vs rao
-
TSRTC: సీసీఎస్ నిధులు వాడుకుని.. వడ్డీకి ఎసరు పెట్టిన ఆర్టీసీ!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఇన్నాళ్లూ ఎడాపెడా సొంతానికి వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం తీరా ఇప్పుడు తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి వాడుకున్న మొత్తంపై వడ్డీ ఎగ్గొట్టాలని చూస్తోంది. అందుకే వడ్డీని కలపకుండా సీసీఎస్ బకాయిలను చూపుతోంది. ఈ పరిణామం సీసీఎస్ నుంచి రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న దాదాపు 9 వేల మంది కార్మికుల్లో గుబులు రేపుతోంది. అంత మేర నష్టపోవాల్సిందేనా.. రాష్ట్రం విడిపోవడానికి ముందు ఎండీగా పనిచేసిన ఓ అధికారి అత్యవసరం కింద సీసీఎస్ నుంచి కొంత మొత్తాన్ని వాడగా ఆ తర్వాత అది అలవాటుగా మారింది. రాష్ట్రం విడిపోయే నాటికి కొన్ని రూ. కోట్లను యాజమాన్యం వాడేసింది. అలా వాడిన మొత్తంపై లెక్కించిన వడ్డీలో విభజన తర్వాత టీఎస్ఆర్టీసీకి రూ. 7 కోట్లు పంచారు. 2014లో రూ. 7 కోట్ల వడ్డీ బకాయి ఉంటే ఆ తర్వాత రూ. వందల కోట్ల మొత్తాన్ని వాడుతూ కొంత మేర తిరిగి చెల్లిస్తూ, మళ్లీ వాడుతూ.. ఇలా రూ. 400 కోట్లకు వడ్డీ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో సీసీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిల్లో వడ్డీ మొత్తాన్ని చేర్చకుండానే నివేదిక రూపొందించడం పెద్ద చర్చకు దారితీస్తోంది. యాజమాన్యం తీరు వల్ల కొన్ని వందల మందికి కావాల్సిన రుణాలకు సరిపోయే రూ. 400 కోట్లను సీసీఎస్... తద్వారా తాము నష్టపోవాల్సిందేనా అన్న ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. వడ్డీ చెల్లించకుంటే ఊరుకోం.. కార్మికులు, ఉద్యోగులు వారి జీతాల నుంచి ప్రతి నెలా 7 శాతం మొత్తం జమ చేయడం ద్వారా ఏర్పడ్డ నిధి అది. ఆ నిధిని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకొని ఇప్పుడు దానిపై రూ. 400 కోట్ల వడ్డీ ఎగ్గొడతామంటే కార్మికలోకం ఊరుకోదు. దాన్ని నయాపైసాతో సహా చెల్లించాల్సిందే. – అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ కార్మికులను బలిపశువులను చేయటమే ఏదైనా కారణాలతో సీసీఎస్‌ను మూసేసి అందులోని మొత్తాన్ని కార్మికులకు వారి వాటా ప్రకారం పంచాల్సి వస్తే రూ. 400 కోట్లను ఎలా చూపుతారు? అంతమేర కార్మికులకు తక్కువగా చెల్లించడం తప్ప ఏముంటుంది. అంటే కార్మికులను బలిపశువు చేసినట్టే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఆ వడ్డీ మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేయాల్సిందే. – వీఎస్ రావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ ,వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి -
బిట్స్ పిలానీ వీసీగా వీఎస్ రావు
బాధ్యతల స్వీకరణ పిలానీ: బిట్స్ పిలానీ తాత్కాలిక వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ వి. సాంబశివ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బిట్స్ పిలానీలోనే ఎమ్మెస్సీ, పీహెచ్డీ పూర్తి చేసిన ప్రొఫెసర్ రావు జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బీల్ఫెల్డ్ నుంచి ఎడ్యుకేషనల్ ఎకనమిక్స్ అండ్ రీసెర్చ్‌లో పట్టా పొందారు. ఇప్పటిదాకా నాలుగు ద శాబ్దాల కాలంలో బిట్స్ పిలానీలో డీన్ ప్రాక్టీస్ స్కూల్‌గా, డిప్యూటీ డెరైక్టర్‌గా, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. శిక్షణ అవసరాల అంచనా, పాఠ్యాంశాల అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రాజెక్ట్ నిర్వహణ, కర్బన రసాయనశాస్త్రం, డ్రగ్ డిజైన్ సబ్జెక్టుల్లో కూడా ప్రొఫెసర్ సాంబశివ రావు నిష్ణాతులు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), సీఐఐ, ఫిక్కీ స్టేట్ కౌన్సిల్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వంటి విద్యా, పరిశోధక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2013 సంవత్సరంలో ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ సదస్సులో ఉత్తమ విద్యావేత్త అవార్డును అందుకున్నారు. వి. సాంబశివ రావు నేతృత్వంలోని పీహెచ్డీ విద్యార్థులు రాసిన ఎన్నో పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. బోధనతో ‘అభ్యసనాన్ని అద్భుతమైన అనుభవం’గా మార్చినందుకు గాను రావు 2014 సంవత్సరంలో బిట్స్ పూర్వ విద్యార్థుల ప్రపంచ సమావేశంలో ఘనంగా సత్కారం అందుకున్నారు.