తమ అభిమాన కథానాయకుడిని కలవాలని కొందరు.. అసాధ్యమని తెలియక హీరోలు కావాలని ఇంకొందరు.. అమ్మానాన్న మందలించారని మరికొందరు.. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టి వీధిన పడుతున్నారు.. తిరిగి ఇంటికెళ్లలేక రోడ్డుమీదే బతికేస్తున్నారు.. మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల చేతికి చిక్కి.. యాచక వృత్తిలోకి బలవంతంగా దించేవారికి దొరికి.. బంగారు భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకుంటున్నారు!
సాక్షి, ముంబై: వీధిబాలల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 2017లో ఒక్క ముంబై నగరంలోనే పోలీసులు దాదాపు 700 మంది వీధిబాలలను కాపాడారు. ఇంకా పోలీసులకు చిక్కకుండా రోడ్లపై తిరుగుతున్నవారు మరెందరో ఉన్నారు. వీరంతా అనాథలు కారని, రకరకాల కారణాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినవారేనని పోలీసులు చెబుతున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మానాన్న మందలించారనే కోపంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్లాలలో తెలియక రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే బతుకున్న 706 మంది చిన్నారులను 2017లో గుర్తించి, తిరిగి ఇంటికి పంపడమో, వసతి గృహాల్లో చేర్చడమో చేశారు.
ముంబై శివారు ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలోనే 528 మందిని గుర్తించగా వారిలో 360 మంది బాలలు, 168 మంది బాలికలు ఉన్నారు. ఇక ముంబైలోని రైల్వే స్టేషన్లలో 178 మందిని గుర్తించగా వారిలో 115 బాలలు, 63 మంది బాలికలున్నారు. వీరంతా 13 నుంచి 18 ఏళ్లలోపు వయసు వారే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారట.
సమాచారం అందిస్తే సరి..
పిల్లలెవరైనా తప్పిపోతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్ నంబర్ వంటి వివరాల ఆధారంగా కూడా తల్లిదండ్రులను గుర్తిస్తున్నామని, అయితే చాలామంది పిల్లలు తిరిగి ఇంటికెళ్లేందుకు భయపడుతున్నారని, అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా తిరిగి ఇంటికి పంపుతున్నామని చెబుతున్నారు.
దొరకనివారి పరిస్థితి...
రైల్వే పోలీసులు గుర్తించిన పిల్లలు ఎలాగోలా తల్లిదండ్రుల వద్దకు చేరడమో.. ఇష్టంలేనివారిని వసతిగృహాల్లో చేర్చడమో జరుగుతోంది. మరి మిగతావారి పరిస్థితి ఏంటి? దీనిపై ఆర్పీఎఫ్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అనుప్‌కుమార్ మాట్లాడుతూ... చాలామంది పిల్లలపై మాదకద్రవ్యాల ముఠాలు, యాచకవృత్తిలోకి పిల్లల్ని దింపే ముఠాలు నిఘాపెట్టాయి. రైళ్లలో నుంచి ఒంటరిగా దిగే పిల్లలకు మాయమాటలు చెప్పి, తీసుకెళ్లి బలవంతంగా బాలకార్మికులుగా, యాచకులుగా, మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారిగా మార్చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment