మొండి బకాయిల చెల్లింపు విషయంలో భవిష్యనిధి సంస్థ సీరియస్
రూ.950 కోట్ల చెల్లింపు విషయంలో స్పందించకపోవడంపై ఆగ్రహం
రోజువారీ ఖర్చులకు చెల్లింపులకు రవాణా సంస్థ ఇబ్బందులు
తదుపరి రీజినల్ కార్యాలయాల ఖాతాల స్తంభనకు చర్యలు?
హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై భవిష్యనిధి (పీఎఫ్) సంస్థ తీవ్ర చర్యకు ఉపక్రమించింది. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలను తీవ్రంగా పరిగణిస్తూ ఏకంగా ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. తనకున్న ప్రత్యేక అధికారాలతో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంతో ముడిపడిన ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఆర్టీసీ రోజువారీ ఆదాయం ఈ ఖాతాల్లోనే డిపాజిట్ అవుతుంది. ఆ మొత్తం నుంచే సంస్థ రోజువారీ కార్యకలాపాలు సాగుతుంటాయి. ఇప్పుడు బ్యాంకు ఖాతాలు స్తంభించడంతో ఆర్టీసీలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
రూ.వేయి కోట్లకు చేరువలో బకాయిలు
ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన భవిష్యనిధి ఖాతాల్లో ప్రతినెలా కంట్రిబ్యూషన్ జమ అవుతుంటుంది. సాధారణ సంస్థల్లాగా కాకుండా, భవిష్యనిధి ఖాతాలను సంస్థనే నిర్వహిస్తుంది. వాటిల్లో ఉద్యోగుల కంట్రిబ్యూషన్, వారి పక్షాన సంస్థ కంట్రిబ్యూషన్ జమ చేస్తుంది. గతంలో ఈ కంట్రిబ్యూషన్ ఠంచన్‌గా జమయ్యేది. కానీ, పదేళ్లుగా సంస్థ పనితీరు సరిగా లేకపోవటంతో.. సంస్థ అవసరాల కోసం భవిష్యనిధి మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవడం ప్రారంభించింది. ఏడాదిన్నర క్రితం వరకు అలా రూ.1,200 కోట్లకు ఆ బకాయిలు పేరుకుపోయాయి.
పలు దఫాలుగా భవిష్యనిధి సంస్థ నిలదీసింది. కానీ ఆర్టీసీ స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో, విడతల వారీగా రూ.300 కోట్ల వరకు చెల్లించింది. ఆ తర్వాత ఆ చెల్లింపులు ఆగిపోయాయి. ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు రూ.950 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ప్రతినెలా కంట్రిబ్యూషన్ల కింద రూ.25 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీన్ని ఇప్పుడు పీఎఫ్ కమిషనరేట్ తీవ్రంగా పరిగణించి నిలదీయటం ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా తన ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది.
రీజినల్ ఖాతాల్లోకి జమ..
భవిష్యనిధి సంస్థ చర్యతో వెంటనే తేరుకున్న ఆర్టీసీ.. రోజువారీ ఆదాయాన్ని బస్‌భవన్‌కు ఉన్న ప్రధాన ఖాతాల్లో కాకుండా రీజినల్ కార్యాలయాలతో అనుసంధానమైన ఇతర ఖాతాల్లో జమ చేయటం ప్రారంభించింది. ఈమేరకు అన్ని కార్యాలయాలకు బస్‌భవన్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలందాయి. ఈ ఖాతాలు ఫ్రీజ్ కానందున వాటిల్లో జమ చేసి వాటి నుంచే డ్రా చేసుకుంటూ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని ఆదేశించింది. భవిష్యనిధి సంస్థ వాటినీ ఫ్రీజ్ చేయబోతోందని సమాచారం అందడంతో హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్‌కాకుండా స్టే పొందాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు తెలిసింది.
అలా జరగని పక్షంలో ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు ఉన్న టోల్‌గేట్ల ఫాస్టాగ్‌లకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంది. దాన్ని కూడా పీఎఫ్ సంస్థ ఫ్రీజ్ చేయబోతోందని ఆరీ్టసీకి సమాచారం అందింది. అదే జరిగితే, ఫాస్టాగ్‌ల నుంచి టోల్ రుసుము మినహాయింపునకు వీలుండదు. దీంతో టోల్ గేట్ల వద్ద నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌తో కాకుండా నగదు చెల్లిస్తే, రుసుము రెట్టింపు ఉంటుంది. ఇది ఆర్టీసీపై రోజువారీ రూ.లక్షల్లో భారం పడుతుంది. దీంతో ఫాస్టాగ్ ఖాతాకు కూడా ప్రత్యామ్నాయ చర్య లకు ఉపక్రమించింది. సోమవారం సెలవు కావటంతో, మంగళవారం దాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది.
పీఎఫ్ బకాయిలకు సాయం సాధ్యమా?
హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేనిపక్షంలో కచి్చతంగా పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సిందే. అన్ని నిధులు ఆర్టీసీ వద్ద సిద్ధంగా లేనందున.. ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, 2013 వేతన సవరణ బాండు బకాయిలకు సంబంధించి ఉద్యోగుల చెల్లింపునే ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేసిన ప్రస్తుత తరుణంలో, పీఎఫ్ బకాయిలకు సాయం చేయటం సాధ్యమా అన్న మీమాంస ఉత్పన్నమవుతోంది. బాండు బకాయిలను ఆర్టీసీ డ్రైవర్లకు చెల్లించి, మిగతా వారికి చెల్లించలేదు. బాండు బకాయిలకు రూ.280 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.80 కోట్లే అందినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని గత ఫిబ్రవరిలో డ్రైవర్ కేటగిరీ ఉద్యోగులకు చెల్లించారు. మిగతా వారికి చెల్లించలేదు. దీంతో భవిష్యనిధి బకాయిల విషయంలో గందరగోళం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment