హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన ఆయన వయసు 73 సంవత్సరాలు.. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులను ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేయగా దానిపై నెలకు రూ.15 వేల వడ్డీ వస్తోంది. ఇప్పుడు ఆయన పూర్తిగా ఈ వడ్డీపైనే ఆధారపడి ఉన్నారు. కానీ మూడు నెలలుగా రాకపోతుండటంతో ఆయనకు దిక్కుతోచని దుస్థితి ఎదురైంది.
వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రిటైర్ అయి పదేళ్లయింది. తన రిటైర్మెంట్ బెనిఫిట్‌ను సీసీఎస్‌లో దాచుకోగా నెలకు రూ.9 వేల వడ్డీ వస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తనకు వచ్చే వడ్డీ ఆసరాగా భార్యతో కలిసి బతుకీడుస్తున్నాడు. కానీ ఇప్పుడు వడ్డీ నిలిచిపోవటంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా వీరిద్దరిదే కాదు.. చాలామంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వేదన ఇది.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో ఇప్పుడు ఆ సంస్థ విశ్రాంత ఉద్యోగులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఉద్యోగం చేస్తున్న కాలంలో నెలవారీ వాటాగా నమోదైనమొత్తం, పదవీ విరమణ సమయంలో వచ్చిన బెనిఫిట్ మొత్తాలను చాలా మంది సీసీఎస్‌లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకు కంటే మెరుగైన వడ్డీ పొందే వీలుండటమే దీనికి కారణం.
ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారి సంగతి పక్కన పెడితే, పేదరికంలో మగ్గుతున్నవారు మాత్రం ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనే ఆధారపడుతున్నారు. కానీ సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ప్రస్తుతం రూ.932 కోట్లు బకాయిపడింది. నెలవారీగా ప్రస్తుతం సీసీఎస్ కోసం ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న రూ.19 కోట్లను ఆర్టీసీ సీసీఎస్‌కు పూర్తిగా చెల్లించటం లేదు. గత నెల కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చింది. దీంతో డిసెంబరు నుంచి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే వడ్డీ పంపిణీ నిలిచిపోయింది. దీంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఎస్ కార్యాలయం చుట్టూ తిరిగి ఫలితం లేక ఉస్సూరు మంటున్నారు.
రూ.కోటి కూడా కష్టమేనా..
సీసీఎస్‌లో ప్రస్తుతం ఐదున్నర వేల మంది విశ్రాంత ఉద్యోగులు డిపాజిట్లు పెట్టుకున్నారు. వారి డిపాజిట్ల మొత్తం దాదాపు రూ. 150 కోట్లు. దీనిపై ప్రతినెలా రూ.కోటి వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ రూ.150 కోట్లు లేవు. నెలవారీ వడ్డీకి సరిపడా రూ.కోటి కూడా అందుబాటులో లేదు. దీంతో మూడు నెలలుగా వడ్డీ చెల్లింపు ఆపేశారు.
గతంలో పది వేల మంది విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లు ఉండగా, సీసీఎస్ పరిస్థితి గందరగోళంగా మారటంతో సగం మంది డిపాజిట్లు వెనక్కు తీసుకున్నారు. తాజా గందరగోళంతో ఇప్పుడు కొత్తగా 150 మంది సభ్యత్వం రద్దుకు దరఖాస్తు చేసుకున్నారు.
మందులకు కూడా డబ్బుల్లేవు
‘‘సీసీఎస్‌లో దాచుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం సహా ఇతర డిపాజిట్ల నుంచి నాకు నెలకు రూ.15 వేలు వస్తాయి. నాకు, హృద్రోగ బాధితురాలైన నా భార్యకు నెలకు మందులకే రూ.20 వేల ఖర్చవుతుంది. సీసీఎస్ వడ్డీ మమ్మల్ని ఆదుకుంటోంది. కానీ గత మూడు నెలలుగా వడ్డీ అందటం లేదు. ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పొదుపు సంస్థగా వెలిగిన సీసీఎస్‌కు మళ్లీ పూర్వవైభవం తెప్పించి నా లాంటి వారిని ఆదుకోవాలి.’’ – ప్రభాకరరావు, రిటైర్డ్ ఏడీసీ
Comments
Please login to add a commentAdd a comment