అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్
- టీచర్‌కు రూ.60 వేలు, ఆయాలకు రూ.30 వేలు
- బెనిఫిట్ తక్కువగా నిర్ణయించడంపై అంగన్‌వాడీల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల (ఆయాల) పదవీ విరమణ అంశం కొలిక్కి వచ్చింది. ఏళ్ల తరబడి సేవలు అందించినందుకు ప్రతిఫలంగా పదవీ విరమణ సమయంలో ఆర్థిక సాయాన్ని అందించాలని సర్కారు నిర్ణయించింది. అంగన్‌వాడీ టీచర్లకు రూ.60 వేలు, అంగన్‌వాడీ హెల్పర్ల (ఆయా)కు రూ.30 వేల చొప్పున అందజేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులేమీ వెలువడలేదు. అయితే పదవీ విరమణ బెనిఫిట్‌గా అతి తక్కువ మొత్తాన్ని నిర్ణయించడంపై అంగన్‌వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రూ. 2 లక్షల వరకైనా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటిదాకా గందరగోళమే..
ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 61,920 మంది పనిచేస్తున్నారు. వారిలో అంగన్‌వాడీ టీచర్లు 30,228 మంది, హెల్పర్లు 28,750 మందికాగా.. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో మరో 2,942 మంది టీచర్లు ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారి వయసు 58 ఏళ్లు నిండితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అలా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ రూపంలో ప్రయోజనాలు అందుతాయి. కానీ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ శాఖలో గందరగోళం నెలకొంది. అయితే అంగన్‌వాడీలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్నందున.. వారి పదవీ విరమణ అంశంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. కానీ ఇటీవల కేంద్రం ఈ అంశంపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో అంగన్‌వాడీల పదవీ విరమణకు సంబంధించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. వాటిని పరిశీలించిన సర్కారు.. తాజాగా ఆర్థిక సాయం మొత్తాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇంకా ఉత్తర్వులేవీ వెలువడలేదు.
రిటైర్ కానున్న 5,398 మంది..
ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్‌వాడీల్లో 5,398 మంది అరవై ఏళ్ల వయసు నిండిన వారు ఉన్నారు. ఇందులో వెయ్యి మందికి ఏకంగా డెబ్బై ఏళ్లకుపైగా వయసు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీరంతా పదవీ విరమణ ప్రయోజనాలపై స్పష్టత వచ్చాకే రిటైరవుదామని వేచి ఉన్నారని అంటున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వారు పదవీ విరమణ తీసుకునే అవకాశముంటుందని చెబుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనంగా నిర్దేశించిన మొత్తంపై అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అంగన్‌వాడీలు చెబుతున్నారు.