హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. మరోవైపు ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఒక ప్రకటన చేశారు.
ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అయితే అది మరోలా ఉంటోందని చెబుతున్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరుతూ ఓ వీడియోను ఉంచారు.
మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారయన. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment