street childrens
-
Haimanti Sen: అ అంటే ఆకాశ బడి
అ అంటే అమ్మ. కాని అమ్మ పనికి పోతుంది. ఆ అంటే ఆకలి. నాన్న పనికి వెళ్లమంటాడు. చదువు ఇప్పటికీ కొందరికి అందదు. అక్షరాలు, పుస్తకాలు, క్లాస్‌రూములు చూడకుండా వాళ్లు పెద్దవాళ్లై మురికివాడలకు పరిమితమవుతారు. ‘వెర్రి కోరికే కావచ్చు. కాని నా ప్రయత్నం నేను చేస్తాను’ అనుకుంది హైమంతి సేన్. వీధి బాలల కోసం ముంబైలో ‘జునూన్’ (వెర్రి కోరిక) అనే సంస్థ స్థాపించి వారికి ‘స్కైవాక్’ల మీద అక్షరాలు నేర్పే పని చేస్తోంది. ఒక రకంగా ఆమె నడుపుతున్నది ఆకాశబడులు. ముంబైలో పాదచారుల కోసం స్కైవాక్‌లు ఏర్పాటు చేయడం హైమంతి సేన్‌కు మేలు చేసింది. స్కూల్ కోసం బిల్డింగ్‌ను అద్దెకు తీసుకోవడం, బల్లలు పెట్టడం, లైట్లు వెలిగించడం లాంటి ఖర్చులేమీ పెట్టే అవసరం లేకపోయింది. నాలుగు చాపలు పట్టుకుని వెళ్లి, వస్తూ పోతున్న వారిని పట్టించుకోకుండా ఒక వైపుగా పరిస్తే, రెయిలింగ్‌కి నాలుగు చార్టులు బిగిస్తే అదే బడి. అలాంటి బడే వీధిపిల్లలను ఆకర్షిస్తుంది అని భావించిందామె. గత రెండేళ్లుగా ఆ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది కూడా. ముంబై కండీవాలి రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న స్కైవాక్ మీదకు వెళితే ఏ పని దినాల్లోనైనా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ స్కూలు నడుస్తూ కనిపిస్తుంది. స్కూల్ అంటే ఒకటి రెండు చాపలు పరువగా ఐదు పది మంది వీధి బాలలు కూచోగా నడిచే స్కూలు. ఇలాంటి స్కూళ్లు ముంబైలోని స్కైవాక్‌ల మీద హైమంతి ఆధ్వర్యంలో ఇప్పుడు నాలుగు నడుస్తున్నాయి. రోజూ ‘జునూన్’ తరఫున వాలంటీర్లు ఈ స్కూళ్లు నడుపుతారు. వీధి బాలలు వాటిలో చదువుకుంటారు. ఇలా నడుస్తున్న స్కూళ్లు ఇవే కావచ్చు. ‘నేను కొన్నాళ్లు టీచర్‌గా, పర్సనాల్టీ డెవలప్మెంట్ కౌన్సిలర్‌గా పని చేశాను. మంచి జీతం వచ్చే ఆ ఉద్యోగంలో నాకు తృప్తి కనిపించలేదు. ముంబైలో ఎక్కడ చూసినా రోడ్డు మీద ఏవో కొన్ని చిల్లర వస్తువులు అమ్మే బాలలు, భిక్షాటన చేసే బాలలు కనిపించేవారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసున్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. కాని ఆ చట్టం వచ్చాక కూడా చాలామంది పిల్లలకు చదువు అబ్బడం లేదు. అందరం సమస్యను గమనిస్తూ ఉంటాం. కాని దాని పరిష్కారానికి ఎంతో కొంత పని చేయడం అవసరం. నేను ఆ పని చేయాలనుకున్నాను’ అంటుంది హైమంతి సేన్. వీధి బాలల కోసం పని చేయాలి అని 2018లో అనుకున్నాక మురికివాడల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ బడుల్లోకి వెళ్లి అక్కడి హెడ్మాస్టర్లతో మాట్లాడింది ఆమె. ‘ఆ పిల్లలతో వేగలేము. వాళ్లు సరిగ్గా స్కూళ్లకు రారు. వచ్చినా సాటి పిల్లలను చెడగొడతారు. యూనిఫామ్‌లు పుస్తకాలు తీసుకెళ్లి పత్తా ఉండరు.’ అని వారు చెప్పారు. అదొక్కటే కాదు... ఆరేడేళ్ల వయసు వచ్చాక కూడా స్కూల్‌కు పంపకపోవడం వల్ల ఆ వయసు పిల్లలను నేరుగా రెండో క్లాసులోనో మూడో క్లాసులోనో వేయడం సమస్య అవుతోంది. ఆ క్లాసును వాళ్లు అందుకోలేరు. చిన్న క్లాసులో కూచోలేరు. ‘ఇవన్నీ చూశాక ఆ పిల్లలను చదివించి బ్రిడ్జ్ కోర్స్లాంటిది చేయించి నేరుగా స్కూళ్లలో చేర్పించాలి అనుకున్నాను’ అంది హైమంతి. ముందు ఆమె ఏదైనా స్థలం వెతికి ఆ పని చేయాలనుకుంది కాని పిల్లలను ఆకర్షించాలంటే వాళ్లు స్వేచ్ఛగా నేర్చుకుంటున్నాము అనుకోవాలంటే స్కైవాక్లే సరైనవి అనుకుంది. ‘అయితే పిల్లలను పట్టుకురావడం అంత సులభం కాదు. మురికివాడల్లోని తల్లిదండ్రులు వారి చేత పని చేయిద్దామనుకుంటారు. వారిని ఒప్పించి తీసుకురావాల్సి వచ్చింది’ అందామె. ఈ రెండేళ్లలో దాదాపు 35 కుటుంబాల పిల్లలు ముంబైలోని నాలుగు స్కైవాక్ స్కూళ్లలో చదువుకున్నారు. ‘ఉషిక అనే అమ్మాయి మా బడి చూశాక వాళ్ల అమ్మా నాన్న మీద పెద్ద యుద్ధం చేసి మా దగ్గర చదువుకుంది. ఈ సంవత్సరం స్కూల్లో చేరనుంది. ఇంతకు మునుపు మట్టిలో ఆడుకుంటూ మురిగ్గా ఉండే తమ పిల్లలు ఇప్పుడు అక్షరాలు చదవడం చూసి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఉషిక చదువుకోవడం మొదలెట్టాక మా సహాయంతో ఆమె తల్లిదండ్రులు ఒక స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు’ అంది హైమంతి. స్కైవాక్‌ల మీద వచ్చే పోయేవారిలో ఈ పిల్లల పట్ల ఇలాంటి పిల్లల పట్ల సానుభూతి ఏర్పడి సాయానికి ముందుకు రావాలని కూడా హైమంతి ఆలోచన. హైమంతి చేస్తున్న పని చాలా ప్రశంసలకే పాత్రమైంది. కాని ‘ఈ పిల్లలు ఏం చేసినా బాగుపడరు’ అనే నిరాశ కూడా వ్యక్తమైంది. కాని హైమంతితో కలిసి నడిచే వాలంటీర్లు వస్తున్నారు. పిల్లలను వెతికి వెతికి వారికి ఆసక్తి కలిగేలా పాఠాలు చెబుతున్నారు. వారి చేతికి అక్షరాలు అనే దారి దీపాలు ఇవ్వడానికి చూస్తున్నారు. నగరాల్లో ఇలాంటి పిల్లలను వెతికి ఈ పని చేసే ఇలాంటి వారు మరింత మంది ఉంటే బాగుణ్ణు. -
వీళ్లకి కరోనా అంటే భయం లేదు..
సాక్షి, హైదరాబాద్ (గాంధీఆస్పత్రి): కరోన వైరస్ తాకిడికి ప్రపంచం మొత్తం మాస్క్‌లు వేసుకుని భౌతిక దూరం పాటిస్తూ తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపధ్యంలో ఎటువంటి అదురు, బెదురు లేకుండా ఊయల ఊగుతూ భయమనేది తెలియకుండా బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ చిన్నారులు. తెలంగాణ కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ముందు నుంచి వెల్లేందుకే జంకుతున్న క్రమంలో గాంధీఆస్పత్రి ప్రధాన ద్వారం సమీపంలో మాస్క్‌లు ధరించకుండా ఎటువంటి భయం లేకుండా చిన్నారులు ఆటలాడుకుంటున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. బాల్యానికి మించిన మధురస్మృతి లేదంటారు. చదవండి: యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో -
పెద్దయ్యాక సీఎం అవుతా..
సాక్షి, తిరుపతి: వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో ఓ బాలిక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో సీఎంను అవుతానని పోలీసులతో చెప్పింది. తిరుపతి అర్బన్ పోలీసులు బుధవారం ఏఆర్ పరేడ్ పోలీస్ గ్రౌండ్లో అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మూడో తరగతి చదువుతున్న అలకనంద(7) అనే బాలిక తల్లిదండ్రులు 8 నెలల కిందట హైదరాబాద్ నుంచి తిరుపతికి వలస వచ్చి బియ్యం వ్యాపారి వద్ద కూలి పనులు చేసుకుంటూ బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా ఈ పాప కూడా పనిచేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. దాంతో అర్బన్ ఎస్పీ ఆ పాపను విచారిస్తూ పెద్దయ్యాక ఏం చేస్తావ్? అని అడిగితే ఆ చిన్నారి పైవిధంగా సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు చిన్నారి బదిలిస్తూ.. హైదరాబాద్‌లో చదువుకుంటే తమకు అమ్మ ఒడి రాదంది. ఏపీలో తన లాంటి చిన్నారులను ప్రోత్సహించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చినట్టు తెలిపింది. -
బాలల కోసం బహువిధ రక్షణ
సాక్షి, అమరావతి: వీధి బాలల రక్షణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం (ఐసీపీఎస్)కింద వివిధ రూపాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం గ్రామ, మండల, పట్టణ, రైల్వే స్టేషన్ స్థాయిల్లో 10,541 రక్షణ కమిటీలను నియమించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,201 బాల్య వివాహాలను నివారించింది. పోక్సో చట్టం కింద నమోదైన 6,038 లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు రక్షణ కల్పించింది. 13,703 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి కల్పించింది. తల్లిదండ్రులు, సంరక్షకులు లేని బాలలను హోమ్స్‌కు తరలించి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టింది. 3,793 మంది యాచించే పిల్లలను గుర్తించి వారి రక్షణ కోసం చర్యలు చేపట్టింది. హెచ్ఐవీ, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలున్న 843 మంది పిల్లల్ని గుర్తించి సహకారం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. రాష్ట్రంలో 14 శిశు గృహ కేంద్రాలు ఉండగా.. వాటిలో 127 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ పిల్లల్లో 675 మంది పిల్లలను వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చే కుటుంబాలకు దత్తత ఇవ్వబోతోంది. పిల్లల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు చదువు అనేది పిల్లల ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా శిక్షార్హులవుతారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాం. అనాథ పిల్లలు ఎక్కడ దొరికినా శిశు గృహ కేంద్రాలకు తరలించి ప్రభుత్వమే వారి ఆలనా, పాలనా చూస్తోంది. – కృతికా శుక్లా, డైరెక్టర్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ -
బడి ఎరుగని బాల్యం!
సాక్షి, రంగంపేట(తూర్పు గోదావరి) : బడిఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. చిన్నారుల తల్లిదండ్రుల పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాలు, దుస్తులు, బూట్లు, సాక్సులు వంటి వాటితో పాటు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం సమకూరుస్తోంది. అయినా కొందరు పిల్లలు ఇంకా బడికి దూరంగానే మిగిలిపోతున్నారు. వారు పొద్దున్న లేచింది మొదలు గ్రామాల్లో తిరుగుతూ రోడ్ల పక్కన పాడేసిన చెత్తలో చిత్తు కాగితాలు, అట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటున్నారు. అలా సేకరించిన చెత్తను మూటలుగా కట్టి రిక్షాలపై వేసి తొక్కుకుంటూ, తోసుకుంటూ తీసుకువెళ్లి తమ పెద్దవాళ్లకు అప్పగిస్తుంటే వారు దాని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం తాగి జల్సాలు చేసుకుంటున్నారు. పిల్లలు తెచ్చే సంపాదనకు అలవాటుపడ్డ తల్లిదండ్రులు వారిని ఈ చెత్త సేకరణకు ప్రోత్సహిస్తున్నారే తప్ప చదివించి ప్రయోజకుల్ని చేద్దామన్న ఆలోచన ఉండటం లేదు. వారి తల్లిదండ్రుల వ్యక్తిగత స్వార్థం, అధికారుల ఊదాసీనత వల్ల చాలా మంది బాలలు బడి బయటే గడుపుతున్నారు. ఆ బాలలకు చెప్పేవారు లేక తమ బాల్యాన్ని చెత్తకుప్పల మధ్య గడిపేస్తున్నారు. చిత్తుకాగితాలు, ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను ఏరుకుంటూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు తాము మద్యం తాగుతూ వీళ్లకు తాగడం అలవాటు చేసేస్తున్నారు. బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉన్నారంటూ ప్రభుత్వానికి లెక్కలు పంపే విద్యాశాఖ అధికారులకు రోడ్ల వెంబడి, చెత్తకుప్పల మధ్య తిరుగుతున్న బాల బాలికలు కనబడటంలేదు. అవగాహన కల్పించాలి అధికారులు ఇలాంటి బాలల తల్లిందండ్రులకు అవగాహన కల్పించి, వారిని నయానోభయానో ఒప్పించి స్కూళ్లల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించాల్సి ఉంది. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థి తల్లికి ఏటా రూ.15 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని చెప్పి ఆ పిల్లలను పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చిన్నారులు.. చిరునగవులు
సాక్షి, హైదరాబాద్: వీధి బాలలు, అనాథలు, తప్పిపోయిన చిన్నారులను చేరదీసి వారికి రక్షణ కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలు ఫలించి ఎందరో చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం రావడం... ఫలితంగా బాలకార్మికులు, వీధిబాలలు, భిక్షాటన చేయించడం తగ్గుముఖం పడుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పిల్లల సంఖ్య తక్కువగా నమోదైంది. ప్రతీ ఏటా జనవరిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీస్, లేబర్, జీహెచ్ఎంసీ తదితర శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ ఆపరేషన్ స్మైల్ లో ఈ సంవత్సరం 2,425 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. అందులో 2,168 చిన్నారులను సేకరించిన వివరాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరో 66 మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరిపి వారికి అప్పగించగా...మరో 191 మంది చిన్నారులను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించారు. ప్రతీ ఏటా జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తారు. ఐదేళ్లలో 23 వేల చిన్నారులకు రక్షణ హైదరాబాద్‌లోని పలు దుకాణాల యజమానులు చిన్నారులను పనిలో పెట్టుకుంటున్నారని పలు ఫిర్యాదులు రావడంతో 2014–15 సంవత్సరంలో పోలీస్ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్‌లోని బ్యాంగిల్ ఇండస్ట్రీలో దాడులు నిర్వహించి 356 మంది చిన్నారులను గుర్తించారు. వారిని పనిలో నుంచి తొలగించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరికొందర్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించారు. స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు 23,476 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. వీరిలో కుటుంబ సభ్యుల వివరాలు చెప్పిన వారికి ఇంటికి పంపించారు. అనాథపిల్లలను కస్తూర్భా గాంధీ పాఠశాలలు, వసతిగృహాల్లో చేర్పించారు. పరిస్థితి మారుతోంది రాష్ట్రంలో బాలకార్మికులు, వీధిబాలలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్‌ల ద్వారా రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా దొరుకుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలిపిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక వాహనంలో ఇంటికి పంపిస్తున్నాం. చట్టాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రచారం చేయడం, క్షేత్రస్థాయి నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో చాలాచోట్ల పరిస్థితి మారింది. గణాంకాల్లోనూ పిల్లల సంఖ్య తగ్గుతూ రావడం శుభపరిణామం. –కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సంయుక్త సంచాలకులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ -
తమ అభిమాన హీరోని కలవాలని కొందరు..
తమ అభిమాన కథానాయకుడిని కలవాలని కొందరు.. అసాధ్యమని తెలియక హీరోలు కావాలని ఇంకొందరు.. అమ్మానాన్న మందలించారని మరికొందరు.. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టి వీధిన పడుతున్నారు.. తిరిగి ఇంటికెళ్లలేక రోడ్డుమీదే బతికేస్తున్నారు.. మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల చేతికి చిక్కి.. యాచక వృత్తిలోకి బలవంతంగా దించేవారికి దొరికి.. బంగారు భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకుంటున్నారు! సాక్షి, ముంబై: వీధిబాలల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 2017లో ఒక్క ముంబై నగరంలోనే పోలీసులు దాదాపు 700 మంది వీధిబాలలను కాపాడారు. ఇంకా పోలీసులకు చిక్కకుండా రోడ్లపై తిరుగుతున్నవారు మరెందరో ఉన్నారు. వీరంతా అనాథలు కారని, రకరకాల కారణాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినవారేనని పోలీసులు చెబుతున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మానాన్న మందలించారనే కోపంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్లాలలో తెలియక రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే బతుకున్న 706 మంది చిన్నారులను 2017లో గుర్తించి, తిరిగి ఇంటికి పంపడమో, వసతి గృహాల్లో చేర్చడమో చేశారు. ముంబై శివారు ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలోనే 528 మందిని గుర్తించగా వారిలో 360 మంది బాలలు, 168 మంది బాలికలు ఉన్నారు. ఇక ముంబైలోని రైల్వే స్టేషన్లలో 178 మందిని గుర్తించగా వారిలో 115 బాలలు, 63 మంది బాలికలున్నారు. వీరంతా 13 నుంచి 18 ఏళ్లలోపు వయసు వారే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారట. సమాచారం అందిస్తే సరి.. పిల్లలెవరైనా తప్పిపోతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్ నంబర్ వంటి వివరాల ఆధారంగా కూడా తల్లిదండ్రులను గుర్తిస్తున్నామని, అయితే చాలామంది పిల్లలు తిరిగి ఇంటికెళ్లేందుకు భయపడుతున్నారని, అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా తిరిగి ఇంటికి పంపుతున్నామని చెబుతున్నారు. దొరకనివారి పరిస్థితి... రైల్వే పోలీసులు గుర్తించిన పిల్లలు ఎలాగోలా తల్లిదండ్రుల వద్దకు చేరడమో.. ఇష్టంలేనివారిని వసతిగృహాల్లో చేర్చడమో జరుగుతోంది. మరి మిగతావారి పరిస్థితి ఏంటి? దీనిపై ఆర్పీఎఫ్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అనుప్‌కుమార్ మాట్లాడుతూ... చాలామంది పిల్లలపై మాదకద్రవ్యాల ముఠాలు, యాచకవృత్తిలోకి పిల్లల్ని దింపే ముఠాలు నిఘాపెట్టాయి. రైళ్లలో నుంచి ఒంటరిగా దిగే పిల్లలకు మాయమాటలు చెప్పి, తీసుకెళ్లి బలవంతంగా బాలకార్మికులుగా, యాచకులుగా, మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారిగా మార్చేస్తున్నారు. -
మరిన్ని మోములపై ముస్కాన్
♦ 45 %తగ్గిన వీధి బాలల సంఖ్య ♦ సరైన చిరునామాలు చెప్పిన వారిని స్వస్థలాలకు చేర్చేలా ఏర్పాట్లు ♦ అనాథ బాలలను కేజీబీవీలు, బాలసదనాలకు తరలింపు రాష్ట్రంలో వీధి బాలల సంఖ్య తగ్గుతోంది. ఇళ్ల నుంచి పారిపోవడం, తప్పిపోవడం లాంటి కారణాలతో వీధినపడ్డ పిల్లల్ని సంరక్షించి పునరావాసం కల్పించేందుకు శిశుసంక్షేమశాఖ ఆరు నెలలకోసారి చేపడుతున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,033 మంది పిల్లలను గుర్తించగా జూలైలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 2,496 మంది బాలలను గుర్తించారు. ఆరు నెలల వ్యవధిలో వీధి బాలల సంఖ్య తగ్గినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పేర్కొంది. తాజాగా గుర్తించిన పిల్లల్ని బాల సదనాలు, కేజీబీవీల్లో చేర్పించడంతోపాటు సరైన చిరునామా ఇచ్చిన పిల్లల్ని స్వగృహాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీధిబాలల సంఖ్య ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటుంది. తాజాగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ మంది వీధి బాలలను గుర్తించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్లాట్‌ఫారాలు, బస్టాపుల్లోనే ఎక్కువ మంది.. జూలై 1 నుంచి 30 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 2,496 మంది వీధి బాలలను అధికారులు గుర్తించారు. వారిలో రాష్ట్రానికి చెందిన పిల్లలు 2,402 మందికాగా మిగిలిన వారు పొరుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు. తాజాగా గుర్తించిన వారిలో ఎక్కువ మంది రైల్వే ప్లాట్‌ఫారాలు, బస్టాపులు, కూడళ్లలో తిరిగుతూ అధికారులకు కనబడగా మరికొందరు యాచిస్తూ కనిపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లల్లో కొందరు తప్పిపోగా మరికొందరు పరిశ్రమలు, కర్మాగారాల్లో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ముస్కాన్ బృందాలు ఆయా పరిశ్రమలపై దాడులు నిర్వహించి బాలలకు విముక్తి కలిగించారు. వారిలో అత్యధికంగా ఒడిశాకు చెందిన 47 మంది చిన్నారులు ఉండగా ఆ తర్వాతి స్థానంలో బిహార్‌కు చెందిన పిల్లలున్నారు. ఆయా పిల్లలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, చిరునామాలు చెప్పిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లకు పంపిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మీదేవి తెలిపారు. కేజీబీవీలకు అనాథ బాలలు... ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా గుర్తించిన వీధి బాలల్లో అనాథలను కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో, బాలసదనాల్లో అధికారులు చేర్పిస్తున్నారు. తాజా ఆపరేషన్‌లో 286 మందిని బాలసదనాలు, కేజీబీవీల్లో చేర్పించినట్లు శిశు సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. వీధి బాలల సంరక్షణకు ఆరు నెలలకోసారి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలే కాకుండా నిరంతరం పనిచేసేలా బాలల పరిరక్షణ సెల్లు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశ్రమలు, నిర్మాణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని శిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
చిరుదీపాలు వెలిగిస్తున్నాడు
స్ఫూర్తి సాటివారికి సాయం చేయాలంటే వారికి డబ్బు, నగలు, వస్త్రాలు వంటివి ఇవ్వనక్కరలేదని, అసలు సాయం చేయాలన్న మంచి మనసు ఉంటే చాలని నిరూపించాడో సెక్యూరిటీ గార్డు. డెహ్రాడూన్‌లోని మాజ్రాలో అలహాబాద్ బ్యాంక్ ఏటీఎంకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బిజేందర్ తాను విధులు నిర్వహిస్తున్న ఏటీఎం ముందున్న ఖాళీస్థలంలో చుట్టుపక్కల వీధిబాలలు, యాచకులు, మురికివాడలలోని పిల్లలను పోగు చేసి, ఆ ఏటీఎం లైటు వెలుగులోనే వారికి నాలుగక్షరమ్ముక్కలు నేర్పుతున్నాడు. సాయంత్రం కాగానే అనాథలు, వీధిబాలలు, యాచకులు బిజేందర్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న ఏటీఎం వద్దకొచ్చి చేరతారు. పొట్టకోస్తే అక్షరం ముక్కరాని ఆ అభాగ్యులకు అక్షరాలు నేర్పుతూ, నిరక్షరాస్యతా చీకటిని పారద్రోలుతూ, వారిలో విద్యావెలుగులను నింపే ప్రయత్నం చేస్తున్నాడు విజేందర్. చదువులేనివారికి అక్షరజ్ఞానం కల్పించడానికి ఎమ్మేలు, బీయేలు చదివి ఉండాల్సిన అవసరం లేదు. కనీస విద్య, ఏదోవిధంగా అవతలివారికి సాయం చేయాలన్న తపన ఉంటే చాలని నిరూపిస్తున్న విజేందర్, ఏటీఎం ముందు విద్యాదీపాలు పెట్టడం మొదలెట్టి ఇప్పటికే పదహారేళ్లయింది. ఇన్నేళ్లుగా తాను చేస్తున్న ఉద్యోగం కన్నా, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం కన్నా కూడా తనకు ఎంతో సంతృప్తి కలిగిస్తున్నది ఇదేనని దీపాల్లా మెరుస్తున్న కళ్లతో ఎంతో సంతోషంగా చెబుతున్నాడు. -
'విద్యార్థులకు న్యాయం చేయండి'