
రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, పీపీఎఫ్ ఇవన్నీ రిటైర్మెంట్‌కు అనుకూలించే సాధనాలే. వీటిల్లో ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం ఉన్నది ఎన్‌పీఎస్ ఒక్కటే. సాధారణంగా రిటైర్మెంట్‌కు సుదీర్ఘకాలం ఉంటుంది. కనుక ఈక్విటీ పెట్టుబడులతో భారీ నిధిని సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించొచ్చు. ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈక్విటీ, ఇతర సాధనాలతో కూడిన పెట్టుబడుల విధానంతో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ (ఎస్‌ఆర్‌బీఎఫ్)’ను ప్రారంభించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇది పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది.
పెట్టుబడుల ఆప్షన్లు..
ఎస్‌ఆర్‌బీఎఫ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం: అంటే ఇన్వెస్టర్లు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. కాకపోతే ఇందులో చేసే పెట్టుబడులకు ఐదేళ్లపాటు లాకిన్ ఉంటుంది. లేదా 65 ఏళ్లు. ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది. ఈ పథకంలో నాలుగు రకాల పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి.
అగ్రెస్సివ్: ఈ ఆప్షన్ ఎంచుకుంటే, ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 80–100 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది.
అగ్రెస్సివ్ హైబ్రిడ్: ఈ ఆప్షన్‌లో ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం వరకే కేటాయించి, మిగిలిన నిధులను డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా కొంత రిస్క్‌ను తగ్గించే విధంగా పనిచేస్తుంది.
కన్జర్వేటివ్ హైబ్రిడ్: ఈ ఆప్షన్‌లో ఈక్విటీ కేటాయింపులు 10 శాతం నుంచి గరిష్టంగా 40 శాతానికే పరిమితం.
కన్జర్వేటివ్: ఇందులో ఈక్విటీలకు 20 శాతం పెట్టుబడులు మించనీయదు. బంగారం ఈటీఎఫ్‌లు, విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రతీ ప్లాన్‌లో భాగంగా ఉంటుంది.
పెట్టుబడుల విధానం
ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 50 శాతాన్ని వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్‌ను ఎంచుకుని, వాటిని దీర్ఘకాలం పాటు కొనసాగించే విధానాన్ని ఈ పథకం అనుసరించనుంది. మిగిలిన ఈక్విటీ పెట్టుబడులను స్థూల ఆర్థిక పరిస్థితులు, బిజినెస్‌సైకిల్స్, కంపెనీల వ్యాల్యూషన్లు, భారీ రాబడి అవకాశాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ పెట్టుబడులను గౌరవ్ మెహతా, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడులను దినేష్ అహుజా, అంతర్జాతీయ పెట్టుబడులను మోహిత్‌జైన్ చూడనున్నారు. డెట్ పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ కలిగిన పీఎస్‌యూ, సార్వభౌమ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించాలి. అంటే అధిక భద్రతతో కూడిన డెట్ సాధనాలనే ఈ పథకం ఎంచుకుంటుంది. అందులోనూ 4–7 ఏళ్ల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీలను ఎంచుకుంటుంది. ఇన్వెస్టర్ల వయసును దృష్టిలో పెట్టుకుని నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్లను ఈ పథకంలో ప్రవేశపెట్టారు.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంచుకుంటే, ప్రతీ సిప్ పెట్టుబడిపై ఐదేళ్ల లాకిన్ నిబంధన అమలవుతుంది. ఇందులో ఆటో ట్రాన్స్‌ఫర్ ప్లాన్ కూడా ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ తక్కువగా ఉండే ఆప్షన్లకు పెట్టుబడులను ఆటోమేటిగ్గా మార్చడం ఇందులో ఉంటుంది. అంటే నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్ల మధ్య మీ మనోభీష్టానికి అనుగుణంగా మారిపోవచ్చు. కానీ, ఇలా మారితే పెట్టుబడులను ఉపసంహరించుకుని, తిరిగి తాజాగా ఇన్వెస్ట్ చేసినట్టు పరిగణిస్తారు. దాంతో మూలధన లాభాల పన్ను పడుతుంది. ఇది నూతన ఫండ్ ఆఫర్ కావడంతో పనితీరు, రాబడులు ఎలా ఉంటాయన్నది ముందే ఊహించడం కష్టం. కొంత కాలం అయితేకానీ పనితీరును అంచనా వేయడం సాధ్యపడదు. కనుక ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని ఎంచుకునేట్టు అయితే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం (లంప్‌సమ్) కంటే కూడా సిప్‌ను ఎంచుకోవడం మెరుగైన ఆప్షన్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment