గర చదువుకుంది. ఈ సంవత్సరం స్కూల్లో చేరనుంది. ఇంతకు మునుపు మట్టిలో ఆడుకుంటూ మురిగ్గా ఉండే తమ పిల్లలు ఇప్పుడు అక్షరాలు చదవడం చూసి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఉషిక చదువుకోవడం మొదలెట్టాక మా సహాయంతో ఆమె తల్లిదండ్రులు ఒక స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు’ అంది హైమంతి.

స్కైవాక్‌ల మీద వచ్చే పోయేవారిలో ఈ పిల్లల పట్ల ఇలాంటి పిల్లల పట్ల సానుభూతి ఏర్పడి సాయానికి ముందుకు రావాలని కూడా హైమంతి ఆలోచన. హైమంతి చేస్తున్న పని చాలా ప్రశంసలకే పాత్రమైంది. కాని ‘ఈ పిల్లలు ఏం చేసినా బాగుపడరు’ అనే నిరాశ కూడా వ్యక్తమైంది.

కాని హైమంతితో కలిసి నడిచే వాలంటీర్లు వస్తున్నారు. పిల్లలను వెతికి వెతికి వారికి ఆసక్తి కలిగేలా పాఠాలు చెబుతున్నారు. వారి చేతికి అక్షరాలు అనే దారి దీపాలు ఇవ్వడానికి చూస్తున్నారు. నగరాల్లో ఇలాంటి పిల్లలను వెతికి ఈ పని చేసే ఇలాంటి వారు మరింత మంది ఉంటే బాగుణ్ణు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement