అప్పు పుట్టేదెట్లా? | TSRTC Employees Suffer No Funds In CCS | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చిరు ఉద్యోగుల గోస 

Published Tue, Dec 8 2020 8:17 AM | Last Updated on Tue, Dec 8 2020 8:32 AM

TSRTC Employees Suffer No Funds In CCS - Sakshi

శ్రీహరి.. ఆర్టీసీలో డ్రైవర్‌.. కూతురు పెళ్లి కోసం గతేడాది ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్‌)లో పొదుపు చేసుకున్న మొత్తం నుంచి రుణం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. సీసీఎస్‌లో నిధులు లేక రుణమివ్వలేదు. దీంతో గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారి వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. లోన్‌ సకాలంలో అందక అప్పు తీర్చకపోవటంతో వడ్డీ వ్యాపారి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో మధ్యవర్తి ద్వారా బ్యాంకులో రుణం తీసుకుని అప్పు తీర్చాడు. బ్యాంకు రుణం ఇప్పించిన పేరుతో మధ్యవర్తి లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్‌ వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాంకు అప్పు గొంతుమీద ఉంది. దాని కిస్తీలు కట్టేందుకు నానాఇబ్బంది పడాల్సి వస్తోంది. 

సురేందర్‌.. హైదరాబాద్‌లో కండక్టర్‌.. తన కుమారుడికి ఐఐటీ మద్రాస్‌లో సీటొచ్చింది. అందుకు వెంటనే రూ.లక్షన్నర చెల్లించాలి. విద్యా రుణం కోసం ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో దరఖాస్తు చేసుకుంటే డబ్బులు లేవన్నారు. దీంతో గత్యంతరం లేక వడ్డీవ్యాపారి నుంచి రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. మూడు నెలల్లో తీర్చేస్తానన్న హామీతో అప్పు పుట్టింది. కానీ ఇప్పటికీ పరపతి సంఘం లోన్‌ రాకపోవటంతో ఆ అప్పు తీర్చలేక, వడ్డీ వ్యాపారి ఒత్తిడి భరించలేక సతమతమవుతున్నాడు. 

సాక్షి, హైదరాబాద్‌: ఇదీ ప్రస్తుతం ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్‌) పరిస్థితి. అందులో కార్మికులు పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవటంతో రెండేళ్లుగా నిధులు లేకుండా పోయాయి. కుటుంబ అత్యవసరాల కోసం ఉద్యోగులు రుణం పొందాలంటే వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం సీసీలో కుటుంబ అత్యవసరాలకు సంబంధించి రుణాల కోసం ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు ఏకంగా 11,800లకు చేరుకున్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ సంబంధించి రుణాలు ఇవ్వాలంటే రూ.300 కోట్లు కావాలి. సీసీఎస్‌కు ఆర్టీసీ బకాయిపడ్డ రూ.776 కోట్లలో భాగంగా వాటిని చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ఆ నిధులను పెండింగులో పెట్టడం ఉద్యోగులకు శాపంగా మారింది. 

ఇదీ జరిగింది.. 
ఆర్థిక పరిస్థితి సరిగా లేక చాలాకాలంగా అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ ఆర్టీసీ వాడుకుంటోంది. ఈ క్రమంలో ఉద్యోగుల (కార్మికుల)కు సంబంధించిన సహకార పరపతి సంఘం (సీసీఎస్‌) నిధులను కూడా వాడేసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు వారి జీతాల నుంచి ప్రతినెలా సీసీఎస్‌కు 7.5 శాతం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి ఆర్టీసీ జీతాలు చెల్లిస్తుంది. అలా మినహాయించిన మొత్తాన్ని సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్‌ పాలకవర్గం కారి్మకుల కుటుంబ అవసరాలకు రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవటం, చదువులు, ఆరోగ్య సంబంధిత ఖర్చులకు వాడతారు. ఈ నిధులన్నింటినీ ఆర్టీసీ వాడేసుకోవటంతో సీసీఎస్‌ ఖజానా ఖాళీ అయింది. దీంతో గతేడాది జనవరి నుంచి ఆ రుణాలు ఇవ్వటం ఆపేశారు. తొలుత 18 వేల దరఖాస్తులు పేరుకుపోగా, ఇటీవల కొంత మందికి అతి కష్టమ్మీద రుణాలిచ్చారు. జూన్‌ నుంచి 11,800 దరఖాస్తులు పెండింగులో ఉండిపోయాయి. (చదవండి: ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్‌! )

ఆదాయం పెరిగితేనే.. 
ఇటీవల కార్గో బస్సులు ప్రారంభించిన ఆరీ్టసీ.. సరుకు రవాణా ద్వారా నిత్యం రూ.10 లక్షలకు పైగా ఆదాయం పొందుతోంది. పెట్రోల్‌ బంకులు సొంతంగా ఏర్పాటు చేసి రూ.25 లక్షల ఆదాయం సమకూర్చుకుంటోంది. అయితే సీసీఎస్‌కు ఉన్న బకాయి పెద్దది కావటంతో ప్రభుత్వం సాయం చేస్తేనే తీరే పరిస్థితి కని్పస్తోంది. గత జనవరిలో ప్రభుత్వ పూచీకత్తుపై రూ.650 కోట్ల బ్యాంకు రుణం వచ్చినా అది కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలకే ఖర్చయింది. దీంతో సీసీఎస్‌ బకాయిలు ఉండిపోయాయి. సీసీఎస్‌ దాఖలు చేసిన కోర్టు కేసులో కంటెమ్ట్‌ రావటంతో ఇటీవల రెండు దశలుగా ఆర్టీసీ రూ.50 కోట్లు, రూ.85 కోట్లు సీసీఎస్‌కు చెల్లించి చేతులెత్తేసింది. పెండింగులో ఉన్న కోర్టు ధిక్కార కేసు కొట్టేయాల్సిందిగా హైకోర్టులో ఆర్టీసీ తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే ఇంకా పెద్ద మొత్తం లో బకాయిలు పెండింగులో ఉన్నందున మిగతా మొత్తం చెల్లించే లా ఆదేశించాలంటూ సీసీఎస్‌ కూడా అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

మధ్యవర్తుల దందా.. 
సీసీఎస్‌లో నిధులు లేకపోవటంతో కొందరు దళారులు అక్కడే తిష్టవేసి దందాకు పాల్పడుతున్నారు. మధ్య వర్తిత్వం నెరిపి బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తూ లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్‌ దండుకుంటున్నారు. ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా వసూలు చేసుకుంటుండటం విశేషం. (చదవండి: కోవిడ్‌ వ్యాక్సిన్‌ రవాణాకు వజ్ర?)

చిల్లిగవ్వ లేదు    
ఆరీ్టసీ సీసీఎస్‌ పరిస్థితి దుర్భరంగా మారింది. నయా పైసా నిల్వ లేదు. రుణాల కోసం 11 వేలకు పైగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఉద్యోగులు నిత్యం మా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల కోసం మేం ఆర్టీసీ చుట్టూ తిరుగుతున్నాం. –బి.మహేశ్, ఆర్టీసీ సహకార పరపతి సంఘం కార్యదర్శి  

నిధులు రాగానే ఇస్తాం 
కోవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ క్రమంగా ఓఆర్‌ పెరుగుతోంది. దీంతో రోజువారీ ఆదాయం కూడా మెరుగవుతోంది. రుణం కోసం ప్రభుత్వాన్ని కూడా కోరాం. అవి రాగానే సీసీఎస్‌కు బకాయిలు చెల్లిస్తాం’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement