సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఇన్నాళ్లూ ఎడాపెడా సొంతానికి వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం తీరా ఇప్పుడు తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి వాడుకున్న మొత్తంపై వడ్డీ ఎగ్గొట్టాలని చూస్తోంది. అందుకే వడ్డీని కలపకుండా సీసీఎస్ బకాయిలను చూపుతోంది. ఈ పరిణామం సీసీఎస్ నుంచి రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న దాదాపు 9 వేల మంది కార్మికుల్లో గుబులు రేపుతోంది.
అంత మేర నష్టపోవాల్సిందేనా..
రాష్ట్రం విడిపోవడానికి ముందు ఎండీగా పనిచేసిన ఓ అధికారి అత్యవసరం కింద సీసీఎస్ నుంచి కొంత మొత్తాన్ని వాడగా ఆ తర్వాత అది అలవాటుగా మారింది. రాష్ట్రం విడిపోయే నాటికి కొన్ని రూ. కోట్లను యాజమాన్యం వాడేసింది. అలా వాడిన మొత్తంపై లెక్కించిన వడ్డీలో విభజన తర్వాత టీఎస్‌ఆర్టీసీకి రూ. 7 కోట్లు పంచారు. 2014లో రూ. 7 కోట్ల వడ్డీ బకాయి ఉంటే ఆ తర్వాత రూ. వందల కోట్ల మొత్తాన్ని వాడుతూ కొంత మేర తిరిగి చెల్లిస్తూ, మళ్లీ వాడుతూ.. ఇలా రూ. 400 కోట్లకు వడ్డీ బకాయిలు చేరుకున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో సీసీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిల్లో వడ్డీ మొత్తాన్ని చేర్చకుండానే నివేదిక రూపొందించడం పెద్ద చర్చకు దారితీస్తోంది. యాజమాన్యం తీరు వల్ల కొన్ని వందల మందికి కావాల్సిన రుణాలకు సరిపోయే రూ. 400 కోట్లను సీసీఎస్... తద్వారా తాము నష్టపోవాల్సిందేనా అన్న ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
వడ్డీ చెల్లించకుంటే ఊరుకోం..
కార్మికులు, ఉద్యోగులు వారి జీతాల నుంచి ప్రతి నెలా 7 శాతం మొత్తం జమ చేయడం ద్వారా ఏర్పడ్డ నిధి అది. ఆ నిధిని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకొని ఇప్పుడు దానిపై రూ. 400 కోట్ల వడ్డీ ఎగ్గొడతామంటే కార్మికలోకం ఊరుకోదు. దాన్ని నయాపైసాతో సహా చెల్లించాల్సిందే.
– అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్
కార్మికులను బలిపశువులను చేయటమే
ఏదైనా కారణాలతో సీసీఎస్‌ను మూసేసి అందులోని మొత్తాన్ని కార్మికులకు వారి వాటా ప్రకారం పంచాల్సి వస్తే రూ. 400 కోట్లను ఎలా చూపుతారు? అంతమేర కార్మికులకు తక్కువగా చెల్లించడం తప్ప ఏముంటుంది. అంటే కార్మికులను బలిపశువు చేసినట్టే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఆ వడ్డీ మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేయాల్సిందే.
– వీఎస్ రావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ ,వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment