ఫైల ఫోటో
సాక్షి, ముంబై: వాణిజ్య రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ముంబైలోని మూడు ప్రముఖ రైల్వే స్టేషన్లలతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద బాంబులు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తయ్యారు. రైల్వే స్టేషన్లతో పాటు బిగ్‌బీ నివాసంవద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ముమ్మర తనిఖీల అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు అమర్చినట్టు చెప్పాడు. వెంటనే స్పందించిన అధికారులు ఇతర రక్షణ సిబ్బందిని అలర్ట్ చేశారు. స్థానిక పోలీసు సిబ్బందితో పాటు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, బాంబు స్క్వాడ్, జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువుల జాడ ఏదీ తమకు లభించలేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఫోన్‌కాల్ ఎక్కడనుంచి వచ్చింది, ఎవరు చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment