Retirement benefit
-
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ‘ఆసరా’పై దెబ్బ
హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన ఆయన వయసు 73 సంవత్సరాలు.. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులను ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేయగా దానిపై నెలకు రూ.15 వేల వడ్డీ వస్తోంది. ఇప్పుడు ఆయన పూర్తిగా ఈ వడ్డీపైనే ఆధారపడి ఉన్నారు. కానీ మూడు నెలలుగా రాకపోతుండటంతో ఆయనకు దిక్కుతోచని దుస్థితి ఎదురైంది. వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రిటైర్ అయి పదేళ్లయింది. తన రిటైర్మెంట్ బెనిఫిట్‌ను సీసీఎస్‌లో దాచుకోగా నెలకు రూ.9 వేల వడ్డీ వస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తనకు వచ్చే వడ్డీ ఆసరాగా భార్యతో కలిసి బతుకీడుస్తున్నాడు. కానీ ఇప్పుడు వడ్డీ నిలిచిపోవటంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా వీరిద్దరిదే కాదు.. చాలామంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వేదన ఇది. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో ఇప్పుడు ఆ సంస్థ విశ్రాంత ఉద్యోగులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఉద్యోగం చేస్తున్న కాలంలో నెలవారీ వాటాగా నమోదైనమొత్తం, పదవీ విరమణ సమయంలో వచ్చిన బెనిఫిట్ మొత్తాలను చాలా మంది సీసీఎస్‌లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకు కంటే మెరుగైన వడ్డీ పొందే వీలుండటమే దీనికి కారణం. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారి సంగతి పక్కన పెడితే, పేదరికంలో మగ్గుతున్నవారు మాత్రం ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనే ఆధారపడుతున్నారు. కానీ సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ప్రస్తుతం రూ.932 కోట్లు బకాయిపడింది. నెలవారీగా ప్రస్తుతం సీసీఎస్ కోసం ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న రూ.19 కోట్లను ఆర్టీసీ సీసీఎస్‌కు పూర్తిగా చెల్లించటం లేదు. గత నెల కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చింది. దీంతో డిసెంబరు నుంచి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే వడ్డీ పంపిణీ నిలిచిపోయింది. దీంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఎస్ కార్యాలయం చుట్టూ తిరిగి ఫలితం లేక ఉస్సూరు మంటున్నారు. రూ.కోటి కూడా కష్టమేనా.. సీసీఎస్‌లో ప్రస్తుతం ఐదున్నర వేల మంది విశ్రాంత ఉద్యోగులు డిపాజిట్లు పెట్టుకున్నారు. వారి డిపాజిట్ల మొత్తం దాదాపు రూ. 150 కోట్లు. దీనిపై ప్రతినెలా రూ.కోటి వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ రూ.150 కోట్లు లేవు. నెలవారీ వడ్డీకి సరిపడా రూ.కోటి కూడా అందుబాటులో లేదు. దీంతో మూడు నెలలుగా వడ్డీ చెల్లింపు ఆపేశారు. గతంలో పది వేల మంది విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లు ఉండగా, సీసీఎస్ పరిస్థితి గందరగోళంగా మారటంతో సగం మంది డిపాజిట్లు వెనక్కు తీసుకున్నారు. తాజా గందరగోళంతో ఇప్పుడు కొత్తగా 150 మంది సభ్యత్వం రద్దుకు దరఖాస్తు చేసుకున్నారు. మందులకు కూడా డబ్బుల్లేవు ‘‘సీసీఎస్‌లో దాచుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం సహా ఇతర డిపాజిట్ల నుంచి నాకు నెలకు రూ.15 వేలు వస్తాయి. నాకు, హృద్రోగ బాధితురాలైన నా భార్యకు నెలకు మందులకే రూ.20 వేల ఖర్చవుతుంది. సీసీఎస్ వడ్డీ మమ్మల్ని ఆదుకుంటోంది. కానీ గత మూడు నెలలుగా వడ్డీ అందటం లేదు. ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పొదుపు సంస్థగా వెలిగిన సీసీఎస్‌కు మళ్లీ పూర్వవైభవం తెప్పించి నా లాంటి వారిని ఆదుకోవాలి.’’ – ప్రభాకరరావు, రిటైర్డ్ ఏడీసీ -
రిటైర్మెంట్ ఫండ్: సిప్‌ను ఎంచుకోవడం బెస్ట్
రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్, ఎన్పీఎస్, పీపీఎఫ్ ఇవన్నీ రిటైర్మెంట్కు అనుకూలించే సాధనాలే. వీటిల్లో ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం ఉన్నది ఎన్పీఎస్ ఒక్కటే. సాధారణంగా రిటైర్మెంట్కు సుదీర్ఘకాలం ఉంటుంది. కనుక ఈక్విటీ పెట్టుబడులతో భారీ నిధిని సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించొచ్చు. ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈక్విటీ, ఇతర సాధనాలతో కూడిన పెట్టుబడుల విధానంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఎస్బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ (ఎస్ఆర్బీఎఫ్)’ను ప్రారంభించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇది పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడుల ఆప్షన్లు.. ఎస్ఆర్బీఎఫ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం: అంటే ఇన్వెస్టర్లు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. కాకపోతే ఇందులో చేసే పెట్టుబడులకు ఐదేళ్లపాటు లాకిన్ ఉంటుంది. లేదా 65 ఏళ్లు. ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది. ఈ పథకంలో నాలుగు రకాల పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. అగ్రెస్సివ్: ఈ ఆప్షన్ ఎంచుకుంటే, ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 80–100 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్: ఈ ఆప్షన్లో ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం వరకే కేటాయించి, మిగిలిన నిధులను డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా కొంత రిస్క్‌ను తగ్గించే విధంగా పనిచేస్తుంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్: ఈ ఆప్షన్లో ఈక్విటీ కేటాయింపులు 10 శాతం నుంచి గరిష్టంగా 40 శాతానికే పరిమితం. కన్జర్వేటివ్: ఇందులో ఈక్విటీలకు 20 శాతం పెట్టుబడులు మించనీయదు. బంగారం ఈటీఎఫ్‌లు, విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రతీ ప్లాన్‌లో భాగంగా ఉంటుంది. పెట్టుబడుల విధానం ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 50 శాతాన్ని వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్‌ను ఎంచుకుని, వాటిని దీర్ఘకాలం పాటు కొనసాగించే విధానాన్ని ఈ పథకం అనుసరించనుంది. మిగిలిన ఈక్విటీ పెట్టుబడులను స్థూల ఆర్థిక పరిస్థితులు, బిజినెస్సైకిల్స్, కంపెనీల వ్యాల్యూషన్లు, భారీ రాబడి అవకాశాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ పెట్టుబడులను గౌరవ్ మెహతా, ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడులను దినేష్ అహుజా, అంతర్జాతీయ పెట్టుబడులను మోహిత్‌జైన్ చూడనున్నారు. డెట్ పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ కలిగిన పీఎస్‌యూ, సార్వభౌమ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించాలి. అంటే అధిక భద్రతతో కూడిన డెట్ సాధనాలనే ఈ పథకం ఎంచుకుంటుంది. అందులోనూ 4–7 ఏళ్ల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీలను ఎంచుకుంటుంది. ఇన్వెస్టర్ల వయసును దృష్టిలో పెట్టుకుని నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్లను ఈ పథకంలో ప్రవేశపెట్టారు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంచుకుంటే, ప్రతీ సిప్ పెట్టుబడిపై ఐదేళ్ల లాకిన్ నిబంధన అమలవుతుంది. ఇందులో ఆటో ట్రాన్స్ఫర్ ప్లాన్ కూడా ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ తక్కువగా ఉండే ఆప్షన్లకు పెట్టుబడులను ఆటోమేటిగ్గా మార్చడం ఇందులో ఉంటుంది. అంటే నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్ల మధ్య మీ మనోభీష్టానికి అనుగుణంగా మారిపోవచ్చు. కానీ, ఇలా మారితే పెట్టుబడులను ఉపసంహరించుకుని, తిరిగి తాజాగా ఇన్వెస్ట్ చేసినట్టు పరిగణిస్తారు. దాంతో మూలధన లాభాల పన్ను పడుతుంది. ఇది నూతన ఫండ్ ఆఫర్ కావడంతో పనితీరు, రాబడులు ఎలా ఉంటాయన్నది ముందే ఊహించడం కష్టం. కొంత కాలం అయితేకానీ పనితీరును అంచనా వేయడం సాధ్యపడదు. కనుక ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని ఎంచుకునేట్టు అయితే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం (లంప్సమ్) కంటే కూడా సిప్‌ను ఎంచుకోవడం మెరుగైన ఆప్షన్ అవుతుంది. -
అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్
- టీచర్‌కు రూ.60 వేలు, ఆయాలకు రూ.30 వేలు - బెనిఫిట్ తక్కువగా నిర్ణయించడంపై అంగన్వాడీల ఆందోళన సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, సహాయకుల (ఆయాల) పదవీ విరమణ అంశం కొలిక్కి వచ్చింది. ఏళ్ల తరబడి సేవలు అందించినందుకు ప్రతిఫలంగా పదవీ విరమణ సమయంలో ఆర్థిక సాయాన్ని అందించాలని సర్కారు నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్లకు రూ.60 వేలు, అంగన్వాడీ హెల్పర్ల (ఆయా)కు రూ.30 వేల చొప్పున అందజేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులేమీ వెలువడలేదు. అయితే పదవీ విరమణ బెనిఫిట్‌గా అతి తక్కువ మొత్తాన్ని నిర్ణయించడంపై అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రూ. 2 లక్షల వరకైనా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా గందరగోళమే.. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 61,920 మంది పనిచేస్తున్నారు. వారిలో అంగన్వాడీ టీచర్లు 30,228 మంది, హెల్పర్లు 28,750 మందికాగా.. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మరో 2,942 మంది టీచర్లు ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారి వయసు 58 ఏళ్లు నిండితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అలా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ రూపంలో ప్రయోజనాలు అందుతాయి. కానీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ శాఖలో గందరగోళం నెలకొంది. అయితే అంగన్వాడీలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్నందున.. వారి పదవీ విరమణ అంశంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. కానీ ఇటీవల కేంద్రం ఈ అంశంపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో అంగన్వాడీల పదవీ విరమణకు సంబంధించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. వాటిని పరిశీలించిన సర్కారు.. తాజాగా ఆర్థిక సాయం మొత్తాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇంకా ఉత్తర్వులేవీ వెలువడలేదు. రిటైర్ కానున్న 5,398 మంది.. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీల్లో 5,398 మంది అరవై ఏళ్ల వయసు నిండిన వారు ఉన్నారు. ఇందులో వెయ్యి మందికి ఏకంగా డెబ్బై ఏళ్లకుపైగా వయసు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీరంతా పదవీ విరమణ ప్రయోజనాలపై స్పష్టత వచ్చాకే రిటైరవుదామని వేచి ఉన్నారని అంటున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వారు పదవీ విరమణ తీసుకునే అవకాశముంటుందని చెబుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనంగా నిర్దేశించిన మొత్తంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అంగన్వాడీలు చెబుతున్నారు. -
రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం అంగన్వాడీల ఆందోళన
-
వైఎస్సే ఆదుకున్నారు...
అంగన్వాడీల ఆందోళన బాట అమీర్‌పేట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకున్నారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోవడం లేదని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్ సమస్యల పరిష్కారంతో పాటు తెల్లరేషన్ కార్డు, పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమీర్‌పేటలోని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం వారు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. తమ వేతనాలను పెంచాలని, గతంలో మాదిరిగా వితంతు, వికలాంగుల పింఛన్లు ఇవ్వాలని కోరా రు. మహిళలు కార్యాల యం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నిం చగా, పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ నాయకులతో పాటు 10 మంది కార్యకర్తలను లోపలికి అనుమతించారు. దీం తో వారు వెళ్లి జాయింట్ డెరైక్టర్ పి.సంధ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ఏకరవు పెట్టారు. దీనిపై జేడీ స్పందిస్తూ సమస్యలను క మిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హ మీ ఇచ్చారు. కార్యక్రమంలో యూ నియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.నిర్మల, పి.జయలక్ష్మి, సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.వెంకటేష్, మల్లేష్, జయపాల్‌రెడ్డి, నర్సమ్మ, మహేశ్వరి, అజయ్‌బాబు, మల్లీశ్వరి, బేబి, భారతి, లక్ష్మి, బాలమణి పాల్గొన్నారు. -
అంగన్వాడీ దీక్షలు భగ్నం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం నాటికి రెండో రోజు చేరుకున్నాయి. బుధవారం సాయంత్రం పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల దీక్షలను భగ్నం చేసి, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ప్రజల నుంచి ఐసీడీఎస్‌ను వేరు చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి చుక్క రాములు మాట్లాడుతూ అంగన్వాడీ దీక్షకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. ఉద్యోగుల పనులతో పాటు వివిధ సర్వేలలో ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకుంటుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్, సూపర్వైజర్ వయో పరిమితి సడలించాలని, ప్రసూతి, వేసవి సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులను నియంత్రించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీక్షలకు ప్రజా సంఘాల నాయకులు జయరాజ్, సుధాకర్, సర్దార్, మాణిక్యం మద్దతు పలికారు.