Department of Child Welfare
-
కొలువుల క్రమబద్ధీకరణ తొలి ప్రతిపాదన పూర్తి.. సీఎం కార్యాలయం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యో గుల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తు న్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్ధీకరించి శాశ్వత ప్రాతి పదికన నియమిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో శాఖలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం వివిధ శాఖలను ఇటీవల ఆదేశించింది. దీంతో క్రమబద్ధీకరణ నిబంధనలకు అను గుణంగా వర్క్ హిస్టరీ ఉన్న ఉద్యోగులను గుర్తించిన శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 143 మంది కాంట్రాక్టు సూపర్వైజర్ల జాబితాతో తొలి ప్రతిపాదన సమర్పించగా సీఎం కార్యాలయం దాన్ని ఆమోదించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఉద్యోగులకు శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్‌లు, కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ నియామక ఉత్త ర్వులు జారీ చేసింది. విధుల్లో చేరిన ఆయా ఉద్యోగులకు కేడర్ ఆధారిత పే స్కేల్‌కు అనుగుణంగా వచ్చే నెల (అక్టోబర్)లో తొలి వేతనం అందనుంది. వడివడిగా కదులుతూ: ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి విద్య, అనుబంధ శాఖల్లోనే దాదాపు 32 శాతం మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గురుకుల సొసైటీలు, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల్లోనే అత్యధిక పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ సర్వీసు నిబంధనల విష యంలో స్పష్టత కోసం ఆయా ఫైళ్లకు మోక్షం కలగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక శాఖతోపాటు సాధారణ పరిపాలన విభాగం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే మరో 30 శాతం మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొలిక్కి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరు లోగా మరికొన్ని ఫైళ్లకు ఆమోదం లభిస్తుందని విశ్వసనీయ సమాచారం. -
సూపర్వైజర్ పోస్టుల భర్తీ ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని సూపర్వైజర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయానికి ఈ పోస్టుల భర్తీ ముడిపడి ఉండటంతో ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సూపర్వైజర్లను క్రమబద్ధీకరిస్తే మరింత మందికి కొత్త కొలువులు వచ్చే అవకాశముందని యంత్రాంగం భావిస్తోంది. దీంతో క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. అంగన్వాడీ టీచర్లకు అవకాశమిస్తూ.. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 420 సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి ఆ శాఖ గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త అభ్యర్థులతో కాకుండా ఇప్పటికే శాఖలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్లతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పదేళ్ల సీనియారిటీ, పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టింది. ప్రస్తుతం ఈ శాఖలో కొనసాగుతున్న కాంట్రాక్టు సూపర్వైజర్లకు వెయిటేజీని ఇస్తూ వారినీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 2న అర్హత పరీక్ష పెట్టి తర్వాత ఫలితాలను వెల్లడించింది. ఈక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తయితే 420 ఉద్యోగాలను అర్హత పరీక్ష ద్వారా వడపోసిన అభ్యర్థులతోనే నేరుగా భర్తీ చేసేందుకు వీలుంటుంది. ఇతర అభ్యర్థులకు లబ్ధి జరుగుతుంది. దీంతో ఫలితాలు విడుదలైనా అర్హుల ప్రాథమిక జాబితాలను ఇంకా ఖరారు చేయలేదు. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు సన్నాహాలు కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, స్థానికత తదితర అంశాలపై స్పష్టత కోసం వారి సర్టిఫికెట్ల పరిశీలన, క్షేత్రస్థాయిలో నిర్ధారణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఫలితాల ప్రకటన తర్వాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరీశీలనకు ఉపక్రమించింది. వ్యూహాత్మకంగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేస్తే క్రమబద్ధీకరణపై స్పష్టత వచ్చాక వేగంగా నియామకాలు చేపట్టవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం కలిగింది. సత్యవతి తండ్రి లింగ్యానా యక్(85) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండాలో మరణించారు. మేడారం జాతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న మంత్రికి సమాచారం అందగానే హుటాహుటీన పెద్దతండా చేరుకున్నారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తండా సమీపాన అంత్యక్రియలు నిర్వహించారు. లింగ్యానాయక్ మరణ వార్త తెలియగానే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మంత్రిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ కమిషన్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తదితరులు మంత్రికి ఫొన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
కరోనా అనాథ పిల్లలెంతమంది?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశ కోవిడ్ సమయం లో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పిల్లలు అనాథలయ్యారు. అలాంటి పిల్లలను గుర్తించేం దుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ద్వారా సమాచార సేకరణ చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 236 మంది పిల్లలు పాక్షిక, పూర్తి అనాథలైనట్లు తేల్చింది. తాజాగా కోవిడ్–19 మూడో దశ కూడా తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండగా.. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమాచారాన్ని సేకరించాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. జిల్లా కార్యాలయానికి సమాచారం.. కరోనా వైరస్ ప్రభావంతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలుంటే ఆ సమాచారాన్ని నేరుగా జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి చేరవేయాలి. ప్రభుత్వం ఈ బాధ్యతలను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు అప్పగించింది. తల్లిదండ్రుల్లో ఒకరు మరణిస్తే పాక్షిక అనాథగా, ఇద్దరు మరణిస్తే పూర్తి అనాథగా గుర్తించి ఆ సమాచారాన్ని జిల్లా కార్యాలయానికి చేరవేయాలి. తల్లిదండ్రుల మరణం నేపథ్యంలో వారి ఆర్థిక స్థితిని అంచనా వేసి తక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలకు తరలించాలి. ఈ ప్రక్రియను శిశుసంక్షేమ ప్రాజెక్టు కార్యాలయం (సీడీపీఓ) ఆధ్వర్యంలో చేపట్టాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు 236 మంది పిల్లలు అనాథలైనట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 11 మంది మాత్రమే ప్రభుత్వ సంక్షేమ గృహాల్లో వసతి పొందుతున్నారు. మిగతా పిల్లలు వారి సమీప బంధువుల వద్ద ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పిల్లల వయసు బట్టి ప్రభుత్వ గృహాలకు పంపే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో జారీ చేయనుంది. -
అనాథలకు స్మార్ట్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్, వెంగళరావునగర్: రాష్ట్రంలోని అనాథలను సంరక్షించేందుకు దేశం గర్వించేలా సమగ్ర చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో శనివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, వినోద్‌కుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో దేశానికి దిక్సూచిలా ఉన్న తెలంగాణ అనాథల విషయంలో తల్లిదండ్రులుగా మరో అద్భుత విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో అనాథలు ఉండొద్దనే సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తామన్నారు. అనాథల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్యనందించి జీవితంలో స్థిరపడేలా ప్రత్యేక రక్షణ కల్పిస్తామన్నారు. సబ్ కమిటీ సమావేశం అనంతరం స్టేట్ హోం ప్రాంగణంలో రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రిగార్డెన్ను కేటీఆర్ సందర్శించి కమిషనర్‌ను అభినందించారు. సబ్ కమిటీ సూచనలు... ♦అనాథ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ చట్టం పెట్టి భవిష్యత్‌లో ఎవరూ ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందించాలి. ♦అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడంతోపాటు వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలి. ఈ కార్డులు ఉంటే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర సర్టిఫికెట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ముస్లింలలో అనాథలను చేరదీసే విధంగా నిర్వహిస్తున్న యతీమ్ఖానాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలా అండగా నిలబడాలి. ♦ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ చానల్లో పెట్టాలి. ఆ ఏడాది నిధులు ఖర్చుకాకపోతే వచ్చే ఏడాది ఉపయోగించుకొనే విధానం పెడితే వారికి శాశ్వత ఆర్థిక భద్రత లభిస్తుంది. ♦ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ హోమ్స్‌లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. -
అంగన్వాడీలకు చేనేత చీరలు
సాక్షి, హైదరాబాద్: చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చేనేత చీరలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యా దేవరాజన్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 67,411 మంది టీచర్లు, ఆయాలకు ఈ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా చేనేత వస్త్రాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు మూడు పర్యాయాలు వేతనాలు పెంచి, 30శాతం వేతన సవరణ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విభాగంపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ అన్నారు. ట్రాన్స్జెండర్లు తయారు చేసిన జనపనార బ్యాగులను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. -
వీల్‌చైర్‌లో వచ్చి.. పరీక్ష రాసి
కదల్లేని పరిస్థితిలో ఉన్నా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. నడవలేక పోయినా పరీక్ష రాయాలన్న తపనే తనను ముందుకు నడిపింది. దీంతో ఇలా వీల్‌చైర్‌లో వచ్చి మరీ పరీక్ష రాసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి అంగన్వాడీ టీచర్ గుజ్జ ప్రేమలతకు నెల రోజుల కిందట కాలు ఫ్యాక్చర్ కావడంతో హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయించుకుంది. రెండు నెలలు రెస్టులో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్‌లోనే ఉంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఉద్యోగం కోసం ప్రేమలత ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆమెకు సూపర్వైజర్ ఉద్యోగ పరీక్ష ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి నేరుగా వీల్‌చైర్‌లో వచ్చిన ఆమె.. దిండు, స్టూల్ కూడా పరీక్ష కేంద్రానికి వెంట తెచ్చుకున్నారు. నల్లగొండ ఎన్జీ కాలేజీలో పరీక్ష రాసి వెళ్లారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ నల్లగొండ -
నాకు ఇప్పుడే పెళ్లి వద్దు.. కాపాడండి!
సాక్షి, బెంగళూరు: తల్లిదండ్రులు బలవంతంగా వివాహం జరిపిస్తున్నారని, కాపాడాలని ఒక యువతి శిశు సంక్షేమ శాఖ అధికారులకు మొరపెట్టుకుంది. తనకు ఇప్పుడే 18 ఏళ్లు వచ్చాయని, తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారని, వద్దంటున్నా వినడం లేదని పిరియాపట్టణ నుంచి లేఖ రాసింది. తమ సొంతూరు హాసన్ కాగా, ఇప్పుడు పిరియాపట్టణలోని స్నేహితురాలి ఇంటికి వచ్చానని, పెళ్లి కాకుండా అడ్డుకోవాలని కోరింది. దీంతో అధికారులు యువతిని పిరియాపట్టణలో ఉన్న సంరక్షణ మందిరానికి తరలించారు. చదవండి: మటం మరిస్వామికి గుబ్బి వీరణ్ణ పురస్కారం -
‘సంక్షేమ’ శాఖలో..డిప్యుటేషన్ల షాక్!
సాక్షి, హైదరాబాద్: ‘‘జిల్లా సంక్షేమ కార్యాలయాల బలోపేతం కోసం మిమ్మల్ని బదిలీ చేస్తున్నాం. ఇకపై డిప్యుటేషన్ల పద్దతిలో మీరంతా డీడబ్ల్యూఓ కార్యాలయాల్లో పని చేయండి. వెంటనే అక్కడ విధుల్లో చేరండి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్కడే కొనసాగండి ఇదీ మహిశాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మినిస్టీరియల్ ఉద్యోగులకు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఆ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ‘న్యూ ఇయర్ షాక్’.క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యను అధిగమించేందుకు సర్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 109 మంది సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్‌లతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆ శాఖ స్థానచలనంకలిగించింది. ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండగా... ఉద్యోగులకు అకస్మాత్తుగా డిప్యుటేషన్లు ఇవ్వడంతో వారంతా అవాక్కయ్యారు. ఎలాంటి సమాచారం లేకుండా... వ్యక్తిగత స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా వేరేచోట విధులు నిర్వహించాలని ఆదేశించడంపై భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల ఆధారంగా ప్రస్తుతం ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా పని ఒత్తిడి తగ్గిన నేపథ్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మినిస్టీరియల్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈమేరకు చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈమేరకు గడచిన డిసెంబర్ 30వ తేదీన మెమో జారీ చేసింది. వెంటనే రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్పందిస్తూ డిప్యుటేషన్లు ఇస్తే సంబంధిత ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా బదిలీ అయిన వారిలో హైదరాబాద్ ఆర్జేడీ పరిధిలో 43 మంది, వరంగల్ ఆర్జేడీ పరిధిలో 66 మంది ఉన్నారు. జిల్లా పరిధిలోనే డిప్యూటేషన్ ఇవ్వాల్సి ఉండగా... కొంతమందికి అంతర్జిల్లాకు కూడా ఇచ్చారు. ఆ ఉద్యోగుల్లో అ‘సమ్మతి’... డిప్యుటేషన్ ఉత్తర్వులు అందడంతో మెజార్టీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కనీస సమాచారం ఇవ్వకుండా, ఉద్యోగుల నుంచి సమ్మతి తీసుకోకుండా ఎలా ఇస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సూచించినట్లుగా ఉద్యోగులతో మాట్లాడాలని, వారి నుంచి సమ్మతి పత్రాలు తీసుకున్న తర్వాతే డిప్యుటేషన్ ఇవ్వాలి. అవేమీ లేకుండానే జిల్లా కార్యాలయాల్లో పనిచేయాలని ఆదేశించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియార్టీని పట్టించుకోకుండా, కౌన్సెలింగ్ నిర్వహించకుండా ఇష్టానుసారంగా స్థానచలనం కలిగించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, కుటుంబాన్ని తరలిస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు వస్తాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ఎన్నికల విధుల్లో ఉండాల్సిన కొందరు ఉద్యోగులకూ డిప్యుటేషన్ ఇచ్చినట్లు సమాచారం. తక్షణాదేశాలు కావడంతో మెజార్టీ ఉద్యోగులు అయిష్టంగానే విధుల్లో చేరారు. -
నాణ్యత అక్కర్లేదా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫుడ్స్‌కు ముడిసరుకుల సరఫరాలో నాణ్యత ప్రమాణాలు అటకెక్కాయి. నాసిరకం సరుకులను కాంట్రాక్టు సంస్థ సరఫరా చేస్తుందనే అభియోగాలను అధికారులు అట్టిపెట్టారు. వాటిపై నిజానిజాలు తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వేసిన థర్డ్ పార్టీ ఎంక్వైరీ విచారణ ప్రక్రియకే పరిమితమైంది. కాంట్రాక్టు సంస్థ కాలపరిమితి ముగుస్తుందన్న సాకుతో టీఎస్ ఫుడ్స్ అధికారులు థర్డ్ పార్టీ నివేదిక కోసం వేచి చూడకుండా.. నిజాలు తేలే వరకు టెండర్లు తెరవొద్దని మంత్రి తేల్చిచెప్పినా కూడా అధికారగణం మాత్రం టెండర్లు తెరిచేందుకే మొగ్గు చూపింది. టీఎస్ ఫుడ్స్‌కు ముడిసరుకుల సరఫరాకు వచ్చిన టెండర్లను అధికారులు సోమవారం తెరిచారు. ఇందులో సాంకేతిక పరమైన అంశాలను మాత్రమే పరిశీలించినట్లు తెలిసింది. కాగా, ముడిసరుకుల కాంట్రాక్టు సంస్థను ఈనెల 29న ఖరారు చేస్తారు. సోమవారం సాంకేతిక అంశాలను పరిశీలించిన టీఎస్ ఫుడ్స్ అధికారులు 29న ఆర్థికపరమైన అంశాలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో తక్కువ ధరలు కోట్ చేసి ఎల్1ని గుర్తించిన సంస్థకు కాంట్రాక్టు బాధ్యతను అప్పగిస్తారు. తాజా టెండర్ల ప్రక్రియలో కొన్ని ప్రధాన సంస్థలే టెండర్లు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో పాల్గొన్న సంస్థలే ఈసారి కూడా టెండర్లు వేసినట్లు సమాచారం. గతంలో అనుసరించిన వ్యూహాల ప్రకారమే ఈసారి కూడా టెండర్ల ప్రక్రియ జరిగిందని, గతంలో సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కే టెండర్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అంతా సిండికేటుదే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల లోపు చిన్నారులకు ఇస్తున్న బాలామృతం, న్యూట్రీమిక్స్, స్నాక్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలన్నీ తెలంగాణ ఫుడ్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటి తయారీకి అవసరమై న ముడిసరుకును టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థ నుంచి తెలంగాణ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. ముడిసరుకులను సరఫరా చేసే కాంట్రాక్టులో నాలుగైదు సంస్థలే కీలకంగా ఉంటున్నాయి. దాదాపు పన్నెండేళ్లుగా ఈ సంస్థలే టెండర్లు దక్కించుకుంటున్నాయి. ఈ సంస్థలే సిండికేట్‌గా మారి టెండర్లు వేస్తున్నాయని, అందుకే ఆ సిండికేటులోని సంస్థలే ఏటా కాంట్రాక్టు దక్కించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ నాణ్యతపై ఫిర్యాదులు అందడం తో మంత్రితో పాటు అధికారులు సీరియస్ అయ్యారు. -
చిన్నారులు.. చిరునగవులు
సాక్షి, హైదరాబాద్: వీధి బాలలు, అనాథలు, తప్పిపోయిన చిన్నారులను చేరదీసి వారికి రక్షణ కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలు ఫలించి ఎందరో చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం రావడం... ఫలితంగా బాలకార్మికులు, వీధిబాలలు, భిక్షాటన చేయించడం తగ్గుముఖం పడుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పిల్లల సంఖ్య తక్కువగా నమోదైంది. ప్రతీ ఏటా జనవరిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీస్, లేబర్, జీహెచ్ఎంసీ తదితర శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ ఆపరేషన్ స్మైల్ లో ఈ సంవత్సరం 2,425 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. అందులో 2,168 చిన్నారులను సేకరించిన వివరాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరో 66 మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరిపి వారికి అప్పగించగా...మరో 191 మంది చిన్నారులను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించారు. ప్రతీ ఏటా జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తారు. ఐదేళ్లలో 23 వేల చిన్నారులకు రక్షణ హైదరాబాద్‌లోని పలు దుకాణాల యజమానులు చిన్నారులను పనిలో పెట్టుకుంటున్నారని పలు ఫిర్యాదులు రావడంతో 2014–15 సంవత్సరంలో పోలీస్ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్‌లోని బ్యాంగిల్ ఇండస్ట్రీలో దాడులు నిర్వహించి 356 మంది చిన్నారులను గుర్తించారు. వారిని పనిలో నుంచి తొలగించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరికొందర్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించారు. స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు 23,476 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. వీరిలో కుటుంబ సభ్యుల వివరాలు చెప్పిన వారికి ఇంటికి పంపించారు. అనాథపిల్లలను కస్తూర్భా గాంధీ పాఠశాలలు, వసతిగృహాల్లో చేర్పించారు. పరిస్థితి మారుతోంది రాష్ట్రంలో బాలకార్మికులు, వీధిబాలలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్‌ల ద్వారా రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా దొరుకుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలిపిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక వాహనంలో ఇంటికి పంపిస్తున్నాం. చట్టాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రచారం చేయడం, క్షేత్రస్థాయి నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో చాలాచోట్ల పరిస్థితి మారింది. గణాంకాల్లోనూ పిల్లల సంఖ్య తగ్గుతూ రావడం శుభపరిణామం. –కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సంయుక్త సంచాలకులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ -
6 నుంచి ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు శిల్పారామంలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఫెస్టివల్‌ను ప్రతి సంవత్సరం ఢిల్లీలో నిర్వహించేవారు. అయితే ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ తెలిపారు. ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ఏర్పాట్ల నేపథ్యంలో సోమవారం శిల్పారామంలోని సంప్రదాయ హాల్లో సంచాలకులు బోయి విజయేందిరతో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించి ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 150 మంది మహిళా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. సేంద్రియ రంగంలో కృషి చేస్తున్న మహిళలు ఇక్కడ ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసి సేంద్రియ సాగు ఉత్పత్తులు, విత్తనాలు, బేకరీ ఉత్పత్తులు, తినుబండారాలను ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉంటాయని చెప్పారు. సేంద్రియ పద్ధతుల్ని మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని, పురుగుమందులు, రసాయనిక ఎరువుల వినియోగం అధికమవుతుండటంతో మనుషులపై వాటి దుష్ప్రభావాలు పెరిగాయన్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. -
‘ఆమె’కు మరింత భరోసా!
సాక్షి, హైదరాబాద్: మహిళలు పనిచేసేచోట మరింత భద్రత కల్పించేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముందడుగు వేసింది. ‘సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్ ఎట్ వర్క్‌ప్లేస్’చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉపక్రమించింది. ఇప్పటివరకు ఈ చట్టం కింద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా, ఇకపై ఆన్లైన్ ద్వారా వినతులు స్వీకరించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. మాన్యువల్ పద్ధతిలో ఫిర్యాదు చేయడంలో ఉన్న ఇబ్బందుల వల్ల ఎక్కువ మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చేవారు కాదు. ఫిర్యాదు చేయకుండా వేధింపులను సహిస్తూ వస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ఈ పరిస్థితిని అధిగమిస్తూ ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రతి కార్యాలయంలో షీ బాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిం ది. వీటిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలే నిర్వహించనున్నాయి. ఈ పెట్టె ద్వారా వచ్చే ఫిర్యాదుల ను పరిశీలించి పరిష్కరించేలా జిల్లా, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనుంది. షీ బాక్స్లతోపాటు ఆన్లైన్ పద్ధతిలో ఫిర్యాదులు స్వీకరించేందుకు వెబ్‌పేజీని తెరిచేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను సైతం అందుబాటులోకి తేనుంది. వెబ్‌పేజీ, యాప్‌ల రూపకల్పన పూర్తి కాగా, ప్రస్తు తం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వచ్చే నెలలో ప్రారంభించేలా ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. నిర్వహణకు ప్రత్యేక విభాగం ప్రభుత్వ కార్యాలయాల్లో షీ బాక్స్లతోపాటు వెబ్‌పేజీ, యాప్ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ విభాగంలో ఒక మహిళా సంక్షేమాధికారి, ఇద్దరు సమన్వయకర్తలుంటారు. ఇప్పటివరకు గృహహింస చట్టం సెల్ (విభాగం) పర్యవేక్షిస్తున్న సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్లను కోఆర్డినేటర్లుగా నియమించేందుకు ఆ శాఖ నిర్ణయించింది. డీవీ సెల్‌ను సఖి కేంద్రాల్లో విలీనం చేయడంతో అక్కడి సిబ్బందిని మహిళా శక్తి కేంద్రాల్లో కొనసాగించేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కోఆర్డినేటర్లు మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతూ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన చర్యలకు సహకరిస్తారు. అదేవిధంగా న్యాయపరమైన సాయం అందిస్తూ చట్టం పట్ల అవగాహన కల్పించి చైతన్యపరుస్తారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక విభాగాలతో పాటు డివిజన్ స్థాయిలోనూ ప్రత్యేకంగా కమిటీలు పనిచేస్తాయి. -
అనుబంధ పోషణ కార్యక్రమంలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న అనుబంధ పోషణ కార్యక్రమం(సప్లిమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రామ్)లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ పథకాల కింద శిశువులు, పిల్లలు, గర్భిణులకు ఇచ్చే పోషకాహారానికి సంబంధించిన ధరలను పెంచింది. ప్రస్తుతం 6 నెలల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారంపై ప్రభుత్వం ప్రతి రోజు రూ.6 ఖర్చు చేస్తుండగా... దాన్ని రూ.8కి పెంచింది. అదే విధంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సరఫరా చేస్తున్న పోషకాహారంపై ప్రతిరోజు రూ.7 ఖర్చు చేస్తుండగా... తాజాగా ఆ మొత్తాన్ని రూ.9.50కి పెంచింది. పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులకు సరఫరా చేసే పౌష్టికాహారంపై రూ.9 ఖర్చు చేస్తుండగా... ఇకపై రూ.12 ఖర్చు చేయనుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
చిట్టి పొట్ట నిండుతలేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశుపోషణ ఆందోళనకరంగా మారుతోంది. నవజాత శిశువుకు ఆరు నెలల వరకూ తల్లి పాలు ఇస్తుండగా.. ఆ తర్వాత ఘనాహారం ఇవ్వాలి. చిన్నారుల ఎదుగుదలకు ఈ సమయంలో పోషణే కీలకం. కానీ రాష్ట్రంలో మెజారిటీ శాతం పిల్లలకు సరైన పోషణ అందడం లేదు. ఆరు నెలలు దాటిన చిన్నారులకు ఘనాహారం పంపిణీపై శిశు సంక్షేమ శాఖ పరిశీలన నిర్వహించగా.. పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 9.6 శాతం మంది పిల్లలు మాత్రమే ఆరు నెలలు నిండిన తర్వాత ఘనాహారం తీసుకుంటున్నట్లు ఈ పరిశీలనలో తేలడం ఆందోళన కలిగిస్తోంది. పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉన్నా.. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ కేంద్రాలు. వీటి పరిధిలో 23.71 లక్షల మంది చిన్నారులు నమోదు కాగా.. వీరిలో 7.25 లక్షల మంది ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు వయసున్నవారు. ఈ క్రమంలో చిన్నారులు ఘనాహారం తీసుకునే తీరుపై ఆ శాఖ పరిశీలన చేయగా.. ఇందులో సగటున 9.6 శాతం చిన్నారులు మాత్రమే సకాలంలో ఘనాహారం తీసుకుంటు న్నట్లు వెల్లడైంది. ఆరు నెలలు దాటిన చిన్నారుల ఎదుగుదల రెండురెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా అవయవాల పెరుగుదల వేగం పుంజుకుంటుంది. దీంతో ఆరు నెలలు దాటిన తర్వాత చనుబాలతో పాటు ఉగ్గు, ఫారెక్స్లాంటి పొడితో కూడిన పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకీ వెనుకబాటు.. చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం తప్పనిసరైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువభాగం చనుబాలతోనే సరిపెడుతున్నారు. ఎక్కువ మంది చిన్నారులకు ఏడాది దాటిన తర్వాతే పోషకాహార పంపిణీ మొదలుపెడుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో పోషకాల పంపిణీపై అవగాహన లేకపోవడం కారణమైతే.. కొన్ని సందర్భాల్లో ఆర్థిక స్తోమత మరో కారణమని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే పోషకాహార పంపిణీ ఆందోళనకరంగా ఉంటోందని శిశు సంక్షేమ శాఖ పరిశీలన చెబుతోంది. ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితిని పరిశీలిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోషకాహార పంపిణీ చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు నెలలు నిండిన చిన్నారులకు ఉగ్గు తదితరాలు కాకుండా సాధారణ భోజనం(మొత్తగా వండిన అన్నం), పెరుగన్నం లాంటివి మెత్తబర్చి పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే తృణధాన్యాలతో కూడిన పోషకాల పంపిణీ సంతృప్తికరంగా జరగడంలేదు. సరైన పోషకాలు అందకపోవడంతో చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో మరో 21 సఖి కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మరిన్ని సఖి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసింది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సఖి కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించడం, న్యాయ సహా యం అందించడం, లైంగిక వేధింపుల బారిన పడిన మహిళలను ఆదుకోవడంతో పాటు వైద్య చికిత్సను సఖి కేంద్రాల్లో పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఉమెన్ హెల్ప్‌లైన్ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ సైతం వీటి ద్వారానే కొనసాగుతోంది. పూర్వపు పది జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున సఖి కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రా నికి ప్రతిపాదనలు సమర్పించగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా రాష్ట్రంలో కొత్తగా 21 సఖి కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొత్త కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేద్దాం..? కొత్తగా ఏర్పాటు చేయనున్న సఖి కేంద్రాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై కేంద్రం స్పష్టత కోరింది. ఇటీవల కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సఖి కేంద్రాల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఆమె స్పం దిస్తూ పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కొత్త కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 10 కేంద్రాలు దాదాపు జిల్లా ఆస్పత్రి, ప్రాంతీయ ఆస్పత్రుల ఆవరణలోగానీ, వాటి సమీపంలోగానీ ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త కేంద్రాలను సైతం జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పక్కా భవనాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్రాల ఏర్పాటుకు స్థలాలు ఖరారైన వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. ఒక్కో కేంద్రానికి గరిష్టంగా రూ.50 లక్షలు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్
- టీచర్‌కు రూ.60 వేలు, ఆయాలకు రూ.30 వేలు - బెనిఫిట్ తక్కువగా నిర్ణయించడంపై అంగన్వాడీల ఆందోళన సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, సహాయకుల (ఆయాల) పదవీ విరమణ అంశం కొలిక్కి వచ్చింది. ఏళ్ల తరబడి సేవలు అందించినందుకు ప్రతిఫలంగా పదవీ విరమణ సమయంలో ఆర్థిక సాయాన్ని అందించాలని సర్కారు నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్లకు రూ.60 వేలు, అంగన్వాడీ హెల్పర్ల (ఆయా)కు రూ.30 వేల చొప్పున అందజేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులేమీ వెలువడలేదు. అయితే పదవీ విరమణ బెనిఫిట్‌గా అతి తక్కువ మొత్తాన్ని నిర్ణయించడంపై అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రూ. 2 లక్షల వరకైనా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా గందరగోళమే.. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 61,920 మంది పనిచేస్తున్నారు. వారిలో అంగన్వాడీ టీచర్లు 30,228 మంది, హెల్పర్లు 28,750 మందికాగా.. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మరో 2,942 మంది టీచర్లు ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారి వయసు 58 ఏళ్లు నిండితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అలా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ రూపంలో ప్రయోజనాలు అందుతాయి. కానీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ శాఖలో గందరగోళం నెలకొంది. అయితే అంగన్వాడీలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్నందున.. వారి పదవీ విరమణ అంశంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. కానీ ఇటీవల కేంద్రం ఈ అంశంపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో అంగన్వాడీల పదవీ విరమణకు సంబంధించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. వాటిని పరిశీలించిన సర్కారు.. తాజాగా ఆర్థిక సాయం మొత్తాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇంకా ఉత్తర్వులేవీ వెలువడలేదు. రిటైర్ కానున్న 5,398 మంది.. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీల్లో 5,398 మంది అరవై ఏళ్ల వయసు నిండిన వారు ఉన్నారు. ఇందులో వెయ్యి మందికి ఏకంగా డెబ్బై ఏళ్లకుపైగా వయసు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీరంతా పదవీ విరమణ ప్రయోజనాలపై స్పష్టత వచ్చాకే రిటైరవుదామని వేచి ఉన్నారని అంటున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వారు పదవీ విరమణ తీసుకునే అవకాశముంటుందని చెబుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనంగా నిర్దేశించిన మొత్తంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అంగన్వాడీలు చెబుతున్నారు. -
మరిన్ని మోములపై ముస్కాన్
♦ 45 %తగ్గిన వీధి బాలల సంఖ్య ♦ సరైన చిరునామాలు చెప్పిన వారిని స్వస్థలాలకు చేర్చేలా ఏర్పాట్లు ♦ అనాథ బాలలను కేజీబీవీలు, బాలసదనాలకు తరలింపు రాష్ట్రంలో వీధి బాలల సంఖ్య తగ్గుతోంది. ఇళ్ల నుంచి పారిపోవడం, తప్పిపోవడం లాంటి కారణాలతో వీధినపడ్డ పిల్లల్ని సంరక్షించి పునరావాసం కల్పించేందుకు శిశుసంక్షేమశాఖ ఆరు నెలలకోసారి చేపడుతున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,033 మంది పిల్లలను గుర్తించగా జూలైలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 2,496 మంది బాలలను గుర్తించారు. ఆరు నెలల వ్యవధిలో వీధి బాలల సంఖ్య తగ్గినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పేర్కొంది. తాజాగా గుర్తించిన పిల్లల్ని బాల సదనాలు, కేజీబీవీల్లో చేర్పించడంతోపాటు సరైన చిరునామా ఇచ్చిన పిల్లల్ని స్వగృహాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీధిబాలల సంఖ్య ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటుంది. తాజాగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ మంది వీధి బాలలను గుర్తించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్లాట్‌ఫారాలు, బస్టాపుల్లోనే ఎక్కువ మంది.. జూలై 1 నుంచి 30 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 2,496 మంది వీధి బాలలను అధికారులు గుర్తించారు. వారిలో రాష్ట్రానికి చెందిన పిల్లలు 2,402 మందికాగా మిగిలిన వారు పొరుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు. తాజాగా గుర్తించిన వారిలో ఎక్కువ మంది రైల్వే ప్లాట్‌ఫారాలు, బస్టాపులు, కూడళ్లలో తిరిగుతూ అధికారులకు కనబడగా మరికొందరు యాచిస్తూ కనిపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లల్లో కొందరు తప్పిపోగా మరికొందరు పరిశ్రమలు, కర్మాగారాల్లో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ముస్కాన్ బృందాలు ఆయా పరిశ్రమలపై దాడులు నిర్వహించి బాలలకు విముక్తి కలిగించారు. వారిలో అత్యధికంగా ఒడిశాకు చెందిన 47 మంది చిన్నారులు ఉండగా ఆ తర్వాతి స్థానంలో బిహార్‌కు చెందిన పిల్లలున్నారు. ఆయా పిల్లలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, చిరునామాలు చెప్పిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లకు పంపిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మీదేవి తెలిపారు. కేజీబీవీలకు అనాథ బాలలు... ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా గుర్తించిన వీధి బాలల్లో అనాథలను కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో, బాలసదనాల్లో అధికారులు చేర్పిస్తున్నారు. తాజా ఆపరేషన్‌లో 286 మందిని బాలసదనాలు, కేజీబీవీల్లో చేర్పించినట్లు శిశు సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. వీధి బాలల సంరక్షణకు ఆరు నెలలకోసారి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలే కాకుండా నిరంతరం పనిచేసేలా బాలల పరిరక్షణ సెల్లు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశ్రమలు, నిర్మాణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని శిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
సేవ ముసుగులో లైంగిక వేధింపులు
⇒ ‘అవేక్ ఓ వరల్డ్’స్వచ్ఛంద సంస్థ అక్రమాలు ⇒ ఖైదీల పిల్లల సంరక్షణ పేరుతో అరాచకాలు ⇒ ఏ అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్న ప్రేమ్‌రాజ్ వర్మ ⇒ ఆరేళ్లుగా యుక్తవయసు పిల్లలపై లైంగిక వేధింపులు ⇒ నిధులు మింగుతూ యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన ⇒ శిశు సంక్షేమ శాఖ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన వాస్తవాలు సాక్షి, హైదరాబాద్: ‘అవేక్ ఓ వరల్డ్’.. జైల్లోని జీవిత ఖైదీల పిల్లలను సంరక్షించేందుకు ప్రపంచాన్ని మేల్కొల్పాలన్న సంకల్పంతో ఏర్పాటైన సంస్థ ఇది. అయితే ప్రపంచాన్ని మేల్కొల్పడం దేవుడెరుగు... ఇన్నాళ్లూ ప్రభుత్వాన్నే మోసపుచ్చుతూ అక్రమాల పుట్టగా మారిందీ సంస్థ. ఎలాంటి అనుమతులు పొందకుండా, కనీసం లెసైన్స్ కూడా లేకుండా ఆరేళ్లుగా ఇది ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. దీన్నంతటినీ ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంస్థ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. దాని నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ వర్మ ఆగడాలను తెలుసుకుని నివ్వెరపోయారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు నిర్ణయించారు. తనిఖీలో బయటపడ్డ వాస్తవాలు 2009 నుంచి హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో నడుస్తున్న అవేక్ ఓ వరల్డ్ సంస్థకి ఎలాంటి గుర్తింపుగానీ, అనుమతులు కానీ లేవు. ఆరేళ్లుగా ఒక్క రికార్డును కూడా నిర్వహించడం లేదు. పిల్లల వివరాలను కూడా నమోదు చేయడం లేదు. ఐదేళ్ల బాలబాలికల నుంచి యుక్తవయసు పిల్లల వరకు అందరినీ ఒకే హోంలో కలిపే ఉంచుతున్నారు. యుక్తవయసు వారిని విడిగా ఉంచాలన్న నిబంధనను పాటించడం లేదు. టీనేజీ అమ్మాయిలు సంస్థ నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ వర్మ ఇంటి వరండాలోనే ఉంటున్నారు. పైగా వారికి మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేదు. అవసరమైతే వర్మ గదిలోకే వెళ్లాలి. వీరికోసం మహిళా పర్యవేక్షకులెవరూ లేకపోవడం జువెనైల్ యాక్ట్‌కి విరుద్ధం. ఇక్కడి పిల్లలకు రోజూ హోటల్ భోజనమే. వంటమనిషిని కూడా పెట్టుకోలేదు. ఇక సంస్థకు వచ్చే నిధుల వివరాలే లేవు. అలాగే గతంలో ఓ జీవిత ఖైదీ భార్య దిక్కులేక ఇదే హోంలో చేరగా ఆమెపై వర్మ అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. కాగా, అవేక్ ఓ వరల్డ్ సంస్థ కార్యాలయాన్ని తనిఖీ చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల కమిటీ ప్రేమ్‌రాజ్ వర్మను నిలదీసింది. అన్ని ప్రశ్నలకూ అతను నీళ్లు నమిలాడు. ఇందుకోసం అనుమతులు తీసుకోవాలన్న విషయమే తనకు తెలియదని చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ అక్రమాలపై ఈ నెల 17న మధ్యాహ్నం సీడబ్ల్యూసీ ఎదుట విచారణకు హాజరుకావాలని అతన్ని ఆదేశించారు. ఇంటర్నెట్, సోషల్ మీడియాపై ఆధారపడి మోసాలు చేస్తున్న ఇలాంటి తప్పుడుతడకల సంస్థలకు ఎలాంటి విరాళాలు ఇవ్వొద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ‘సాక్షి’తో వెలుగులోకి.. ‘అవేక్’ నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ సమాజ సేవ చేస్తున్నానంటూ తొలుత మీడియానూ తప్పుదోవ పట్టించాడు. తద్వారా పలు పత్రికల్లో అనుకూలంగా కథనాలు వచ్చేలా చూసుకున్నాడు. ఏ ఆదరణా లేని ఖైదీల పిల్లలకు సాయం చేస్తున్నానన్న అతని ప్రచారాన్ని ‘సాక్షి’ కూడా విశ్వసించింది. దీంతో ‘ప్రేమ ఖైదీ’ పేరుతో ఓ కథనాన్ని ప్రచురించడంతో పాటు అతన్ని సత్కరించింది. ఖైదీల పిల్లలకు మరింత అండగా నిలిచే ఉద్దేశంతో అవేక్ పూర్వాపరాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నిం చగా దాని గుట్టు బయటపడింది. అది అక్రమాల నిలయమని, పిల్లల పేరుతో డబ్బులు దండుకుంటోందని, అందు లో అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో ఉండే ఓ అమ్మాయి గతేడాది అదృశ్యమైనట్లు తెలుస్తోంది.