ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి
నిత్యం 350 కిలో మీటర్లకు పైగా డ్యూటీ
కేఎంపీఎల్ రాకపోతే డ్రైవర్లకు కౌన్సెలింగ్
మహాలక్ష్మి’తో కిటకిటలాడుతున్న బస్సులు
ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లు, కండక్టర్లు
వందల సంఖ్యలో బస్సులు.. లక్షల మంది ప్రయాణికులు.. వారిని సకాలంలో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిలో నిమగ్నమవుతున్నారు. పని భారాన్ని భరిస్తూ ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మీ’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉద్యోగులపై తీవ్ర పనిఒత్తిడి పడింది. వీటన్నింటినీ తట్టుకుని నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నా.. వారి బతుకు బండి సురక్షితంగా సాగడంలేదు. ఒకవైపు తీవ్ర పనిఒత్తిడి, డబుల్ డ్యూటీలు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులు, ఇలా అనేక సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2400కు పైగా మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షా 90వేల మంది ప్రయాణించేవారు. కాగా.. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెండు లక్షల 90 వేలకు చేరింది.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 50 మంది వరకు ఉంటుంది. గతంలో సామర్థ్యానికి మించి అదనంగా 10 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించడానికి వయస్సు పైబడినవారు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు.
నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట
8 గంటల డ్యూటీ లేదు..
డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు పని గంటల నిబంధన లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు డేడ్యూటీ చేస్తారు. కానీ ఉదయం వెళ్లిన వారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతోంది. నిజామాబాద్ – హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్లు అవుతుండగా.. నిజామాబాద్ – వరంగల్ మధ్య అప్ అండ్ డౌన్ 460 కిలోమీటర్లు పడుతుంది.
దీంతో పాటు వారికి టార్గెట్ ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో కార్మికులకు పనిభారం పెరుగుతోంది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం 10 నుంచి 12 గంటల పాటు పని చేస్తున్నారు. దీంతో నిద్ర కరువై అనారోగ్యాల భారిన పడుతున్నారు. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యూనియన్లు లేకపోవడంతో డిపోలోని అధికారులు సిబ్బందికి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేయడంతో పనిఒత్తిడి పెరుగుతోంది.
ప్రశ్నిస్తున్న అధికారులు..
ఆర్టీసీ బస్సులకు డైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రూట్‌లో వెళ్లే బస్సులు కేఎంపీఎల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. డైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కేఏంపీఎల్ వచ్చేటట్లు చూడాలని సూచనలు చేస్తున్నారు. కండక్టర్లకు మహాలక్ష్మి పథకంతో పాటు టిక్కెట్లకు టార్గెట్ నిర్దేశిస్తున్నట్లు ఆరీ్టసీలో చర్చ జరుగుతోంది. దీంతో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని కండక్టర్లు వాపోతున్నారు.
రెండు డ్యూటీలు చేస్తేనే స్పెషల్ ఆఫ్..
ఆర్టీసీ ఉద్యోగులు లీవ్‌లు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్, డ్రైవర్లకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ ఉంటుంది. రోజంతా పనిచేస్తేనే మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే అనార్యోగం పాలైన సిబ్బంది సంబంధిత డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర సెలవులు కావాలంటే అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment