మరిన్ని మోములపై ముస్కాన్‌ | Street Children number decreasing in India | Sakshi
Sakshi News home page

మరిన్ని మోములపై ముస్కాన్‌

Published Fri, Aug 11 2017 1:47 AM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

మరిన్ని మోములపై ముస్కాన్‌

మరిన్ని మోములపై ముస్కాన్‌

45 %తగ్గిన వీధి బాలల సంఖ్య
సరైన చిరునామాలు చెప్పిన వారిని స్వస్థలాలకు చేర్చేలా ఏర్పాట్లు
అనాథ బాలలను కేజీబీవీలు, బాలసదనాలకు తరలింపు  


రాష్ట్రంలో వీధి బాలల సంఖ్య తగ్గుతోంది. ఇళ్ల నుంచి పారిపోవడం, తప్పిపోవడం లాంటి కారణాలతో వీధినపడ్డ పిల్లల్ని సంరక్షించి పునరావాసం కల్పించేందుకు శిశుసంక్షేమశాఖ ఆరు నెలలకోసారి చేపడుతున్న ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,033 మంది పిల్లలను గుర్తించగా జూలైలో చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో 2,496 మంది బాలలను గుర్తించారు. ఆరు నెలల వ్యవధిలో వీధి బాలల సంఖ్య తగ్గినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పేర్కొంది. తాజాగా గుర్తించిన పిల్లల్ని బాల సదనాలు, కేజీబీవీల్లో చేర్పించడంతోపాటు సరైన చిరునామా ఇచ్చిన పిల్లల్ని స్వగృహాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీధిబాలల సంఖ్య ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటుంది. తాజాగా నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ మంది వీధి బాలలను గుర్తించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్లాట్‌ఫారాలు, బస్టాపుల్లోనే ఎక్కువ మంది..
జూలై 1 నుంచి 30 వరకు నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో 2,496 మంది వీధి బాలలను అధికారులు గుర్తించారు. వారిలో రాష్ట్రానికి చెందిన పిల్లలు 2,402 మందికాగా మిగిలిన వారు పొరుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు. తాజాగా గుర్తించిన వారిలో ఎక్కువ మంది రైల్వే ప్లాట్‌ఫారాలు, బస్టాపులు, కూడళ్లలో తిరిగుతూ అధికారులకు కనబడగా మరికొందరు యాచిస్తూ కనిపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లల్లో కొందరు తప్పిపోగా మరికొందరు పరిశ్రమలు, కర్మాగారాల్లో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ముస్కాన్‌ బృందాలు ఆయా పరిశ్రమలపై దాడులు నిర్వహించి బాలలకు విముక్తి కలిగించారు. వారిలో అత్యధికంగా ఒడిశాకు చెందిన 47 మంది చిన్నారులు ఉండగా ఆ తర్వాతి స్థానంలో బిహార్‌కు చెందిన పిల్లలున్నారు. ఆయా పిల్లలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని, చిరునామాలు చెప్పిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లకు పంపిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మీదేవి తెలిపారు.

కేజీబీవీలకు అనాథ బాలలు...
ఆపరేషన్‌ స్మైల్, ముస్కాన్‌ ద్వారా గుర్తించిన వీధి బాలల్లో అనాథలను కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో, బాలసదనాల్లో అధికారులు చేర్పిస్తున్నారు. తాజా ఆపరేషన్లో 286 మందిని బాలసదనాలు, కేజీబీవీల్లో చేర్పించినట్లు శిశు సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. వీధి బాలల సంరక్షణకు ఆరు నెలలకోసారి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలే కాకుండా నిరంతరం పనిచేసేలా బాలల పరిరక్షణ సెల్‌లు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశ్రమలు, నిర్మాణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని శిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement